విశ్లేషణ
తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి సంస్థ విషయంలో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. 1954 నాటి చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. అయినా ఫలానా ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలువలు పలువలుగా చెప్పడం కొనసాగుతూనే ఉంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం ఒక్క సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్సావిధానాలు, మందుల గురించి ప్రచారం జరుగుతోంది. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు; చట్టాల అమలులో ఉదాసీనంగా ఉండటమే అసలు సమస్య.
సుప్రీంకోర్టులో ఇటీవల ఓ ఆసక్తికరమైన వ్యవహారం నడిచింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి ఆయుర్వేద వ్యవస్థాప కుడు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేననీ, ధిక్కరణ కేసు విష యంలో క్షమాపణలు స్పష్టంగా, బహిరంగంగా తగు ప్రాధాన్యంతో చెప్పాల్సిందేననీ సుప్రీంకోర్టు పట్టుబట్టిన విషయం తెలిసిందే. తుది తీర్పు మాటెలా ఉన్నా... ఈ కేసు అటు మందుల తయారీదారుకు, ఇటు నియంత్రణ వ్యవస్థలు, ప్రభుత్వాలు, వినియోగదారులకు చాలా పాఠాలు నేర్పింది.
ఇంతకీ ఏమిటీ కేసు? అన్నింటికీ కేంద్రంగా ఉన్నవి 1954 నాటి డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనల) చట్టం; 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం... దీని కింద 1945లో రూపొందించిన నిబంధనలను రామ్‌దేవ్ బాబాకు చెందిన సంస్థలు ఉల్లంఘించాయన్నది ఆరోపణ. 1954 చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. కొన్ని రకాల మందుల ప్రకటనకు సంబంధించి పరిమితులు విధిస్తోంది.
క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, ఎయిడ్స్, ఊబకాయం, తక్కువ వయసు లోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం, అంధత్వం వంటి సమస్యల పరిష్కారానికి మందులున్నాయని ప్రకటనలు జారీ చేయకూడదు... ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలు వలు పలువలుగా చెప్పడం వంటివి. 1940 నాటి చట్టం... భారత్‌లో మందులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాలు తదితరాల తయారీ, పంపిణీ, అమ్మకాలకు సంబంధించిన ప్రాథమిక చట్టం.
పతంజలి సంస్థ మధుమేహం మొదలుకొని థైరాయిడ్ సంబంధిత సమస్యలు, ఆఖరికి క్యాన్సర్ వ్యాధికీ మూలిక సంబంధిత మందులు ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ సంస్థ వ్యాధిని నయం చేస్తుందని చెబుతూ ‘కరోనిల్’ను ప్రవేశ పెట్టింది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీనికి మద్దతు పలికారు.
ఈ మందుపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు మార్కెటింగ్‌లో ‘చికిత్స’ స్థానంలో ‘నిర్వహణ’ అని మార్చి చేతులు దులుపుకుంది పతంజలి. ఎన్నో వ్యాధులకు చికిత్స కల్పిస్తామని ప్రక టనలు జారీ చేయడమే కాకుండా, ఆధునిక వైద్య పద్ధతినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది.
ఈ అంశంపై విసుగు చెందిన కొందరు ఆరోగ్య కార్యకర్తలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు.. చట్టాల ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదు చేశారు. కోర్టు తగదని వారించినా తప్పుడు ప్రకటన జారీ మాత్రం ఆపలేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణకూ పాల్పడినట్లు అయ్యింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం పతంజలి సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. నిర్దిష్ట సమయాల్లో దేశంలోని
పత్రికలు, న్యూస్ ఛానెళ్లు కూడా ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్స పద్ధతులు, మందుల గురించి ప్రచారం చేస్తూంటాయి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనైతే ఇలాంటివి కుప్పలు తెప్పలు! తాజాగా సోషల్ మీడియా ‘ఇన్‌ఫ్లుయెన్సర్లు’ రంగంలోకి దిగారు.
ప్రమాదకరమైన ఉత్పత్తులను కూడా వీరు ఆరోగ్యం పేరిట అమ్మడం, ప్రచారం చేయడం మొదలుపెట్టారు. పెద్ద కంపెనీలు నేరుగా ప్రకటనలు జారీ చేసే విషయంలో కొంత నిగ్రహం పాటిస్తాయి. బదులుగా పెయిడ్ న్యూస్, వైద్య సంబంధిత సదస్సుల ప్రాయోజకత్వం, వైద్యులకు గిఫ్టులు ఇవ్వడం వంటి అనైతిక చర్యల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేస్తూంటాయి.
కొన్నేళ్ల క్రితం తగినన్ని సాక్ష్యాలు లేకపోయినా కొన్ని ఔషధాల సామర్థ్యం విషయంలో ఐఎంఏ స్వయంగా మద్దతు పలకడం చెప్పుకోవాల్సిన అంశం. వైద్యుల అనైతిక చర్యల విషయంలోనూ ఐఎంఏ రికార్డు ఏమంత గొప్పగా లేదు.
దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు. ప్రభుత్వాలు చట్టాలను అమలు చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూండటమే అసలు సమస్య. నియంత్రణ సంస్థలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి.
హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు చికిత్స కల్పిస్తామంటూ రామ్‌దేవ్ చేసిన ప్రకటనలను 2008లో నేను ఖండించాను. స్వయంగా వైద్యుడైన అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రామ్‌దేవ్‌కు నోటీసు జారీ చేసింది. కొంత కాలం గడిచిందో లేదో... మంత్రి ‘యూ టర్న్’ తీసుకున్నారు.
గురుగ్రామ్‌లో రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగా సెషన్ లో కనిపించారు. ఆ వేదికపై కూడా రామ్‌దేవ్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ల చికిత్సకు తన మందులు ఉపయోగపడతాయని ప్రకటించుకున్నారు. దాదాపు ఈ సమయంలోనే సీపీఎం ఎంపీగా ఉన్న బృందా కారత్ ఈ రామ్‌దేవ్ వ్యవ హారాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
ప్రస్తుత కేసు సంగతికి వద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా ఉదాసీన వైఖరిని అవలంబించాయి. ఫలితంగా రామ్‌దేవ్ బాబా తన తప్పుడు ప్రకటనల జారీని యథేచ్ఛగా కొనసాగించగలిగారు. కేరళకు చెందిన ఆరోగ్య కార్యకర్త, ఆర్టీఐ ఉద్యమకారుడు డాక్టర్ కేవీ బాబు పతంజలి సంస్థపై వరుసగా ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని స్టేట్ లైసెన్సింగ్ అథారిటీకి పలుమార్లు లేఖలు రాశారు.
దాంతో అధికారులు పతంజలి సంస్థ అలాంటి ప్రకటనలు జారీ చేయడం మానుకోవాలని లేఖ రాశారు. అంతేగానీ, అధికారం ఉన్నప్పటికీ చర్యలు చేపట్టలేదు. పైగా తప్పించుకునేందుకు మార్గమూ చూపించారు. 1954 చట్టం కింద కాకుండా డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్‌లోని నిర్దిష్ట నిబంధన కింద నోటీసు జారీ చేశారు.
ఈ నిబంధనపై అప్పటికే ముంబై హైకోర్టులో ఓ కేసు నడుస్తూ ఉంది. దీంతో పతంజలి సంస్థ ఆ కేసును చూపి ప్రకటనల జారీ కొనసాగించింది. ప్రశ్నార్థకమైన ఈ నిబంధనను 2018లో ఒక సవరణ ద్వారా కలిపారు. ఆరోగ్య సంబంధిత ప్రకటనల జారీలో ముందస్తు అనుమతులను అది తప్పనిసరి చేసింది.
ఆహార పదార్థాల ప్రకటనల్లో సెలబ్రిటీలు పాల్గొనడం, వాటి గురించి ఊదరగొట్టడం కూడా ఒక సమస్య. ఇలాంటి కేసుల్లోనూ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ పనితీరును నత్తను తలపించేదే. న్యూట్రాస్యూ టికల్స్, ఫుడ్ సప్లిమెంట్స్‌లకు సంబంధించిన ప్రకటనల విషయంలో ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో మారిపోతున్న మీడియా వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుంటే... ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలకు ఉన్న అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల (ఔషధాలు, సౌందర్య సాధనాలకు సంబంధించినవి) సంపూర్ణ సమీక్ష అవసరం.
మందులు, ఆహార పదార్థాలు, సప్లిమెంట్ల వంటి అన్ని అంశాలకు సంబంధించిన, భారతీయ వైద్య విధానానికి సంబంధించిన చట్టాలను కూడా పూర్తిగా సమీక్షించాలి. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ప్రస్తుతమున్న చట్టాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీల పని తీరునూ సమీక్షించాలి. తగినన్ని వనరులు, అధికారాలు సమ కూర్చడం, స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించడం ద్వారా పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment