పొదుపు పథకాలపై రేటు కోత మంచిదే: నొమురా
న్యూఢిల్లీ: చిన్న పొదుపులపై వడ్డీరేట్ల తగ్గింపు అటు ప్రభుత్వానికి, ఇటు బ్యాంకులకు తగిన ప్రయోజనాన్నే కల్పిస్తాయని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనా వేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం కోరుకుంటున్నట్లు... బ్యాంకులు తమ కు అందిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది. ఈ ప్రయోజనం ఏప్రిల్-జూన్ మధ్య ప్రధానంగా వ్యవస్థలో కనిపిస్తుందని అంచనా వేసింది. కాగా చిన్న పొదుపు మొత్తాలపై రేటును తగ్గించడంవల్ల... వీటిలోకి వచ్చే డబ్బు తగ్గే అవకాశం ఉందని నొమురా విశ్లేషించింది.
దీనితో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక అవసరాలకు మార్కెట్ రుణాలపై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని పేర్కొంది. చిన్న పొదుపులపై రేటు కన్నా తక్కువగా ఇక్కడ (మార్కెట్ రుణాలు) తక్కువ వడ్డీ రేటు ఉన్నందువల్ల... ప్రభుత్వాలపై వడ్డీభారం తగ్గే వీలుందని విశ్లేషించింది. కాగా దిగువస్థాయి వడ్డీరేట్ల వల్ల దీర్ఘకాలంలో కస్టమర్లు, కార్పొరేట్లు కూడా ప్రయోజనం పొందుతారని... వెరసి ఈ ప్రక్రియ మొత్తం చక్కటి వృద్ధికి దారితీస్తుందని నొమురా అంచనావేసింది.