పన్ను విధానాల్ని సరళం చేయాలి... | FM Nirmala Sitharaman holds second pre Budget meeting with industry representatives | Sakshi
Sakshi News home page

పన్ను విధానాల్ని సరళం చేయాలి...

Published Wed, Jun 12 2019 5:08 AM | Last Updated on Wed, Jun 12 2019 5:11 AM

FM Nirmala Sitharaman holds second pre Budget meeting with industry representatives - Sakshi

న్యూఢిల్లీ:  కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మంగళవారం పారిశ్రామిక రంగం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక బడ్జెట్‌ సూచనలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, పన్ను విధానాలను మరింత సరళతరం చేయడం, మౌలిక రంగంలో పెట్టుబడులు వృద్ధికి తగిన చర్యలు, కనీస ప్రత్యామ్నాయ పన్ను రద్దు,  డివిడెండ్‌ పంపిణీ పన్నును సగానికి సగం  తగ్గించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఆయా అంశాలు మందగమనాన్ని నిరోధించి దేశాభివృద్ధికి దోహదపడతాయని పారిశ్రామిక రంగం పేర్కొంది. బడ్జెట్‌ ముందస్తు భేటీ సందర్భంగా పారిశ్రామిక సంఘాల ప్రతినిధుల సిఫారసుల్లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

►ప్రస్తుతం ఉన్న డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్నును ప్రస్తుత 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ కోరారు. ఇన్వెస్టర్‌కు అందే మొత్తంపై పన్ను విధించరాదని అభ్యర్థించారు.  

►తాజా పెట్టుబడులకు సంబంధించి మొదటి ఏడాది పెట్టుబడుల విషయంలో భారీ పన్ను ప్రయోజనాలు కల్పించాలని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ బీకే గోయెంకా కోరారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మరింత సరళతరం చేయాలన్నారు. ముఖ్యంగా ద్వంద్వ రేటు (8శాతం, 16 శాతం) విధానాన్ని ఆయన సిఫారసు చేశారు.  

►వ్యక్తులకు సంబంధించి ఆదాయపు పన్ను శ్లాబ్స్‌ను సరళతరం చేయాలని ఫిక్కీ కోరింది. రూ. 20 లక్షల ఆదాయం దాటిన వారికే 30 శాతం పన్ను రేటును అమలు చేయాలని పేర్కొంది. కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి తగ్గించాలని అభిప్రాయపడింది. భారత వ్యాపారాలు అధిక పన్ను భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోందని, అన్ని పన్నులూ కలుపుకుంటే 50 శాతం దాటిపోయే పరిస్థితి నెలకొందని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమానీ పేర్కొన్నారు.  

►భూ సంస్కరణలు, ప్రత్యేక ఆర్థిక జోన్లు, పారిశ్రామిక విధానం, పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు, పర్యాటక రంగానికి ఊతం ఇవ్వడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ వంటి పలు అంశాలపై కూడా పారిశ్రామిక రంగం పలు సిఫారసులు చేసింది.  

ఎన్నో చర్యల వల్లే బిజినెస్‌ ర్యాంక్‌ మెరుగు: నిర్మలా సీతారామన్‌
కఠినంగా, క్లిష్టతరంగా ఉన్న నియమ నిబంధనల సరళీకరణ, హేతుబద్ధీకరణకు 2014 నుంచీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ‘‘సమాచార సాంకేతిక అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. దీనివల్ల ప్రభుత్వ పాలనా సామర్థ్యం ఎంతో మెరుగుపడింది. దీనివల్లే మన దేశంలో వ్యాపార పరిస్థితుల సానుకూలతకు సంబంధించి ప్రపంచ బ్యాంక్‌ ర్యాంక్‌ 190 దేశాల్లో 77కు చేరింది. 2018లో 100 ఉంటే 2019 నాటికి ఇది 23 ర్యాంకులు మెరుగుపరచుకోవడం ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవాలి. దేశంలో యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించే మార్గాలను పరిశ్రమలు అన్వేషించాలి’’ అని సీతారామన్‌ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయాలకు వీలు కల్పిస్తూ, ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని తాజా బడ్జెట్‌ టీమ్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ ఉన్నారు. ఫైనాన్స్‌ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ నేతృత్వంలోని అధికారుల బృందంలో వ్యయ వ్యవహారాల కార్యదర్శి గిరీష్‌ చంద్ర ముర్మూ, రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే, డీఐపీఏఎం సెక్రటరీ అతన్‌ చక్రవర్తి, ఫైనాన్స్‌ సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌లు ఉంటారు. కొత్తగా ఎన్నికైన 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు జూన్‌ 17 నుంచి జూలై 26వ తేదీ వరకూ జరుగుతాయి. 2018–19 ఆర్థిక సర్వేను జూలై 4న ఆర్థికమంత్రి ప్రవేశపెడతారు. ఆ తదుపరిరోజు 2018–19 పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచుతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement