న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)పై ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. వీటిలో ముఖ్యంగా కార్పొరేట్ పన్నును 30% నుంచి 25%కి తగ్గించడం ఈ రంగానికి ప్రధానంగా మేలు చేయనుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ముద్రా పథకం కింద ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణ వితరణ లక్ష్యం రూ.3 లక్షల కోట్లుగా జైట్లీ ప్రకటించారు. దీనికి వీలుగా అర్హత నిబంధనలను సమీక్షించనున్నట్టు చెప్పారు.
బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.3,794 కోట్ల నిధుల్ని కేటాయించారు. ఎంఎస్‌ఎంఈ సంస్థలకు సంబంధించి మొండి బకాయిల సమస్యల(ఎన్‌పీఏ)ను పరిష్కరించేందుకు ఓ రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. దీంతో ఈ రంగం ఎదుర్కొంటున్న నిధుల లభ్యత సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆన్‌లైన్‌లోనే రుణాల జారీని పునరుద్ధరించడం ద్వారా బ్యాంకులు సత్వరం నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు.
అలాగే, ఈ రంగానికి రుణ సదుపాయం, వడ్డీ రాయితీలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. 2015 ఏప్రిల్‌లో ముద్రా యోజన పథకం ప్రారంభించగా, ఇప్పటి వరకు రూ.4.6 లక్షల కోట్ల రుణాలను అందించామని, వీటిలో 76% రుణాలు మహిళలకు ఇచ్చినవేనని తెలిపారు.
కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు
పన్ను తగ్గించాలంటూ కార్పొరేట్లు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌కు జైట్లీ ఈ బడ్జెట్‌లో చోటు కల్పించారు. అందరికీ కాకుండా రూ.250 కోట్ల వరకు వార్షిక వ్యాపారం ఉన్న సంస్థలకే కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. పన్ను తగ్గింపుతో ఎంఎస్‌ఎంఈ రంగం మొత్తానికి లబ్ధి కలుగుతుందని, పన్నులు చెల్లించే వాటిలో 99 శాతం ఇవేనని మంత్రి చెప్పారు.
పన్ను తగ్గింపు వల్ల 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.7,000 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందన్నారు. కాగా, రూ.250 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన కంపెనీలకు గతంలో మాదిరే 30 శాతం కార్పొరేట్ పన్నులో ఎటువంటి మార్పు లేకపోవడంతో చాలావరకూ లిస్టెడ్ కంపెనీలు నిరుత్సాహంతో ఉన్నాయి. కార్పొరేట్ పన్నును 25%కి తగ్గిస్తామని 2015 బడ్జెట్‌లో జైట్లీ హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment