విదేశీ పెట్టుబడులపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి  | YS Jagan Mohan Reddy Special focus on Foreign Investment | Sakshi
Sakshi News home page

విదేశీ పెట్టుబడులపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి 

Published Thu, Oct 3 2019 4:44 AM | Last Updated on Thu, Oct 3 2019 8:15 AM

YS Jagan Mohan Reddy Special focus on Foreign Investment - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను భారీగా తగ్గించడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే కొరియా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, చైనా వంటి అనేక దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. కొరియా.. స్టీల్, ఆటోమొబైల్, బ్లూ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించి వెళ్లగా.. ఇజ్రాయెల్‌.. డీశాలినేషన్, వ్యర్థాల నిర్వహణ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిని చూపిస్తోంది. ఫ్రాన్స్‌.. ఫుడ్‌ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్, అర్బన్‌ ఇన్‌ఫ్రా వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఆస్ట్రేలియా.. మైనింగ్, ఇంధనం, విద్య, రహదారులు, భవనాల నిర్మాణం వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విదేశీ పారిశ్రామిక ప్రతినిధుల సందేహాలను తీర్చడానికి ఆయా దేశాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తోంది. 

కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం
వృద్ధిరేటు తగ్గుతుండటంతో కొత్త పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 10 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తే.. ఇప్పటికే ఉన్న కంపెనీలపై పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి తగ్గించింది. దీంతో చైనా, కొరియా, జపాన్, అమెరికా వంటి దేశాల కంటే మన దేశంలో పన్ను రేటు తక్కువగా ఉండటంతో విదేశీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. 

వినూత్న విధానాలతో ముందుకు..
గత ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా భాగస్వామ్య సదస్సులు నిర్వహించి.. ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేసినా ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. దీనికి భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్‌ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే విదేశీ రాయబారుల సమావేశంలో కొత్త ప్రభుత్వ విధానాలను వివరించడంతోపాటు కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై ఉన్న అపోహలను తొలగించారు. అలాగే సొంత ఖర్చులతో ఇజ్రాయెల్, అమెరికా పర్యటనలకు వెళ్లిన ఆయన అక్కడ కూడా పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

అమెరికా పర్యటనలో యూఎస్‌ – ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల కల్పన, తయారీ రంగం, వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి తెలిపారు. ఇలా ఆయా దేశాల్లో పెట్టుబడిదారులతో మాట్లాడటంతోపాటు వారిని నేరుగా రాష్ట్రానికి తీసుకొచ్చి వాస్తవ పరిస్థితులు వివరించడం వినూత్న ఆలోచన అని సీఐఐ ఏపీ చాప్టర్‌ వైఎస్‌ చైర్మన్‌ రామకృష్ణ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 3, 4 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో రాష్ట్రంలో అవకాశాలను వివరించడం ద్వారా దక్షిణాసియా దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement