పన్ను మినహాయింపులకు స్వస్తి! | CBDT proposes roadmap for elimination of tax exemption | Sakshi
Sakshi News home page

పన్ను మినహాయింపులకు స్వస్తి!

Published Sat, Nov 21 2015 2:15 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

పన్ను మినహాయింపులకు స్వస్తి! - Sakshi

పన్ను మినహాయింపులకు స్వస్తి!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపునకు రంగం సిద్ధమయ్యింది. వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను క్రమేపీ 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి వీలుకల్పిస్తూ... ఇతర పన్ను మినహాయింపుల్ని రద్దుచేయడానికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తయారు చేసింది.  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్‌లోనే కార్పొరేట్ టాక్స్ తగ్గింపును ప్రతిపాదించారు.

ఇదే సమయంలో కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను క్రమేపీ ఉపసంహరించనున్నట్లు కూడా ప్రకటించారు.
 సీబీడీటీ తాజా ముసాయిదా ప్రకారం కంపెనీలు పొందుతున్న ప్రత్యేక రాయితీలకు (సన్‌సెట్ క్లాజ్ కింద) తుది గడువును మార్చి 31, 2017గా నిర్ణయించింది. ఆ తర్వాత నుంచి ఈ ప్రత్యేక మినహాయింపులను పునరుద్ధరించడం, పొడిగించడం జరగదు. తుది గడువు (టెర్మినల్ డేట్) లేకుండా పొందుతున్న పన్ను మినహాయింపులకు కూడా మార్చి 31, 2017నే తుది గడువు.

కొన్ని రంగాలను ప్రోత్సహించడానికి కేంద్రం కొన్ని పత్యేక పన్ను మినహాయింపులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌ఫ్రా రంగం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, వాణిజ్యపరంగా సహజ, ఖనిజ చమురును ఉత్పత్తి చేసే సంస్థలు ఈ సన్‌సెట్ క్లాజ్ కింద ప్రత్యేక పన్ను మినహాయింపులు పొందుతున్నాయి.

ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించనుండటంతో ఆ మేరకు ఈ పన్ను మినహాయింపులకు మంగళం పాడాలని కేంద్రం ఆలోచన. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే కంపెనీలు చేసే వివిధ వ్యయాలపై లభించే పన్ను మినహాయింపులు ఆగిపోతాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆస్తుల తరుగుదలపై లభించే 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపును 60 శాతానికి, పరిశోధనలకు చేసే వ్యయంపై లభించే 200 శాతం తరుగుదలను 100 శాతానికి, అలాగే వివిధ వ్యవసాయ గిడ్డంగులు, చౌక గృహాలకు ఇచ్చే 150 శాతం వెయిటెడ్ డిడక్షన్‌ను పూర్తిగా రద్దు కానున్నాయి.

ఈ ప్రతిపాదనలపై 15 రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలను తెలపవచ్చని సీబీడీటీ తెలిపింది. దేశీయ పన్నుల విధానాన్ని సరళంగా, మరింత పారదర్శకంగా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిందని, ఇందులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఈ మినహాయింపులు పొందే విషయంలో కంపెనీలకు సీబీడీటీ మధ్య చాలా వివాదాలు నడుస్తున్నాయని, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో వీటికి అడ్డుకట్ట  పడుతుందన్నారు.

కానీ ప్రత్యేక ఆర్థిక మండళ్లపై ఇప్పటి వరకు లభిస్తున్న పన్ను రాయితీలు రద్దు కానుండటంతో వీటి భవిష్యత్తుపై కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
వివాదాలు తగ్గుతాయ్..
పన్ను మినహాయింపులను దశలవారీగా తొలగించడం వల్ల వివాదాలు, కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీని వల్ల పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ఇతర దేశాలతో మరింతగా పోటీపడగలదని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement