Patanjali Ayurved Ltd
-
సుప్రీం ఆగ్రహం.. మరోసారి యాడ్‌తో క్షమాపణలు చెప్పిన పతంజలి
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘షరతులు లేని బహిరంగ క్షమాపణ’ పేరుతో యాడ్ ఇచ్చారు. ఈ కేసులో పతంజలి పత్రికల్లో క్షమాపణలు చెప్పడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. ముందుగా సోమవారం కూడా క్షమాపణలు కోరుతూ యాడ్స్ఇచ్చారు.కాగా కోవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి సంస్థ గతంలో ఇచ్చిన ప్రకటనల వివాదంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కోర్టు పలుమార్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. మంగళవారం విచారణ సందర్భంగా రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు చెప్పినా.. ‘ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. కోర్టుకు చెప్పినట్లే నేడు పెద్ద సైజులో యాడ్ ఇచ్చారు.సంబంధిత వార్త: నాటి అడ్వర్టైజ్మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా? -
సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ కంపెనీ
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేసినందుకుగాను పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. అసత్య ప్రచారాలను వెంటనే నిలిపేయాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే కంపెనీ ప్రతినిధులను ఆదేశించింది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు నోటీసులు పంపింది. అయితే నోటీసులకు సమాధానం చెప్పకపోవడంతో కోర్టు మరోసారి మందలించింది. దాంతో డైరెక్టర్ బాలకృష్ణ సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. పలు రకాల వ్యాధులను నయం చేస్తుందంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని గతంలో సుప్రీంకోర్టు సంస్థకు సూచించింది. వెంటనే ఆ తరహా ప్రకటనలు నిలిపివేయాలంది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అయితే ఆ హామీలను సంస్థ విస్మరించింది. ఈ వ్యవహారంపై ఇటీవల కోర్టు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయవద్దని మరోసారి సూచించింది. ఆ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వారిని ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు కోర్టు ఎదుట హాజరుకావాలని తెలిపింది. ఇదీ చదవండి: తండ్రిని ఇంట్లో నుంచి గెంటేసి తాజాగా ఆశీస్సులు కోరిన వైనం ఈ తరుణంలో పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని సంస్థ డైరెక్టర్ బాలకృష్ణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ తరహా ప్రకటనలు జారీ చేయకుండా చూసుకుంటామని చెప్పారు. కోర్టు నోటీసులకు బదులు చెప్పకుండా ఉన్నందుకు కోర్టుకు క్షమాపణలు తెలిపారు. -
పతంజలి కంపెనీకి జరిమానా
హరిద్వార్: యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి కంపెనీ ఉత్పత్తులు నాణ్యతలేవని, మిస్ బ్రాండింగ్ అని కూడా తేలడంతో రూ.11 లక్షల జరిమానా విధించారు. నెల రోజుల్లో ఆ కంపెనీ ఈ నగదును కట్టాలని, భవిష్యత్తులో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. డిసెంబర్ 1న తీర్పు వెల్లడి కాగా, ఆలస్యంగా ఈ విషయం వెలుగుచూసింది. నాణ్యతలేని ఉత్పత్తులను తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టి మార్కెట్లో అధిక లాభాలను గడిస్తోందని 2012లో హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. తేనే, ఉప్పు, జామ్, మస్టర్డ్ ఆయిల్ ఉత్పత్తుల శాంపిల్స్ ను ఆ ఏడాది నవంబర్ లో సేకరించారు. నాణ్యత ప్రమామాలు పాటించలేదని అప్పట్లోనే నిరూపితమైంది. గత నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్న ఈ కేసును విచారించిన హరిద్వార్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పతంజలి కంపెనీకి రూ.11 లక్షల జరిమానా విధించారు. ఇతర కంపెనీలలో తయారుచేసిన ఉత్పత్తులను పతంజలి బ్రాండ్ ఇమేజ్ తో మార్కెట్లో విక్రయిస్తున్నారని, ప్రస్తుతం రూ.5వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 వే కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తుందని కోర్టు గుర్తించింది. ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ లాబోరేటరిలో టెస్ట్ చేసిన శాంపిల్స్ రిపోర్ట్స్ ను కోర్టు ఆధారంగా తీసుకుంది. ఆహార నాణ్యత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం సెక్షన్ 52(మిస్ బ్రాండింగ్), సెక్షన్ 53(తప్పుడు ప్రకటనలు) కింద ఆరోపణలు నిరూపితమయ్యాయి.