మార్కెట్లకు ‘కార్పొరేట్‌’ బూస్టర్‌! | Market celebrates corporate tax cut with biggest rally in 10 years | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు ‘కార్పొరేట్‌’ బూస్టర్‌!

Published Sat, Sep 21 2019 4:33 AM | Last Updated on Sat, Sep 21 2019 4:49 AM

Market celebrates corporate tax cut with biggest rally in 10 years - Sakshi

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకమైనది. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలను ఇతోధికం చేయడంతోపాటు దేశ సంపదను పెంచి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వీలు పడుతుంది.  ఇది భారత్‌లో తయారీకి ప్రేరణనిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మన ప్రైవేటు రంగం పోటీతత్వం పెరుగుతుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి’’.
–ప్రధాని మోదీ

సాధారణంగా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతాయి. ఈ సారి మాత్రం స్టాక్‌ మార్కెట్‌లో  ‘సీతమ్మ’ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఇప్పటివరకూ స్టాక్‌ మార్కెట్‌పై పట్టు బిగించిన బేర్‌లకు నిర్మలా సీతారామన్‌ చుక్కలు చూపించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె సంధించిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు అస్త్రానికి బేర్‌లు బేర్‌మన్నారు. సెన్సెక్స్‌ 1,921 పాయింట్లు, నిఫ్టీ 556 పాయింట్లు పెరిగాయి. పదేళ్లలో ఈ రెండు సూచీలు ఈ రేంజ్‌లో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 2,285 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ చివరకు 1,921 పాయింట్ల  లాభంతో 38,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 569 పాయింట్ల లాభంతో 11,274 పాయింట్లకు ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ చెరో 5.32 శాతం వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్లు ఎగసింది.

దీపావళి బొనంజా....
కంపెనీలపై కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్‌ను నిర్మలా సీతారామన్‌ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి మొదలయ్యే కొత్త తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గతంలో ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌పై ట్యాక్స్‌ను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.  అలాగే షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే మూలధన లాభాలకు సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ వర్తించదని వివరించారు. ఈ నిర్ణయాలన్నీ స్టాక్‌ మార్కెట్‌కు దీపావళి బహుమతి అని నిపుణులంటున్నారు. ఒక్క స్టాక్‌ మార్కెట్‌కే కాకుండా వినియోగదారులకు, కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు కూడా ఈ నిర్ణయాలు నజరానాలేనని వారంటున్నారు.   తాజా ఉపశమన చర్యల కారణంగా కేంద్ర ఖజానాకు రూ.1.45 లక్షల కోట్లు చిల్లు పడుతుందని అంచనా.  

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,285 పాయింట్లు అప్‌
మందగమన భయాలతో అంతకంతకూ పడిపోతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లో జోష్‌ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గతంలో పలు తాయిలాలు ప్రకటించారు. విదేశీ ఇన్వెస్టర్లపై సూపర్‌ రిచ్‌ సెస్‌ తగ్గింపు, బలహీన బ్యాంక్‌ల విలీనం, రియల్టీ రంగం కోసం రూ.20,000 కోట్లతో నిధి.. వాటిల్లో కొన్ని. అయితే ఇవేవీ స్టాక్‌ మార్కెట్‌ పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. శుక్రవారం  ఉదయం 10.45 నిమిషాలకు  ఎవరూ ఊహించని విధంగా కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఎవరి అంచనాలకు అందకుండా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఇన్నేసి పాయింట్లు లాభపడటం చరిత్రలో ఇదే మొదటిసారి. చివరకు సెన్సెక్స్‌ 1,921 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 569 లాభాలతో ముగిశాయి.  నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 11 శాతం ఎగసింది. అన్ని సూచీల కంటే అధికంగా లాభపడిన సూచీ ఇదే. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా వాహన కంపెనీలకు అత్యధికంగా పన్ను భారం తగ్గుతుండటమే దీనికి కారణం. ఈ సూచీలోని 15 షేర్లూ లాభపడ్డాయి. వీటిల్లో ఆరు షేర్లు పదిశాతానికి పైగా పెరగడం విశేషం.  

నిఫ్టీ కంపెనీల నికర లాభం
12 శాతం పెరుగుతుంది
దాదాపు 20 నిఫ్టీ కంపెనీలు 30 శాతానికి పైగా కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్‌ను చెల్లిస్తున్నాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇది ఆ యా కంపెనీల నికర లాభాల్లో దాదాపు 40 శాతంగా ఉంటోందని తెలిపింది. 30 శాతం మేర పన్ను చెల్లించే కంపెనీల నికర లాభం 12 శాతం మేర పెరగే అవకాశాలున్నాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది.  

ఒక్క రోజులో రూ.7 లక్షల కోట్లు
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్‌ విలువ రూ.6.82  లక్షల కోట్లు పెరిగి రూ.1,45,37,378 కోట్లకు ఎగసింది.

ఉదయం 9
సెన్సెక్స్‌ ఆరంభం  36,215

ఉదయం 10.40
ఆర్థిక మంత్రి కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోత 36,226

ఉదయం 11.31
 37,701

మధ్యాహ్నం 2 గంటలు
38,378

 3.30
ముగింపు  38,015

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement