న్యూఢిల్లీ: 2023-24 కేంద్రం బడ్జెట్‌కు సంబంధించిన కేటాయింపులు, మినహాయింపులు, కోతలపై సామాన్య ప్రజానీకం నుంచి కార్పొరేట్ దాకా చాలా ఆశలు, ఊహాగానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టన్నారు.ఈ సందర్భంగా కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో మరిన్ని ప్రజాకర్షక పథకాలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పసిడి ధర, బంగారు ఆభరణాల ధర తగ్గుముఖం పడుతుందా? దిగుమతి సుంకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా పండుగల సీజన్‌లో రిటైల్ అమ్మకాలను దెబ్బతీస్తూ బంగారం ధరలు రికార్డు స్థాయిలకు పెరుగుతున్న తరుణంలో, రాబోయే కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తారని భారతీయ ఆభరణాల విభాగం భావిస్తోంది.
ప్రస్తుతం, బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్‌గా అదనంగా 2.5శాతంగా ఉంది. గత బడ్జెట్‌లో కరెంటు ఖాతా లోటును తగ్గించేందుకు ఈ సుంకాన్ని పెంచారు. ఫలితంగా బంగారం దిగుమతులు 2021లో 1,068 టన్నుల నుంచి 2022లో 706 టన్నులకు తగ్గిపోయాయి. సుంకం పెంపు వల్ల భారత్‌లోకి బంగారం అక్రమ రవాణా పెరిగిందనీ, ఇది ఏడాదికి 200 టన్నులు అని అంచనా వేశామని వాస్తవానికి బంగారం రిటైల్ అమ్మకాలను ఇది ప్రభావితం చేస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
బంగారం, వెండి ,ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 4 శాతంక తగ్గించాలని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) డిమాండ్ చేస్తోంది. ఈ దిగుమతి సుంకం ఎగుమతిదారుల నుండి మూలధనాన్ని హరించివేస్తోందని భావిస్తోంది. కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా ప్రకారం. దిగుమతి సుంకం తగ్గింపు ఆరోగ్యకరమైన ,మరియు పారదర్శక పరిశ్రమను కలిగి ఉండటానికి సహాయడుతుందనీ, అలాగే ఎగుమతిదారుల వర్కింగ్ క్యాపిటల్ అడ్డంకిని తగ్గించడంలో సహాయపడుతుంది.
స్థానిక ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో కొన్ని వస్తువులు ఖరీదైనవి, మరికొన్ని చౌకగా మారనున్నట్లు తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్‌లో, ప్రభుత్వం మొత్తం దృష్టి దేశంలో ఉత్పత్తిని పెంచడం, అనవసరమైన వస్తువుల దిగుమతిని తగ్గించడంపైనే ఉంటుంది. తద్వారా దేశంలోని వాణిజ్య నిల్వలను సరిచేయవచ్చు. కరెంట్ ఖాతా లోటును తగ్గించవచ్చు.
దీనికి తోడు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం అనేక రంగాలకు పీఎల్‌ఐ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో బంగారం చౌకగా ఉండే అవకాశం ఉందని, తద్వారా ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని తెలుస్తోంది. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారంతో పాటు మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. తద్వారా దేశం నుండి ఆభరణాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. గతేడాది బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ధరల సెగ కాస్త తగ్గుముఖం పట్టి..ప్రజల చేతుల్లో పుత్తడి మరింత మెరిసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment