న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు తమ ఎదుట స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు విధించింది. పతంజలి ఆయుర్వేదం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు(యాడ్స్)జారీ చేసిన క్రమంలో కోర్టు ధిక్కార నోటీసుపై స్పందించడంలో విఫలమైనట్లు కోర్టు తెలిపింది.
పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రసారం చేస్తుందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌లు హిమా కోహ్లీ, అమానుల్లాతో కూడిన ద్విసభ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రామ్‌దేవ్‌పై సుప్రీం తీవ్ర స్థాయిలో మండిపడింది. గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ కేసులో స్పందన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్‌కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేయడమే కాకుండా.. కోర్టు ధిక్కారానికి సంబంధించి ఆయనపై ఎందుకు చర్చలు చేపట్టకూడదో వివరించాలని కోరింది.
విచారణ సందర్భంగా బాబా రామ్‌దేవ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని కోర్టు ధిక్కార నోటీసుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. తమ క్లయింట్ అయిన రామ్‌దేవ్ బాబాను కోర్టుకు హాజరు కావాలని కోరింది. రామ్‌దేవ్‌తోపాటు పతాంజలి ఆయుర్వేదిక్ ఎండీ ఆచార్య బాలకృష్ణను కూడా కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. ఈ కేసులో బాబా రామ్‌దేవ్‌ను పార్టీగా చేర్చవద్దని రోహత్గీ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇద్దరినీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేయబోమని కూడా తెలిపింది.
కాగా ఫిబ్రవరి 27న రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, ఊబకాయం వంటి ఇతర వ్యాధులకు సంబంధించి పతంజలి ఆయుర్వేదం అందించే మందులపై ప్రకటనలను ప్రచురించకుండా సుప్రీంకోర్టు నిషేధించింది. ఈ మేరకు పతంజలి ఆయుర్వేద్ ఎంపీ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు ధిక్కార నోటీసు జారీ చేసింది. అయినా పతంజలి కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీం సీరియస్‌గా వ్యవహరించింది.
Comments
Please login to add a commentAdd a comment