ఐటీ ఉద్యోగాలు.. ఇంకొన్నాళ్లు ఇంతే! | Indian IT sector hiring to remain low till growth momentum picks up by H2 FY26 ICRA | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగాలు.. ఇంకొన్నాళ్లు ఇంతే!

Published Tue, Dec 17 2024 12:56 PM | Last Updated on Tue, Dec 17 2024 3:07 PM

Indian IT sector hiring to remain low till growth momentum picks up by H2 FY26 ICRA

భారతీయ ఐటీ సేవల పరిశ్రమలో 2025–26 రెండవ అర్ధ భాగం నాటికి వృద్ధి ఊపందుకునేంత వరకు నియామకాలు సమీప కాలంలో తక్కువ స్థాయిలోనే ఉంటాయని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఇక్రా నివేదిక ప్రకారం.. యుఎస్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల తక్షణ కాలంలో కొంత విధానపర అనిశ్చితి ఏర్పడవచ్చు.

అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణం మధ్య యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో కస్టమర్లు సాంకేతికతపై తక్కువ వ్యయం చేయడంతో 6–8 త్రైమాసికాల్లో భారతీయ ఐటీ సేవల కంపెనీలకు డిమాండ్‌ తగ్గింది. తక్కువ అట్రిషన్, ఉద్యోగుల వినియోగాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం వంటి అంశాలు కూడా నియామకాల్లో మందగమనానికి కారణం అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కొంత రికవరీ ఉన్నప్పటికీ.. 2025–26 అక్టోబర్‌–మార్చి నాటికి వృద్ధి ఊపందుకుంటున్నంత వరకు సమీప కాలంలో నియామకాలు తక్కువగానే ఉంటాయి.  

నైపుణ్యాన్ని పెంచుతున్నాయి.. 
2021–22, 2022–23 కాలంలో జోడించిన ఉద్యోగుల వినియోగం పెరుగుదల 2023–24, 2024–25 క్యూ1లో ఐటీ సేవల కంపెనీల నియామకాలపై ఒత్తిడి తెచ్చింది. అట్రిషన్‌ స్థాయిల పెరుగుదలతో పాటు, ఇక్రా ఎంచుకున్న కంపెనీలకు 2024–25 క్యూ1 వరకు ఏడు త్రైమాసికాల్లో నికర ఉద్యోగుల చేరిక ప్రతికూలతకు దారితీసింది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్‌ మహీంద్రా, విప్రో లిమిటెడ్‌ ఉన్నాయి.

జనరేటివ్‌ (జెన్‌) ఏఐ వేగంగా ప్రవేశిస్తున్నందున ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత వ్యాపార అవకాశాలను అన్వేషించడం ద్వారా అన్ని ప్రముఖ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు నైపుణ్యాన్ని పెంచుతున్నాయి. కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే ఇది తాజా నియామకంలో మొత్తం నియంత్రణకు దారితీసే అవకాశం ఉందని అంచనా. ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం జనరేటివ్‌ ఏఐ విస్తృత స్వీకరణ ప్రభావం రాబోయే కొన్ని సంవత్సరాలలో కనిపిస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది.  

డిమాండ్‌ నియంత్రణతో.. 
నివేదిక రూపకల్పనకు ఇక్రా ఎంచుకున్న కంపెనీల్లో ఒక్కో ఉద్యోగికి సగటు ఆదాయం 2019–20 నుంచి 2023–24లో దాదాపు 50,000 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. 12 నెలల అట్రిషన్‌ రేటు 2021–22 క్యూ4, 2022–23 క్యూ1 సమయంలో దాదాపు 23 శాతానికి చేరుకుంది. నియామకాలు పెద్ద ఎత్తున జరగడం, ఆ తరువాత డిమాండ్‌–సరఫరా అసమతుల్యత ఇందుకు కారణం.

యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో డిమాండ్‌ నియంత్రణ కారణంగా ఐటీ సేవల కంపెనీల ద్వారా తక్కువ నియామకాలతో అట్రిషన్‌ క్రమంగా క్షీణించింది. ఇక్రా నమూనా కంపెనీల అట్రిషన్‌ రేటు 2023–24 క్యూ3 నుండి దాదాపు 13 శాతం వద్ద స్థిరీకరించడం ప్రారంభించింది. కోవిడ్‌ ముందస్తు 2019–20 క్యూ1లో ఇది 18 శాతం నమోదైంది అని ఇక్రా వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement