యూరియా సబ్సిడీ మీద కోతలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయ త్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికంటే ముం దర వంటగ్యాస్ సబ్సిడీల తగ్గింపు దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు తెలిసినవే. అదేవిధంగా, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జరిగే ఆహార పంపిణీలను కూడా క్రమేణా నామమాత్రంగా మార్చివేశారు. ఇదే నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే ప్రభు త్వం కార్పొరేట్లపై పన్నును సుమారు 34 శాతం నుంచి 25 శాతం మేరకు తగ్గించింది. ఈ నిర్ణయం వలన, కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి సుమారు 1.45 లక్షల కోట్లమేరకు గండిపడుతుంది. ఇప్పటికే పన్నుల సేకరణ, ఆదాయ సమీకరణ లక్ష్యంలో మన ప్రభుత్వం దారుణంగా విఫలం అవుతోంది. ఈ స్థితిలో కార్పొరేట్లకు వదులుకున్న ఈ 1.45 లక్షల కోట్ల రూపాయలు మన ఖజానాను మరింత బలహీనపరచగలవు.
దీనికి తోడుగా ఈమధ్యకాలంలోనే ఉద్దీపన పథకాల పేరిట వాహనరంగం, రియల్ ఎస్టేట్ రంగం వంటి కార్పొరేట్ రంగాలకు వేలకోట్ల రూపాయలను ప్రభుత్వం కట్టబెట్టే ఆలోచన చేసింది. అలాగే, ఒత్తిడికి లొంగి విదేశీ పోర్ట్‌పోలియో ఇన్సెస్టర్ల మీద వేసిన పన్నును ఉపసంహరించుకుంది. ఈ చర్యల ద్వారా మన దేశ ఆరి్థక వ్యవస్థలో నెలకొన్న మాంద్య పరిస్థితులను చక్కదిద్దగలమని పాలకులు భావిస్తున్నారు. కానీ, నిజా నికి మాంద్యం సమస్యకు ఇది పరిష్కారం కాదు. నేడు వ్యవస్థలో మాంద్యానికి కారణం పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తి.
ఉపాధిరాహిత్యం, ద్రవ్యోల్బణం, వేతనాల పెరుగుదలలో స్తంభనవంటి వాటి వలన మన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. అలాగే, దీనికి పెద్దనోట్ల రద్దు, హడావుడి జీఎస్టీలు అగ్గికి ఆజ్యంలా తోడయ్యాయి. విషయం డిమాండ్ పతనం కాగా, ప్రభుత్వం బండికి వెనుక గుర్రాన్ని కట్టినట్టుగా కార్పొరేట్లకు రాయితీల ద్వారా వ్యవస్థకు చికిత్స చేయడానికి ఉపక్రమించింది. ఈ విధమైన ధోరణి తాత్కాలికంగా కార్పొరేట్లకు కొద్దిపాటి ఉపశమనాన్ని కల్పించగలదు. వాటి బ్యాలెన్స్ షీట్లు కాస్తంత మెరుగుపడగలవు. కానీ, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, మాంద్యాన్ని అధిగమించే నికరమైన పనిని ఈ విధానాలు సాధించలేవు. ఈ కారణం గానే అమెరికాలో ట్రంప్, కార్పొరేట్లపై పన్నును భారీగా తగ్గించినప్పుడు, ఆర్థ్ధిక రంగంలో తాత్కాలికంగా ఆశావహ లక్షణాలు కనపడ్డాయి. కానీ, అదంతా కేవలం తాత్కాలికంగానే. కొద్దికాలంలోనే అమెరికాలో ఆర్థిక మందగమన స్థితి మరలా విజృంభించింది.
కాగా, ప్రజల డిమాండ్ లేదా కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపాధి కల్పన, సంక్షేమం వంటి వాటి రూపంలో ఉద్దీపనలను ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడుతోంది. దీనికి కారణంగా తన ఆదాయ లోటును లేదా ద్రవ్య లోటును చెబుతోంది. ప్రభుత్వ ఖజానాలో తగినమేరకు డబ్బు లేదు గనుక నేడు సంక్షేమ పథకాలను అమలు జరపటం సాధ్యం కాదంటూ, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
మరి, ఈ స్థితిలో ఉన్న కాస్తంత ఆదాయాన్నీ కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేందుకు ఎందుకు వదులుకున్నట్లు? మరోప్రక్కన ద్రవ్యలోటు పెరిగిపోతోందంటూ యూరియా, రేషన్ సరుకులు, వంట గ్యాస్ వంటి సామాన్య జనం, రైతుల అవసరాలపై సబ్సిడీలను ఎత్తేయడం ఎందుకు? అలాగే, మొన్నటి బడ్జెట్లో ప్రజావసరం అయిన పెట్రోల్‌పై లీటరుకు రూపాయి సెస్ వేయడం ఎందుకు?
అదే, 1980ల నుంచీ పాలకులు ప్రపంచవ్యాప్తంగా, 1990ల నుంచీ మన దేశంలో అమలుజరుపుతోన్న సప్లై సైడ్ ఆర్థిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం సారం సులువైనదే. దీని ప్రకారం, ఆర్థికవ్యవస్థలో వృద్ధికోసం కార్పొరేట్లపై పన్నులు, తదితర ‘భారాలు’, నియంత్రణలను తగ్గించడం లేదా తొలగించడం చేయాలి. తద్వారా వారు మరింతగా పెట్టుబడులు పెడతారు. ఫలితంగా వ్యవస్థలో ఉపాధికల్పన జరుగుతుంది. కాగా, ఈ సప్లై సైడ్ ఆర్థిక సిద్ధాంతం, దానిముందరి కాలపు డిమాండ్ యాజమాన్య సిద్ధాంతానికి తిలోదకాలు ఇచి్చంది.
ఈ డిమాండ్ యాజమాన్య సిద్ధాంతమే 1930ల నాటి పెను ఆరి్థకమాంద్య కాలం నుంచి 1980ల వరకూ ప్రపంచంలో బలంగా ఉంది. దీని ప్రకారం, మార్కెట్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మెజారిటీ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉండాలి. దానికోసం, ప్రభుత్వం; కార్పొరేట్లూ కారి్మకుల, ఉద్యోగుల, సామాన్యుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి. అంటే, ఆయా వర్గాలకు ఉచిత వైద్యం, విద్యవంటి సంక్షేమ పథకాలు అమలు జరగాలి. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం వ్యయాలు చేయాలి. ఈ రకమైన విధానాల ద్వారానే 1950ల నుంచి 1980ల వరకూ ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తాలూకు స్వర్ణయుగంగా చెప్పుకునే కాలం నడిచింది. అదే సంక్షేమరాజ్యాల కాలం.
కానీ, తరువాతి కాలంలో కార్పొరేట్లు తమ లాభాలను పెంచుకోగలిగేందుకు డిమాండ్ యాజ మాన్య, సంక్షేమరాజ్య విధానాలకు బ్రిటన్, అమెరికాలతో మొదలుపెట్టి, మెల్లగా ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ తిలోదకాలు ఇచ్చాయి. సంస్కరణలూ, ప్రపంచీకరణ పేరిట కార్పొరేట్లు ధనవంతులకు అనుకూలమైన సప్లై సైడ్ ఆరి్థక విధానాలను ముందుగు తెచ్చారు. తద్వారా పేద ప్రజలకు సంక్షేమం కలి్పస్తే వారు సోమరిపోతులవుతారనే కొత్త సిద్ధాంతం ముందుకు వచి్చంది. తద్వారా ప్రభుత్వ నిధులను కార్పొరేట్లూ, ధనికులకు రాయితీలుగా మళ్ళించడం మొదలుపెట్టారు.
కడకు ఈ విధానాలు ప్రజల కొనుగోలు శక్తి పతనానికి దారి తీసి, అంతిమంగా 2008 నాటి ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి. కాబట్టి, నేడు మన దేశంలో కూడా ఈ కాకులను కొట్టి గద్దలకు వేసే కార్పొరేట్ల అనుకూల విధానాలు ఆర్థ్ధిక మాంద్య స్థితిని మరింత జటిలం మాత్రమే చేయగలవు. ఈ కారణం చేతనే నేటి మాంద్య స్థితిలో కూడా 2018లో 831 మందిగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయలపైన సంపద ఉన్న వారి సంఖ్య, 2019లో 953కు పెరిగింది. అంటే, ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు ధనవంతులను మరింత ధనవంతులను చేస్తున్నాయి. సామాన్య జనాన్ని ఆరి్థకమాంద్యపు అ«థఃపాతాళంలోకి నెట్టేస్తున్నాయి.
వ్యాసకర్త : డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు
మొబైల్ : 98661 79615
పెద్దలకు రాయితీ–పేదలకు కోత
Published Sun, Sep 29 2019 4:24 AM | Last Updated on Sun, Sep 29 2019 4:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment