న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల విలీనం వల్ల బ్యాంకింగ్ రంగం ఎంతో బలపడిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ దృడ సంకల్పంతో బ్యాంక్‌ల విలీన నిర్ణయం జరిగిందని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ 17వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడంతో పాటు అంతరాష్ట్రాల సంబంధాలు కూడా బలపడ్డప్పుడే దేశంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అనే నినాదంతో దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
కాగా కేంద్ర ప్రభుత్వం పథకాల కోసం 100 లక్షల కోట్ల ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏ పౌరుడిపైనా ఒత్తిడి పైట్టబోదని తెలిపారు. పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందితే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సమస్యలుంటే అధికారులు చెప్పవచ్చని అన్నారు. కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం వల్ల దేశంలో పెట్టుబడులు పెరగడంతో పాటు తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. సంస్కరణలను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని అన్నారు.
అందరికీ సురక్షితమైన నీరు అనే లక్ష్యంతో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. దేశంలో 112 జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాలను విస్మరించారని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు, రామ జన్మభూమి సమస్యకు పరిష్కారం లభించడం సంతోషకరమన్నారు. ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment