Tax Rate
-
Budget 2024: పన్నుల తగ్గింపు యోచనలో ప్రభుత్వం!
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే జులై నెలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రకటించే అవకాశం ఉంది. వ్యక్తిగత పన్ను తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని, మధ్యతరగతికి పొదుపు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.వార్షికాదాయం రూ.15 లక్షలు కంటే ఎక్కువ పొందేవారు పన్ను ఉపశమనం పొందే కేటగిరీలో ఉన్నారని, అత్యధిక పన్ను పరిమితి ఆదాయం ఎంత ఉండాలన్నది ఇంకా నిర్ణయించలేదని నివేదిక తెలిపింది. రూ.10 లక్షల వార్షికాదాయానికి ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని, పాత పన్ను విధానంలో అత్యధికంగా 30 శాతం పన్ను విధించే ఆదాయానికి కొత్త పరిమితిపై చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది.2020లో ప్రారంభించిన పన్ను విధానంలో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. దీని ప్రకారం.. రూ .15 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 5 శాతం నుంచి 20 శాతం పన్ను, రూ .15 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఒక వ్యక్తి ఆదాయం రూ .3 లక్షల నుంచి రూ .15 లక్షలకు ఐదు రెట్లు పెరిగినప్పుడు ఆదాయపు పన్ను రేటు మాత్రం ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది చాలా తీవ్రమైనదంటూ నివేదిక పేర్కొంది. -
సంపన్నులపై ‘కరోనా’ పన్ను!
కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా ఆదాయాన్ని పెంచుకు నేందుకు అధిక సంపద కలిగిన వారిపై 40% పన్ను, విదేశీ కంపెనీలపై అధిక లెవీ విధించాలంటూ కేంద్రానికి కొందరు సీనియర్ అధికారులు సూచించడం సంచలనంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ఫోర్స్’ పేరుతో ఒక నివేదికను సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీకి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సమర్పించింది. రూ.కోటికి పైగా ఆదాయం కలిగిన వారిపై ప్రస్తుతం 30% పన్ను రేటు అమల్లో ఉండగా దీనిని 40% చేయాలని కోరింది. రూ.5 కోట్లు పైబడి ఆదాయాన్ని ఆర్జించే వారిపై తిరిగి సంపద పన్ను ప్రవేశపెట్టాలని సూచించింది. 3–6 నెలల కాలానికి ఈ సూచనలు చేసింది. అయితే ఈ నివేదికను ప్రభుత్వ అధికారిక అభిప్రాయంగా పరిగణించరాదని సీబీడీటీ స్పష్టం చేసింది. అధికారికంగా ఎవరూ చెప్పకుండానే దీన్ని తమంత తాముగా రూపొందించిన 50 మంది ఐఆర్ఎస్ అధికారులపై విచారణ చేపడుతున్నట్లు పేర్కొంది. -
మార్చి 1 నుంచి లాటరీలపై 28 శాతం జిఎస్టీ
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మార్చి 1 నుంచి లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు. రాష్ట్రాలు నిర్వహిస్తున్న లేదా ఆధీకృత లాటారీలపై 28 శాతం శ్లాబ్‌లో ఏకరీతి పన్నును విధించాలని గత ఏడాది డిసెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీపై 12 శాతం పన్ను ఉండగా, రాష్ట్ర అధీకృత లాటరీపై 28 శాతం పన్ను విధిస్తున్నారు. లాటరీలపై ఏకరీతి పన్ను ఉండాలనే డిమాండ్ల నేపథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం సిఫార్సుతో లాటరీలపై 28 శాతం యూనిఫాం రేటుతో పన్ను విధించాలని గత ఏడాది డిసెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా మార్చి 1 నుంచి లాటరీలపై నూతన పన్ను విధానం అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చదవండి : ఇలా చేస్తే రూ. 1 కోటి దాకా నజరానా -
ప్లాస్టిక్ కుర్చీ లగ్జరీ వస్తువా..?
⇒ 28 శాతం స్లాబ్‌లోకి ఎలా చేరుస్తారు ⇒ చిన్న కంపెనీలు మూతపడతాయి ⇒ మౌల్డెడ్ ఫర్నిచర్ తయారీదార్ల సంఘం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ వస్తువుల జాబితాలోకి ప్లాస్టిక్ కుర్చీలను చేర్చడాన్ని ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ తయారీదారుల సంఘం తప్పుపట్టింది. జీఎస్టీ కౌన్సిల్ ప్లాస్టిక్ కుర్చీలపై 28 శాతం పన్ను రేటు నిర్ణయించింది. వీటిని హౌస్‌హోల్డ్ వస్తువుల జాబితాలోకి చేర్చడం ద్వారా 18 శాతం పన్ను స్లాబులోకి తేవాలని సంఘం డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ కంపెనీలు 5 శాతం వ్యాట్, 12.5 శాతం ఎక్సైజ్ డ్యూటీని చెల్లించాయి. దేశంలో 60 శాతం చిన్న స్థాయి కంపెనీలే ఉన్నాయి. ప్లాస్టిక్ కుర్చీలపై పన్ను 28 శాతముంటే పరిశ్రమలో ఈ తయారీ కంపెనీలు మనలేవని సంఘం ప్రెసిడెంట్ కె.పి.రవీంద్రన్ తెలిపారు. ‘పెద్ద బ్రాండ్లు ఎంత ధర పెట్టినా కస్టమర్లు కొంటారు. చిన్న కంపెనీలు స్వల్పంగా ధర సవరించినా కొనేవారుండరు. రీసైక్లింగ్ ప్లాస్టిక్ తయారీలో ఉన్న యూనిట్లకు ఇప్పటి వరకూ పన్ను మినహాయింపు ఉంది. ఎస్ఎస్ఐ యూనిట్లకు ఎక్సైజ్ డ్యూటీ లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. ఇది భారత పరిశ్రమకు నష్టాన్ని కలిగిస్తుంది’ అని తెలిపారు. చైనా దిగుమతుల వెల్లువ..: ప్రభుత్వం పన్ను సవరించకపోతే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలుగుతుందని సంఘం కార్యదర్శి సుశీల్ అగర్వాల్ అన్నారు. సామాన్యులు వాడే ప్లాస్టిక్ కుర్చీ లగ్జరీ ఎలా అయిందో అర్థం కావడం లేదన్నారు. ‘భారత కంపెనీ ఒక ఉత్పాదనను రూ.100కు విక్రయిస్తే, అదే ఉత్పాదనను చైనా కంపెనీ రూ.60కే ఇక్కడ ప్రవేశపెడుతుంది. దీంతో చైనా ఉత్పత్తులు వెల్లువలా వచ్చి పడతాయి. ఇక్కడి కంపెనీలు మూతపడక తప్పదు. మౌల్డెడ్ ప్లాస్టిక్ తయారీ రంగంలో 200 కంపెనీలున్నాయి. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి 40 దాకా ఉంటాయి. 20,000 మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. పరిశ్రమ పరిమాణం రూ.300 కోట్లు. ఇందులో ప్లాస్టిక్ చైర్ల విక్రయాలు 80%. అందుకే జీఎస్టీ ప్రభావం ఎక్కువ’ అని చెప్పారు. ముడి ప్లాస్టిక్‌పై 18% జీఎస్టీ ఉందని సంఘం హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉపేందర్ గుప్తా తెలిపారు. -
డీడీ, చెక్‌బుక్, బీమా పాలసీ... ఇకపై కాస్త ప్రియం!
♦ సేవా రంగానికి జీఎస్టీ పన్ను రేటు 18 శాతం ♦ క్రెడిట్ కార్డు చెల్లింపులు, నగదు లావాదేవీలు, ప్రాసెసింగ్ ఫీజులన్నీ ఖరీదు ♦ డీడీ, ఏటీఎం విత్‌డ్రా, చెక్‌బుక్స్ వంటివి కూడా.. ♦ బీమా ప్రీమియంలు 3 శాతం పెరుగుతాయ్ ♦ మ్యూచువల్ ఫండ్లు, షేర్ల లావాదేవీలూ కాస్త భారమే ♦ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ప్రియం ♦ తయారీ తరహాలోనే ఆర్థిక సేవలకూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకుకెళ్లి మీరో డీడీ తియ్యాలనుకున్నారు. దానికి చార్జీలు ఇకపై కాస్త ఎక్కువే అవుతాయి. బ్యాంకును చెక్‌బుక్ అడిగారనుకోండి. దానికీ కాస్త ఎక్కువ చార్జీలే అవుతాయి. అంతేకాదు! రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, క్రెడిట్ కార్డు చెల్లింపులు... ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంకింగ్ సేవలన్నీ కాస్త ప్రియం కాబోతున్నాయి. అదీ... మరో 20 రోజుల్లో అమల్లోకి రాబోతున్న జీఎస్టీ మహత్యం. ఒక్క బ్యాంకింగ్ సేవలే కాదు. బీమా, మ్యూచువల్ ఫండ్ల వంటి ఆర్థిక లావాదేవీలన్నీ జీఎస్టీ రాకతో కాస్త ఖరీదవుతాయి. ఎందుకంటే గతంలో వీటన్నిటిపై సేవాపన్నుండేది. అది సెస్సులతో కలిపి 15 శాతం. కానీ జీఎస్టీలో ఈ సర్వీసు ట్యాక్సు ఆధారిత సేవలన్నిటిపైనా 18 శాతం పన్ను విధించారు. దాంతో ఇక ప్రతి సేవా ఖరీదే. ఆ వివరాలివిగో... ప్రస్తుతం బ్యాంకులు ఏ సేవలకైతే సర్వీస్ ట్యాక్స్ విధిస్తున్నాయో అవన్నీ జీఎస్టీ అమలయ్యాక ఖరీదవుతాయనే బండగుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం బ్యాంకులు చెక్ బుక్స్, డిమాండ్ డ్రాఫ్ట్స్ (డీడీ) జారీ చేయటం, క్రెడిట్ కార్డు చెల్లింపులు గనక నగదు రూపంలో చెల్లిస్తే ప్రాసెస్ చేయటం, , నగదు బదిలీ, ఏటీఎం లావాదేవీలు, రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు వంటి సేవలకు 15% సేవా పన్నును వసూలు చేస్తున్నాయి. జీఎస్టీ అమలుతో అంటే జూలై 1 నుంచి ఈ సేవలపై 18% పన్నును విధిస్తాయి. అంటే ఖాతాదారుడు ఆయా సేవలపై అదనంగా 3% పన్నును చెల్లించాల్సి ఉంటుంది. సేవింగ్ అకౌంట్ ప్రారంభం, ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీ) వంటి వాటిపై సర్వీస్ ట్యాక్స్ లేదు గనక.. జీఎస్టీ అమలయ్యాక కూడా ఈ సేవలపై పన్ను భారం ఉండదు. ఒక్కో రాష్ట్రంలో ఏడాదికి 61 రిటర్న్స్..: బ్యాంకులకు జీఎస్టీతో పెద్ద చిక్కే రాబోతోంది. ఎందుకంటే ఇవి జీఎస్టీఎన్లో రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక రాష్ట్రంలో గనక బోలెడన్ని బ్రాంచీలుంటే అన్నిటికీ కలిపి ఒకే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే ప్రస్తుతం దేశంలోని బ్యాంకులన్నీ దాదాపుగా బహుళ రాష్ట్రాల్లో సేవలందిస్తున్నవే. దీంతో రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం వాటికి ఇబ్బందే. ప్రస్తుతం ఈ బ్యాంకులు సర్వీస్ ట్యాక్స్ కింద సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒకో ఆర్థిక సంవత్సరంలో రెండే రిటర్న్స్ దాఖలు చేస్తున్నాయి. కానీ, జీఎస్టీ అమలయ్యాక ఇవి ఒక్కో రాష్ట్రంలో నెలకు 5 రిటర్న్‌లు, వార్షిక రాబడికి ఒకటి చొప్పున ఏడాదికి 61 రిటర్న్స్ ఫైల్ చేయాలి. దీంతో బ్యాంకుల ఆర్థిక ఉత్పత్తులు, ఐటీ వ్యవస్థపై ప్రభావం పడి వ్యయం పెరుగుతుంది. దీంతో బ్యాంకులు వివిధ రకాల సేవల రుసుములను పెంచే ప్రమాదముంది. ఇన్పుట్ క్రెడిట్ దక్కుతుంది సుమీ! జీఎస్టీలో తయారీరంగం మాదిరే సేవా రంగానికీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వర్తిస్తుంది. ఇది ఆర్థిక సేవల రంగంలో సమతుల్యతను తీసుకొస్తుందనే అంచనాలున్నాయి. అలాగే ఇన్నాళ్లు బ్యాంక్, బీమా ఇతర ఆర్ధిక సంస్థలకు మూలధన విస్తరణ (క్యాపెక్స్), నిర్వహణ విస్తరణ(ఓపెక్స్) వ్యాట్ క్రెడిట్ అందుబాటులో లేదు. కానీ, జీఎస్టీలో వీటి క్యాపెక్స్, ఓపెక్స్లపై క్రెడిట్ లభిస్తుంది. దీంతో ఆర్థిక సేవా రంగం మరింత బలోపేతమై సమర్థంగా పనిచేసే అవకాశముంటుంది. బ్యాంకులకు జీఎస్టీ సవాళ్లివే.. ⇒ సేవలందుకునే ప్రాంతం ఆధారంగా జీఎస్టీని నిర్ణయిస్తున్నారు. అంటే ఏ రాష్ట్రంలో సేవలందుకుంటామో అక్కడ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. తయారీ రంగం మాదిరి ఆర్థిక సేవల రంగంలోనూ సేవా ప్రాంతాన్ని గుర్తించడం అంత తేలిక్కాదు. ఎందుకంటే ఇక్కడ సేవలన్నీ దాదాపు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. ప్రస్తుతం దేశంలోని బ్యాంకులన్నీ బాగా విస్తరించాయి. రాష్ట్ర పరిధిలో, రాష్ట్రం అవతల లావాదేవీలు నిర్వహించటమనేది అత్యంత సహజం. ⇒ ఒకే బ్యాంక్‌కు చెందిన రెండు బ్రాంచీల మధ్య జరిగే రెండు రాష్ట్రాల పరిధిలోని లావాదేవీలు మరింత గజిబిజిని సృష్టిస్తాయి. వీటి గుర్తింపు బ్యాంకులకు సవాలే. జీఎస్టీతో రెండు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీలు ఐజీఎస్టీ పరిధిలోకి వస్తాయి. అంటే ఏ రాష్ట్రమైతే సేవలను అందుకుంటుందో ఆ బ్యాంక్ బ్రాంచ్ క్రెడిట్‌ను అందుకుంటుంది. ⇒ ఒకవేళ సేవల సరఫరా స్థానాన్ని గుర్తించడంలో పన్ను చెల్లింపుదారుడు విఫలమైతే చట్టపరమైన వివాదాల్లో చిక్కుకునే ప్రమాదముంది. అలాగే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ పన్నులను తప్పుగా చెల్లిస్తే.. పన్నులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చెల్లించిన పన్నుల రీఫండ్ కోసం దావా వేయాల్సి ఉంటుంది. అంటే దీనర్థం సంబంధిత లావాదేవీలు రాష్ట్ర పరిధిలోదా, రెండు రాష్ట్రాల పరిధిలోనివా అనేది నిర్ణయించాల్సిన బాధ్యత పన్ను చెల్లింపుదారుదే. బీమా ప్రీమియంలు పెరుగుతాయ్.. ఆర్ధిక భద్రత, జీవితానికి భరోసా!. ఇదీ బీమా రంగ లక్ష్యం. ప్రస్తుతం ఈ రంగానికి పాలసీని బట్టి ప్రీమియం మీద సర్వీస్ ట్యాక్స్ 1.5 శాతం నుంచి 15 శాతం వరకూ ఉంది. జీఎస్టీలో మాత్రం బీమా రంగం మొత్తాన్ని ఒకే గాటన కట్టేశారు. అన్ని రకాల పాలసీలకూ 18 శాతం పన్ను శ్లాబును నిర్ధారించారు. దీంతో ఆరోగ్య, వాహన, ఎండోమెంట్ ఏ పాలసీ అయినా ప్రీమియం భారీగా పెరగనుంది. ఉదాహరణకు ఏటా రూ.10 వేలు ప్రీమియంగా చెల్లించేవారు ఇపుడు సేవా పన్నుగా రూ.1,500 చెల్లిస్తున్నారు. జీఎస్టీ అమలయ్యాక రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2017 తర్వాత తొలిసారి బీమా పాలసీ తీసుకున్నా లేదా ప్రస్తుత పాలసీని పునరుద్ధరించినా ఈ అదనపు భారం తప్పదు. ఎందుకంటే పాలసీలకు ఏప్రిల్ నుంచి ఆర్ధిక సంవత్సరం ప్రారంభమవుతుంది గనక!! ఏ పాలసీపై ఎంత ప్రభావమంటే? ♦ టర్మ్ ప్లాన్: ప్రస్తుతం టర్మ్ ప్లాన్స్ ప్రీమియంపై సర్వీస్ ట్యాక్స్ 15 శాతముంది. జీఎస్టీ 18%. ♦ ఎండోమెంట్ ప్లాన్స్: ప్రస్తుతం ఎండోమెంట్ ప్లాన్స్‌లో తొలి ఏడాది ప్రీమియంపై సర్వీస్ ట్యాక్స్ 3.75%. రెండో ఏడాది నుంచి 1.88 శాతంగా ఉంది. జీఎస్టీ అమలయ్యాక.. తొలి ఏడాది పన్ను 4.5 శాతం, రెండో ఏడాది 2.25 శాతానికి చేరుతుంది. ♦ యులిప్: యునిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్(యులిప్స్)కు సర్వీస్ ట్యాక్స్ తొలి ఏడాది 3.5%, రెండో ఏడాది 1.75%గా ఉంది. జీఎస్టీలో తొలి ఏడాది 4.5%, రెండో ఏడాది 2.25%. ♦ ఆరోగ్య, వాహన బీమా: ప్రస్తుతం ఆరోగ్య, వాహన బీమాలకు సర్వీస్ ట్యాక్స్ ప్రీమియం మీద 15 శాతంగా ఉంది. ఇది 18 శాతానికి చేరుతుంది. జీఎస్టీ నుంచి కొన్ని పాలసీల్ని మినహాయించారు. ఆ పాలసీలేంటో తెలుసా? ఇక మ్యూచ్‌వల్ ఫండ్స్‌పై, షేర్లపై జీఎస్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది? www.sakshibusiness.com లో -
బంగారంపై పన్ను రేట్లు పెరుగుతాయా?
న్యూఢిల్లీ : బంగారంపై పన్ను రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకీకృత పన్ను పాలనకు రూపొందించిన ఫైనల్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలుపడానికి ఉదయ్‌పూర్ లో భేటీ కాబోతున్న జీఎస్టీ కౌన్సిల్, నేడు బంగారంపై పన్ను రేట్లు ఎలా ఉండాలన్నది నిర్ణయిస్తుందని తెలుస్తోంది. వస్తువులపై నాలుగు శ్లాబులుగా పన్ను రేట్లు నిర్ధారించిన జీఎస్టీ కౌన్సిల్, ఇంకా బంగారంపై పన్ను రేటు ఎలా ఉండాలో నిర్ధారించలేదు. పన్ను నియంత్రణపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి అమలుచేయాల్సిన జీఎస్టీని ప్రస్తుతం ప్రభుత్వం 2017 జూలై 1 నుంచి ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అన్ని సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి. ఒక్క బంగారంపై ఎంత పన్ను విధించాలనే అంశమే పెండింగ్‌లో ఉంది. జీఎస్టీ కింద విలువైన మెటల్స్‌కు 4 శాతం పన్ను విధించాలని కేంద్ర, రాష్ట్రాలు నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఇది ప్రస్తుతమున్న రేటు కంటే ఎక్కువ. ఎక్కువ పన్ను విధించడం అక్రమాలకు దారితీస్తుందని మరోవైపు నుంచి బంగార వర్తకులు వాదిస్తున్నారు. అయితే చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రహ్మణ్యం ప్రతిపాదించిన రిపోర్టు ప్రకారం బంగారంపై 4 శాతం పన్ను విధింపుకే తాము మద్దతిస్తామని కేరళ ఆర్థికమంత్రి చెప్పారు. ప్రస్తుతం వ్యాట్ కింద బంగారంపై 1 శాతం, ఎక్స్చేంజ్ డ్యూటీ కింద నాన్-సిల్వర్ జువెల్లరీపై 1 శాతం విధిస్తున్నారు. సుబ్రహ్మణ్యం ప్రతిపాదించిన బంగారంపై 2 నుంచి 6 శాతం పన్నుకే చాలా రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నాయి. దీంతో నేడు జరిగే భేటీ బంగారంపై పన్ను రేట్లు ఎలా ఉంటాయన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
జీఎస్టీ టైంటేబుల్‌కు కేంద్రం, రాష్ట్రాలు ఓకే
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసకొచ్చేందుకుగాను త్వరగా పన్ను రేటును నిర్ణయించి, చట్టబద్ధ ప్రక్రియను ముగించడానికి ఉద్దేశించిన ఒక టైంటేబుల్‌ను కేంద్ర ంతోపాటు అన్ని రాష్ట్రాలు గురువారం అంగీకరించాయి. అయితే పన్ను నుంచి మినహాయింపు పొందడానికి డీలర్లకు ఉండాల్సిన టర్నోవర్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్తగా ఏర్పాటైన జీఎస్టీ మండలి తొలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన 29 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో గురువారం ఢిల్లీలో జరిగింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జీఎస్టీలో ఒక రాష్ట్రం-ఒక ఓటు సూత్రాన్ని వ్యతిరేకించాయి. తమ రాష్ట్రాలు పెద్దవి, పరిశ్రమలు అధికంగా ఉన్నవనీ...జీఎస్టీపై అభిప్రాయం చెప్పడానికి తమకు ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు కావాలని అవి కోరాయి. రాష్ట్రానికో ఓటు ఇస్తే చిన్న రాష్ట్రాలకు, తమకు తేడా ఏంటని వాదించాయి. మిగతా రాష్ట్రాలవారు ఈ డిమాండ్‌ను కొట్టిపారేశారు. డీలర్లను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలన్న డిమాండ్‌పై కూడా ఏకాభిప్రాయం రాలేదు. కొన్ని రాష్ట్రాలు రూ.10 లక్షల లోపు టర్నోవర్ ఉండే డీలర్లకు మినహాయింపులివ్వాలని కోరగా...ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు పరిమితి రూ.25 లక్షలు ఉండాలన్నాయి. సమావేశం రేపు కూడా కొనసాగనుంది. -
పన్ను‘పోటు’ దేశాలు
ఒక్కొక్క దేశంలో ఒక్కోపన్ను విధానం... ప్రపంచంలోని ఎక్కువ వసూలు చేస్తున్న మొదటి ఎనిమిది దేశాల జాబితా ఇది.. అరుబా (కరేబియన్ సముద్రంలోని ద్వీప దేశం) పన్ను రేటు: 58.95 శాతం ► ఉద్యోగులకు చెల్లించే జీతాల ఆధారంగా వసూలు ఉండదు. మూలధనం పన్ను కూడా లేదు. 15 శాతం వ్యాట్ కూడా వసూలు చేస్తున్నారు స్వీడన్ పన్ను రేటు: 56.60 శాతం ► {పజలకు ఉచిత విద్య, రాయితీతో వైద్య సేవలు, ప్రజా రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. కంపెనీలు సోషల్ సెక్యూరిటీగా 31.42% పన్ను చెల్లించాలి. మూలధన రాబడులపై 30% చెల్లించాలి. డెన్మార్క్ పన్ను రేటు: 55.56 శాతం ► 2008లో 62.3గా ఉన్న పన్ను రేటును తగ్గించారు. ఈ దేశంలో సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ లేదు. భాగస్వామి నుంచే సంక్రమించే ఆస్తికి పన్ను విధించరు. ఇతరుల నుంచి ఆస్తి సంక్రమిస్తే కట్టాల్సిందే నెదర్లాండ్స్ పన్ను రేటు: 52.00 శాతం ► ఈ దేశంలో ఉద్యోగుల జీతాలపై పన్ను లేదు. అలాగే స్టాంప్ డ్యూటీ వసూలు చేయరు. ఆస్తి మార్పిడిపై మాత్రం 6 శాతం వసూలు చేస్తున్నారు. బెల్జియం పన్ను రేటు: 50.00 శాతం ► అతి ఎక్కువ సంవత్సరాదాయమున్న ఉద్యోగులు మొత్తంలో 40 శాతం మాత్రమే ఇంటికెళ్తారు. 13 శాతం సోషల్ సెక్యూరిటీ పన్ను చెల్లించాల్సి ఉండగా.. అందులో ఉద్యోగి వాటా 35 శాతం.. జపాన్ పన్ను రేటు: 50.00 శాతం ► దాదాపు రూ. 1.55 కోట్ల సంవత్సర ఆదాయముంటే 50 శాతం వసూలు చేస్తారు. ఈ పన్నులు రెండుగా విభజించారు. 40 శాతం మార్జినల్ పన్ను, 10 శాతం ప్రాపర్టీ పన్ను యునెటైడ్ కింగ్డమ్ పన్ను రేటు: 50.00 శాతం ► రూ.1.60 కోట్ల ఆదాయం వస్తే 50 శాతం చెల్లించాల్సిందే.. సోషల్ సెక్యూరిటీ కోసం 14 శాతం వసూలు చేస్తున్నారు. ఫిన్లాండ్ పన్ను రేటు: 49.20 శాతం ► సంవత్సర ఆదాయం రూ. 62 లక్షలుంటే 49.2 శాతం కట్టాల్సిందే. కేపిటల్ గెయిన్స్‌పై 28 శాతం పన్ను ఉండగా, 21 శాతం మున్సిపల్ ట్యాక్స్ చెల్లించాలి. ఇండియా ఇండియాలో గరిష్టంగా 30% వసూలు చేస్తుండగా... కనిష్ట 10 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. -
8-10 శాతం వృద్ధి సాధ్యమే: జైట్లీ
కోల్‌కతా : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ.. భారత్ ఆర్థికవ్యవస్థ మాత్రం పురోగమిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పెట్టుబడుల జోరు, సరైన పాలసీల తోడ్పాటుతో 8-10 శాతం వృద్ధి రేటును సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘సరైన దిశలో సరైన చర్యలు తీసుకోగలిగితే 8 శాతం, అంతకుమించి వృద్ధి సాధ్యమేనన్న నమ్మకం నాకు ఉంది. అయితే, పెట్టుబడులకు ద్వారాలు తెరవడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. ఆదివారమిక్కడ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ రాయితీలు వెనక్కి... కార్పొరేట్లకు ఇప్పటివరకూ ఇస్తున్న ఆర్థిక రాయితీలు, మినహాయింపులను ఉపసంహరణకు త్వరలో ఒక రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నట్లు కూడా జైట్లీ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘రానున్న ఐదేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను ఇప్పుడున్న 30% నుంచి 25 శాతానికి తగ్గించనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించాం. దీనికి మేం కట్టుబడి ఉన్నాం. అయితే, వాస్తవానికి ఇప్పుడు విధిస్తున్న(ఎఫెక్టివ్) పన్ను రేటు 22 శాతమే. దీనికి ప్రధానంగా మినహాయింపులే కారణం. అందుకే నెమ్మదినెమ్మదిగా వీటిని తొలగించాల్సిన అవసరం ఉంది. అని జైట్లీ వివరించారు. -
5 శాతం పెరిగిన డీసీబీ నికర లాభం
ముంబై : ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.45 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.47 కోట్లకు పెరిగిందని డీసీబీ తెలిపింది. తమకు వర్తించే పన్ను రేటు 16 శాతమని, కానీ తాము 35 శాతం పన్ను రేటు చొప్పున చెల్లించామని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురళి ఎం. నటరాజన్ చెప్పారు. అందుకే నికర లాభం తగ్గిందని వివరించారు. నికర మొండి బకాయిలు 0.97 శాతం నుంచి 1.22 శాతానికి పెరిగాయని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 1.96 శాతానికి చేరాయని పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం రూ.352 కోట్ల నుంచి రూ.404 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.140 కోట్లకు పెరిగాయని, మొత్తం ఆదాయం రూ.204 కోట్లకు పెరిగిందని వివరించారు. త్వరలో కొత్తగా 30 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని, 400 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నామని తెలిపారు.