పతంజలి కంపెనీకి జరిమానా
హరిద్వార్: యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి కంపెనీ ఉత్పత్తులు నాణ్యతలేవని, మిస్ బ్రాండింగ్ అని కూడా తేలడంతో రూ.11 లక్షల జరిమానా విధించారు. నెల రోజుల్లో ఆ కంపెనీ ఈ నగదును కట్టాలని, భవిష్యత్తులో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. డిసెంబర్ 1న తీర్పు వెల్లడి కాగా, ఆలస్యంగా ఈ విషయం వెలుగుచూసింది. నాణ్యతలేని ఉత్పత్తులను తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టి మార్కెట్లో అధిక లాభాలను గడిస్తోందని 2012లో హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. తేనే, ఉప్పు, జామ్, మస్టర్డ్ ఆయిల్ ఉత్పత్తుల శాంపిల్స్ ను ఆ ఏడాది నవంబర్ లో సేకరించారు. నాణ్యత ప్రమామాలు పాటించలేదని అప్పట్లోనే నిరూపితమైంది.
గత నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్న ఈ కేసును విచారించిన హరిద్వార్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పతంజలి కంపెనీకి రూ.11 లక్షల జరిమానా విధించారు. ఇతర కంపెనీలలో తయారుచేసిన ఉత్పత్తులను పతంజలి బ్రాండ్ ఇమేజ్ తో మార్కెట్లో విక్రయిస్తున్నారని, ప్రస్తుతం రూ.5వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 వే కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తుందని కోర్టు గుర్తించింది. ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ లాబోరేటరిలో టెస్ట్ చేసిన శాంపిల్స్ రిపోర్ట్స్ ను కోర్టు ఆధారంగా తీసుకుంది. ఆహార నాణ్యత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం సెక్షన్ 52(మిస్ బ్రాండింగ్), సెక్షన్ 53(తప్పుడు ప్రకటనలు) కింద ఆరోపణలు నిరూపితమయ్యాయి.