Corporate tax
-
రూ.12.11 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 15.41 శాతం అధికంగా రూ.12.11 లక్షల కోట్ల నికర పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో రూ.5.10 లక్షల కోట్లు కార్పొరేట్ పన్ను రూపంలో రాగా, రూ.6.62 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ రూపంలో సమకూరింది. ఇక స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్ నుంచి నవంబర్ 10 వరకు రూ.15.02 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగింది. ఈ కాలంలో రూ.2.92 లక్షల కోట్ల రిఫండ్లను ఆదాయపన్ను శాఖ పూర్తి చేసింది. -
అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు
ముంబై: కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌సేత్ తెలిపారు. ప్రత్యక్ష పన్నుల్లో రెండో అతి పెద్ద వాటా కలిగిన కార్పొరేట్ పన్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్–జూలై) 10.4 శాతం తగ్గడం గమనార్హం. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో పన్నుల ఆదాయం 14 శాతం తగ్గడంపై వస్తున్న ఆందోళలను సేత్ తోసిపుచ్చారు. పన్నుల వసూళ్లను దీర్ఘకాలానికి చూడాలని సూచించారు. ‘‘కేవలం కొన్ని నెలల డేటా చూసి, దీర్ఘకాల ధోరణిని అంచనా వేయకూడదు. కనీసం మరో త్రైమాసికం వేచి చూసిన తర్వాత దీర్ఘకాలంపై అంచనాకు రావాలి. బడ్జెట్లో పేర్కొన్న అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు ఉంటాయన్నది నా ఉద్దేశ్యం’’అని వివరించారు. ఎస్ఎంఈ రుణాలపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా సేత్ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఏప్రిల్–జూలై కాలానికి స్థూల పన్నుల ఆదాయం రూ.8.94 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.8 శాతం అధికం. 2023–24 సంవత్సరానికి రూ.33.61 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొనడం గమనార్హం. -
రూ. వేల కోట్లు ట్యాక్స్ కట్టిన టాప్ 10 కంపెనీలు ఇవే.. (ఫొటోలు)
-
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 26 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం (ప్రస్తుత 2022–23) ఇంకా దాదాపు మూడు నెలలుపైగా మిగిలి ఉండగానే ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష్యంవైపునకు దూసుకుపోతున్నాయి. ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 17వ తేదీ నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా 26 శాతం వృద్ధితో రూ.13,63,649 కోట్లుగా నమోదయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ లక్ష్యంలో ఇది దాదాపు 80 శాతం. అధికారిక సమాచారం ప్రకారం, స్థూల వసూళ్లలో రిఫండ్స్ విలువ రూ.2.28 లక్షల కోట్లు. ఇవి పోను నికరంగా వసూళ్లు రూ.11.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థూల వసూళ్లలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) విలువ రూ.7.25 లక్షల కోట్లు. ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్)సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (పీఐటీ) వసూళ్లు రూ.6.35 లక్షల కోట్లు. మొత్తం లక్ష్యం రూ.27.50 లక్షల కోట్లు.. 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. 2022–23లో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు కట్టడికి (జీడీపీలో 6.4 శాతం వద్ద) దోహదపడే అంశం ఇది. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 45 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జూన్ 16వ తేదీ నాటికి 45 శాతం పెరిగాయి. విలువలో రూ.3.39 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022–23 ఇదే కాలంలో ఈ వసూళ్ల పరిమాణం రూ.2,33,651 కోట్లు. భారీగా నమోదయిన ముందస్తు పన్ను వసూళ్లు ఈ స్థాయి పురోగతికి కారణమని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) విభాగానికి సంబంధించి రూ.1.70 లక్షల కోట్లకుపైగా మొత్తం నమోదయ్యింది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ)సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) విభాగంలో రూ.1.67 లక్షల కోట్లకుపైగా వసూళ్లు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. వసూళ్లలో ముందస్తు పన్ను వాటా 33 శాతంపైగా పెరిగి రూ.1.01 లక్షల కోట్లకు ఎగసింది. -
కార్పోరేట్ ట్యాక్స్.. జోబైడెన్ వర్సెస్ జెఫ్ బేజోస్
అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం వివిధ దేశాధినేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ఓ ప్రతిపాదన కార్పోరేట్ కంపెనీలకు కంటగింపుగా మారింది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతోంది. కరోనా మొదలైన చీకటి రోజులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ద్రవ్యోల్బణం అక్కడ నమోదు అవుతోంది, డాలరు విలువకు బీటలు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఓ ప్రతిపాదన తెరమీదకు తెస్తూ ట్వీట్ చేశారు. అందులో ద్రవ్యోల్బణం కట్టడి చేయాలంటే.. సంపన్న కార్పోరేట్ కంపెనీలు పన్నులు సక్రమంగా చెల్లించాలంటూ కోరారు. యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ ట్వీట్‌కు వెంటనే కౌంటర్ ఇచ్చాడు ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెప్బేజోస్. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేయాలనుకోవడం మంచి విషయమే.. చర్చించతగిన అంశమే. అలాగే కార్పోరేట్ ట్యాక్సుల చెల్లింపు కూడా చర్చకు ఆమోదించతగిన విషయమే. అయితే ఈ రెండింటిని కలగలిపి కలగాపులగం చేయడం మాత్రం సరైన పద్దతి కాదు. దీంతో అసలు విషయం పక్కదారి పడుతుందంటూ జో బైడెన్ అభిప్రాయంతో విబేధించాడు జెఫ్‌బేజోస్. The newly created Disinformation Board should review this tweet, or maybe they need to form a new Non Sequitur Board instead. Raising corp taxes is fine to discuss. Taming inflation is critical to discuss. Mushing them together is just misdirection. https://t.co/ye4XiNNc2v — Jeff Bezos (@JeffBezos) May 14, 2022 గత కొంత కాలంగా పన్నుల చెల్లింపులో అమెజాన్ పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2018లో 11 బిలియన్ డాలర్ల లాభంపై అమెజాన్ పన్ను చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పోరేట్ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో జోబైడెన్, జెఫ్ బేజోస్ల మధ్య నడిచిన సంవాదం ఆసక్తికరంగా మారింది. చదవండి: జెఫ్ బేజోస్‌కి ఝలక్ ఇచ్చిన ఎలన్‌మస్క్! -
మరో ఏడాది రాయితీ పన్ను రేటు
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు త్వరగా వాటి తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు రెవెన్యూ వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలకు రాయితీతో కూడిన 15 శాతం పన్ను రేటును మరో ఏడాది పాటు (2024 మార్చి) వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ఆదాయం పెరుగుతున్నట్టు చెప్పారు. అంటే కార్పొరేట్ రంగం పనితీరు కూడా మెరుగ్గా ఉందని, జీడీపీలో పన్నుల వాటా ప్రస్తుత సంవత్సరంలో అత్యధిక గరిష్టానికి చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాయితీతో కూడిన పన్ను రేటును 2024 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు బడ్జెట్లో మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను తగ్గింపు సమయంలో మొదటిసారి ఈ అవకాశం కల్పించారు. 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే తయారీ యూనిట్లు, 2023 మార్చి 31లోపు ఉత్పత్తి మొదలు పెడితే 15 శాతం పన్ను రేటును ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ రాయితీ రేటును పొందే కంపెనీలు ఆదాయపన్ను చట్టం కింద మరే ఇతర మినహాయింపు, రాయితీ పొందేందుకు అవకాశం ఉండదు. పన్నుల వాటా పెరుగుతోంది.. కార్పొరేట్ పన్ను తగ్గించడంతో జీడీపీలో పన్నుల నిష్పత్తి తగ్గుముఖం పట్టిందని, ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నట్టు తరుణ్ బజాజ్ తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులను కలిపి చూస్తే జీడీపీలో పన్నుల నిష్పత్తి ఈ ఏడాది అత్యంత గరిష్ట స్థాయికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. గడిచిన మూడేళ్లలో మూలధన వ్యయాలు రెట్టింపైనట్టు చెప్పారు. ఇది జీడీపీ వృద్ధిని ముందుకు తీసుకెళుతుందన్నారు. ఒక్కసారి వృద్ధి చక్కగా పుంజుకుంటే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చి ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళతాయన్న అంచనాలను వ్యక్తం చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదవడం తెలిసిందే. దీంతో 2021–22 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూ.11.08 లక్షల కోట్లను ప్రభుత్వం రూ.12.50 లక్షల కోట్లకు సవరించుకుంది. 2022–23 సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.14.20 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని విధించుకుంది. ఇబ్బందుల్లేకుండా రుణ సమీకరణ ప్రభుత్వ రుణసమీకరణ కార్యక్రమం వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాధ్యతాయుతుంగా ఉటుందని.., ప్రైవేటు పెట్టుబడులకు అవరోధంగా ఉండదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేత్ తెలిపారు. ద్రవ్యలోటుకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. జీడీపీలో ద్రవ్యలోటు 6.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. చెప్పినట్టుగా రూ.6.6 లక్షల కోట్ల రుణాలకు పరిమితం అవుతామని అయజ్ సేత్ అన్నారు. చిన్న పొదుపు పథకాల నుంచి ఎక్కువ నిధులు సమకూరితే మార్కెట్ నుంచి రుణ సమీకరణ తగ్గించుకుంటామని చెప్పారు. రెట్రో కేసుల సెటిల్మెంట్ ఫిబ్రవరిలోనే పూర్తి.. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సు కేసులన్నింటినీ దాదాపుగా ఫిబ్రవరిలోనే సెటిల్ చేసే అవకాశం ఉందని తరుణ్ బజాజ్ తెలిపారు. అనూహ్య మార్పులేమీ ఉండని, స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఇది దోహదపడగలదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ‘రెట్రో ట్యాక్సేషన్‌ను ఆగస్టులో రద్దు చేశాం. దాదాపుగా అన్ని కేసులను ఈ నెలలోనే పరిష్కరించే అవకాశం ఉంది. తద్వారా ఆ అధ్యాయం ఇక ముగిసిపోతుంది‘ అని బజాజ్ పేర్కొన్నారు. చదవండి : పన్ను చెల్లింపుదారులకు ఝలక్ ! ఐటీ అప్డేట్.. క్షమాభిక్ష స్కీము కాదు.. -
15% కార్పొరేట్ పన్ను గడువు పొడిగింపు!
న్యూఢిల్లీ: తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ పన్ను అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. ఇందుకు సంబంధించిన గడువు పొడిగింపును పరిశీలించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధి కనిష్టాలకు పడిపోవడంతో పెట్టుబడులకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి.. అదే విధంగా 2019 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య తయారీ రంగంలో ఏర్పాటయ్యే కంపెనీలకు కార్పొరేట్ పన్నును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయాలు తీసుకుంది. ‘‘మేము ఏం చేయగలమన్నది చూస్తాం. నూతన పెట్టుబడులపై 15 శాతం కార్పొరేట్ పన్ను నుంచి పరిశ్రమ ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను. దీంతో 2023 మార్చి 31 వరకు ఇచ్చిన గడువును పొడిగించడాన్ని పరిగణనలోకి తీసుకుంటాము’’ అని సీతారామన్ ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి చెప్పారు. దేశీయ పరిశ్రమలకు, ఆర్థిక రంగ ఉద్దీపనానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కోవిడ్–19 అత్యవసర రుణ సదుపాయం కేవలం ఎంఎస్ఎంఈలకే కాకుండా అన్ని కంపెనీలకు అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. లిక్విడిటీ సమస్య లేదు: వ్యవస్థలో లిక్విడిటీ తగినంత అందుబాటులో ఉందని, ఇందుకు సం బంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని సీతారామన్ చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాలకూ బకాయిలు తీర్చేయాలని చెప్పినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌దేనని స్పష్టం చేశారు. -
నూతన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు ఇవే...
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శనివారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఈ మేరకు... 0 నుంచి 2.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదని, 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం అలాగే ఉంటుందని తెలిపారు. అదే విధంగా.. రూ. 5-7.5 లక్షల వార్షిక ఆదాయంపై ఇప్పటి వరకు ఉన్న పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి, రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్నును 20 నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు.. అదే విధంగా రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను, రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) అయితే, ఆదాయం పన్నును సరళీకరించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఏడు స్లాబుల విధానాన్ని ప్రతిపాదించారు. గతంలో ఐదు స్లాబులు మాత్రమే ఉన్న విషయం తెల్సిందే. ఆదాయం పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త స్లాబుల్లో ఏదోఒక స్లాబును ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఆదాయం వరకు వచ్చేవారు ఏ స్లాబును ఎంపిక చేసుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే రెండింటిలోను వారికి తేడా లేదు. ఏడు స్లాబులు గల కొత్త విధానాన్ని ఎంపిక చేసుకునేవారు 80 సీ, 80 డీ కింద వచ్చే మినహాయింపులను వదులు కోవాల్సి ఉంటుంది. వాటిని వదులుకున్నప్పుడే కొత్త విధానం వర్తిస్తుంది. పన్ను మినహాయింపులు వదులుకోదల్చుకోలేని వారు పాత స్లాబులోనే కొనసాగవచ్చు. ఏది ఏమైనా అది వారి ఐచ్ఛికం. అదే విధంగా... కార్పొరేట్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఈ మేరకు కార్పొరేట్ ట్యాక్స్‌లను 15 శాతం తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కార్పొరేట్ ట్యాక్సులను తగ్గించడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి తక్కువ కార్పొరేట్ పన్నులు ఉన్న దేశం భారత్ అని పేర్కొన్నారు. కొత్తగా అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డివిడెండ్ డిస్ర్టిబ్యూషన్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్షియల్ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు చేస్తామని తెలిపారు. -
కార్పొరేట్ ట్యాక్స్‌ను హేతుబద్ధీకరించాలి
న్యూఢిల్లీ: వివిధ కార్పొరేట్ ట్యాక్స్ రేట్లన్నింటినీ ఎటువంటి మినహాయింపులు లేకుండా 15 శాతం స్థాయికి హేతుబద్ధీకరించాలని కేంద్రాన్ని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కోరింది. 2023 ఏప్రిల్ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా రాబోయే బడ్జెట్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయాలని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఇంకా ఆశించిన స్థాయిలో తగ్గుదల లేదని తెలిపారు. తయారీ, సేవా రంగాల పన్ను రేట్లలో అసమానతలు నెలకొనడమే ఇందుకు కారణమని వివరించారు. తగ్గుతున్న శాతాలు... 1991–92లో 45 శాతంగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ రేటు క్రమంగా తగ్గి ప్రస్తుతం 22 శాతానికి చేరింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ స్థాయికి తగ్గించింది. అయితే, కంపెనీలు దీన్ని వినియోగించుకోవాలంటే పన్ను మినహాయింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలను వదులుకోవాల్సి ఉంటుంది. 2023 మార్చి 31లోగా ఉత్పత్తి ప్రారంభించే తయారీ సంస్థలు, 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటైన సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే ఉంటుంది. సర్‌చార్జీ, సెస్సు దీనికి అదనం. పలు దేశాలకు దీటుగా పోటీపడేందుకు దేశీ సంస్థలకు .. తాజా రేట్ల కోత తోడ్పడనుంది. క్రమేపీ పెట్టుబడుల వ్యయాన్ని తగ్గించుకునేందుకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఊతమిచ్చేందుకు తక్కువ స్థాయి కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు దోహదపడనున్నాయి. కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించింది. -
గతంకంటే బలంగా బ్యాంకింగ్ రంగం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల విలీనం వల్ల బ్యాంకింగ్ రంగం ఎంతో బలపడిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ దృడ సంకల్పంతో బ్యాంక్‌ల విలీన నిర్ణయం జరిగిందని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ 17వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడంతో పాటు అంతరాష్ట్రాల సంబంధాలు కూడా బలపడ్డప్పుడే దేశంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అనే నినాదంతో దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కాగా కేంద్ర ప్రభుత్వం పథకాల కోసం 100 లక్షల కోట్ల ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏ పౌరుడిపైనా ఒత్తిడి పైట్టబోదని తెలిపారు. పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందితే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సమస్యలుంటే అధికారులు చెప్పవచ్చని అన్నారు. కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం వల్ల దేశంలో పెట్టుబడులు పెరగడంతో పాటు తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. సంస్కరణలను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని అన్నారు. అందరికీ సురక్షితమైన నీరు అనే లక్ష్యంతో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. దేశంలో 112 జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాలను విస్మరించారని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు, రామ జన్మభూమి సమస్యకు పరిష్కారం లభించడం సంతోషకరమన్నారు. ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. -
పెట్టుబడుల్ని రప్పించేందుకే కార్పొరేట్ పన్ను కోత
న్యూఢిల్లీ: పెట్టుబడులకు ఊతమిచ్చేందుకే కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ వెల్లడించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పడే ప్రగతి చక్రాలు ఆశించినంత వేగంగా పరుగు తీయకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలియజేశారు. ఇండియా ఎకనమిక్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శుక్రవారం సుబ్రమణియన్ ఈ విషయాలు చెప్పారు. ‘ఉత్పాదకత మెరుగుపడితే వేతనాలు పెరుగుతాయి. ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎగుమతులు పెరుగుతాయి. ఇవన్నీ కలిస్తే అంతిమంగా వినియోగదారుల కొనుగోలు శక్తి మెరుగుపడి, డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ ఆధారంగానే కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. ఇదో చక్రం లాంటిది. గతంలో 7% పైగా వృద్ధి రేటు ఉన్నప్పుడు.. ఈ చక్రాలు వేగంగా పరుగెత్తేవి.. కానీ గడిచిన కొన్ని త్రైమాసికాలుగా ఆశించినంత స్థాయిలో పరుగు తియ్యడం లేదు. అందుకే .. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది‘ అని చెప్పారు. -
కార్పొరేట్ పన్ను కోతకు బిల్లు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు, 2019ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కార్పొరేట్ పన్ను తగ్గింపునకు ఉద్దేశించిన ఈ బిల్లును అంతక్రితం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టారు. మందగిస్తున్న ఆర్థిక వృద్ధి రేటుకు ఊతం ఇవ్వడానికి కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ, సెప్టెంబర్ 20వ తేదీన కేంద్రం ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) ఆర్డినెన్స్, 2019ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఐఎఫ్ఎస్సీ అథారిటీ దిశలో... కాగా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ) అధారిటీ బిల్లు, 2019ని కూడా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఐఎఫ్‌ఎస్‌సీలకు సంబంధించి ఏకీకృత ఫైనాన్షియల్ రెగ్యులేటర్ ఏర్పాటు ఈ బిల్లు లక్ష్యం. ఇందుకు సంబంధించి ఏర్పాటయ్యే అథారిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. చైర్మన్ నేతృత్వంలో పనిచేసే అథారిటీలో ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. ఇద్దరు ప్రభుత్వ నామినీలు ఉంటారు. సెలెక్ట్ కమిటీ సిఫారసులతో మరో ఇరువురినీ ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. అన్ని ఫైనాన్షియల్ సేవల ఏకీకృత నియంత్రణ ప్రతిపాదిత అథారిటీ ఏర్పాటు లక్ష్యం. ఐఎఫ్‌ఎస్‌సీల్లో ప్రస్తుతం బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్స్, బీమా రంగాలు ఉంటే, వాటని ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ వంటి విభిన్న రెగ్యులేటర్లు నియంత్రిస్తున్నాయి. సెంట్రల్ జీఎస్టీ @ రూ.3.26 లక్షల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, బడ్జెట్ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయని వివరించారు. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లని వివరించారు. -
ఐటీసీ లాభం 4,173 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.4,174 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.3,045 కోట్లు)తో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. పేపర్ బోర్డ్స్, హోటళ్లు, ఎఫ్ఎమ్సీజీ ఇతర వ్యాపారాల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఐటీసీ వెల్లడించింది. కంపెనీ సాధించిన అత్యధిక త్రైమాసిక లాభం ఇదే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనం (రూ.166 కోట్ల మేర) సానుకూల ప్రభావం చూపించిందని ఐటీసీ పేర్కొంది. నికర అమ్మకాలు రూ.12,019 కోట్ల నుంచి 6% వృద్ధితో రూ.12,759 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సిగరెట్ల వ్యాపారం ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.5,842 కోట్లకు, ఎఫ్ఎమ్సీజీ వ్యాపారం(సిగరెట్లు కలుపుకొని) 6 శాతం వృద్ధితో రూ.9,138 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీయేతర వ్యాపారాల ఆదాయం 4 శాతం పెరిగి రూ.3,286 కోట్లకు చేరాయి. ఇక హోటళ్ల వ్యాపారం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.446 కోట్లకు, వ్యవసాయ వ్యాపార విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.2,674 కోట్లకు, పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ విభాగం ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,565 కోట్లకు పెరిగాయని పేర్కొంది. -
మార్కెట్ పంచాంగం
కార్పొరేట్ పన్ను తగ్గింపు కారణంగా గత నెల మూడోవారంలో జరిగిన ర్యాలీలో వచ్చిన లాభాల్ని పట్టుమని పదిరోజులు కూడా మార్కెట్ నిలుపుకోలేకపోయింది. పన్ను తగ్గింపు ప్రయోజనం లేకుండా పెరిగిన షేర్లు తగ్గడం సహజమేగానీ, ఆ ప్రయోజనం పొందే షేర్లు సైతం గతవారం చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం ఆశ్చర్యం కల్గించేదే. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లను మొండి బకాయిలు, జీడీపీ బలహీన వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు సైతం విక్రయిస్తున్నారు. ఈ రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగితే...వీటికే సూచీల్లో అధిక వెయిటేజీ వున్నందున, మార్కెట్ మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం వుంటుంది. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... అక్టోబర్ 4తో ముగిసిన నాలుగురోజుల వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 38,923 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 37,633 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 1150 పాయింట్ల భారీ నష్టంతో 37,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం వేగంగా 37,950 పాయింట్ల తొలి అవరోధాన్ని అధిగమించి, స్థిరపడితేనే డౌన్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుంది. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని దాటితే 38,300–38,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తే క్రమేపీ 38,850 పాయింట్ల వద్దకు చేరే అవకాశం వుంటుంది. ఈ వారం సెన్సెక్స్ తొలి అవరోధంపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా మొదలైనా 37,540 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 37,305 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 37,000 పాయింట్ల వద్దకు పతనం కొనసాగవచ్చు. నిఫ్టీ తొలి నిరోధం 11,260 గతవారం ప్ర«థమార్థంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,554 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగిన తర్వాత ... చివరిరోజున 11,158 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 337 పాయింట్ల నష్టంతో 11,175 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి తొలుత 11,260 పాయింట్ల సమీపంలో గట్టి నిరోధం ఎదురవుతున్నది. ఈ స్థాయిపైన స్థిరపడితేనే మార్కెట్ క్షీణతకు అడ్డుకట్టపడుతుంది. అటుపైన 11,370–11,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 11,500 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. నిఫ్టీ ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే 11,110 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,060 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 10,950 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
విదేశీ పెట్టుబడులపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే కొరియా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, చైనా వంటి అనేక దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. కొరియా.. స్టీల్, ఆటోమొబైల్, బ్లూ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించి వెళ్లగా.. ఇజ్రాయెల్.. డీశాలినేషన్, వ్యర్థాల నిర్వహణ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిని చూపిస్తోంది. ఫ్రాన్స్.. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్, అర్బన్ ఇన్ఫ్రా వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఆస్ట్రేలియా.. మైనింగ్, ఇంధనం, విద్య, రహదారులు, భవనాల నిర్మాణం వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విదేశీ పారిశ్రామిక ప్రతినిధుల సందేహాలను తీర్చడానికి ఆయా దేశాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనం వృద్ధిరేటు తగ్గుతుండటంతో కొత్త పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కార్పొరేట్ ట్యాక్స్‌ను 10 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తే.. ఇప్పటికే ఉన్న కంపెనీలపై పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి తగ్గించింది. దీంతో చైనా, కొరియా, జపాన్, అమెరికా వంటి దేశాల కంటే మన దేశంలో పన్ను రేటు తక్కువగా ఉండటంతో విదేశీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. వినూత్న విధానాలతో ముందుకు.. గత ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా భాగస్వామ్య సదస్సులు నిర్వహించి.. ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేసినా ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. దీనికి భిన్నంగా సీఎం వైఎస్ జగన్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే విదేశీ రాయబారుల సమావేశంలో కొత్త ప్రభుత్వ విధానాలను వివరించడంతోపాటు కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై ఉన్న అపోహలను తొలగించారు. అలాగే సొంత ఖర్చులతో ఇజ్రాయెల్, అమెరికా పర్యటనలకు వెళ్లిన ఆయన అక్కడ కూడా పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. అమెరికా పర్యటనలో యూఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల కల్పన, తయారీ రంగం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి తెలిపారు. ఇలా ఆయా దేశాల్లో పెట్టుబడిదారులతో మాట్లాడటంతోపాటు వారిని నేరుగా రాష్ట్రానికి తీసుకొచ్చి వాస్తవ పరిస్థితులు వివరించడం వినూత్న ఆలోచన అని సీఐఐ ఏపీ చాప్టర్ వైఎస్ చైర్మన్ రామకృష్ణ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్ 3, 4 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్రంలో అవకాశాలను వివరించడం ద్వారా దక్షిణాసియా దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
పెద్దలకు రాయితీ–పేదలకు కోత
యూరియా సబ్సిడీ మీద కోతలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయ త్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికంటే ముం దర వంటగ్యాస్ సబ్సిడీల తగ్గింపు దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు తెలిసినవే. అదేవిధంగా, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జరిగే ఆహార పంపిణీలను కూడా క్రమేణా నామమాత్రంగా మార్చివేశారు. ఇదే నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే ప్రభు త్వం కార్పొరేట్లపై పన్నును సుమారు 34 శాతం నుంచి 25 శాతం మేరకు తగ్గించింది. ఈ నిర్ణయం వలన, కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి సుమారు 1.45 లక్షల కోట్లమేరకు గండిపడుతుంది. ఇప్పటికే పన్నుల సేకరణ, ఆదాయ సమీకరణ లక్ష్యంలో మన ప్రభుత్వం దారుణంగా విఫలం అవుతోంది. ఈ స్థితిలో కార్పొరేట్లకు వదులుకున్న ఈ 1.45 లక్షల కోట్ల రూపాయలు మన ఖజానాను మరింత బలహీనపరచగలవు. దీనికి తోడుగా ఈమధ్యకాలంలోనే ఉద్దీపన పథకాల పేరిట వాహనరంగం, రియల్ ఎస్టేట్ రంగం వంటి కార్పొరేట్ రంగాలకు వేలకోట్ల రూపాయలను ప్రభుత్వం కట్టబెట్టే ఆలోచన చేసింది. అలాగే, ఒత్తిడికి లొంగి విదేశీ పోర్ట్‌పోలియో ఇన్సెస్టర్ల మీద వేసిన పన్నును ఉపసంహరించుకుంది. ఈ చర్యల ద్వారా మన దేశ ఆరి్థక వ్యవస్థలో నెలకొన్న మాంద్య పరిస్థితులను చక్కదిద్దగలమని పాలకులు భావిస్తున్నారు. కానీ, నిజా నికి మాంద్యం సమస్యకు ఇది పరిష్కారం కాదు. నేడు వ్యవస్థలో మాంద్యానికి కారణం పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తి. ఉపాధిరాహిత్యం, ద్రవ్యోల్బణం, వేతనాల పెరుగుదలలో స్తంభనవంటి వాటి వలన మన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. అలాగే, దీనికి పెద్దనోట్ల రద్దు, హడావుడి జీఎస్టీలు అగ్గికి ఆజ్యంలా తోడయ్యాయి. విషయం డిమాండ్ పతనం కాగా, ప్రభుత్వం బండికి వెనుక గుర్రాన్ని కట్టినట్టుగా కార్పొరేట్లకు రాయితీల ద్వారా వ్యవస్థకు చికిత్స చేయడానికి ఉపక్రమించింది. ఈ విధమైన ధోరణి తాత్కాలికంగా కార్పొరేట్లకు కొద్దిపాటి ఉపశమనాన్ని కల్పించగలదు. వాటి బ్యాలెన్స్ షీట్లు కాస్తంత మెరుగుపడగలవు. కానీ, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, మాంద్యాన్ని అధిగమించే నికరమైన పనిని ఈ విధానాలు సాధించలేవు. ఈ కారణం గానే అమెరికాలో ట్రంప్, కార్పొరేట్లపై పన్నును భారీగా తగ్గించినప్పుడు, ఆర్థ్ధిక రంగంలో తాత్కాలికంగా ఆశావహ లక్షణాలు కనపడ్డాయి. కానీ, అదంతా కేవలం తాత్కాలికంగానే. కొద్దికాలంలోనే అమెరికాలో ఆర్థిక మందగమన స్థితి మరలా విజృంభించింది. కాగా, ప్రజల డిమాండ్ లేదా కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపాధి కల్పన, సంక్షేమం వంటి వాటి రూపంలో ఉద్దీపనలను ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడుతోంది. దీనికి కారణంగా తన ఆదాయ లోటును లేదా ద్రవ్య లోటును చెబుతోంది. ప్రభుత్వ ఖజానాలో తగినమేరకు డబ్బు లేదు గనుక నేడు సంక్షేమ పథకాలను అమలు జరపటం సాధ్యం కాదంటూ, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి, ఈ స్థితిలో ఉన్న కాస్తంత ఆదాయాన్నీ కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేందుకు ఎందుకు వదులుకున్నట్లు? మరోప్రక్కన ద్రవ్యలోటు పెరిగిపోతోందంటూ యూరియా, రేషన్ సరుకులు, వంట గ్యాస్ వంటి సామాన్య జనం, రైతుల అవసరాలపై సబ్సిడీలను ఎత్తేయడం ఎందుకు? అలాగే, మొన్నటి బడ్జెట్లో ప్రజావసరం అయిన పెట్రోల్‌పై లీటరుకు రూపాయి సెస్ వేయడం ఎందుకు? అదే, 1980ల నుంచీ పాలకులు ప్రపంచవ్యాప్తంగా, 1990ల నుంచీ మన దేశంలో అమలుజరుపుతోన్న సప్లై సైడ్ ఆర్థిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం సారం సులువైనదే. దీని ప్రకారం, ఆర్థికవ్యవస్థలో వృద్ధికోసం కార్పొరేట్లపై పన్నులు, తదితర ‘భారాలు’, నియంత్రణలను తగ్గించడం లేదా తొలగించడం చేయాలి. తద్వారా వారు మరింతగా పెట్టుబడులు పెడతారు. ఫలితంగా వ్యవస్థలో ఉపాధికల్పన జరుగుతుంది. కాగా, ఈ సప్లై సైడ్ ఆర్థిక సిద్ధాంతం, దానిముందరి కాలపు డిమాండ్ యాజమాన్య సిద్ధాంతానికి తిలోదకాలు ఇచి్చంది. ఈ డిమాండ్ యాజమాన్య సిద్ధాంతమే 1930ల నాటి పెను ఆరి్థకమాంద్య కాలం నుంచి 1980ల వరకూ ప్రపంచంలో బలంగా ఉంది. దీని ప్రకారం, మార్కెట్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మెజారిటీ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉండాలి. దానికోసం, ప్రభుత్వం; కార్పొరేట్లూ కారి్మకుల, ఉద్యోగుల, సామాన్యుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి. అంటే, ఆయా వర్గాలకు ఉచిత వైద్యం, విద్యవంటి సంక్షేమ పథకాలు అమలు జరగాలి. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం వ్యయాలు చేయాలి. ఈ రకమైన విధానాల ద్వారానే 1950ల నుంచి 1980ల వరకూ ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తాలూకు స్వర్ణయుగంగా చెప్పుకునే కాలం నడిచింది. అదే సంక్షేమరాజ్యాల కాలం. కానీ, తరువాతి కాలంలో కార్పొరేట్లు తమ లాభాలను పెంచుకోగలిగేందుకు డిమాండ్ యాజ మాన్య, సంక్షేమరాజ్య విధానాలకు బ్రిటన్, అమెరికాలతో మొదలుపెట్టి, మెల్లగా ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ తిలోదకాలు ఇచ్చాయి. సంస్కరణలూ, ప్రపంచీకరణ పేరిట కార్పొరేట్లు ధనవంతులకు అనుకూలమైన సప్లై సైడ్ ఆరి్థక విధానాలను ముందుగు తెచ్చారు. తద్వారా పేద ప్రజలకు సంక్షేమం కలి్పస్తే వారు సోమరిపోతులవుతారనే కొత్త సిద్ధాంతం ముందుకు వచి్చంది. తద్వారా ప్రభుత్వ నిధులను కార్పొరేట్లూ, ధనికులకు రాయితీలుగా మళ్ళించడం మొదలుపెట్టారు. కడకు ఈ విధానాలు ప్రజల కొనుగోలు శక్తి పతనానికి దారి తీసి, అంతిమంగా 2008 నాటి ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి. కాబట్టి, నేడు మన దేశంలో కూడా ఈ కాకులను కొట్టి గద్దలకు వేసే కార్పొరేట్ల అనుకూల విధానాలు ఆర్థ్ధిక మాంద్య స్థితిని మరింత జటిలం మాత్రమే చేయగలవు. ఈ కారణం చేతనే నేటి మాంద్య స్థితిలో కూడా 2018లో 831 మందిగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయలపైన సంపద ఉన్న వారి సంఖ్య, 2019లో 953కు పెరిగింది. అంటే, ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు ధనవంతులను మరింత ధనవంతులను చేస్తున్నాయి. సామాన్య జనాన్ని ఆరి్థకమాంద్యపు అ«థఃపాతాళంలోకి నెట్టేస్తున్నాయి. వ్యాసకర్త : డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడైనా మారేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : నానాటికి కునారిల్లుతున్న దేశ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో దేశంలో స్టాక్ మార్కెట్ ఎన్నడు లేనంతగా రోదసివైపు దూసుకెళ్లిన విషయం తెల్సిందే. ఆమె తీసుకున్న నిర్ణయం సముచితమని, తద్వారా దేశంలో కార్పొరేట్ పెట్టుబడులు భారీగా పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆయన ప్రభుత్వంలోని ప్రభువులంతా ప్రశంసలు కూడా కురిపించారు. అలాంటి పరిస్థితే ఉంటే ఇప్పటికే పలు కార్పొరేట్ వర్గాల నుంచి సూచనలు అందేవి. అలాంటి సూచనలు సుదూరంగా కూడా కనిపించడం లేదు. ఎందుకు? లోపం ఎక్కడ? నిర్మలా సీతారామన్ ఈ నెల 20వ తేదీన కార్పొరేట్ పన్నును 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ఇతర రాయతీలేవీ తీసుకొని కార్పొరేట్ కంపెనీలు 22 శాతం పన్నును మాత్రమే చెల్లిస్తే చాలు. ఈ నిర్ణయం వల్ల ఏడాదికి భారత ఖజానాకు 1.45 లక్షల కోట్ల రెవెన్యూ తగ్గిపోయింది. దీని వల్ల ద్రవ్యలోటు మరింతగా పెరుగుతుంది. ముమ్మాటికి ఆర్థిక ద్రవ్యలోటును 3.3 శాతానికి మించనివ్వమంటూ మోదీ ప్రభుత్వం పదేళ్లుగా ప్రామిస్ చేస్తూ వచ్చినా అది నేటికి నాలుగు శాతానికి చేరుకుంది. జాతీయ స్థూల ఆదాయం (జీడీపీ) వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళతామని మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో వాగ్దానం చేసిన మోదీ ప్రభుత్వం నేటికి ఆ వాగ్దానాన్ని తీర్చలే కపోగా ఉన్న వృద్ధిరేటును కూడా నిలబెట్టుకోలేక పోయింది. దేశ జీడీపీ రేటు గత త్రైమాసికంలో ఐదు శాతానికి పడిపోవడంతో పరువు పోతున్నట్లు భావించింది. ద్రవ్యలోటు విషయంలో ఇచ్చిన మాటను తప్పినా సరేగానీ వృద్ధి రేటు విషయంలో పోతున్న పరువును పరిరక్షించుకోవడం కోసం కార్పొరేట్ పన్నును తగ్గించింది. పన్ను రేటు తక్కువగా ఉందని, కొత్త కంపెనీలు ఆశించినంతగా ముందుకు రాకపోయిన పన్ను తగ్గింపు వల్ల లాభ పడిన ప్రస్తుత కంపెనీలు అదనపు పెట్టుబడులకు ముందుకు వస్తాయన్నదే ప్రభుత్వం నిర్ణయం వెనక అసలు లక్ష్యం. అదే జరిగితే ద్రవ్యలోటు తగ్గుతుందీ, వృద్ధి రేటూ పెరుగుతుంది. ప్రస్తుత కార్పొరేట్ కంపెనీలు అదనపు పెట్టుబడులు పెట్టకపోయినా, పన్ను మనిహాయింపు వల్ల మిగిలిన సొమ్మునైనా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. ఆటోమొబైల్ రంగం నుంచి ఉక్కు, సిమ్మెంట్ రంగం వరకు వృద్ధి రేటు ఘోరంగా పడిపోయిన నేపథ్యంలో పలు కంపెనీలు వారం చొప్పున ‘లే ఆఫ్’లు ప్రకటిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పన్ను తగ్గింపు వల్ల వచ్చిన ఊరటకు ఊపిరి పీల్చుకుంటాయే తప్ప, కొత్తగా పెట్టుబడులకు ముందుకు రావు. దేశంలోని వినియోగదారుల కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వారి కొనుగోలు శక్తి పెరిగితేగాని ఈ కంపెనీలు అదనపు పెట్టుబడులకు ముందుకు రావు. దేశంలో నిరుద్యోగ సమస్య 48 ఏళ్ల గరిష్టానికి చేరకున్న పరిస్థితుల్లో వినియోగదారుల కొనుగోలు శక్తి పెంచడం అంత ఈజీ కాదు. వాస్తవానికి దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలోటును తగ్గించుకోవాలంటే కార్పొరేటు పన్నులను తగ్గించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకొని కార్పొరేట్ పన్నులను పెంచితే చాలు. విలాసాల విషయంలో కార్పొరేట్ యజమానులతో నేటి రాజకీయ వేత్తలు పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే అవకాశం లేదు. కార్పొరేట్ రంగం నుంచి అదనపు పెట్టుబడులు రావడం వల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుంది అంటే, కొత్తవారికి ఉద్యోగాలు వస్తాయి. వారు కూడా తోడవుతారు కనుక వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని సిద్ధాంతం. మూల సిద్ధాంతాన్ని గుడ్డిగా పాటించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. (చదవండి: భారత ఆర్థిక వ్యవస్థపై ‘సహస్రాబ్ది జోక్’) -
భారత్... అవకాశాల గని!
న్యూయార్క్: అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాల ప్రయాణంలో కేవలం ఆరంభమేనన్నారు. కార్పొరేట్ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. భారత్‌లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని న్యూయార్క్‌లో బుధవారం జరిగిన బ్లూంబర్గ్ వ్యాపార సదస్సులో భాగంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కార్పొరేట్లను, సంపద సృష్టికర్తలను గౌరవించే ప్రభుత్వం భారత్‌లో ఉందన్నారు. ‘‘విస్తరణకు అవకాశం ఉన్న మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు భారత్‌కు విచ్చేయండి. ఆధునిక ధోరణులు, ఫీచర్లను అభినందించే మార్కెట్లో చేయదలిస్తే భారత్‌కు రండి. భారీ మార్కెట్ ఉన్న చోట స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రండి. ప్రపంచంలో ఒకానొక అతిపెద్ద మౌలిక సదుపాయాల వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు తరలిరండి’’ అని ప్రధాని అంతర్జాతీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. కార్పొరేట్ పన్నును అన్ని రకాల సెస్సులు, చార్జీలతో కలుపుకుని 35 శాతంగా ఉన్నదాన్ని ఇటీవలే ప్రభుత్వం 25.17 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల పన్నులకు దీటుగా భారత కార్పొరేట్ పన్ను మారింది. ఆ నాలుగు అంశాలే భారత్‌కు బలం... ‘‘భారత వృద్ధి పథం నాలుగు కీలక అంశాలతో ముడిపడి ఉంది. ప్రపంచంలో వేరెక్కడా ఇవి లేవు. అవి ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, నిర్ణయాత్మక శక్తి. ప్రజాస్వామ్యానికి తోడు, రాజకీయ స్థితర్వం, ఊహించతగ్గ విధానాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్నవి పెట్టుబడుల వృద్ధికి భరోసానిచ్చేవి., రక్షణనిచ్చేవి. భారత్ తన పట్టణాలను ఎంతో వేగంగా ఆధునీకరిస్తోంది. ఆధునిక టెక్నాలజీలతో, పౌరులకు సౌకర్యమైన సదుపాయాలతో వాటిని తీర్చిదిద్దుతోంది. కనుక పట్టణీకరణపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రావాలి’’అని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రక్షణ రంగంలో ముందెన్నడూ లేని స్థాయిలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు ఆయన చెప్పారు.భారత్ కోసం, ప్రపంచం కోసం భారత్‌లో తయారు చేయాలనుకుంటే భారత్‌కు రావాలని ఆహ్వానం పలికారు. వ్యాపార వాతావరణం మెరుగుపరిచేందుకు గాను రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించిన అనంతరం.. మోదీ సర్కారు 50 చట్టాలను రద్దు చేసిన విషయం గమనార్హం. ఆరంభమే... మున్ముందు ఇంకా చూస్తారు ‘‘భారత ప్రభుత్వం వ్యాపార ప్రపంచాన్ని, సంపద సృష్టిని గౌరవిస్తుంది. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు కఠినమైన, భారీ నిర్ణయాలను తీసుకుంటోంది. నూతన ప్రభుత్వం కొలువుదీరి కేవలం మూడు నాలుగు నెలలే అయింది. ఇది కేవలం ఆరంభమేనని చెప్పదలుచుకున్నా. ఇంకా ఎంతో పదవీ కాలం ఉంది. ఈ ప్రయాణంలో అంతర్జాతీయ వ్యాపార సమూహంతో భాగస్వామ్యం పటిష్టం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మీకు బంగారం లాంటి అవకాశం’’ అని మోదీ వివరించారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) దేశ జీడీపీని తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కేంద్ర సర్కారు విధించుకున్న విషయం గమనార్హం. ఇప్పటికే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల మేర జీడీపీ స్థాయిని పెంచామని, 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పారు. 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో ఇప్పటికే 120 గిగావాట్ల మేర సాధించినట్టు తెలిపారు. 450 గిగావాట్ల లక్ష్యాన్ని సమీప కాలంలో చేరుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. గడచిన ఐదేళ్లలో భారత్ 286 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని, అంతక్రితం 20 ఏళ్లలో వచ్చినవి ఇందులో సగమేనన్నారు. మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. సరుకు రవాణా, అంతర్జాతీయ పోటీతత్వం, అంతర్జాతీయ ఆవిష్కరణ, వ్యాపార సులభతర నిర్వహణ సూచీల్లో భారత్ తన స్థానాలను మెరుగుపరుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. -
పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్
న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్ను తగ్గింపుతో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా మారిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదిగా ఆయన అభివరి్ణంచారు. ఆరి్థక మందగమనానికి మందుగా దేశీయ కంపెనీలపై 30 శాతంగా ఉన్న పన్నును 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ గత వారం తగ్గించిన సంగతి తెలిసిందే. 28 సంవత్సరాల్లో చరిత్రాత్మకమైనదిగా ఈ నిర్ణయాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. ‘‘ఇది ఎంతో సాహసోపేతమైన చర్య. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన ఆరి్థక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి అత్యంత సానుకూలమైనది. భారత్ కార్పొరేట్ పన్ను ప్రస్తుతం ఆసియాన్ అలాగే ఇతర ఆసియా దేశాల్లో అతితక్కువగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్య పోటీ అంశాలకు వస్తే, ఇది భారత్‌కు అత్యంత సానుకూలమైనది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోణంలో చూసినా లేక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుల (ఎఫ్‌డీఐ) వైపు నుంచి ఆలోచించినా, భారత్ ఇప్పుడు పోటీ పూర్వక వాతావరణంలో నిలిచింది. అధిక పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యాన్ని పొందింది’’ అని దాస్ పేర్కొన్నారు. ‘‘ఇక దేశీయ కార్పొరేట్ల విషయానికి వస్తే, వారి వద్ద ఇప్పుడు అదనపు నిధులు ఉంటాయి. దీనితో వారు మరిన్ని పెట్టుబడులు పెట్టగలుగుతారు’’ అని కూడా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. రుణ భారంలో ఉన్న కంపెనీలు దీనిని కొంత తగ్గించుకోగలుగుతాయని, వాటి బ్యాలెన్స్ షీట్లు మెరుగుపడతాయన్నారు. ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రితో చర్చ అంతకుముందు ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం ముందు జరిగే సాంప్రదాయక సమావేశంగా ఆయన దీనిని పేర్కొన్నారు. ‘‘పాలసీ సమావేశానికి ముందు ఆరి్థక శాఖ మంత్రితో ఆర్బీఐ గవర్నర్ సమావేశం కావడం, ఆరి్థక వ్యవస్థపై చర్చించడం గత ఎంతోకాలంగా ఉన్న సాంప్రదాయమే. ఇప్పుడు జరిగింది కూడా ఈ తరహా సమావేశమే’’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచీ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పావుశాతం రెపోరేటు కోత ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం ఉద్దీపన చర్యలు ప్రకటించడానికి వీలుపడదని, ద్రవ్య పరిస్థితులు ఇందుకు దోహదపడవని ఇటీవల పేర్కొన్న ఆర్బీఐ గవర్నర్, రెపో రేటు తగ్గింపునకు మాత్రం అవకాశం ఉందని అభిప్రాయపడిన సంగతి ఇక్కడ గమనార్హం. ఆర్థిక వృద్ధి లక్ష్యంగా గడచిన 4 త్రైమాసికాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో 1.1% తగ్గింది. దీనితో ఈ రేటు ప్రస్తుతం 5.4%కి దిగివచి్చంది. అంతేకాకుండా ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్లకు బదలాయించడానికీ ఆర్బీఐ చర్యలు తీసుకుంది. బ్యాంక్ రుణ రేటును రెపో, తదితర బెంచ్‌మార్క్ రేట్లకు అక్టోబర్ 1వ తేదీ నుంచి అనుసంధానించాలని ఆదేశించింది. 3 నెలలకు ఒకసారి సమీక్ష జరిపి ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆర్బీఐ సూచించింది. -
ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు
ముంబై: కార్పొరేట్ పన్నును కేంద్ర ప్రభుత్వం ఒకేసారి గణనీయంగా తగ్గించినప్పటికీ... భారీగా పడిపోయిన ఆటోమొబైల్ వాహన డిమాండ్ పునరుద్ధరణపై పరిమిత ప్రభావమే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ అభిప్రాయపడింది. కంపెనీలపై 10–12 శాతం పన్నును తగ్గించడం వల్ల అంతిమంగా 1–2 శాతం వరకే ఉత్పత్తులపై తగ్గింపునకు అవకాశం ఉంటుందని ఈ సంస్ధ తన నివేదికలో పేర్కొంది. దీనికి బదులు ప్రభుత్వం జీఎస్టీ 10 శాతం తగ్గింపును ఆఫర్ చేసి ఉంటే, అప్పుడు కంపెనీలకు మేలు జరిగేదని, అవి ఉత్పత్తులపై 7–8 శాతం వరకు (ఆన్‌రోడ్డు ధరలు) తగ్గించేవని తెలిపింది. ఆటోమొబైల్ రంగం రెండు దశాబ్దాల కాలంలోనే అత్యంత ప్రతికూల పరిస్థితులను చవిచూస్తున్న విషయం గమనార్హం. దీంతో వాహన రంగంపై 28 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది. -
బుల్‌చల్!
కార్పొరేట్ ట్యాక్స్ కోత లాభాలు వరుసగా రెండో రోజూ, సోమవారం కూడా కొనసాగాయి. పన్ను కోత కారణంగా బాగా ప్రయోజనం పొందే ఆర్థిక, బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీలు మరోసారి భారీ లాభాలను సాధించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,600 పాయింట్లపైకి ఎగబాకాయి. జీఎస్టీ మండలి సానుకూల నిర్ణయాలు కలసివచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ఉన్నా, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న ఈ వారంలో స్టాక్ సూచీలు బలంగా ట్రేడవడం విశేషం. ఇంట్రాడేలో 1,426 పాయింట్లు పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 1,075 పాయింట్లు లాభపడి 39,090 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 326 పాయింట్లు పెరిగి 11,600 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.8 శాతం చొప్పున ఎగిశాయి. ఇక గత రెండు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 2,996 పాయింట్లు(8.3 శాతం), నిఫ్టీ 895 పాయింట్లు(8.36 శాతం) చొప్పున లాభపడ్డాయి. రెండు రోజుల్లో ఈ రెండు సూచీలు ఇంత భారీగా లాభపడటం ఇప్పటిదాకా ఇదే మొదటిసారి. సాంకేతిక అవరోధాలు కారణంగా ముగింపులో చివరి పదినిమిషాల పాటు ఎన్ఎస్ఈ ట్రేడింగ్‌లో అంతరాయం ఏర్పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం, యుటిలిటీస్, పవర్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్ల మేర పెరిగాయి. పన్ను కోత.. లాభాల మోత... కార్పొరేట్ ట్యాక్స్‌ను (సెస్‌లు, సర్‌చార్జీలు కలుపుకొని) కేంద్రం 34.9 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు వర్తించే మూలధన లాభాల పన్నుపై అదనపు సర్‌చార్జీని కూడా కేంద్రం తొలగించింది. అలాగే షేర్ల బైబ్యాక్‌పై పన్నును కూడా కేంద్రం రద్దు చేసింది. ఇక 37వ జీఎస్టీ మండలిలో వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలను కంపెనీ తీసుకుంది. ఈ సానుకూల నిర్ణయాల వరదలో స్టాక్ మార్కెట్ లాభాల సునామీలో తడిసి ముద్దవుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ కోత కారణంగా కంపెనీల లాభాలు బాగా పెరుగుతాయని సెంట్రమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ దేవాంగ్ మెహతా చెప్పారు. ఈ లాభాల నేపథ్యంలో కంపెనీలు ధరలను తగ్గించి డిమాండ్ పెంచేలా చేసి అమ్మకాలను పెంచుకుంటాయని పేర్కొన్నారు. లేదా వాటాదారులకు డివిడెండ్లు పంచడమో, మూలధన పెట్టుబడులను పెంచుకోవడమో చేస్తాయని, ఎలా చూసినా రేట్ల కోత కంపెనీలకు సానుకూలమేనని వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల లాభాలు పెరిగే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► నిఫ్టీ 50లోని 32 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ► హోటల్ రూమ్ టారిఫ్‌లపై జీఎస్టీని తగ్గించడంతో హోటల్ షేర్లు దుమ్ము రేపాయి. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ 20 శాతం, రాయల్ ఆర్చిడ్ హోటల్స్ 16 శాతం, ఇండియన్ హోటల్స్ కంపెనీ 8 శాతం, ఐటీసీ 7 శాతం, హోటల్ లీలా వెంచర్ 3.5 శాతం చొప్పున పెరిగాయి. ఒక్క రాత్రి బసకు రూ.7,500 ధర ఉండే హోటల్ రూమ్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. రూ.7,500కు మించిన టారిఫ్‌లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయింది. సోమవారం ఈ షేర్ 10 శాతం నష్టంతో రూ.272 వద్ద ముగిసింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ విక్రయించిందన్న వార్తలతో ఈ షేర్ ఈ స్థాయిలో పడిపోయింది. ► ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం వచ్చే మార్చికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలతో బీపీసీఎల్ షేర్ 13% లాభంతో రూ.454 వద్ద, కంటైనర్ కార్ప్ షేర్ 6.4% లాభంతో రూ.585 వద్ద ముగిసింది. ► క్యూఐపీ మార్గంలో రూ.12,500 కోట్లు సమీకరించిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 6.8 శాతం లాభంతో రూ.727 వద్ద ముగిసింది. ► మార్కెట్ లాభాల ధమాకాలోనూ, 200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాఫీ డే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ప్రొవొగ్, యాడ్‌ల్యాబ్స్.. ఈ జాబితాలో ఉన్నాయి. టార్గెట్లు పెరిగాయ్... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర చర్యల కారణంగా కంపెనీల లాభాలు జోరందుకుంటాయని విశ్లేషకులంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం సెన్సెక్స్, నిఫ్టీ టార్గెట్లను వివిధ బ్రోకరేజ్ సంస్థలు పెంచాయి. వచ్చే ఏడాది జూన్‌కల్లా సెన్సెక్స్45,000 పాయింట్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి నిప్టీ 12,300–13,300 రేంజ్‌కు చేరగలదని యూబీఎస్, 13,200 పాయింట్లకు ఎగుస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొన్నాయి. ఆల్‌టైమ్ హైకి బాటా... స్టాక్ మార్కెట్ జోరు కారణంగా పలు షేర్లు వాటి వాటి జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, డీ–మార్ట్(అవెన్యూ సూపర్ మార్ట్స్), హిందుస్తాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, ఓల్టాస్, కాల్గేట్ పామోలివ్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
మార్కెట్లకు ‘కార్పొరేట్’ బూస్టర్!
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకమైనది. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలను ఇతోధికం చేయడంతోపాటు దేశ సంపదను పెంచి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వీలు పడుతుంది. ఇది భారత్‌లో తయారీకి ప్రేరణనిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మన ప్రైవేటు రంగం పోటీతత్వం పెరుగుతుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి’’. –ప్రధాని మోదీ సాధారణంగా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతాయి. ఈ సారి మాత్రం స్టాక్ మార్కెట్లో ‘సీతమ్మ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్‌పై పట్టు బిగించిన బేర్లకు నిర్మలా సీతారామన్ చుక్కలు చూపించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె సంధించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు అస్త్రానికి బేర్లు బేర్మన్నారు. సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 556 పాయింట్లు పెరిగాయి. పదేళ్లలో ఈ రెండు సూచీలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 2,285 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 1,921 పాయింట్ల లాభంతో 38,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 569 పాయింట్ల లాభంతో 11,274 పాయింట్లకు ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ చెరో 5.32 శాతం వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్లు ఎగసింది. దీపావళి బొనంజా.... కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను నిర్మలా సీతారామన్ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే కొత్త తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గతంలో ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌పై ట్యాక్స్‌ను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే మూలధన లాభాలకు సూపర్ రిచ్ ట్యాక్స్ వర్తించదని వివరించారు. ఈ నిర్ణయాలన్నీ స్టాక్ మార్కెట్‌కు దీపావళి బహుమతి అని నిపుణులంటున్నారు. ఒక్క స్టాక్ మార్కెట్‌కే కాకుండా వినియోగదారులకు, కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు కూడా ఈ నిర్ణయాలు నజరానాలేనని వారంటున్నారు. తాజా ఉపశమన చర్యల కారణంగా కేంద్ర ఖజానాకు రూ.1.45 లక్షల కోట్లు చిల్లు పడుతుందని అంచనా. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు అప్ మందగమన భయాలతో అంతకంతకూ పడిపోతున్న దేశీ స్టాక్ మార్కెట్లో జోష్ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో పలు తాయిలాలు ప్రకటించారు. విదేశీ ఇన్వెస్టర్లపై సూపర్ రిచ్ సెస్ తగ్గింపు, బలహీన బ్యాంక్‌ల విలీనం, రియల్టీ రంగం కోసం రూ.20,000 కోట్లతో నిధి.. వాటిల్లో కొన్ని. అయితే ఇవేవీ స్టాక్ మార్కెట్ పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. శుక్రవారం ఉదయం 10.45 నిమిషాలకు ఎవరూ ఊహించని విధంగా కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎవరి అంచనాలకు అందకుండా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఇన్నేసి పాయింట్లు లాభపడటం చరిత్రలో ఇదే మొదటిసారి. చివరకు సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 569 లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 11 శాతం ఎగసింది. అన్ని సూచీల కంటే అధికంగా లాభపడిన సూచీ ఇదే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా వాహన కంపెనీలకు అత్యధికంగా పన్ను భారం తగ్గుతుండటమే దీనికి కారణం. ఈ సూచీలోని 15 షేర్లూ లాభపడ్డాయి. వీటిల్లో ఆరు షేర్లు పదిశాతానికి పైగా పెరగడం విశేషం. నిఫ్టీ కంపెనీల నికర లాభం 12 శాతం పెరుగుతుంది దాదాపు 20 నిఫ్టీ కంపెనీలు 30 శాతానికి పైగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను చెల్లిస్తున్నాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది ఆ యా కంపెనీల నికర లాభాల్లో దాదాపు 40 శాతంగా ఉంటోందని తెలిపింది. 30 శాతం మేర పన్ను చెల్లించే కంపెనీల నికర లాభం 12 శాతం మేర పెరగే అవకాశాలున్నాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఒక్క రోజులో రూ.7 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ విలువ రూ.6.82 లక్షల కోట్లు పెరిగి రూ.1,45,37,378 కోట్లకు ఎగసింది. ఉదయం 9 సెన్సెక్స్ ఆరంభం 36,215 ఉదయం 10.40 ఆర్థిక మంత్రి కార్పొరేట్ ట్యాక్స్ కోత 36,226 ఉదయం 11.31 37,701 మధ్యాహ్నం 2 గంటలు 38,378 3.30 ముగింపు 38,015 -
మందగమనంపై సర్జికల్ స్ట్రైక్!
దేశ ఆర్థిక రంగంలో గుర్తుండిపోయే విధంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఊహించని కానుకతో కార్పొరేట్లను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. కార్పొరేట్ పన్ను(కంపెనీలపై ఆదాయపన్ను)ను తగ్గించాలని ఎప్పటి నుంచో చేస్తున్న అభ్యర్థనను ఎట్టకేలకు మన్నించింది. 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును ఏకంగా 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. దీంతో మధ్య, పెద్ద స్థాయి కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. సెస్సులతో కలుపుకుని 35 శాతంగా చెల్లిస్తున్న పన్ను... ఇకపై 25.17 శాతానికి దిగొస్తుంది. ఇతర ఆసియా దేశాలైన దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల సమాన స్థాయికి మన కార్పొరేట్ పన్ను దిగొస్తుంది. ప్రభుత్వం తీసుకున్న మరో విప్లవాత్మక నిర్ణయం... అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతమే అమలు కానుంది. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. స్టాక్ మార్కెట్లలో మూలధన లాభాలపై ఆదాయపన్ను సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) నుంచే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని మంత్రి ప్రకటించారు. అంతేకాదు వేగంగా ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ఇంతకుముందు మూడు విడతల్లో... ఆటోమొబైల్ రంగం, ఎగుమతులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... అవేవీ పడిపోతున్న ఆర్థిక వృద్ధిని కాపాడలేవన్న విశ్లేషణలు వినిపించాయి. దీంతో కార్పొరేట్ కంపెనీలపై పన్ను భారాన్ని దించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించాలని ప్రభుత్వం భావించే సాహసోపేతంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల రూపంలో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోనుంది. ఈ నిర్ణయాలకు స్టాక్ మార్కెట్లు ఘనంగా స్వాగతం పలికాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ తన చరిత్రలోనే ఒకే రోజు అత్యధికంగా లాభపడి రికార్డు నమోదు చేసింది. బీఎస్ఈ సైతం దశాబ్ద కాలంలోనే ఒక రోజు అత్యధికంగా లాభపడింది. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శకుల దగ్గర్నుంచి విశ్లేషకుల వరకు అందరూ మెచ్చుకున్నారు.. అభినందించారు. కంపెనీలపై కార్పొరేట్ పన్ను భారం నికరంగా 28 శాతం ఒకేసారి తగ్గిపోవడం, ఆరేళ్ల కనిష్ట స్థాయికి కుంటుపడిన దేశ ఆర్థిక రంగ వృద్ధిని (జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5 శాతం) మళ్లీ కోలుకునేలా చేస్తుందని, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో కార్పొరేట్ ఇండియా (భారత కంపెనీలు) పోటీ పడగలదని విశ్వసిస్తున్నారు. జూలై 5 బడ్జెట్ తర్వాత నుంచి పడిపోతున్న స్టాక్ మార్కెట్లకు తాజా నిర్ణయాలు బ్రేక్ వేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయాలు వృద్ధిని, పెట్టుబడులను ప్రోత్సాహిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ద్రవ్యలోటుపై దీని ప్రభావం పట్ల తాము అవగాహనతోనే ఉన్నామని, గణాంకాలను సర్దుబాటు చేస్తామని చెప్పారు. ప్రధాన నిర్ణయాలు ► కార్పొరేట్ ట్యాక్స్ బేస్ రేటు ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు పొందని రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న దేశీయ కంపెనీలపై 25 శాతంగా, అంతకుమించిన టర్నోవర్‌తో కూడిన కంపెనీలపై 30 శాతంగా ఉంది. ఇది ఇకపై 22 శాతమే అవుతుంది. ► 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసి... 2023 మార్చి 31లోపు ఉత్పత్తి ప్రారంభించే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే అమలవుతుంది. ఇతరత్రా ఎలాంటి రాయితీలు/ప్రోత్సాహకాలు పొందనివాటికే ఈ కొత్త రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిపై ఈ పన్ను 25 శాతంగా అమల్లో ఉంది. ► ఎటువంటి పన్ను తగ్గింపుల విధానాన్ని ఎంచుకోని కంపెనీలకే ఈ కొత్త పన్ను రేట్లు. అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) వంటి వాటిల్లో నడుస్తూ పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందుతున్న కంపెనీలు ఇంతకుముందు మాదిరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ట్యాక్స్ మినహాయింపు కాలవ్యవధి తీరిన తర్వాత కొత్త రేట్లు వాటికి అమలవుతాయి. ఇవి మ్యాట్‌ను చెల్లిస్తున్నాయి. ► బేస్ పన్ను రేటుకు అదనంగా స్వచ్ఛ భారత్ సెస్సు, విద్యా సెస్సు, సర్‌చార్జీలు కూడా కలిపితే కార్పొరేట్లపై వాస్తవ పన్ను 34.94 శాతంగా అమలవుతోంది. రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలపై రూ.29.12 శాతం అమలవుతోంది. ఇవి ఇకపై అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలు కలిపి 25.17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే తయారీ యూనిట్లపై అన్ని సెస్సులు, సర్‌చార్జీలు కలిపి అమలవుతున్న 29.12 శాతం పన్ను కాస్తా 17.01 శాతానికి దిగొస్తుంది. ► ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుందని అంచనా. వాస్తవానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.16.5 లక్షల కోట్లు పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ► కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. అసలు పన్ను చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉండకూడదని భావించి, అన్ని కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని 1996–97లో మ్యాట్‌ను ప్రవేశపెట్టారు. కంపెనీలు తాము పొందే పుస్తక లాభాలపై 18.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని 15 శాతానికి తగ్గించారు. సాధారణ కార్పొరేట్ పన్ను కట్టే కంపెనీలకు మ్యాట్ ఉండదు. ► 2023 మార్చి 31 తర్వాత ఉత్పత్తి ప్రారంభించే కంపెనీలు ఎటువంటి పన్ను మినహాయింపులు తీసుకోకపోతే, వాటిపై పన్ను రేటు అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలతో కలిపి 17.01 శాతంగా అమల్లోకి వస్తుంది. ► కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్) తమ లాభాల్లో 2% ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు కూడా వర్తింపజేశారు. ► రూ.2 కోట్లకుపైన ఆదాయం ఉన్న వర్గాలు ఆర్జించే మూలధన లాభాలపై సర్‌చార్జీని భారీగా పెంచుతూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ లోగడే ప్రకటించారు. ఇది కూడా అమల్లోకి వచ్చినట్టే. ► 2019 జూలై 5లోపు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలు దానిపై ఇక ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. -
లాభాల మెరుపులు : ఆటో కంపెనీలకు ఊరట
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రినిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ పన్ను కోత స్టాక్‌మార్కెట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను భారీగా ప్రభావితం చేసింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు లాభాలను నమోదు చేసేంత. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ వారంతాంలో ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగిసి స్థిరంగా ముగిసాయి. బెంచ్ మార్క్ సూచీలు శుక్రవారం 6 శాతానికి పైగా పెరిగాయి. సెన్సెక్స్ 38,350 మార్కుకు చేరగా, నిఫ్టీ 11,370 స్థాయిని టచ్ చేసింది. కేవలం ఐటీ, జీ ఎంటర్టైన్ మెంట్ తప్ప అన్నీ లాభాల్లోనే ముగిసాయి. ప్రధానంగా ఆటో కంపెనీలకు ఆర్థికమంత్రి ప్రకటన ఊరట నిచ్చింది. ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్‌బ విన్నర్స్‌గా ఉన్నాయి. 'ఎ కేటగిరీ' గ్రూపులోని 10 శాతానికిపైగా ఎగిసిన వాటిల్లో షేర్లలో ఐషర్ మోటార్స్ (16 శాతం), హీరో మోటో కార్ప్ 13 శాతం , జామ్నా ఆటో (11శాతం), అశోక్ లేలాండ్ (11 శాతం), మారుతి సుజుకి (11 శాతం) ఉన్నాయి. మారుతి సుజుకి షేర్ ధర అంతకుముందు రూ .5,938.30 తో పోలిస్తే 11శాతం పెరిగి రూ .6,626 కు చేరుకుంది. ఈ స్టాక్ 6,001 నుంచి ఇంట్రాడేలో 6,640 స్థాయికి చేరుకుంది. గత ఏడేళ్లలో లేని లాభాలతో మారుతి మార్కెట్ క్యాపిటలైజేషన్ బిఎస్ఇలో రూ .1.99 లక్షల కోట్లకు పెరిగింది.ప్రభుత్వం అకస్మాత్తుగా ఉత్పత్తి రంగా మీద , పెట్టుబుడల ప్రాముఖ్యతపై దృష్టిపెట్టిందని, ఇది చాలా వినూత్నమైన, ముఖ్యమైన నిర్ణయమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ పేర్కొనడం విశేషం. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్(విలువ)కు రూ. 7 లక్షల కోట్లకు చేరగా, వెరసి మార్కెట్ విలువ రూ. 1.45 ట్రిలియన్లను దాటేసింది. -
కార్పొరేట్ పన్నుకోత : దిగ్గజాల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్నురేటు తగ్గింపు నిర్ణయంపై స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్నినింపింది. ఏకంగా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 2250 పాయింట్లు ఎగిసింది. అటు దేశీయ వ్యాపార దిగ్గజాలు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది చాలా ఉన్నతమైన చర్య అని అభివర్ణించారు. పన్ను తగ్గింపు వల్ల ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ముఖ్యంగా వృద్ధి చర్యలు లోపించాయని ట్విటర్లో బహిరంగంగా విమర్శించిన బయోకాన్ ఎండీ, చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఆర్థికమంత్రి నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య ఆర్థిక వృద్ధితోపాటు పెట్టుబడులను పునరుద్ధరిస్తుందన్నారు. ఇది గొప్ప చర్య. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆమెకు నా హ్యాట్సాఫ్ అని ప్రశంసించారు. కార్పొరేట్ పన్ను రేటును 25 శాతానికి తగ్గించే నిర్ణయం ధైర్యమైన, ప్రగతిశీల అడుగు. ఇదో బిగ్ బ్యాంగ్ సంస్కరణ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి భారతీయ కంపెనీలకు ఊతమిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతానిస్తోందన్నారు. పిరమల్ ఎంటర్ప్రైజ్ చైర్మన్ అజయ్ పిరమల్ మాట్లాడుతూ దీనికోసమే తామంతా ఎదురుచూస్తున్నామన్నారు. ఇంతటి సాహసోపేతమైన అడుగు వేసినందుకు ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి అభినందనలు తెలిపారు. ఇది ఉత్పాదక రంగానికి పునరుజ్జీవనమిచ్చే నిర్ణయమని ఫిక్కీ చైర్మన్ సందీప్ సోమనీ తెలిపారు. ఈ ప్రకటన కార్పొరేట్ భారతానికి మంచి ఊతం, ముఖ్యంగా కష్టతరమైన దశలో ఉన్న ఉత్పాదక రంగాన్ని కొత్త శక్తి వస్తుందన్నారు. కార్పొరేట్లపై ఆదాయపు పన్నును తగ్గించాలని తాము చాలాకాలంగా అభ్యర్థిస్తున్నామని గుర్తు చేశారు. కేపీఎంజీ కొర్పొరేట్ హెడ్ హితేష్ డి గజారియా స్పందిస్తూ ఇది చాలా సానుకూల దశ, మరిన్ని ఉద్యోగావకాశాలు లభించనున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్థికమంత్రి ఎట్టకేలకు బలమైన చర్యలు తీసుకున్నారని రెలిగేర్ బ్రోకింగ్‌లోని విపి రీసెర్చ్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత కొన్ని త్రైమాసికాలలో కార్పొరేట్ ఆదాయాలు దిగజారిపోయాయి, ప్రధానంగా కొనసాగుతున్న మందగమనం కారణంగా కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు అంటే కార్పొరేట్ కంపెనీలకు లాభదాయకమే. మరోవైపు కార్పొరేట్ పన్నుకోత నిర్ణయంపై కాంగ్రెస్ తప్పుబడుతోంది. ఇది హౌడీమోదీ ఈవెంట్ కోసం తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ విమర్శించారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిందే అయినప్పటికీ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న కునారిల్లుతున్న ఆర్థికవ్యవస్థను రానున్న పెట్టుబడులు పునరుద్ధరాస్తాయా అనేది సందేహమేనని ఆయన ట్వీట్ చేశారు. అటు ఆర్థికమంత్రి ఇంటిముందు కాంగ్రెస్శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. Timing of FM announcement dictated by #HowdyModi event. PM can now say, "I have come to Texas promising lower Taxes". Is this his 'trump card'? — Jairam Ramesh (@Jairam_Ramesh) September 20, 2019 దేశీయ సంస్థలకు, కొత్త దేశీయ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుత 30 శాతం కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గిస్తామని, కొత్త తయారీ సంస్థలకు ప్రస్తుతం ఉన్న రేట్లు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
కేంద్రం కీలక నిర్ణయాలు : స్టాక్ మార్కెట్ జోరు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇచ్చేందుకు కార్పొరేట్ పన్నుల్లో కోత విధించారు. దేశీయ కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్‌ను 34.94 శాతం నుంచి 25.17 (సర్‌చార్జ్‌లు సెస్ కలిపి) శాతానికి తగ్గించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయ కంపెనీలు రాయితీలు, ప్రోత్సాహకాలు పొందకుంటే ఆయా కంపెనీలకు 22 శాతం కార్పొరేట్ పన్ను వర్తింపచేసింది. 2019 అక్టోబర్ 1 తర్వాత తయారీ రంగంలో తాజా పెట్టుబడులతో ప్రారంభించే దేశీయ కంపెనీలకు కేవలం 15 శాతం ఆదాయ పన్ను చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు.నూతన పన్ను రేట్లు, ఇతర ఊరట ఇచ్చే చర్యలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో నూతన నిబంధనలకు అనుగుణంగా సర్ధుబాటు చేస్తామని తెలిపారు. కాగా కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు, ఊరట కల్పించే చర్యలతో కేంద్రానికి ఏటా రూ 1.45 లక్షల కోట్ల ఆదాయం గండిపడుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో జోరు పెంచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉత్పత్తి రంగంలోకి పెట్టుబడులను ముమ్మరం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా కేంద్రం ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్ల లాభంతో 37,550 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 424 పాయింట్ల లాభంతో 11,128 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. గత కొన్ని సెషన్లలో మందకొడిగా సాగుతున్న మార్కెట్లకు ఆర్థిక మంత్రి ప్రకటన ఉద్దీపనలా పనిచేసింది. . -
కార్పొరేట్ ట్యాక్స్ క్రమంగా తగ్గిస్తాం
న్యూఢిల్లీ: సుమారు రూ. 400 కోట్ల పైగా టర్నోవరు ఉండే కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేటును క్రమంగా 25 శాతానికి తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపద సృష్టికర్తలకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. జీవనాన్ని మరింత సులభతరం చేసే ఉద్దేశంతోనే ప్రతీ విధానం, ప్రతీ పథకాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి వివరించారు. ‘ప్రస్తుతం కేవలం 0.7 శాతం సంస్థలే గరిష్ట కార్పొరేట్ ట్యాక్స్ రేటు పరిధిలో ఉన్నాయి. దీర్ఘకాలంలో వీటికి కూడా ట్యాక్స్ రేటును 25 శాతం పరిధిలోకి తెస్తాము‘ అని ఆమె చెప్పారు. అయితే, ఎప్పటిలోగా ఇది అమలు చేసేదీ మాత్రం స్పష్టమైన గడువేదీ మంత్రి పేర్కొనలేదు. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 400 కోట్ల దాకా వార్షిక టర్నోవరు ఉన్న సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. జీవనాన్ని మరింత సులభతరం చేసే ఉద్దేశంతోనే ప్రతీ విధానం, ప్రతీ పథకాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన వార్షిక స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసం సందర్భంగా సంపద సృష్టించే వారి పాత్రను కొనియాడారు. వారిని అనుమానాస్పదంగా చూడొద్దని చెప్పారు. సంపద సృష్టి జరిగితేనే, దానిని పంపిణీ చేయడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. సంపద సృష్టించడం అత్యవసరమని, సంపద సృష్టించేవారే భారత సంపద అని, వారిని గౌరవిస్తామని తన ప్రసంగంలో ప్రధాని ఉద్ఘాటించారు. న్యూస్‌ప్రింట్‌పై సుంకం తగ్గించం న్యూస్‌ప్రింట్‌పై విధించిన 10 శాతం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. చౌక దిగుమతుల కారణంగా దేశీయ న్యూస్‌ప్రింట్ కంపెనీలు దెబ్బతింటున్నాయని, దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వడం కోసమే బడ్జెట్లో ఈ సుంకాన్ని విధించామని వివరించారు. ఇప్పటిదాకా న్యూస్‌ప్రింట్‌పై ఎలాంటి దిగుమతి సుంకాలు లేవని, ఈ 10 శాతం కస్టమ్స్ సుంకాల వల్ల లాభపదాయకత దెబ్బతింటుందని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ పేర్కొంది. కాగా భారత్‌లో న్యూస్‌ప్రింట్ వార్షిక వినియోగం 2.5 మిలియన్ టన్నులుగా ఉంది. దేశీయ పరిశ్రమ 1 మిలియన్ టన్నుల న్యూస్‌ప్రింట్‌ను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. కొత్త పన్నుల చట్టంపై కేంద్రానికి నివేదిక న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టదల్చుకున్న ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ)పై నివేదికను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సోమవారం కేంద్రానికి సమర్పించింది. ‘టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ అఖిలేష్ రంజన్ సోమవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు‘ అని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. అయితే, నివేదిక వివరాలేవీ వెల్లడి కాలేదు. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం రూపొందిన ఆదాయపు పన్ను చట్టానికి కాలం చెల్లిందని, దాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని 2017 సెప్టెంబర్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దీంతో దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రత్యక్ష పన్నుల స్మృతిని రూపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. మిగతా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు కూడా అధ్యయనం చేసి అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలతో దీన్ని తయారు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇది వాస్తవానికి ఆరు నెలల వ్యవధిలో 2018 మే 22 నాటికి నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. ఆగస్టు 22 దాకా కేంద్రం గడువు పొడిగించింది. కన్వీనర్ అరబింద్ మోదీ 2018 సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికల్లా నివేదికను సమర్పించే బాధ్యతను అఖిలేష్ రంజన్ సారథ్యంలోని కమిటీకి అప్పగించింది. కమిటీలో కొత్త సభ్యులు మరింత సమయం కోరడంతో దీన్ని ఆ తర్వాత మే 31కి, అటు పైన ఆగస్టు 16 నాటికి పొడిగించింది. గిరీష్ అహూజా (సీఏ), రాజీవ్ మెమానీ (ఈవై రీజనల్ మేనేజింగ్ పార్ట్నర్, చైర్మన్) తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. -
పన్ను విధానాల్ని సరళం చేయాలి...
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మంగళవారం పారిశ్రామిక రంగం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక బడ్జెట్ సూచనలు చేసింది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, పన్ను విధానాలను మరింత సరళతరం చేయడం, మౌలిక రంగంలో పెట్టుబడులు వృద్ధికి తగిన చర్యలు, కనీస ప్రత్యామ్నాయ పన్ను రద్దు, డివిడెండ్ పంపిణీ పన్నును సగానికి సగం తగ్గించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఆయా అంశాలు మందగమనాన్ని నిరోధించి దేశాభివృద్ధికి దోహదపడతాయని పారిశ్రామిక రంగం పేర్కొంది. బడ్జెట్ ముందస్తు భేటీ సందర్భంగా పారిశ్రామిక సంఘాల ప్రతినిధుల సిఫారసుల్లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►ప్రస్తుతం ఉన్న డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును ప్రస్తుత 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ కోరారు. ఇన్వెస్టర్‌కు అందే మొత్తంపై పన్ను విధించరాదని అభ్యర్థించారు. ►తాజా పెట్టుబడులకు సంబంధించి మొదటి ఏడాది పెట్టుబడుల విషయంలో భారీ పన్ను ప్రయోజనాలు కల్పించాలని అసోచామ్ ప్రెసిడెంట్ బీకే గోయెంకా కోరారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మరింత సరళతరం చేయాలన్నారు. ముఖ్యంగా ద్వంద్వ రేటు (8శాతం, 16 శాతం) విధానాన్ని ఆయన సిఫారసు చేశారు. ►వ్యక్తులకు సంబంధించి ఆదాయపు పన్ను శ్లాబ్స్‌ను సరళతరం చేయాలని ఫిక్కీ కోరింది. రూ. 20 లక్షల ఆదాయం దాటిన వారికే 30 శాతం పన్ను రేటును అమలు చేయాలని పేర్కొంది. కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించాలని అభిప్రాయపడింది. భారత వ్యాపారాలు అధిక పన్ను భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోందని, అన్ని పన్నులూ కలుపుకుంటే 50 శాతం దాటిపోయే పరిస్థితి నెలకొందని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ పేర్కొన్నారు. ►భూ సంస్కరణలు, ప్రత్యేక ఆర్థిక జోన్లు, పారిశ్రామిక విధానం, పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు, పర్యాటక రంగానికి ఊతం ఇవ్వడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వంటి పలు అంశాలపై కూడా పారిశ్రామిక రంగం పలు సిఫారసులు చేసింది. ఎన్నో చర్యల వల్లే బిజినెస్ ర్యాంక్ మెరుగు: నిర్మలా సీతారామన్ కఠినంగా, క్లిష్టతరంగా ఉన్న నియమ నిబంధనల సరళీకరణ, హేతుబద్ధీకరణకు 2014 నుంచీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ‘‘సమాచార సాంకేతిక అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. దీనివల్ల ప్రభుత్వ పాలనా సామర్థ్యం ఎంతో మెరుగుపడింది. దీనివల్లే మన దేశంలో వ్యాపార పరిస్థితుల సానుకూలతకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ ర్యాంక్ 190 దేశాల్లో 77కు చేరింది. 2018లో 100 ఉంటే 2019 నాటికి ఇది 23 ర్యాంకులు మెరుగుపరచుకోవడం ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవాలి. దేశంలో యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించే మార్గాలను పరిశ్రమలు అన్వేషించాలి’’ అని సీతారామన్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయాలకు వీలు కల్పిస్తూ, ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని తాజా బడ్జెట్ టీమ్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఉన్నారు. ఫైనాన్స్ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ నేతృత్వంలోని అధికారుల బృందంలో వ్యయ వ్యవహారాల కార్యదర్శి గిరీష్ చంద్ర ముర్మూ, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే, డీఐపీఏఎం సెక్రటరీ అతన్ చక్రవర్తి, ఫైనాన్స్ సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు ఉంటారు. కొత్తగా ఎన్నికైన 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు జూన్ 17 నుంచి జూలై 26వ తేదీ వరకూ జరుగుతాయి. 2018–19 ఆర్థిక సర్వేను జూలై 4న ఆర్థికమంత్రి ప్రవేశపెడతారు. ఆ తదుపరిరోజు 2018–19 పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచుతారు. -
చిన్న పరిశ్రమలకు జోష్..!
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)పై ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. వీటిలో ముఖ్యంగా కార్పొరేట్ పన్నును 30% నుంచి 25%కి తగ్గించడం ఈ రంగానికి ప్రధానంగా మేలు చేయనుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ముద్రా పథకం కింద ఎంఎస్ఎంఈ రంగానికి రుణ వితరణ లక్ష్యం రూ.3 లక్షల కోట్లుగా జైట్లీ ప్రకటించారు. దీనికి వీలుగా అర్హత నిబంధనలను సమీక్షించనున్నట్టు చెప్పారు. బడ్జెట్లో ఎంఎస్ఎంఈ రంగానికి రూ.3,794 కోట్ల నిధుల్ని కేటాయించారు. ఎంఎస్ఎంఈ సంస్థలకు సంబంధించి మొండి బకాయిల సమస్యల(ఎన్పీఏ)ను పరిష్కరించేందుకు ఓ రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. దీంతో ఈ రంగం ఎదుర్కొంటున్న నిధుల లభ్యత సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆన్లైన్లోనే రుణాల జారీని పునరుద్ధరించడం ద్వారా బ్యాంకులు సత్వరం నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. అలాగే, ఈ రంగానికి రుణ సదుపాయం, వడ్డీ రాయితీలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. 2015 ఏప్రిల్‌లో ముద్రా యోజన పథకం ప్రారంభించగా, ఇప్పటి వరకు రూ.4.6 లక్షల కోట్ల రుణాలను అందించామని, వీటిలో 76% రుణాలు మహిళలకు ఇచ్చినవేనని తెలిపారు. కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు పన్ను తగ్గించాలంటూ కార్పొరేట్లు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌కు జైట్లీ ఈ బడ్జెట్లో చోటు కల్పించారు. అందరికీ కాకుండా రూ.250 కోట్ల వరకు వార్షిక వ్యాపారం ఉన్న సంస్థలకే కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. పన్ను తగ్గింపుతో ఎంఎస్ఎంఈ రంగం మొత్తానికి లబ్ధి కలుగుతుందని, పన్నులు చెల్లించే వాటిలో 99 శాతం ఇవేనని మంత్రి చెప్పారు. పన్ను తగ్గింపు వల్ల 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.7,000 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందన్నారు. కాగా, రూ.250 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన కంపెనీలకు గతంలో మాదిరే 30 శాతం కార్పొరేట్ పన్నులో ఎటువంటి మార్పు లేకపోవడంతో చాలావరకూ లిస్టెడ్ కంపెనీలు నిరుత్సాహంతో ఉన్నాయి. కార్పొరేట్ పన్నును 25%కి తగ్గిస్తామని 2015 బడ్జెట్లో జైట్లీ హామీనిచ్చారు. -
ప్రత్యక్ష పన్ను వసూళ్ల జోరు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాలకు మించి పరుగులు పెడుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌తో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిదిన్నర నెలల కాలంలో (ఏప్రిల్ నుంచి జనవరి 15 వరకు) పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగి ఏకంగా 6.89 లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలను ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) బుధవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9.8 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లను ఆదాయపన్ను శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జనవరి 15 నాటికి 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టయింది. స్థూల వసూళ్లు రూ.8.11 లక్షల కోట్లుగా ఉండగా, ఇందులో రూ.1.22 లక్షల కోట్లు రిఫండ్స్ (తిరిగి చెల్లింపులు) ఉన్నట్టు సీబీడీటీ తెలిపింది. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన, చెప్పుకోతగ్గ పురోగతి ఉంది. స్థూల పన్ను వసూళ్లు జూన్ క్వార్టర్లో ఉన్న 10 శాతం నుంచి సెప్టెంబర్ క్వార్టర్లో 10.3 శాతానికి, డిసెంబర్ క్వార్టర్లో 12.6 శాతానికి, ప్రస్తుత క్వార్టర్లో జనవరి 15 నాటికి 13.5 శాతానికి చేరాయి’’ అని సీబీడీటీ వెల్లడించింది. నికర పన్ను వసూళ్లు సైతం క్యూ1లో 14.8 శాతంగా ఉంటే, క్యూ2లో 15.8 శాతానికి, క్యూ3లో 18.7 శాతానికి, ప్రస్తుత క్వార్టర్లో జనవరి 15 నాటికి 18.7 శాతానికి పెరిగినట్టు వివరించింది. కార్పొరేట్ పన్ను వసూళ్లు సైతం ఇదే తీరులో వృద్ధి చెందాయి. జూన్ క్వార్టర్లో 4.8 శాతంగా ఉంటే, డిసెంబర్ క్వార్టర్ నాటికి 10.1 శాతానికి, ఆ తర్వాత 11.4 శాతానికి పెరిగాయని తెలిపింది. -
కార్పొరేట్ పన్నుకు కోత?
న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్ను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై దేశ కార్పొరేట్ రంగం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. పన్ను రేటు 30 శాతంగా ఉండగా దాన్ని 25 శాతానికి తగ్గిస్తామని మూడేళ్ల క్రితం కేంద్రం హామీ ఇచ్చింది. దాన్ని ఇప్పటికైనా నెరవేర్చాలని కార్పొరేట్ రంగం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరుతోంది. అమెరికాలో కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించినందున అంతర్జాతీయ స్థాయిలో మన పన్ను రేటు సైతం పోటీపడేలా మార్పులు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. 2015–16 బడ్జెట్ సందర్భంగా జైట్లీ కార్పొరేట్ పన్నును 30% నుంచి 25%కి నాలుగేళ్లలో తగ్గిస్తామని ప్రకటించారు. ఇది పెట్టుబడులకు, అధిక వృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఇప్పటికీ అది తగ్గగక పోవటంతో కనీసం 28 శాతానికైనా తగ్గించాలని పరిశ్రమల సమాఖ్యలు కోరుతున్నాయి. ఈ బడ్జెట్లో చేస్తారని ఆశిస్తున్నాం: ఫిక్కీ దీనిపై ఫిక్కీ ప్రెసిడెంట్ రషేష్షా స్పందిస్తూ... ఆర్థిక ప్రతికూలతల నేపథ్యంలో మంత్రి జైట్లీ కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గిస్తారని ఆశించడం లేదన్నారు. కనీసం 28 శాతానికైనా తీసుకొచ్చేలా కృషి చేయాలని, అది ఈ బడ్జెట్లో చేస్తారని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 18 శాతం చేయాలి... సీఐఐ: సీఐఐ మాత్రం కార్పొరేట్ పన్నును ఏకంగా 18 %కి తగ్గించేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పార్టనర్షిప్ సంస్థలు, ఎల్ఎల్పీలు, ఏవోపీలు, కో–ఆపరేటివ్ సొసైటీలకు కూడా వర్తింపజేయాలని, దీంతో భిన్న సంస్థల మధ్య సమాంతర వాటా ఉంటుందని సూచించింది. సమీక్షించాల్సిన అవసరం ఉంది... మనదేశ కార్పొరేట్ పన్ను అంతర్జాతీయంగా ఉన్న రేట్లతో పోలిస్తే పోటీపడేట్లుగానే ఉందన్నారు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ అమిత్ సింఘానియా. అయితే, ఇటీవల అమెరికాలో కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించినందున 2018 బడ్జెట్లో ఇక్కడా సమీక్షించాల్సి ఉందని, ఎందుకంటే ఇది అమెరికా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తుందని చెప్పారాయన. -
చిన్న, మధ్యతరహా కంపెనీలకూ ఊరట
వీటి కార్పొరేట్ ట్యాక్స్ 30 నుంచి 25 శాతానికి తగ్గింపు పద్దులు రాయని చిన్న సంస్థలు 6 శాతం లాభం లెక్కిస్తే చాలు బడా కార్పొరేట్లకు ఏమాత్రం ఊరటనివ్వని కేంద్ర బడ్జెట్ సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి పెద్ద కంపెనీలకు పూర్తిగా నిరాశ మిగిల్చినా... చిన్న, మధ్య స్థాయి కంపెనీలపై బాగానే ప్రేమ చూపించారు. గతేడాది బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్‌ను దశలవారీగా 30% (సెస్‌లతో కలిపి 34.6 శాతం) నుంచి 25 శాతానికి తీసుకు వస్తానని ప్రకటించిన జైట్లీ... ఈసారి బడ్జెట్లో ఒకేసారి 25 శాతానికి తగ్గించేశారు. సెస్‌లతో కలిపి ఇది 28.84 శాతం అవుతుంది. కాకపోతే దీన్ని కేవలం మధ్య, చిన్నతరహా (ఎంఎఎస్‌ఎంఈ) పరిశ్రమలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పన్ను చెల్లిస్తున్న కంపెనీల్లో 96 శాతం కంపెనీలు ఈ కేటగిరీలోనే ఉండటంతో తాజా నిర్ణయం చాలా కంపెనీలకు లాభదాయకమని అంచనా వేస్తున్నారు. కంపెనీలకు నాలుగు డబ్బులు మిగిలితే వారు మరింత మంది ఉద్యోగుల్ని తీసుకోవటానికి, ఆ లాభాన్ని కస్టమర్లకు బదిలీ చేయటానికి ప్రయ త్నాలు చేస్తారని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం... ► రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలకు పన్నుని 30% నుంచి 25% తగ్గిస్తున్నట్లు ప్రక టించారు. మొత్తం పన్ను చెల్లిస్తున్న కంపెనీల్లో ఈ కేటగిరీలోనివే 96% ఉన్నాయి. దీంతో 96% కంపె నీలకు లాభం కలుగుతుందని జైట్లీ చెప్పారు. ► 2015–16లో 6.94 లక్షల కంపెనీలు రిటర్నులు దాఖలు చేయగా రూ.50 కోట్ల టర్నోవర్ పరిధిలో 6.67 లక్షల కంపెనీలున్నాయని, ఈ నిర్ణయం వల్ల కేంద్రం రూ.7,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుందని జైట్లీ చెప్పారు. ► రూ.2 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలు ఎలాంటి పద్దులూ నిర్వహించాల్సిన అవసరం లేదు. కాకపోతే వారు తమ టర్నోవర్‌లో 8 శాతాన్ని లాభంగా ఊహించుకుని దానిపై పన్ను చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తగ్గించారు. ఇలా ఖాతాలూ నిర్వహించకుండా ఉండే రూ.2 కోట్ల లోపు టర్నోవర్ కంపె నీలు ఇకపై తమ లాభాన్ని 6% ఊహించుకుని దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ నిర్ణయా న్ని అమలు చేస్తామని జైట్లీ స్పష్టం చేశారు. ► దీనివల్ల ఏం జరుగుతుందంటే.. ఉదాహరణకు ఇదివరకు ఓ సంస్థ గనక తన టర్నోవర్ రూ.1.5 కోట్లుంటుందని భావించి, దానిపై 8 శాతం... అంటే 12 లక్షలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇపుడు అది రూ.9 కోట్లపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ► స్టార్టప్ కంపెనీలు మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ (మ్యాట్) తొలగించాలని కోరినా ఆర్థిక మంత్రి అంగీకరించలేదు. కానీ మ్యాట్ క్రెడిట్‌ను 15 ఏళ్ల వరకు చూపించుకోవడానికి అనుమతించారు. ఇది ఇప్పటి వరకు 10 ఏళ్లుగా ఉండేది. అదే విధంగా స్టార్టప్స్ నష్టాలను భవిష్యత్తు లెక్కల్లో చూపించుకోవడానికి ఉన్న నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో ఓటింగ్ రైట్స్ 51 శాతం ఉంటేనే నష్టాలను మిగిలిన సంవత్సరాల్లో కూడా చూపించుకోవడానికి అనుమతించేవారు. ఇప్పుడు ప్రమోటర్‌కు వాటా ఉంటే చాలు తప్ప 51 శాతం వాటా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీలకూ కార్పొరేట్ ట్యాక్స్ కనీసం ఒక శాతమైనా తగ్గిస్తారని అంతా ఊహించారు. దీనికి భిన్నంగా ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఈ తగ్గింపును పరిమితం చేయడంతో పెద్ద కంపెనీలు నిరాశ వ్యక్తం చేశాయి. -
కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించే చాన్స్!
బడ్జెట్లో చర్యలపై డెలాయిట్ సర్వేలో అంచనా... న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో సతమతమవుతున్న పారిశ్రామిక రంగాన్ని మోదీ సర్కారు ఈసారి బడ్జెట్లో కాస్త కనికరించనుందా? ట్యాక్స్ కన్సెల్టెన్సీ దిగ్గజం డెలాయిట్ ఇండియా సర్వేలో మెజారిటీ కార్పొరేట్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్నును తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో రెండు వారాల్లో(ఫిబ్రవరి1న) 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. 2015 ఫిబ్రవరి బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ కార్పొరేట్లకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాలను దశలవారీగా తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 2017, ఏప్రిల్ 1 నుంచి కార్పొరేట్ పన్నును క్రమంగా 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని అప్పుడే వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న కార్పొరేట్లలో 53 శాతం మంది ఈసారి కార్పొరేట్ పన్ను రేటులో తగ్గింపు ఉండొచ్చని పేర్కొన్నారు. ‘నల్లధనాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో పన్ను రేటు తగ్గించేందుకు ఇదే సరైన సమయం. డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత ఆర్థిక వృద్ధి దిగజారుతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనికి ప్రధానంగా డిమాండ్ పడిపోవడమే కారణం. సర్వేలో ఎక్కువమంది ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు బడ్జెట్లో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని 80 శాతం మంది సర్వేలో స్పందించారు’ అని డెలాయిట్ పేర్కొంది. గతేడాది ప్రభుత్వ పన్ను ఆదాయాల్లో కార్పొరేట్ పన్ను వాటా దాదాపు 19 శాతం కాగా, ఆదాయపు పన్ను వాటా 14 శాతంగా నమోదైంది. ఇతర ముఖ్యాంశాలివీ... పన్ను ప్రోత్సాహకాలు పూర్తిగా తొలగించడం మంచిదని.. దీనివల్ల లిటిగేషన్లకు ఆస్కారం తగ్గుతుందని సర్వేలో 40% అభిప్రాయపడ్డారు. ఇన్ఫ్రా వంటి రంగాల్లో వృద్ధి కొనసాగాలంటే లాభాలతో ముడిపడిన పన్ను ప్రోత్సాహకాలు తప్పనిసరి అని మరో 40% మంది పేర్కొన్నారు. ఇన్ఫ్రా రంగానికి ప్రోత్సాహకాలు పూర్తిగా తొలగించకుండా పెట్టుబడులతో ముడిపడిన పన్ను రాయితీలు కల్పించాలని 15శాతం మంది కోరారు. నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సంబంధించి డిమాండ్ తీవ్రంగా దెబ్బతింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్ నిధులు పోటెత్తడంతో రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. మరోపక్క, ప్రభుత్వం కూడా వడ్డీరేట్ల రాయితీలను అందిస్తోంది. ఇవన్నీ చైక గృహాలకు డిమాండ్‌ను మళ్లీ భారీగా పెంచనున్నాయి. మొత్తంమీద నిర్మాణాత్మక సంస్కరణల జోరు పెంచేందుకు ప్రభుత్వం విధానపరమైన చర్యలను కొనసాగించే అవకాశం ఉందని డెలాయిట్ అభిప్రాయపడింది. -
కార్పొరేట్ ట్యాక్స్ కోతపై స్పష్టత కావాలి
ప్రీ-బడ్జెట్ సమావేశాల్లో పరిశ్రమవర్గాల వినతి న్యూఢిల్లీ: రాబోయే బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అంశానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని పరిశ్రమవర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి. ప్రోత్సాహకాల ఉపసంహరణ అనేది... కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపుతో పాటు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) తొలగింపునకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా పరిశ్రమల సమాఖ్యలు సీఐఐ, ఫిక్కీ ఈ మేరకు తమ వినతులు సమర్పించాయి. ప్రోత్సాహకాలు, మినహాయింపుల ఉపసంహరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని సీఐఐ ప్రెసిడెంట్ సుమీత్ మజుందార్ చెప్పారు. వీటిని తగ్గించిన తర్వాత మ్యాట్‌ను దశలవారీగా ఎత్తివేయాలని కోరినట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నోతియా తెలిపారు. ఇక వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమలులో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతుంటుందని వారు పేర్కొన్నారు. ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు పన్నులపరమైన బాదరబందీ ఉండకుండా చూడాలని తాము సూచించినట్లు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులను కల్పించడంతో పాటు పన్నుల విధానాన్ని కూడా మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు అసోచాం ప్రెసిడెంట్ సునీల్ కనోడియా వివరించారు. ఎగుమతులకు సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. -
పన్ను మినహాయింపులకు స్వస్తి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపునకు రంగం సిద్ధమయ్యింది. వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను క్రమేపీ 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి వీలుకల్పిస్తూ... ఇతర పన్ను మినహాయింపుల్ని రద్దుచేయడానికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తయారు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్లోనే కార్పొరేట్ టాక్స్ తగ్గింపును ప్రతిపాదించారు. ఇదే సమయంలో కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను క్రమేపీ ఉపసంహరించనున్నట్లు కూడా ప్రకటించారు. సీబీడీటీ తాజా ముసాయిదా ప్రకారం కంపెనీలు పొందుతున్న ప్రత్యేక రాయితీలకు (సన్‌సెట్ క్లాజ్ కింద) తుది గడువును మార్చి 31, 2017గా నిర్ణయించింది. ఆ తర్వాత నుంచి ఈ ప్రత్యేక మినహాయింపులను పునరుద్ధరించడం, పొడిగించడం జరగదు. తుది గడువు (టెర్మినల్ డేట్) లేకుండా పొందుతున్న పన్ను మినహాయింపులకు కూడా మార్చి 31, 2017నే తుది గడువు. కొన్ని రంగాలను ప్రోత్సహించడానికి కేంద్రం కొన్ని పత్యేక పన్ను మినహాయింపులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్ఫ్రా రంగం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, వాణిజ్యపరంగా సహజ, ఖనిజ చమురును ఉత్పత్తి చేసే సంస్థలు ఈ సన్‌సెట్ క్లాజ్ కింద ప్రత్యేక పన్ను మినహాయింపులు పొందుతున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించనుండటంతో ఆ మేరకు ఈ పన్ను మినహాయింపులకు మంగళం పాడాలని కేంద్రం ఆలోచన. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే కంపెనీలు చేసే వివిధ వ్యయాలపై లభించే పన్ను మినహాయింపులు ఆగిపోతాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆస్తుల తరుగుదలపై లభించే 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపును 60 శాతానికి, పరిశోధనలకు చేసే వ్యయంపై లభించే 200 శాతం తరుగుదలను 100 శాతానికి, అలాగే వివిధ వ్యవసాయ గిడ్డంగులు, చౌక గృహాలకు ఇచ్చే 150 శాతం వెయిటెడ్ డిడక్షన్‌ను పూర్తిగా రద్దు కానున్నాయి. ఈ ప్రతిపాదనలపై 15 రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలను తెలపవచ్చని సీబీడీటీ తెలిపింది. దేశీయ పన్నుల విధానాన్ని సరళంగా, మరింత పారదర్శకంగా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిందని, ఇందులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఈ మినహాయింపులు పొందే విషయంలో కంపెనీలకు సీబీడీటీ మధ్య చాలా వివాదాలు నడుస్తున్నాయని, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో వీటికి అడ్డుకట్ట పడుతుందన్నారు. కానీ ప్రత్యేక ఆర్థిక మండళ్లపై ఇప్పటి వరకు లభిస్తున్న పన్ను రాయితీలు రద్దు కానుండటంతో వీటి భవిష్యత్తుపై కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదాలు తగ్గుతాయ్.. పన్ను మినహాయింపులను దశలవారీగా తొలగించడం వల్ల వివాదాలు, కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీని వల్ల పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ఇతర దేశాలతో మరింతగా పోటీపడగలదని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో తెలిపారు. -
కార్పొరేట్ పన్ను కోతకు సిద్ధం!
న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రక్రియ వచ్చే బడ్జెట్ నుంచీ ప్రారంభమవుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగానికి ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపులను దశలవారీగా ఉపసంహరణ జాబితా కూడా కొద్ది రోజుల్లో విడుదల చేస్తామంటూ బుధవారం ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ బేసిక్ పన్ను రేటును నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గిస్తామని ఆర్థికమంత్రి గత బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పన్నును తగ్గించినప్పుడు కార్పొరేట్ పన్ను మినహాయింపుల అవసరమూ తగ్గుతుందన్న అభిప్రాయాన్ని అత్యున్నత స్థాయి అధికారులు ఇప్పటికే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 30 శాతం పన్ను రేటు ఇతర దిగ్గజ ఆసియా దేశాల్లో కార్పొరేట్ పన్ను రేటు కన్నా అధికంగా ఉంది. దీనితో భారత్ పరిశ్రమల అంతర్జాతీయ మార్కెట్లో ‘ధరల పరంగా’ పోటీని ఎదుర్కొనలేకపోతోంది. ‘నేషనల్ స్ట్రేటజీ డే ఇన్ ఇండియా’ పేరుతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, భారత పరిశ్రమల సమాఖ్య ఇక్కడ భారత్ వృద్ధిపై ఒక సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... * క్లిష్టమైన పన్ను సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలో వస్తు, సేవల పన్ను అమలు అవుతుందని విశ్వాసం కూడా ఉంది. దీనిపై కాంగ్రెస్‌తో మరోసారి ప్రభుత్వం చర్చిస్తుంది. కార్పొరేట్ పన్ను మినహాయింపుల తొలగింపులపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. * దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రికవరీ వేగంగా ఉంది. దేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.5 శాతం నుంచి 8 శాతం శ్రేణిలో వృద్ధి సాధించే సత్తా ఉంది. పరోక్ష పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి రికవరీ వేగాన్ని సూచిస్తోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) పరోక్ష పన్ను వసూళ్లలో 36 శాతం వృద్ధి నమోదయ్యింది. * అమెరికాలో ఫెడ్ రేటు పెంపు అవకాశాలు, చైనా మందగమనం నేపథ్యంలో పరిణామాలు వంటివి భారత్‌పై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు చూపిస్తాయనడంలో సందేహం లేదు. అయితే మన ఆర్థిక వ్యవస్థ ప్రాతిపదికన ప్రతికూల ప్రభావాలను సాధ్యమైనంత తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. * విద్యుత్ రంగం సంస్కరణల విషయంలో రానున్న కొద్ది రోజుల్లో ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రంగంలో సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. * భూ సేకరణ చట్టం విషయంలో రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకునే దిశలో కేంద్రం ప్రోత్సహించాలన్న ధ్యేయంతోనే ఈ విధానంలో మార్పు జరిగింది. దివాలా వ్యవహారాన్ని 180 రోజుల్లో తేల్చాలి..! * ప్రభుత్వానికి కమిటీ సిఫారసులు న్యూఢిల్లీ: దివాలా వ్యవహారానికి సంబంధించి ప్రక్రియ అంతా 180 రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం నియమించిన కమిటీ బుధవారం సిఫారసు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార వైఫల్యం వంటి కారణాల వల్ల తలెత్తే దివాలా ప్రక్రియ సత్వర పరిష్కారం లక్ష్యంగా కమిటీ సిఫారసులను రూపొందించింది. ఈ నివేదికను కమిటీ చైర్మన్, మాజీ లా సెక్రటరీ టీకే విశ్వనాథన్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి న్యూఢిల్లీలో అందజేశారు. రుణదాతలు, గ్రహీతల మధ్య ఘర్షణలను పరిష్కరించడానికి సంబంధించిన వ్యవస్థను మెరుగుపరచాలని నివేదిక కోరింది. దివాలా అంశాలపై ప్రత్యేక దృష్టికి ఇన్సాల్వెన్సీ రెగ్యులేటర్ ఏర్పాటును కూడా నివేదిక పేర్కొం ది. కంపెనీల విషయంలో న్యాయ అంశాల పరిశీలన అధికారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు ఉండాలని సూచించింది. వివిధ కంపెనీలకు పలు విధాలుగా కాకుండా అన్నింటికీ వర్తించేలా ఏకైక సమగ్ర దివాలా చట్టం అవసరమని తెలిపింది. కాగా ఆయా అంశాలన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
8-10 శాతం వృద్ధి సాధ్యమే: జైట్లీ
కోల్‌కతా : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ.. భారత్ ఆర్థికవ్యవస్థ మాత్రం పురోగమిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పెట్టుబడుల జోరు, సరైన పాలసీల తోడ్పాటుతో 8-10 శాతం వృద్ధి రేటును సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘సరైన దిశలో సరైన చర్యలు తీసుకోగలిగితే 8 శాతం, అంతకుమించి వృద్ధి సాధ్యమేనన్న నమ్మకం నాకు ఉంది. అయితే, పెట్టుబడులకు ద్వారాలు తెరవడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. ఆదివారమిక్కడ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ రాయితీలు వెనక్కి... కార్పొరేట్లకు ఇప్పటివరకూ ఇస్తున్న ఆర్థిక రాయితీలు, మినహాయింపులను ఉపసంహరణకు త్వరలో ఒక రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నట్లు కూడా జైట్లీ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘రానున్న ఐదేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను ఇప్పుడున్న 30% నుంచి 25 శాతానికి తగ్గించనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించాం. దీనికి మేం కట్టుబడి ఉన్నాం. అయితే, వాస్తవానికి ఇప్పుడు విధిస్తున్న(ఎఫెక్టివ్) పన్ను రేటు 22 శాతమే. దీనికి ప్రధానంగా మినహాయింపులే కారణం. అందుకే నెమ్మదినెమ్మదిగా వీటిని తొలగించాల్సిన అవసరం ఉంది. అని జైట్లీ వివరించారు. -
అప్‌ట్రెండ్‌కు అవకాశం..!
బడ్జెట్‌తో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగు - కార్పొరేట్ పన్ను తగ్గింపు,గార్ వాయిదాతో బూస్ట్ - సంవత్సరాంతానికి సెన్సెక్స్ 32,500 పాయింట్లు-ఐసీఐసీఐ సెక్యూరిటీస్ న్యూఢిల్లీ: బడ్జెట్లో కొన్ని సానుకూల ప్రతిపాదనల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని, దాంతో ఈ వారం స్టాక్ మార్కెట్లో అప్‌ట్రెండ్ కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కార్పొరేట్ పన్నును క్రమేపీ 5% మేర తగ్గించాలన్న ప్రతిపాదన, విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించిన వివాదాస్పద ‘గార్’పన్ను అమలును వాయిదావేయడం వంటి అంశాలు అప్‌ట్రెండ్‌కు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సందర్భంగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 141 పాయింట్లు లాభపడటం తెలిసిందే. గత మూడు బడ్జెట్ల సమర్పణ రోజుల్లో సూచీలు నష్టపోయాయి. ఈ దఫా మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే బడ్జెట్ ఉన్నం దున, ఈ వారం సూచీలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం కూడా లేకపోలేదని క్యాపిటల్ వయా రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఏడాదికి 15-20% పెరగవచ్చు...: వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును క్రమేపీ 5% తగ్గించాలన్న ప్రతిపాదనను 2015-16 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పొందుపర్చారు. దీంతో పాటు జీఎస్టీని 2016 ఏప్రిల్ నుంచి అమలుపర్చాలన్న ప్రతిపాదన, నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రతిపాదించిన చర్యల ఫలితంగా ఆర్థికాభివృద్ధి రెండంకెలకు చేరే అవకాశం ఉంటుందని ఎడల్వైజ్ సెక్యూరిటీస్ సీఈఓ వికాశ్ ఖేమాని వ్యాఖ్యానించారు. శనివారం మార్కెట్ ముగిసిన తీరు కారణంగా ఈ వారం మరికొంత పెరుగుదల ఉండవచ్చని, అయితే విదేశీ ఇన్వెస్టర్లు స్పందించే తీరు ఆధారంగా ట్రెండ్ కొనసాగుతుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ అన్నారు. రూపాయి కదలికలు, చమురు ధర హెచ్చుతగ్గులు, విదేశీ ఇన్వెస్టర్ల ట్రెండ్ ఆధారంగా ట్రేడింగ్ ఉండవచ్చని మరికొంతమంది నిపుణులు విశ్లేషించారు. బడ్జెట్లో పలు సానుకూల ప్రతిపాదనల కారణంగా రానున్న 2-3 ఏళ్లలో ఏటా 15-20% చొప్పున మార్కెట్ పెరుగుతుందని ఆనంద్‌రాఠి ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ ఆనంద్‌రాఠి చెప్పారు. ఆటోమొబైల్స్, సిమెంట్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాల పట్ల బుల్లిష్‌గా ఉన్నామని, 2015 డిసెంబర్‌కల్లా సెన్సెక్స్ 32,500, నిఫ్టీ 9,750 పాయింట్లకు పెరగవచ్చనేది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. శుక్రవారం హోలీ పండుగ కారణంగా సెలవు అయినందున, ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితమవుతుంది. గార్ అంటే ఏంటి? మారిషస్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి కొన్ని‘ట్యాక్స్ హెవెన్స్’ దేశాల నుంచి పెట్టుబడుల ద్వారా భారత్‌లో పన్ను భారాల నుంచి తప్పించుకునే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించడానికి ఉద్దేశించినదే జనరల్ యాంటీ అవెడైన్స్ రూల్(గార్). అయితే దీనిలో నిబంధనల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో గార్ అమలు ఎప్పుటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెలలో రెండు ఐపీవోలు చాలాకాలం నుంచి మందకొడిగా వున్న ఐపీఓ మార్కెట్‌కు ఊపునిస్తూ రెండు కంపెనీల తొలి పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓలు) ఈ నెలలో జారీకానున్నాయి. కేబుల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒర్టల్ కమ్యూనికేషన్ ఐపీఓ మార్చి 3న, అమ్యూజ్మెంట్ పార్క్ నిర్వహిస్తున్న అడ్లాబ్స్ ఇమేజికా ఇష్యూ మార్చి 10న మార్కెట్లోకి రానున్నాయి. మరో ఐదు కంపెనీలు-యూనిపార్ట్స్ ఇండియా, వీఆర్ఎల్ లాజిస్టిక్స్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఏసీబీ ఇండియా, శ్రీపుష్కర్ కెమికల్స్-ఐపీఓలు జారీచేసేందుకు ఇటీవల మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. ఈ కంపెనీల ఇష్యూలు రానున్న నెలల్లో మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. -
పరిశ్రమే ప్రధానం
మేక్ ఇన్ ఇండియాకు ఊతం న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. తద్వారా దేశీ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, మరిన్ని ఉద్యోగాల కల్పనకు తోడ్పాటునందించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కార్పొరేట్ పన్నును ఇతర దేశాలతో పోటీపడేలా 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించడంతో పాటు కొన్నింటిపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గించారు. మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి, దేశీ తయారీ పరిశ్రమకు ఊపుతెచ్చారు. మొబైళ్లు, ట్యాబెట్లను దిగుమతి చేసుకునే బదులు ఇక్కడ ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించేలా సుంకాల్ని సవరించారు. ఇన్సులేటెడ్ వైర్లు..కేబుల్స్, ఫ్రిజ్‌లలో కంప్రెసర్ భాగాలు, ఎరువుల తయారీలో ఉపయోగించే సల్ఫ్యూరిక్ యాసిడ్ మొదలైన వాటిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించారు. ఇక లేథ్ మెషీన్లలో ఉపయోగించే కొన్ని ముడి వస్తువులపై కస్టమ్స్ సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి, మెడికల్ వీడియో ఎండోస్కోప్లపై 5% నుంచి 2.5 శాతానికి తగ్గుతాయి. అలాగే, స్మార్ట్ కార్డులకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మాడ్యూల్స్ తయారీలో ఉపయోగించే వేఫర్లు మొదలైన వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి కుదించారు ఆర్థిక మంత్రి. పేస్మేకర్ల తయారీలో ఉపయోగపడే నిర్దిష్ట ముడి వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేశారు. ఇనుము, ఉక్కు, రాగి, అల్యూమినియం మొదలైన మెటల్ స్క్రాప్‌పై ప్రత్యేక అదనపు సుంకాన్ని (ఎస్ఏడీ) 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇక, ఎల్ఈడీ లైట్లు తయారీలో ఉపయోగపడే ముడివస్తువులపై నాలుగు శాతంగా ఉన్న ఎస్ఏడీని పూర్తిగా తొలగించారు. సాంకేతిక అంశాలపరంగా చిన్న తరహా సంస్థలు ఎదుర్కొనే సమస్యలను కూడా పరిష్కరించడంపై జైట్లీ దృష్టి పెట్టారు. టెక్నికల్ సర్వీసులకు సంబంధించిన రాయల్టీపై పన్ను రేటును 25 శాతం నుంచి 10 శాతానికి కుదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 దాకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నోటిఫైడ్ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు అదనంగా 15 శాతం మేర పెట్టుబడిపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు మరో 15 శాతం మేర తరుగుద ల చూపించుకునే వెసులుబాటు కల్పించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ విషయంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్లాంటు, యంత్రాలపై అదనంగా మరో 20 శాతం మేర తరుగుదల చూపించుకునే వీలు కల్పించారు. వీటన్నింటికంటే మించి దేశీయ మౌలిక రంగానికి కేటాయింపులు పెంచడం ద్వారా దేశీయ ఉత్పాదక రంగానికి ఊపుతెచ్చే ప్రయత్నం చేశారు. కాగా.. దేశీయ తయారీ సంస్థలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా దిగుమతి చేసుకున్న వాణిజ్య వాహనాలపై కస్టమ్స్ డ్యూటీని పది శాతం నుంచి 40 శాతానికి పెంచారు. యువ జనాభా ప్రపంచంలోనే ఎక్కువ మంది యువ జనాభా ఉన్న దేశం మనది. పనిచేసేవారు ఎక్కువగా ఉండడం అభివృద్ధిలో దూసుకుపోయేందుకు తోడ్పడుతుంది. పప్పు ధాన్యాలు, జనపనార, పాలు, అరటిపండ్లు, మామిడి ఉత్పత్తిలో భారతే నంబర్ వన్. అలాగే పేదలు, ఎయిడ్స్ బాధితుల సంఖ్య, ఆయుధాల దిగుమతి వంటి అంశాల్లోనూ మనమే టాప్. -
జైట్లీ కార్పొరేట్ జాలం
ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఊతమిస్తూ.. మరోవైపు విదేశీ పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ట్యాక్స్ తగ్గింపు ప్రతిపాదనలతో కార్పొరేట్లను ఆకట్టుకున్నారు. భారీ పెట్టుబడి ప్రతిపాదనలతో ఇన్ఫ్రా రంగానికి జోష్నివ్వడంపై దృష్టిపెట్టారు. అటు.. ప్రజల దగ్గర నిరుపయోగంగా మూలుగుతున్న పసిడిని చెలామణీలోకి తెచ్చే చర్యలు చేపట్టారు. వెరసి అధిక వృద్ధి లక్ష్యంగా జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కి పరిశ్రమ వర్గాల మెప్పు పొందడంలో కొంత మేర సఫలమయ్యారు. నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గనున్న కార్పొరేట్ ట్యాక్స్ న్యూఢిల్లీ: కార్పొరేట్లకు ఊరటనిస్తూ దాదాపు పదేళ్ల విరామం తర్వాత కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను 5 శాతం మేర తగ్గించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న దీన్ని 2016 ఏప్రిల్‌తో మొదలుపెట్టి ఆపై నాలుగేళ్లలో దీన్ని 25 శాతానికి తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే కొన్ని పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను కూడా ఉపసంహరించనున్నట్లు శనివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పెట్టుబడులు పెరిగేందుకు, అధిక వృద్ధి సాధించడంతో పాటు ఉపాధి కల్పన పెంచేందుకు కూడా ఈ చర్య తోడ్పడగలదని ఆయన వివరించారు. చివరిసారిగా 2005లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం కార్పొరేట్ ట్యాక్స్‌ను 35% నుంచి 30 శాతానికి తగ్గించారు. 2014-15లో పలు మినహాయింపులు, ప్రోత్సాహకాల కారణంగా ఖజానాకు రావాల్సిన ఆదాయంలో రూ.62,399 కోట్లు తగ్గుతుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ.4,26,079 కోట్లుగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 4,70,628 కోట్లుగాను ఉండగలదని అంచనా. ఆసియాలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కార్పొ రేట్ పన్నులు చాలా అధికంగా ఉన్నాయని తాజాగా అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రస్తుతం కార్పొరేట్ పన్ను వసూళ్లు 23 శాతమేనని మంత్రి తెలిపారు. పలు మినహాయింపులు ఇస్తుండటమే ఇందుకు కారణమన్నారు. అధిక పన్నులు ఉన్నా వసూలు అయ్యేది అంతంత మాత్రంగానే ఉండటం వల్ల రెండు రకాలుగానూ ప్రయోజనం లేకుండా పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. పలు మినహాయింపుల వల్ల ఆదాయ నష్టంతో పాటు వివాదాలూ తలెత్తుతున్నాయని జైట్లీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ ట్యాక్స్‌ను నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు కార్పొరేట్ పన్ను చెల్లింపుదార్లకు ఇస్తున్న పలు మినహాయింపులు, ప్రోత్సాహకాలను కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ.. ముందస్తుగా తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చే ఆ పై ఆర్థిక సంవత్సరం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడులకు రెడ్‌కార్పెట్! న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించే చర్యల్లో భాగంగా బడ్జెట్లో ఆర్థికమంత్రి జెట్లీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. అందులో కొన్నింటిని చూస్తే... బ్యాంక్ప్ట్స్రీ కోడ్...: దేశంలో వ్యాపార అవకాశాల మెరుగు, పెట్టుబడిదారులు తన పెట్టుబడులను తేలిగ్గా ఉపసంహరించుకోడానికి వీలయ్యే విధంగా ఒక సమగ్ర బ్యాంక్ప్ట్స్రీ(దివాలా) కోడ్‌ను ఆవిష్కరించనున్నట్లు జైట్లీ తెలిపారు. దివాలాకు సంబంధించి న్యాయ ప్రక్రియ వేగంగా జరగడానికి ఈ చర్య దోహదపడుతుంది. ఈ విషయంలో ఖాయిలా పరిశ్రమ కంపెనీల చట్టం, బీఐఎఫ్ఆర్లు విఫలమయ్యాయని జైట్లీ పేర్కొన్నారు. పబ్లిక్ కాంట్రాక్ట్ చట్టం...: మౌలిక రంగంలో పబ్లిక్ కాంట్రాక్ట్‌లకు సంబంధించి తలెత్తే సమస్యల సత్వర పరిష్కార లక్ష్యంగా ‘పబ్లిక్ కాంట్రాక్ట్ (వివాదాల పరిష్కార) చట్టాన్ని జైట్లీ ప్రతిపాదించారు. ప్రొక్యూర్మెంట్ చట్టం...: పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంశాలకు సంబంధించి అధికారులు ఎలాంటి లొసుగులకూ పాల్పడకుండా చూసేందుకు ప్రొక్యూర్మెంట్ చట్ట ప్రతిపాదన బడ్జెట్లో మరో కీలకమైన అంశం. రిట్స్, ఇన్విట్స్కు పన్ను ప్రయోజనాలు: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(ఆర్ఈఐటీ-రిట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(ఐఎన్వీఐటీ- ఇన్విట్స్) కు కేంద్రం కొత్త పన్ను ప్రయోజనాలు ఇచ్చింది. ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. వీటికి సంబంధించి క్యాపిటల్ గెయిన్ పన్నుల వ్యవస్థను హేతుబద్దీకరిస్తున్నట్లు పేర్కొంది. 2014 సెప్టెంబర్‌లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రిట్స్, ఇన్విట్స్ లిస్టింగ్‌కు నిబంధనలను నోటిఫై చేసింది. రియల్టీ, ఇన్ఫ్రా రంగాలకు పారదర్శక రీతిలో మరిన్ని నిధులు అందేలా చేయడం వీటి ప్రధాన లక్ష్యం. డెవలపర్లు తమ ప్రధాన కంపెనీ పరిధిలోని ఆస్తులను లిస్టెడ్ సంస్థకు (ప్రత్యేకంగా రిట్స్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన) బదలాయించినప్పడు ఈ ప్రక్రియకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. చిన్న పరిశ్రమల విషయంలో...: లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించి వర్కింగ్ కేపిటల్ అవసరాలు కీలకమైనవని జైట్లీ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టీఆర్ఈడీఎస్) ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఆయా పరిశ్రమలకు ఫైనాన్స్, సత్వర రెవెన్యూ వసూళ్ల లక్ష్యంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ద్రవ్య లభ్యత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ‘గార్’ మరో రెండేళ్లు వాయిదా... విదేశీ ఇన్వెస్టర్లలో గుబులు రేపుతున్న జనరల్ యాంటీ అవెడైన్స్ రూల్ (గార్) అమలు మరో రెండేళ్లపాటు జైట్లీ వాయిదా వేశారు. గార్ నిబంధనలు, అమలు విషయంలో కొన్ని క్లిష్టమైన అంశాలు ఉన్నాయని, వీటిపై ప్రజల్లో మరింత చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. 2015 ఏప్రిల్ 1 నుంచీ గార్ అమలు కావాల్సి ఉంది. తాజా నిర్ణయం ప్రకారం, 2017 మార్చి 31 వరకూ పెట్టుబడుల విషయంలో గార్ వర్తించబోదు. 2012-13 వార్షిక బడ్జెట్లో అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ దీనిని ప్రతిపాదించారు. మారిషస్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి కొన్ని ‘ట్యాక్స్ హెవెన్స్’ దేశాల నుంచి పెట్టుబడుల ద్వారా భారత్‌లో పన్ను భారాల నుంచి తప్పించుకునే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించడానికి ఉద్దేశించినదే గార్. అయితే దీనిలోని నిబంధనల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవి కొంత వివాదాస్పదమయ్యాయి. దీనితో దీని అమలు ఎప్పుటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఎఫ్‌డీఐ విధాన సరళీకరణ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళీకరణ విధానంపై బడ్జెట్ దృష్టి పెట్టింది. విభిన్న రకాల విదేశీ పెట్టుబడుల విశ్లేషణలకు సంబంధించి వ్యత్యాసాన్ని తొలగిస్తున్నట్లు పేర్కొంది. దీని ప్రకారం ఇకపై పోర్ట్‌ఫోలియో-ఎఫ్‌డీఐ పెట్టుబడులను ఒకే కేటగిరీగా పరిగణించడం జరుగుతుంది. వీటన్నింటికీ ఎఫ్‌డీఐ నిబంధనలనే వర్తింపజేస్తారు. భారత్ కంపెనీలు సరళతర మార్గాల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ విధానం దోహదపడుతుందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 69,500 కోట్లు న్యూఢిల్లీ: అధిక ఆదాయ వనరులపై దృష్టి సారించిన బడ్జెట్, రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.69,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యాలను నిర్దేశించుకుంది. వీటిలో రూ. 41,000 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల అమ్మకాలకు సంబంధించిన పరి మాణం కాగా, మిగతా రూ.28,500 కోట్లు లాభ, నష్టదాయక కంపెనీల నుంచి వ్యూహాత్మక అమ్మకాల ద్వారా సమీకరణ లక్ష్యం. ప్రస్తుతం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సమకూరుతాయని భావిస్తున్న నిధులకు ఇది దాదాపు రెట్టింపు. నిజానికి గత బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.58,425 కోట్లుగా నిర్దేశించుకున్నప్పటికీ, తాజా అంచనాల ప్రకారం ఈ నిధుల పరిమాణం రూ.31,350 కోట్లేనని తాజా బడ్జెట్ పేర్కొంది. బడ్జెట్ కామెంట్స్ భారత్ అంచనాలకు తగ్గ బడ్జెట్ ఇది. ఇన్ఫ్రాకు రూ.70 వేల కోట్లు, అలాగే భారీ విద్యుత్ ప్రాజెక్టులతో పెట్టుబడుల వాతావరణానికి పునరుత్తేజం కలి గించే నిర్ణయాలు. 22 ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో భారత్‌లో తయారీ రంగానికి ప్రోత్సహం లభిస్తుంది. వ్యాపారానికి అనువైన రీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. ఆవిష్కరణల ప్రోత్సాహకానికి కేవలం రూ.150 కోట్లు కేటాయించడం నిరాశ కలిగిస్తోంది. మరిన్ని నిధులు అందిస్తే భారత ఆరోగ్య సేవల రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. - సతీష్ రెడ్డి,చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అయిదు రాష్ట్రాల్లో కొత్తగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) రానున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆరోగ్య సేవల సౌలభ్యం పెరగడమేగాక, వైద్య నిపుణులకు శిక్షణ లభిస్తుంది. వీసా ఆన్ అరైవల్ సేవలు 150 దేశాలకు విస్తరించడం ఆహ్వానించదగ్గది. దీని ఫలితంగా ప్రపంచస్థాయి వైద్య సేవలందిస్తున్న భారత్‌లో మెడికల్ టూరిజం మరింత వృద్ధిలోకి వస్తుంది. వైద్య విద్య, ఆసుపత్రుల ఏర్పాటులో ఆరోగ్య రంగ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా రానున్న రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. - సంగీత రెడ్డి, జేఎండీ, అపోలో హాస్పిటల్స్ స్టార్టప్‌లు, ఎస్ఎంఈల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టాలెంట్ యుటిలైజేషన్(సేతు) ప్రతిపాదన పెద్ద ముందడుగు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించే అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరో సానుకూల నిర్ణయం. సాంకేతిక సేవలపై రాయల్టీని 25 నుంచి 10 శాతానికి చేర్చడం వల్ల టెక్నాలజీ వ్యయం తగ్గేందుకు దోహదం చేస్తుంది. సేవా పన్ను 1.5% పెంచడం నిరుత్సాహపర్చింది. ప్రొడక్ట్ కంపెనీల విషయంలో సేవా పన్ను, అమ్మకం పన్నుపై స్పష్టత ఇవ్వలేదు. - బీవీఆర్ మోహన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సైయంట్ నిజమైన అవసరాలు గుర్తించారు ఎప్పటిలాగే కార్పొరేట్లకు ఉపయోగపడేలా కాకుండా ఈ సారి బడ్జెట్లో సామాన్యులకు, ప్రత్యేకించి వృద్ధులకు నిజమైన అవసరాలను గుర్తించారు. వ్యవసాయం, ఇన్ఫ్రా, విద్యుత్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థను పెంచడానికి ఈ బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ నీటిపారుదల కోసం రూ.5,300 కోట్లు, నాబర్డ్ కింద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, లాంగ్ టర్మ్ రూరల్ క్రెడిట్ ఫండ్, షార్ట్ టర్మ్ కో-ఆపరేటివ్ రూరల్ క్రెడిట్ రీఫైనాన్స్ ఫండ్ వంటివి ఇందుకు ఉదాహరణలు. - వెల్లయాన్, మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ -
'లక్ష' దాటితే పాన్‌కార్డ్ తప్పనిసరి
న్యూఢిల్లీ : ఇక నుంచి లక్ష దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్‌కార్డు తప్పనిసరి కానుంది. నల్లధనాన్ని నియంత్రించటానికి కేంద్రం నడుము బిగించింది. దాంతో పాన్ కార్డు ద్వారానే లావాదేవీలు కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే లక్ష దాటిన విదేశీ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జైట్లీ తెలిపారు. అలాగే సంపద పన్ను రద్దు కాగా, రూ.కోటి ఆదాయం దాటిన వారిపై కేంద్రం 2 శాతం పన్ను వడ్డించింది. -
కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ : కార్పొరేట్ పన్నును కేంద్ర ప్రభుత్వం 25 శాతానికి తగ్గించింది. ఇది నాలుగేళ్లపాటు వర్తిస్తుంది. ఇంతకు ముందు కార్పొరేట్ పన్ను రేటు 30 శాతంగా ఉండేది. అయితే అంత మొత్తం పన్ను వసూలు కావటం లేదని, దాని వల్ల ఎంతో ఆదాయన్ని నష్టపోతున్నామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అందువల్ల కార్పొరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు చెప్పారు. అలాగే నల్లధనం వెలికితీతకు కొత్త చట్టం చేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. -
సేవల పన్ను 2.15 లక్షల కోట్లు
తొలిసారిగా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల్ని దాటిన సేవల వసూళ్లు న్యూఢిల్లీ: సేవల పన్ను. 1994లో నాటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ పన్ను... తొలిసారిగా 2014-15లో ఏకంగా కస్టమ్స్, ఎక్సయిజ్ సుంకాలను కూడా దాటేయబోతోంది. దీన్ని బట్టి తెలియట్లేదూ... మన దేశంలో సేవలకున్న ప్రాధాన్యం. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే ఖజానాకు సర్వీస్ ట్యాక్స్ కన్నా ఎక్కువ వసూళ్లనిస్తున్నవిపుడు రెండే..! ఒకటి కార్పొరేట్ ట్యాక్స్. రెండు ఆదాయపు పన్ను. సర్వీస్ ట్యాక్స్ అంటే: ఫైనాన్స్ చట్టం పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సేవలపై వసూలు చేసే పన్ను ఇది. సేవలందించేవారు ప్రభుత్వానికి ఈ మొత్తం చెల్లించి... దాన్ని సేవలందుకున్న వారి దగ్గర వసూలు చేస్తారు. ఇది కూడా ఎక్సయిజు, సేల్స్ ట్యాక్స్ మాదిరిగా పరోక్ష పన్నే. ప్రస్తుతం ఈ పన్ను 12 శాతం. దీనిపై ఎడ్యుకేషన్ సెస్ 2%, ఉన్నత విద్య సెస్ 1% కలిపితే మొత్తం 12.36 శాతమవుతోంది. -
పన్నులు తగ్గించాలి
వృద్ధికి ఊతమివ్వాలి కేంద్రానికి పారిశ్రామిక దిగ్గజాల వినతి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో {పీ-బడ్జెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణకు ప్రతికూలంగా ఉంటున్న పన్నుల విధానాలను సరిచేయాలని పారిశ్రామిక దిగ్గజాలు కేంద్రాన్ని కోరారు. ఇందులో భాగంగా కార్పొరేట్ ట్యాక్స్, ఆదాయ పన్నులు మొదలైనవి తగ్గించాలని సూచించారు. బడ్జెట్ తయారీకి ముందు జరిపే చర్చల్లో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహించిన సమావేశంలో వారు ఈ మేరకు తమ అభ్యర్థనలు తెలియజేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై మరిన్ని నిధులు వెచ్చించాలని, మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సంస్కరణల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని వారు పేర్కొన్నారు. తయారీ రంగ వృద్ధి మందకొడిగా ఉన్న పరిస్థితి వాస్తవమేనని అంగీకరించిన అరుణ్ జైట్లీ.. వ్యాపార నిర్వహణకు పరిస్థితులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వస్తే.. పన్నుల వ్యవస్థ మెరుగుపడగలదని, మరింత పారదర్శకత రాగలదని ఆయన తెలిపారు. మరోవైపు, కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 10 శాతానికి పరిమితం చేయడం ద్వారా తయారీ రంగానికి తోడ్పాటునివ్వాలని భేటీలో కోరినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో(సెజ్) యూనిట్లకు, డెవలపర్లకు మ్యాట్ .. డివిడెండ్ పంపిణీ పన్నులు (డీడీటీ) నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ ప్రక్రియకు, ఉపాధి కల్పనకి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్లో మరిన్ని చర్యలు ఉండగలవని ఆశిస్తున్నట్లు శ్రీరామ్ పేర్కొన్నారు.