
ముంబై: డిపాజిట్లపై బీమా పరిమితిని రూ.5 లక్షలకు మించి పెంచితే అది బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం చూపిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. దీనివల్ల సుమారు రూ.12,000 కోట్ల మేర లాభం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఒక బ్యాంక్ పరిధిలో ఒక కస్టమర్ పేరిట రూ.5లక్షల బీమా సదుపాయాన్ని డీఐసీజీసీ అందిస్తోంది. ఇందుకు గాను బ్యాంక్‌లు డిపాజిట్ల మొత్తంపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లిస్తుంటాయి.
రూ.5 లక్షలకు మించి పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే, నోటిఫై చేస్తామని చెప్పారు. ‘‘ఇటీవల ఓ కోపరేటివ్ బ్యాంక్ (న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్) వైఫల్యం నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితి పెంపు చర్చకు వచ్చింది. ఇది బ్యాంక్‌లపై స్వల్ప స్థాయిలోనే అయినా, చెప్పుకోతగ్గ మేర లాభదాయకతపై ప్రభావం చూపించనుంది’’అని ఇక్రా ఫైనాన్షియల్ రంగం రేటింగ్స్ హెడ్ సచిన్ సచ్‌దేవ పేర్కొన్నారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ వైలఫ్యంతో చివరిగా 2020 ఫిబ్రవరిలో డిపాజిట్‌పై బీమాను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచినట్టు గుర్తు చేశారు.
97.8 శాతం డిపాజిట్లకు రక్షణ
2024 మార్చి నాటికి 97.8 శాతం బ్యాంక్ ఖాతాలు బీమా రక్షణ పరిధిలో ఉన్నట్టు ఇక్రా తెలిపింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్ల మొత్తం రూ.5లక్షల్లోపే ఉన్నట్టు పేర్కొంది. ఇన్సూర్డ్ డిపాజిట్ రేషియో (ఐడీఆర్) 43.1 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఐడీఆర్‌ను 47 శాతం నుంచి 66.5 శాతానికి తీసుకెళితే, అప్పుడు బ్యాంకుల నికర లాభం రూ.1,800 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల మేర ప్రభావితమవుతుందని వివరించింది. దీంతో బ్యాంకుల రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌వోఏ) 0.01–0.04 శాతం మేర, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) 0.07–0.4 శాతం మేర ప్రభావితం కావొచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment