న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వీటిపై వడ్డీ రేట్లను ఒక శాతం వరకు పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి – మార్చి కాలానికి కొత్త రేట్లు అమలు కానున్నాయి. ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 2.25 శాతం మేర కీకలమైన రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సవరించినట్టు తెలుస్తోంది.
వివిధ పథకాలపై పెంపు 0.20–1.1 శాతం మధ్య ఉంది. తాజా పెంపు తర్వాత కొన్ని పెట్టుబడి పథకాలు ఆకర్షణీయంగా మారాయి. ప్రధానంగా జీవిత లక్ష్యాలకు ఉపకరించే, దీర్ఘకాలంతో కూడిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై రేట్లు పెరగలేదు. అలాగే, సేవింగ్స్ డిపాజిట్, ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేట్లలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు.
నాలుగేళ్ల విరామం తర్వాత ఈ పథకాల రేట్లను కేంద్ర సర్కారు 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సవరించడం గమనార్హం. అప్పుడు 0.10–0.30 శాతం మేర మూడు పథకాల రేట్లను పెంచింది. తాజా సవరణ తర్వాత బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లకు, ఈ పథకాల రేట్లకు పెద్దగా వ్యత్యాసం లేదు.
Comments
Please login to add a commentAdd a comment