న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ తొలగింపులంటూ వస్తున్న ఆరోపణలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ డేటా బేస్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని, తమ నుంచి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపింది. అంతే తప్పా.. ఆధార్ కార్డులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
ప్రజాప్రయోజనాల కోసం ఆధార్ కార్డ్ అత్యవసరం. కాబట్టే, ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తూ, కార్డు దారులు మార్పులు చేసుకుంటుంటే సంబంధిత డాక్యుమెంట్లు, ఇతర సమాచారం డేటాబేస్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ ఆధార్ కార్డ్ దారులు సమస్యలు తలెత్తితే యూఐడీఏఐకి ఫిర్యాదు చేయాలని కోరింది. రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఉండేలా యూఐడీఏఐ ద్వారా కేంద్రం ఆధార్ కార్డ్ లను డీయాక్టీవేట్ చేస్తుందన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో యూఐడీఏఐ పై విధంగా స్పందించింది.
కుట్రపూరితంగా కేంద్రం
కేంద్రం కుట్రపూరితంగా తమ రాష్ట్ర ప్రజల ఆధార్ కార్డ్ లను నిరుపయోగం చేస్తుందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూఐడీఏఐపై పలు ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రజలు వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందకుండా నిరోధించేలా వారి ఆధార్ కార్డ్ లను డీయాక్టీవ్ చేసిందని అన్నారు. బీర్ భూమ్ జిల్లాలో జరిగిన ప్రజా పంపిణీ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఆధార్ కార్డు లేని లబ్ధిదారులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్వహించే సంఓేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.
ఆందోళన వద్దు..మీకు నేనున్నా
బెంగాల్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కోసం నేను ఉన్నాను. జాగ్రత్తగా ఉండండి. వారు (కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) ఆధార్ కార్డ్ లను డీయాక్టీవేట్ చేస్తున్నారు. బెంగాల్ లోని అనేక జిల్లాల్లో అనేక ఆధార్ కార్డ్ లు డీయాక్టీవేట్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలు ఉచిత రేషన్, బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్ పథకం ప్రయోజనాలను పొందకూడదనేదే కేంద్రం ఉద్దేశమని, దీనిని తెలుసుకోవాలని ప్రజలను కోరారు. తన ప్రభుత్వం ఆధార్ కార్డు లేనివారికి సైతం పథకాలను అందించడం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు.
పుర్బా బర్ధమాన్ జిల్లా పరిధిలోని జమాల్‌పూర్‌లో 50 మంది, బీర్‌భూం, నార్త్, సౌత్ 24 పరగణాలు జిల్లాతో పాటు ఉత్తర బెంగాల్‌లో అనేక మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు డీలింక్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment