అప్‌ట్రెండ్‌కు అవకాశం..!
బడ్జెట్‌తో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగు
- కార్పొరేట్ పన్ను తగ్గింపు,గార్ వాయిదాతో బూస్ట్
- సంవత్సరాంతానికి సెన్సెక్స్ 32,500 పాయింట్లు-ఐసీఐసీఐ సెక్యూరిటీస్
న్యూఢిల్లీ: బడ్జెట్లో కొన్ని సానుకూల ప్రతిపాదనల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని, దాంతో ఈ వారం స్టాక్ మార్కెట్లో అప్‌ట్రెండ్ కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
కార్పొరేట్ పన్నును క్రమేపీ 5% మేర తగ్గించాలన్న ప్రతిపాదన, విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించిన వివాదాస్పద ‘గార్’పన్ను అమలును వాయిదావేయడం వంటి అంశాలు అప్‌ట్రెండ్‌కు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సందర్భంగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 141 పాయింట్లు లాభపడటం తెలిసిందే. గత మూడు బడ్జెట్ల సమర్పణ రోజుల్లో సూచీలు నష్టపోయాయి. ఈ దఫా మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే బడ్జెట్ ఉన్నం దున, ఈ వారం సూచీలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం కూడా లేకపోలేదని క్యాపిటల్ వయా రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు.
ఏడాదికి 15-20% పెరగవచ్చు...: వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును క్రమేపీ 5% తగ్గించాలన్న ప్రతిపాదనను 2015-16 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పొందుపర్చారు. దీంతో పాటు జీఎస్‌టీని 2016 ఏప్రిల్ నుంచి అమలుపర్చాలన్న ప్రతిపాదన, నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రతిపాదించిన చర్యల ఫలితంగా ఆర్థికాభివృద్ధి రెండంకెలకు చేరే అవకాశం ఉంటుందని ఎడల్‌వైజ్ సెక్యూరిటీస్ సీఈఓ వికాశ్ ఖేమాని వ్యాఖ్యానించారు. శనివారం మార్కెట్ ముగిసిన తీరు కారణంగా ఈ వారం మరికొంత పెరుగుదల ఉండవచ్చని, అయితే విదేశీ ఇన్వెస్టర్లు స్పందించే తీరు ఆధారంగా ట్రెండ్ కొనసాగుతుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ అన్నారు.
రూపాయి కదలికలు, చమురు ధర హెచ్చుతగ్గులు, విదేశీ ఇన్వెస్టర్ల ట్రెండ్ ఆధారంగా ట్రేడింగ్ ఉండవచ్చని మరికొంతమంది నిపుణులు విశ్లేషించారు. బడ్జెట్లో పలు సానుకూల ప్రతిపాదనల కారణంగా రానున్న 2-3 ఏళ్లలో ఏటా 15-20% చొప్పున మార్కెట్ పెరుగుతుందని ఆనంద్‌రాఠి ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ ఆనంద్‌రాఠి చెప్పారు. ఆటోమొబైల్స్, సిమెంట్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాల పట్ల బుల్లిష్‌గా ఉన్నామని, 2015 డిసెంబర్‌కల్లా సెన్సెక్స్ 32,500, నిఫ్టీ 9,750 పాయింట్లకు పెరగవచ్చనేది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. శుక్రవారం హోలీ పండుగ కారణంగా సెలవు అయినందున, ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితమవుతుంది.
గార్ అంటే ఏంటి?
మారిషస్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి కొన్ని‘ట్యాక్స్ హెవెన్స్’ దేశాల నుంచి పెట్టుబడుల ద్వారా భారత్‌లో పన్ను భారాల నుంచి తప్పించుకునే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించడానికి ఉద్దేశించినదే జనరల్ యాంటీ అవెడైన్స్ రూల్(గార్). అయితే దీనిలో నిబంధనల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో గార్ అమలు ఎప్పుటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.
ఈ నెలలో రెండు ఐపీవోలు
చాలాకాలం నుంచి మందకొడిగా వున్న ఐపీఓ మార్కెట్‌కు ఊపునిస్తూ రెండు కంపెనీల తొలి పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓలు) ఈ నెలలో జారీకానున్నాయి. కేబుల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒర్టల్ కమ్యూనికేషన్ ఐపీఓ మార్చి 3న, అమ్యూజ్‌మెంట్ పార్క్ నిర్వహిస్తున్న అడ్‌లాబ్స్ ఇమేజికా ఇష్యూ మార్చి 10న మార్కెట్లోకి రానున్నాయి. మరో ఐదు కంపెనీలు-యూనిపార్ట్స్ ఇండియా, వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, ఏసీబీ ఇండియా, శ్రీపుష్కర్ కెమికల్స్-ఐపీఓలు జారీచేసేందుకు ఇటీవల మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. ఈ కంపెనీల ఇష్యూలు రానున్న నెలల్లో మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి.