న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాలకు మించి పరుగులు పెడుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌తో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిదిన్నర నెలల కాలంలో (ఏప్రిల్ నుంచి జనవరి 15 వరకు) పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగి ఏకంగా 6.89 లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలను ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) బుధవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9.8 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లను ఆదాయపన్ను శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో జనవరి 15 నాటికి 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టయింది. స్థూల వసూళ్లు రూ.8.11 లక్షల కోట్లుగా ఉండగా, ఇందులో రూ.1.22 లక్షల కోట్లు రిఫండ్స్ (తిరిగి చెల్లింపులు) ఉన్నట్టు సీబీడీటీ తెలిపింది. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన, చెప్పుకోతగ్గ పురోగతి ఉంది. స్థూల పన్ను వసూళ్లు జూన్ క్వార్టర్‌లో ఉన్న 10 శాతం నుంచి సెప్టెంబర్ క్వార్టర్‌లో 10.3 శాతానికి, డిసెంబర్ క్వార్టర్‌లో 12.6 శాతానికి, ప్రస్తుత క్వార్టర్‌లో జనవరి 15 నాటికి 13.5 శాతానికి చేరాయి’’ అని సీబీడీటీ వెల్లడించింది.
నికర పన్ను వసూళ్లు సైతం క్యూ1లో 14.8 శాతంగా ఉంటే, క్యూ2లో 15.8 శాతానికి, క్యూ3లో 18.7 శాతానికి, ప్రస్తుత క్వార్టర్‌లో జనవరి 15 నాటికి 18.7 శాతానికి పెరిగినట్టు వివరించింది. కార్పొరేట్ పన్ను వసూళ్లు సైతం ఇదే తీరులో వృద్ధి చెందాయి. జూన్ క్వార్టర్‌లో 4.8 శాతంగా ఉంటే, డిసెంబర్ క్వార్టర్ నాటికి 10.1 శాతానికి, ఆ తర్వాత 11.4 శాతానికి పెరిగాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment