
న్యూఢిల్లీ: సుమారు రూ. 400 కోట్ల పైగా టర్నోవరు ఉండే కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేటును క్రమంగా 25 శాతానికి తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపద సృష్టికర్తలకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. జీవనాన్ని మరింత సులభతరం చేసే ఉద్దేశంతోనే ప్రతీ విధానం, ప్రతీ పథకాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి వివరించారు. ‘ప్రస్తుతం కేవలం 0.7 శాతం సంస్థలే గరిష్ట కార్పొరేట్ ట్యాక్స్ రేటు పరిధిలో ఉన్నాయి. దీర్ఘకాలంలో వీటికి కూడా ట్యాక్స్ రేటును 25 శాతం పరిధిలోకి తెస్తాము‘ అని ఆమె చెప్పారు. అయితే, ఎప్పటిలోగా ఇది అమలు చేసేదీ మాత్రం స్పష్టమైన గడువేదీ మంత్రి పేర్కొనలేదు. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 400 కోట్ల దాకా వార్షిక టర్నోవరు ఉన్న సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. జీవనాన్ని మరింత సులభతరం చేసే ఉద్దేశంతోనే ప్రతీ విధానం, ప్రతీ పథకాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన వార్షిక స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసం సందర్భంగా సంపద సృష్టించే వారి పాత్రను కొనియాడారు. వారిని అనుమానాస్పదంగా చూడొద్దని చెప్పారు. సంపద సృష్టి జరిగితేనే, దానిని పంపిణీ చేయడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. సంపద సృష్టించడం అత్యవసరమని, సంపద సృష్టించేవారే భారత సంపద అని, వారిని గౌరవిస్తామని తన ప్రసంగంలో ప్రధాని ఉద్ఘాటించారు.
న్యూస్‌ప్రింట్‌పై సుంకం తగ్గించం
న్యూస్‌ప్రింట్‌పై విధించిన 10 శాతం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. చౌక దిగుమతుల కారణంగా దేశీయ న్యూస్‌ప్రింట్ కంపెనీలు దెబ్బతింటున్నాయని, దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వడం కోసమే బడ్జెట్‌లో ఈ సుంకాన్ని విధించామని వివరించారు. ఇప్పటిదాకా న్యూస్‌ప్రింట్‌పై ఎలాంటి దిగుమతి సుంకాలు లేవని, ఈ 10 శాతం కస్టమ్స్ సుంకాల వల్ల లాభపదాయకత దెబ్బతింటుందని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ పేర్కొంది. కాగా భారత్‌లో న్యూస్‌ప్రింట్ వార్షిక వినియోగం 2.5 మిలియన్ టన్నులుగా ఉంది. దేశీయ పరిశ్రమ
1 మిలియన్ టన్నుల న్యూస్‌ప్రింట్‌ను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది.
కొత్త పన్నుల చట్టంపై కేంద్రానికి నివేదిక
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టదల్చుకున్న ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ)పై నివేదికను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సోమవారం కేంద్రానికి సమర్పించింది. ‘టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ అఖిలేష్ రంజన్ సోమవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు‘ అని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్‌లో ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. అయితే, నివేదిక వివరాలేవీ వెల్లడి కాలేదు. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం రూపొందిన ఆదాయపు పన్ను చట్టానికి కాలం చెల్లిందని, దాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని 2017 సెప్టెంబర్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దీంతో దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రత్యక్ష పన్నుల స్మృతిని రూపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. మిగతా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు కూడా అధ్యయనం చేసి అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలతో దీన్ని తయారు చేయాలని ప్రభుత్వం సూచించింది.
ఇది వాస్తవానికి ఆరు నెలల వ్యవధిలో 2018 మే 22 నాటికి నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. ఆగస్టు 22 దాకా కేంద్రం గడువు పొడిగించింది. కన్వీనర్ అరబింద్ మోదీ 2018 సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికల్లా నివేదికను సమర్పించే బాధ్యతను అఖిలేష్ రంజన్ సారథ్యంలోని కమిటీకి అప్పగించింది. కమిటీలో కొత్త సభ్యులు మరింత సమయం కోరడంతో దీన్ని ఆ తర్వాత మే 31కి, అటు పైన ఆగస్టు 16 నాటికి పొడిగించింది. గిరీష్ అహూజా (సీఏ), రాజీవ్ మెమానీ (ఈవై రీజనల్ మేనేజింగ్ పార్ట్‌నర్, చైర్మన్) తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment