సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్నురేటు తగ్గింపు నిర్ణయంపై స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్నినింపింది. ఏకంగా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 2250 పాయింట్లు ఎగిసింది. అటు దేశీయ వ్యాపార దిగ్గజాలు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది చాలా ఉన్నతమైన చర్య అని అభివర్ణించారు. పన్ను తగ్గింపు వల్ల ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెప్పారు.
ముఖ‍్యంగా వృద్ధి చర్యలు లోపించాయని ట్విటర్‌లో బహిరంగంగా విమర్శించిన బయోకాన్ ఎండీ, చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా ఆర్థికమంత్రి నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య ఆర్థిక వృద్ధితోపాటు పెట్టుబడులను పునరుద్ధరిస్తుందన్నారు. ఇది గొప్ప చర్య. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆమెకు నా హ్యాట్సాఫ్ అని ప్రశంసించారు.
కార్పొరేట్ పన్ను రేటును 25 శాతానికి తగ్గించే నిర్ణయం ధైర్యమైన, ప్రగతిశీల అడుగు. ఇదో బిగ్ బ్యాంగ్ సంస్కరణ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి భారతీయ కంపెనీలకు ఊతమిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతానిస్తోందన్నారు.
పిరమల్ ఎంటర్‌ప్రైజ్ చైర్మన్ అజయ్ పిరమల్ మాట్లాడుతూ దీనికోసమే తామంతా ఎదురుచూస్తున్నామన్నారు. ఇంతటి సాహసోపేతమైన అడుగు వేసినందుకు ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి అభినందనలు తెలిపారు. ఇది ఉత్పాదక రంగానికి పునరుజ్జీవనమిచ్చే నిర్ణయమని ఫిక్కీ చైర్మన్ సందీప్ సోమనీ తెలిపారు. ఈ ప్రకటన కార్పొరేట్ భారతానికి మంచి ఊతం, ముఖ్యంగా కష్టతరమైన దశలో ఉన్న ఉత్పాదక రంగాన్ని కొత్త శక్తి వస్తుందన్నారు. కార్పొరేట్లపై ఆదాయపు పన్నును తగ్గించాలని తాము చాలాకాలంగా అభ్యర్థిస్తున్నామని గుర్తు చేశారు.
కేపీఎంజీ కొర్పొరేట్ హెడ్ హితేష్ డి గజారియా స్పందిస్తూ ఇది చాలా సానుకూల దశ, మరిన్ని ఉద్యోగావకాశాలు లభించనున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్థికమంత్రి ఎట్టకేలకు బలమైన చర్యలు తీసుకున్నారని రెలిగేర్ బ్రోకింగ్‌లోని విపి రీసెర్చ్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత కొన్ని త్రైమాసికాలలో కార్పొరేట్ ఆదాయాలు దిగజారిపోయాయి, ప్రధానంగా కొనసాగుతున్న మందగమనం కారణంగా కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు అంటే కార్పొరేట్ కంపెనీలకు లాభదాయకమే.
మరోవైపు కార్పొరేట్ పన్నుకోత నిర్ణయంపై కాంగ్రెస్ తప్పుబడుతోంది. ఇది హౌడీమోదీ ఈవెంట్ కోసం తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ విమర్శించారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిందే అయినప్పటికీ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న కునారిల్లుతున్న ఆర్థికవ్యవస్థను రానున్న పెట్టుబడులు పునరుద్ధరాస్తాయా అనేది సందేహమేనని ఆయన ట్వీట్ చేశారు. అటు ఆర్థికమంత్రి ఇంటిముందు కాంగ్రెస్‌శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాయి.
Timing of FM announcement dictated by #HowdyModi event. PM can now say, "I have come to Texas promising lower Taxes".
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 20, 2019
Is this his 'trump card'?
దేశీయ సంస్థలకు, కొత్త దేశీయ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుత 30 శాతం కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గిస్తామని, కొత్త తయారీ సంస్థలకు ప్రస్తుతం ఉన్న రేట్లు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment