తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘షరతులు లేని బహిరంగ క్షమాపణ’ పేరుతో యాడ్ ఇచ్చారు. ఈ కేసులో పతంజలి పత్రికల్లో క్షమాపణలు చెప్పడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. ముందుగా సోమవారం కూడా క్షమాపణలు కోరుతూ యాడ్స్‌ఇచ్చారు.
కాగా కోవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి సంస్థ గతంలో ఇచ్చిన ప్రకటనల వివాదంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కోర్టు పలుమార్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. మంగళవారం విచారణ సందర్భంగా రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు చెప్పినా.. ‘ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్‌ల స్థాయిలోనే ఈ యాడ్‌లను ప్రముఖంగా ప్రచురించారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.
అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. కోర్టుకు చెప్పినట్లే నేడు పెద్ద సైజులో యాడ్ ఇచ్చారు.
సంబంధిత వార్త: నాటి అడ్వర్టైజ్‌మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా?
Comments
Please login to add a commentAdd a comment