8-10 శాతం వృద్ధి సాధ్యమే: జైట్లీ
కోల్‌కతా : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ.. భారత్ ఆర్థికవ్యవస్థ మాత్రం పురోగమిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పెట్టుబడుల జోరు, సరైన పాలసీల తోడ్పాటుతో 8-10 శాతం వృద్ధి రేటును సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘సరైన దిశలో సరైన చర్యలు తీసుకోగలిగితే 8 శాతం, అంతకుమించి వృద్ధి సాధ్యమేనన్న నమ్మకం నాకు ఉంది. అయితే, పెట్టుబడులకు ద్వారాలు తెరవడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. ఆదివారమిక్కడ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కార్పొరేట్ రాయితీలు వెనక్కి...
కార్పొరేట్లకు ఇప్పటివరకూ ఇస్తున్న ఆర్థిక రాయితీలు, మినహాయింపులను ఉపసంహరణకు త్వరలో ఒక రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నట్లు కూడా జైట్లీ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘రానున్న ఐదేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను ఇప్పుడున్న 30% నుంచి 25 శాతానికి తగ్గించనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించాం. దీనికి మేం కట్టుబడి ఉన్నాం. అయితే, వాస్తవానికి ఇప్పుడు విధిస్తున్న(ఎఫెక్టివ్) పన్ను రేటు 22 శాతమే. దీనికి ప్రధానంగా మినహాయింపులే కారణం. అందుకే నెమ్మదినెమ్మదిగా వీటిని తొలగించాల్సిన అవసరం ఉంది. అని జైట్లీ వివరించారు.