చిన్న, మధ్యతరహా కంపెనీలకూ ఊరట
వీటి కార్పొరేట్ ట్యాక్స్ 30 నుంచి 25 శాతానికి తగ్గింపు
పద్దులు రాయని చిన్న సంస్థలు 6 శాతం లాభం లెక్కిస్తే చాలు
బడా కార్పొరేట్లకు ఏమాత్రం ఊరటనివ్వని కేంద్ర బడ్జెట్
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి పెద్ద కంపెనీలకు పూర్తిగా నిరాశ మిగిల్చినా... చిన్న, మధ్య స్థాయి కంపెనీలపై బాగానే ప్రేమ చూపించారు. గతేడాది బడ్జెట్‌లో కార్పొరేట్ ట్యాక్స్‌ను దశలవారీగా 30% (సెస్‌లతో కలిపి 34.6 శాతం) నుంచి 25 శాతానికి తీసుకు వస్తానని ప్రకటించిన జైట్లీ... ఈసారి బడ్జెట్లో ఒకేసారి 25 శాతానికి తగ్గించేశారు. సెస్‌లతో కలిపి ఇది 28.84 శాతం అవుతుంది. కాకపోతే దీన్ని కేవలం మధ్య, చిన్నతరహా (ఎంఎఎస్‌ఎంఈ) పరిశ్రమలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పన్ను చెల్లిస్తున్న కంపెనీల్లో 96 శాతం కంపెనీలు ఈ కేటగిరీలోనే ఉండటంతో తాజా నిర్ణయం చాలా కంపెనీలకు లాభదాయకమని అంచనా వేస్తున్నారు. కంపెనీలకు నాలుగు డబ్బులు మిగిలితే వారు మరింత మంది ఉద్యోగుల్ని తీసుకోవటానికి, ఆ లాభాన్ని కస్టమర్లకు బదిలీ చేయటానికి ప్రయ త్నాలు చేస్తారని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం...
► రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలకు పన్నుని 30% నుంచి 25% తగ్గిస్తున్నట్లు ప్రక టించారు. మొత్తం పన్ను చెల్లిస్తున్న కంపెనీల్లో ఈ కేటగిరీలోనివే 96% ఉన్నాయి. దీంతో 96% కంపె నీలకు లాభం కలుగుతుందని జైట్లీ చెప్పారు.
► 2015–16లో 6.94 లక్షల కంపెనీలు రిటర్నులు దాఖలు చేయగా రూ.50 కోట్ల టర్నోవర్ పరిధిలో 6.67 లక్షల కంపెనీలున్నాయని, ఈ నిర్ణయం వల్ల కేంద్రం రూ.7,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుందని జైట్లీ చెప్పారు.
► రూ.2 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలు ఎలాంటి పద్దులూ నిర్వహించాల్సిన అవసరం లేదు. కాకపోతే వారు తమ టర్నోవర్‌లో 8 శాతాన్ని లాభంగా ఊహించుకుని దానిపై పన్ను చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తగ్గించారు. ఇలా ఖాతాలూ నిర్వహించకుండా ఉండే రూ.2 కోట్ల లోపు టర్నోవర్ కంపె నీలు ఇకపై తమ లాభాన్ని 6% ఊహించుకుని దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ నిర్ణయా న్ని అమలు చేస్తామని జైట్లీ స్పష్టం చేశారు.
► దీనివల్ల ఏం జరుగుతుందంటే.. ఉదాహరణకు ఇదివరకు ఓ సంస్థ గనక తన టర్నోవర్ రూ.1.5 కోట్లుంటుందని భావించి, దానిపై 8 శాతం... అంటే 12 లక్షలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇపుడు అది రూ.9 కోట్లపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని జైట్లీ పేర్కొన్నారు.
► స్టార్టప్ కంపెనీలు మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ (మ్యాట్) తొలగించాలని కోరినా ఆర్థిక మంత్రి అంగీకరించలేదు. కానీ మ్యాట్ క్రెడిట్‌ను 15 ఏళ్ల వరకు చూపించుకోవడానికి అనుమతించారు. ఇది ఇప్పటి వరకు 10 ఏళ్లుగా ఉండేది. అదే విధంగా స్టార్టప్స్ నష్టాలను భవిష్యత్తు లెక్కల్లో చూపించుకోవడానికి ఉన్న నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో ఓటింగ్ రైట్స్ 51 శాతం ఉంటేనే నష్టాలను మిగిలిన సంవత్సరాల్లో కూడా చూపించుకోవడానికి అనుమతించేవారు. ఇప్పుడు ప్రమోటర్‌కు వాటా ఉంటే చాలు తప్ప 51 శాతం వాటా ఉండాల్సిన అవసరం లేదు.
అన్ని కంపెనీలకూ కార్పొరేట్ ట్యాక్స్ కనీసం ఒక శాతమైనా తగ్గిస్తారని అంతా ఊహించారు. దీనికి భిన్నంగా ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే ఈ తగ్గింపును పరిమితం చేయడంతో పెద్ద కంపెనీలు నిరాశ వ్యక్తం చేశాయి.