రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కరోనా విలయకాలంలో అల్లోపతి వంటి ఆధునిక వైద్యవిధానాలను తప్పుబడుతూ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఇచ్చిన తప్పుడు అడ్వర్టైజ్‌మెంట్లు, ప్రకటనల కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం రాందేవ్, బాలకృష్ణ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరయ్యారు. రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. ‘‘ ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్‌ల స్థాయిలోనే ఈ యాడ్‌లను ప్రముఖంగా ప్రచురించారా?.
అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘ మా క్లయింట్లు యాడ్స్ కోసం లక్షలు వెచ్చించారు’ అని రోహత్గీ చెప్పారు. ‘ ఖర్చు ఎంతయింది అనేది మాకు అనవసరం’ అని జడ్జి అసహనం వ్యక్తంచేశారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు.
దీంతో సోమవారం నాటి ప్రకటనల వివరాలను రెండ్రోజుల్లోపు సమర్పించాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్‌ల ధర్మాసనం ఆదేశించింది. ఇలాగే తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ఫాస్ట్‌మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సంబంధింత మూడు కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. ‘‘ ఈ కంపెనీల తప్పుడు ప్రకటనలు వల్లే ఆయా సంస్థల ఉత్పత్తులను చిన్నారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు, వృద్ధులు విరివిగా వినియోగిస్తున్నారు’ అని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment