reduction interest rates
-
మార్కెట్లకు ‘కార్పొరేట్’ బూస్టర్!
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకమైనది. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలను ఇతోధికం చేయడంతోపాటు దేశ సంపదను పెంచి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వీలు పడుతుంది. ఇది భారత్‌లో తయారీకి ప్రేరణనిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మన ప్రైవేటు రంగం పోటీతత్వం పెరుగుతుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి’’. –ప్రధాని మోదీ సాధారణంగా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతాయి. ఈ సారి మాత్రం స్టాక్ మార్కెట్లో ‘సీతమ్మ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్‌పై పట్టు బిగించిన బేర్లకు నిర్మలా సీతారామన్ చుక్కలు చూపించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె సంధించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు అస్త్రానికి బేర్లు బేర్మన్నారు. సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 556 పాయింట్లు పెరిగాయి. పదేళ్లలో ఈ రెండు సూచీలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 2,285 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 1,921 పాయింట్ల లాభంతో 38,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 569 పాయింట్ల లాభంతో 11,274 పాయింట్లకు ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ చెరో 5.32 శాతం వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్లు ఎగసింది. దీపావళి బొనంజా.... కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను నిర్మలా సీతారామన్ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే కొత్త తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గతంలో ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌పై ట్యాక్స్‌ను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే మూలధన లాభాలకు సూపర్ రిచ్ ట్యాక్స్ వర్తించదని వివరించారు. ఈ నిర్ణయాలన్నీ స్టాక్ మార్కెట్‌కు దీపావళి బహుమతి అని నిపుణులంటున్నారు. ఒక్క స్టాక్ మార్కెట్‌కే కాకుండా వినియోగదారులకు, కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు కూడా ఈ నిర్ణయాలు నజరానాలేనని వారంటున్నారు. తాజా ఉపశమన చర్యల కారణంగా కేంద్ర ఖజానాకు రూ.1.45 లక్షల కోట్లు చిల్లు పడుతుందని అంచనా. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు అప్ మందగమన భయాలతో అంతకంతకూ పడిపోతున్న దేశీ స్టాక్ మార్కెట్లో జోష్ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో పలు తాయిలాలు ప్రకటించారు. విదేశీ ఇన్వెస్టర్లపై సూపర్ రిచ్ సెస్ తగ్గింపు, బలహీన బ్యాంక్‌ల విలీనం, రియల్టీ రంగం కోసం రూ.20,000 కోట్లతో నిధి.. వాటిల్లో కొన్ని. అయితే ఇవేవీ స్టాక్ మార్కెట్ పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. శుక్రవారం ఉదయం 10.45 నిమిషాలకు ఎవరూ ఊహించని విధంగా కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎవరి అంచనాలకు అందకుండా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఇన్నేసి పాయింట్లు లాభపడటం చరిత్రలో ఇదే మొదటిసారి. చివరకు సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 569 లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 11 శాతం ఎగసింది. అన్ని సూచీల కంటే అధికంగా లాభపడిన సూచీ ఇదే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా వాహన కంపెనీలకు అత్యధికంగా పన్ను భారం తగ్గుతుండటమే దీనికి కారణం. ఈ సూచీలోని 15 షేర్లూ లాభపడ్డాయి. వీటిల్లో ఆరు షేర్లు పదిశాతానికి పైగా పెరగడం విశేషం. నిఫ్టీ కంపెనీల నికర లాభం 12 శాతం పెరుగుతుంది దాదాపు 20 నిఫ్టీ కంపెనీలు 30 శాతానికి పైగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను చెల్లిస్తున్నాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది ఆ యా కంపెనీల నికర లాభాల్లో దాదాపు 40 శాతంగా ఉంటోందని తెలిపింది. 30 శాతం మేర పన్ను చెల్లించే కంపెనీల నికర లాభం 12 శాతం మేర పెరగే అవకాశాలున్నాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఒక్క రోజులో రూ.7 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ విలువ రూ.6.82 లక్షల కోట్లు పెరిగి రూ.1,45,37,378 కోట్లకు ఎగసింది. ఉదయం 9 సెన్సెక్స్ ఆరంభం 36,215 ఉదయం 10.40 ఆర్థిక మంత్రి కార్పొరేట్ ట్యాక్స్ కోత 36,226 ఉదయం 11.31 37,701 మధ్యాహ్నం 2 గంటలు 38,378 3.30 ముగింపు 38,015 -
రుణాలు ఇక పండగే!
ముంబై: పండుగలు మొదలవుతున్న తరుణంలో రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తీపికబురు తెచ్చింది. కీలక పాలసీ రేట్లను అంచనాలకు మించి తగ్గించడంతో... ఇక అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు దిగిరానున్నాయి. నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం కూడా తగ్గనుంది. కాగా, దిగజారుతున్న దేశ ఆర్థిక వృద్ధి, పడిపోతున్న డిమాండ్ ఆర్బీఐనీ ఆందోళనకు గురిచేస్తోంది! బుధవారం వెల్లడైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష నిర్ణయాల్లో ఇదే తేటతెల్లమైంది. వృద్ధి క్షీణతకు చెక్ పెట్టేందుకు, వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు తన వంతుగా రేట్ల కోతతో ముందుకు వచ్చింది. 25 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేయగా, ఈ విషయంలో ఆర్బీఐ విశాలంగానే స్పందించి 35 బేసిస్ పాయింట్లను తగ్గించి ఆశ్చర్యపరిచింది. బ్యాంకులకు సమకూర్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా పేర్కొంటారు. ‘‘25 బేసిస్ పాయింట్ల తగ్గింపు సరిపోదు. 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఎక్కువ అవుతుంది. 35 బేసిస్ పాయింట్లు అన్నది సమతుల్యంగా ఉంటుందని ఎంపీసీ భావించింది’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. సాధారణంగా ఆర్బీఐ పావు శాతం లేదా అరశాతం (25 బేసిస్ పాయింట్ల మల్టిపుల్‌లో) మేర రేట్లలో చేసే మార్పులకు, 35 బేసిస్ పాయింట్ల తగ్గింపు అన్నది వినూత్నమే. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ 1.1% రెపో రేటును తగ్గించడం విశేషం. తాజా నిర్ణయం తర్వాత రెపో రేటు 5.4%కి, రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్బీఐ సమీకరించే నిధులపై ఇచ్చే రేటు) 5.15%కి దిగొచ్చాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను గతంలో ఉన్న 7% నుంచి 6.9 శాతానికి తగ్గించింది. సర్దుబాటు ధోరణిని కొనసాగించింది. అంటే పాలసీ విషయంలో ఉదారంగా వ్యవహరించే వెసులుబాటు ఈ విధానంలో ఉంటుందని ఆశించొచ్చు. అవసరమైతే భవిష్యత్తులోనూ రేట్ల కోత చేపట్టవచ్చని ఇది సూచిస్తుంది. బలహీనంగా ఆర్థిక రంగం ‘‘దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వృద్ధి తగ్గే రిస్క్‌ను పెంచుతున్నాయి. వృద్ధిపై ఆందోళనలకు పరిష్కారంగా డిమాండ్‌ను పెంచేందుకు, ప్రైవేటు పెట్టుబడులను పెంచడం అన్నది ఈ దశలో అత్యంత ముఖ్యమైనది’’ అని రేట్ల కోత అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఎంపీసీ స్పష్టం చేసింది. -
అక్రమ లాభార్జనపై 10% జరిమానా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలపై, ఎలక్ట్రిక్ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్మెంట్ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి అధ్యక్షత వహరించిన జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే తెలిపారు. ► అక్రమ లాభ నిరోధక విభాగం పదవీ కాలాన్ని 2021 నవంబర్ వరకు రెండేళ్లపాటు పొడిగింపు. ► జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా అక్రమంగా లాభాలు పోగేసుకుంటే ఆ మొత్తంలో 10% జరిమానా విధింపునకు నిర్ణయం. ప్రస్తుతం ఈ జరిమానా నిబంధనల మేరకు గరిష్టంగా రూ.25,000గానే ఉంది. ► ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను ప్రస్తుతం 12 శాతం ఉండగా, దీన్ని 5 శాతానికి, ఎలక్ట్రిక్ చార్జర్లపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గించాలన్న ప్రతిపాదనలను ఫిట్మెంట్ కమిటీకి నివేదింపు. ► ఆధార్‌తో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు అనుమతి. ► 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలుకు ఈ ఏడాది ఆగస్టు వరకు గడువు పొడిగింపు. ► వరుసగా రెండు నెలల పాటు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారిని ఈవే బిల్లులు జారీ చేయకుండా నిషేధం విధింపు సైతం ఆగస్టు వరకు వాయిదా. ► 2020 జనవరి 1 నుంచి ప్రయోగాత్మక విధానంలో ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ విధానం ప్రారంభం. అప్పటి నుంచి జీఎస్టీ నమోదిత మల్టీప్లెక్స్‌లు ఈ టికెట్లనే జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే, రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థలు ఎలక్ట్రానిక్ రూపంలోనే ఇన్వాయిస్లను జారీ చేయాలి. ► నూతన జీఎస్టీ రిటర్నుల దాఖలు వ్యవస్థ కూడా 2020 జనవరి 1 నుంచి అమల్లోకి. తేలని లాటరీల అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీలపై 12 శాతం జీఎస్టీ, రాష్ట్రాల గుర్తింపుతో నడిచే లాటరీలపై 28 శాతం పన్ను అమల్లో ఉంది. ఒకటే దేశం ఒకటే పన్ను అన్నది జీఎస్టీ విధానం కావడంతో ఒకటే పన్నును తీసుకురావాలన్నది కేంద్రం ప్రతిపాదన. అయితే, ఇందుకు ఎనిమిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని కౌన్సిల్ తాజాగా నిర్ణయించింది. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ‘‘దేశవ్యాప్తంగా ఒకటే రేటు ఉండాలన్నది జీఎస్టీ ప్రాథమిక సూత్రం. లాటరీల విషయంలో ప్రస్తుతం రెండు రేట్లు అమల్లో ఉన్నాయి. దీంతో ఆర్టికల్ 340పై స్పష్టత తీసుకోవాలని నిర్ణయించినట్టు’’ చెప్పారు. రేట్లను తదుపరి తగ్గించాలన్న అంశం చర్చకు వచ్చిందా? అన్న ప్రశ్నకు.. మరింత సులభంగా మార్చడమే తమ ఉద్దేశమన్నారు. జీఎస్టీ నిబంధనలు మరింత సులభంగా మార్చడం, జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ, జీఎస్టీ పరిధిలోకి మరి న్ని వస్తు, సేవలను తీసుకురావడమన్నది ఆర్థిక మంత్రి అభిప్రాయంగా ఆర్థిక శాఖ తెలిపింది. -
పండుగల సీజన్‌పై బ్యాంకుల దృష్టి..
• గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు • ఐసీఐసీఐ బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం న్యూఢిల్లీ: పండుగల సీజన్లో వ్యాపారం పెంపుపై ప్రభుత్వ-ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్ దృష్టి సారించారుు. వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో రేటు తగ్గింపుసహా పలు ఆఫర్లను ప్రకటించారుు. ఎస్బీఐ ఇలా... రూ.75 లక్షల వరకూ గృహ రుణాలపై వడ్డీరేటును 0.15 శాతం తగ్గించింది. ఎస్బీఐ గృహ రుణం 9.15 శాతానికి లభిస్తుండగా, మహిళల విషయంలో ఈ రేటు 9.10 శాతంగా ఉంది. బ్యాంక్ రేటు అతితక్కువ అరుునందువల్ల కొత్త గృహ రుణ గ్రహీతలకు అలాగే తమ గృహ రుణాలను ఎస్బీఐకి మార్చుకుని రుణ రేటు ద్వారా ప్రయోజనం పొందాలనుకునేవారికి ఇది సానుకూలమని పేర్కొంది. గృహ రుణ రేటు తగ్గింపు వల్ల రూ.50 లక్షల రుణంపై నెలవారీగా కొనుగోలుదారుడు రూ.542 పొదుపుచేసుకోగలుగుతాడు. 30 ఏళ్ల రుణ కాలంలో దాదాపు రూ. 2 లక్షల వరకూ ప్రయోజనం ఉంటుంది. ఇదే ఈఎంఐ మొత్తాన్ని రుణ కాలానికి నెలవారీగా రికరింగ్ డిపాజిట్లో పొదుపుచేస్తే... రూ.6 లక్షల ఆదాయం లభిస్తుందనని ఎస్బీఐ వివరించింది. ఐసీఐసీఐ బ్యాంక్... గృహాలకు సంబంధించి అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఆస్తి తనఖాపై ఓవర్‌డ్రాఫ్ట్‌గా రూ. 5 లక్షల నుంచి రూ. కోటి వరకూ రుణాన్ని ఆఫర్ చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ ఓవర్‌డ్రాఫ్ట్’గా వ్యవహరిస్తున్న ఈ ప్రొడక్ట్ అటు టర్మ్ లోన్‌గా ఇటు ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యంగా ఉపయోగపడుతుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలపింది. తక్షణ అవసరాలకు ఈ నిధులు కస్టమరకు ఉపయోగపడతాయని తెలిపింది. విద్య, వైద్యం, గృహ పునర్ నిర్మాణం , వివాహం, విదేశీయానాలకు సైతం ఓవర్‌డ్రాఫ్ట్ రుణ సౌలభ్యం దోహదపడుతుందని వివరించింది. టర్మ్‌లోన్ విషయంలో నెలవారీ ఇన్స్టాల్మెంట్ ఆధారంగా వడ్డీరేటు ఉంటుందని తెలిపింది. ఓవర్‌డ్రాఫ్ట్ విషయంలో వినియోగించిన నిధులు, ఆయా కాలాలకు అనుగుణంగా వడ్డీరేటు ఉంటుందని వివరిచింది. -
పొదుపు పథకాలపై రేటు కోత మంచిదే: నొమురా
న్యూఢిల్లీ: చిన్న పొదుపులపై వడ్డీరేట్ల తగ్గింపు అటు ప్రభుత్వానికి, ఇటు బ్యాంకులకు తగిన ప్రయోజనాన్నే కల్పిస్తాయని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనా వేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం కోరుకుంటున్నట్లు... బ్యాంకులు తమ కు అందిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది. ఈ ప్రయోజనం ఏప్రిల్-జూన్ మధ్య ప్రధానంగా వ్యవస్థలో కనిపిస్తుందని అంచనా వేసింది. కాగా చిన్న పొదుపు మొత్తాలపై రేటును తగ్గించడంవల్ల... వీటిలోకి వచ్చే డబ్బు తగ్గే అవకాశం ఉందని నొమురా విశ్లేషించింది. దీనితో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక అవసరాలకు మార్కెట్ రుణాలపై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని పేర్కొంది. చిన్న పొదుపులపై రేటు కన్నా తక్కువగా ఇక్కడ (మార్కెట్ రుణాలు) తక్కువ వడ్డీ రేటు ఉన్నందువల్ల... ప్రభుత్వాలపై వడ్డీభారం తగ్గే వీలుందని విశ్లేషించింది. కాగా దిగువస్థాయి వడ్డీరేట్ల వల్ల దీర్ఘకాలంలో కస్టమర్లు, కార్పొరేట్లు కూడా ప్రయోజనం పొందుతారని... వెరసి ఈ ప్రక్రియ మొత్తం చక్కటి వృద్ధికి దారితీస్తుందని నొమురా అంచనావేసింది.