వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేసినందుకుగాను పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. అసత్య ప్రచారాలను వెంటనే నిలిపేయాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే కంపెనీ ప్రతినిధులను ఆదేశించింది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు నోటీసులు పంపింది. అయితే నోటీసులకు సమాధానం చెప్పకపోవడంతో కోర్టు మరోసారి మందలించింది. దాంతో డైరెక్టర్ బాలకృష్ణ సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు.
పలు రకాల వ్యాధులను నయం చేస్తుందంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని గతంలో సుప్రీంకోర్టు సంస్థకు సూచించింది. వెంటనే ఆ తరహా ప్రకటనలు నిలిపివేయాలంది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అయితే ఆ హామీలను సంస్థ విస్మరించింది.
ఈ వ్యవహారంపై ఇటీవల కోర్టు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయవద్దని మరోసారి సూచించింది. ఆ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వారిని ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు కోర్టు ఎదుట హాజరుకావాలని తెలిపింది.
ఇదీ చదవండి: తండ్రిని ఇంట్లో నుంచి గెంటేసి తాజాగా ఆశీస్సులు కోరిన వైనం
ఈ తరుణంలో పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని సంస్థ డైరెక్టర్ బాలకృష్ణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ తరహా ప్రకటనలు జారీ చేయకుండా చూసుకుంటామని చెప్పారు. కోర్టు నోటీసులకు బదులు చెప్పకుండా ఉన్నందుకు కోర్టుకు క్షమాపణలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment