డీడీ, చెక్‌బుక్, బీమా పాలసీ... ఇకపై కాస్త ప్రియం! | GST rates: Financial services transactions to become marginally | Sakshi
Sakshi News home page

డీడీ, చెక్‌బుక్, బీమా పాలసీ... ఇకపై కాస్త ప్రియం!

Published Wed, Jun 7 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

డీడీ, చెక్‌బుక్, బీమా పాలసీ... ఇకపై కాస్త ప్రియం!

డీడీ, చెక్‌బుక్, బీమా పాలసీ... ఇకపై కాస్త ప్రియం!

సేవా రంగానికి జీఎస్‌టీ పన్ను రేటు 18 శాతం
క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, నగదు లావాదేవీలు, ప్రాసెసింగ్‌ ఫీజులన్నీ ఖరీదు
డీడీ, ఏటీఎం విత్‌డ్రా, చెక్‌బుక్స్‌ వంటివి కూడా..
బీమా ప్రీమియంలు 3 శాతం పెరుగుతాయ్‌
మ్యూచువల్‌ ఫండ్లు, షేర్ల లావాదేవీలూ కాస్త భారమే
మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ప్రియం
తయారీ తరహాలోనే ఆర్థిక సేవలకూ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకుకెళ్లి మీరో డీడీ తియ్యాలనుకున్నారు. దానికి చార్జీలు ఇకపై కాస్త ఎక్కువే అవుతాయి. బ్యాంకును చెక్‌బుక్‌ అడిగారనుకోండి. దానికీ కాస్త ఎక్కువ చార్జీలే అవుతాయి. అంతేకాదు! రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజులు, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు... ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంకింగ్‌ సేవలన్నీ కాస్త ప్రియం కాబోతున్నాయి. అదీ... మరో 20 రోజుల్లో అమల్లోకి రాబోతున్న జీఎస్‌టీ మహత్యం. ఒక్క బ్యాంకింగ్‌ సేవలే కాదు. బీమా, మ్యూచువల్‌ ఫండ్ల వంటి ఆర్థిక లావాదేవీలన్నీ జీఎస్‌టీ రాకతో కాస్త ఖరీదవుతాయి. ఎందుకంటే గతంలో వీటన్నిటిపై సేవాపన్నుండేది. అది సెస్సులతో కలిపి 15 శాతం. కానీ జీఎస్‌టీలో ఈ సర్వీసు ట్యాక్సు ఆధారిత సేవలన్నిటిపైనా 18 శాతం పన్ను విధించారు. దాంతో ఇక ప్రతి సేవా ఖరీదే.

ఆ వివరాలివిగో...
ప్రస్తుతం బ్యాంకులు ఏ సేవలకైతే సర్వీస్‌ ట్యాక్స్‌ విధిస్తున్నాయో అవన్నీ జీఎస్‌టీ అమలయ్యాక ఖరీదవుతాయనే బండగుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం బ్యాంకులు చెక్‌ బుక్స్, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌ (డీడీ) జారీ చేయటం, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు గనక నగదు రూపంలో చెల్లిస్తే ప్రాసెస్‌ చేయటం, , నగదు బదిలీ, ఏటీఎం లావాదేవీలు, రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజులు వంటి సేవలకు 15% సేవా పన్నును వసూలు చేస్తున్నాయి. జీఎస్‌టీ అమలుతో అంటే జూలై 1 నుంచి ఈ సేవలపై 18% పన్నును విధిస్తాయి. అంటే ఖాతాదారుడు ఆయా సేవలపై అదనంగా 3% పన్నును చెల్లించాల్సి ఉంటుంది. సేవింగ్‌ అకౌంట్‌ ప్రారంభం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ (ఎఫ్‌డీ) వంటి వాటిపై సర్వీస్‌ ట్యాక్స్‌ లేదు గనక.. జీఎస్‌టీ అమలయ్యాక కూడా ఈ సేవలపై పన్ను భారం ఉండదు.

ఒక్కో రాష్ట్రంలో ఏడాదికి 61 రిటర్న్స్‌..: బ్యాంకులకు జీఎస్‌టీతో పెద్ద చిక్కే రాబోతోంది. ఎందుకంటే ఇవి జీఎస్‌టీఎన్‌లో రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఒక రాష్ట్రంలో గనక బోలెడన్ని బ్రాంచీలుంటే అన్నిటికీ కలిపి ఒకే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అయితే ప్రస్తుతం దేశంలోని బ్యాంకులన్నీ దాదాపుగా బహుళ రాష్ట్రాల్లో సేవలందిస్తున్నవే. దీంతో రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవటం వాటికి ఇబ్బందే. ప్రస్తుతం ఈ బ్యాంకులు సర్వీస్‌ ట్యాక్స్‌ కింద సెంట్రలైజ్డ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఒకో ఆర్థిక సంవత్సరంలో రెండే రిటర్న్స్‌ దాఖలు చేస్తున్నాయి. కానీ, జీఎస్‌టీ అమలయ్యాక ఇవి ఒక్కో రాష్ట్రంలో నెలకు 5 రిటర్న్‌లు, వార్షిక రాబడికి ఒకటి చొప్పున ఏడాదికి 61 రిటర్న్స్‌ ఫైల్‌ చేయాలి. దీంతో బ్యాంకుల ఆర్థిక ఉత్పత్తులు, ఐటీ వ్యవస్థపై ప్రభావం పడి వ్యయం పెరుగుతుంది. దీంతో బ్యాంకులు వివిధ రకాల సేవల రుసుములను పెంచే ప్రమాదముంది.

ఇన్‌పుట్‌ క్రెడిట్‌ దక్కుతుంది సుమీ!
జీఎస్‌టీలో తయారీరంగం మాదిరే సేవా రంగానికీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) వర్తిస్తుంది. ఇది ఆర్థిక సేవల రంగంలో సమతుల్యతను తీసుకొస్తుందనే అంచనాలున్నాయి. అలాగే ఇన్నాళ్లు బ్యాంక్, బీమా ఇతర ఆర్ధిక సంస్థలకు మూలధన విస్తరణ (క్యాపెక్స్‌), నిర్వహణ విస్తరణ(ఓపెక్స్‌) వ్యాట్‌ క్రెడిట్‌ అందుబాటులో లేదు. కానీ, జీఎస్‌టీలో వీటి క్యాపెక్స్, ఓపెక్స్‌లపై క్రెడిట్‌ లభిస్తుంది. దీంతో ఆర్థిక సేవా రంగం మరింత బలోపేతమై సమర్థంగా పనిచేసే అవకాశముంటుంది.

బ్యాంకులకు జీఎస్‌టీ సవాళ్లివే..
సేవలందుకునే ప్రాంతం ఆధారంగా జీఎస్‌టీని నిర్ణయిస్తున్నారు. అంటే ఏ రాష్ట్రంలో సేవలందుకుంటామో అక్కడ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. తయారీ రంగం మాదిరి ఆర్థిక సేవల రంగంలోనూ సేవా ప్రాంతాన్ని గుర్తించడం అంత తేలిక్కాదు. ఎందుకంటే ఇక్కడ సేవలన్నీ దాదాపు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ప్రస్తుతం దేశంలోని బ్యాంకులన్నీ బాగా విస్తరించాయి. రాష్ట్ర పరిధిలో, రాష్ట్రం అవతల లావాదేవీలు నిర్వహించటమనేది అత్యంత సహజం.
ఒకే బ్యాంక్‌కు చెందిన రెండు బ్రాంచీల మధ్య జరిగే రెండు రాష్ట్రాల పరిధిలోని లావాదేవీలు మరింత గజిబిజిని సృష్టిస్తాయి. వీటి గుర్తింపు బ్యాంకులకు సవాలే. జీఎస్‌టీతో రెండు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీలు ఐజీఎస్‌టీ పరిధిలోకి వస్తాయి. అంటే ఏ రాష్ట్రమైతే సేవలను అందుకుంటుందో ఆ బ్యాంక్‌ బ్రాంచ్‌ క్రెడిట్‌ను అందుకుంటుంది.
ఒకవేళ సేవల సరఫరా స్థానాన్ని గుర్తించడంలో పన్ను చెల్లింపుదారుడు విఫలమైతే చట్టపరమైన వివాదాల్లో చిక్కుకునే ప్రమాదముంది. అలాగే సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ పన్నులను తప్పుగా చెల్లిస్తే.. పన్నులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చెల్లించిన పన్నుల రీఫండ్‌ కోసం దావా వేయాల్సి ఉంటుంది. అంటే దీనర్థం సంబంధిత లావాదేవీలు రాష్ట్ర పరిధిలోదా, రెండు రాష్ట్రాల పరిధిలోనివా అనేది నిర్ణయించాల్సిన బాధ్యత పన్ను చెల్లింపుదారుదే.

బీమా ప్రీమియంలు పెరుగుతాయ్‌..
ఆర్ధిక భద్రత, జీవితానికి భరోసా!. ఇదీ బీమా రంగ లక్ష్యం. ప్రస్తుతం ఈ రంగానికి పాలసీని బట్టి ప్రీమియం మీద సర్వీస్‌ ట్యాక్స్‌ 1.5 శాతం నుంచి 15 శాతం వరకూ ఉంది. జీఎస్‌టీలో మాత్రం బీమా రంగం మొత్తాన్ని ఒకే గాటన కట్టేశారు. అన్ని రకాల పాలసీలకూ 18 శాతం పన్ను శ్లాబును నిర్ధారించారు. దీంతో ఆరోగ్య, వాహన, ఎండోమెంట్‌ ఏ పాలసీ అయినా ప్రీమియం భారీగా పెరగనుంది. ఉదాహరణకు ఏటా రూ.10 వేలు ప్రీమియంగా చెల్లించేవారు ఇపుడు సేవా పన్నుగా రూ.1,500 చెల్లిస్తున్నారు. జీఎస్‌టీ అమలయ్యాక రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 2017 తర్వాత తొలిసారి బీమా పాలసీ తీసుకున్నా లేదా ప్రస్తుత పాలసీని పునరుద్ధరించినా ఈ అదనపు భారం తప్పదు. ఎందుకంటే పాలసీలకు ఏప్రిల్‌ నుంచి ఆర్ధిక సంవత్సరం ప్రారంభమవుతుంది గనక!!

ఏ పాలసీపై ఎంత ప్రభావమంటే?
టర్మ్‌ ప్లాన్‌: ప్రస్తుతం టర్మ్‌ ప్లాన్స్‌ ప్రీమియంపై సర్వీస్‌ ట్యాక్స్‌ 15 శాతముంది. జీఎస్‌టీ 18%.
ఎండోమెంట్‌ ప్లాన్స్‌: ప్రస్తుతం ఎండోమెంట్‌ ప్లాన్స్‌లో తొలి ఏడాది ప్రీమియంపై సర్వీస్‌ ట్యాక్స్‌ 3.75%. రెండో ఏడాది నుంచి 1.88 శాతంగా ఉంది. జీఎస్‌టీ అమలయ్యాక.. తొలి ఏడాది పన్ను 4.5 శాతం, రెండో ఏడాది 2.25 శాతానికి చేరుతుంది.
యులిప్‌: యునిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌(యులిప్స్‌)కు సర్వీస్‌ ట్యాక్స్‌ తొలి ఏడాది 3.5%, రెండో ఏడాది 1.75%గా ఉంది. జీఎస్‌టీలో తొలి ఏడాది 4.5%, రెండో ఏడాది 2.25%.
ఆరోగ్య, వాహన బీమా: ప్రస్తుతం ఆరోగ్య, వాహన బీమాలకు సర్వీస్‌ ట్యాక్స్‌ ప్రీమియం మీద 15 శాతంగా ఉంది. ఇది 18 శాతానికి చేరుతుంది.

జీఎస్‌టీ నుంచి కొన్ని పాలసీల్ని మినహాయించారు. ఆ పాలసీలేంటో తెలుసా?
ఇక మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌పై, షేర్లపై జీఎస్‌టీ ప్రభావం ఎలా ఉండబోతోంది?

www.sakshibusiness.com లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement