Deposit Insurance Corporation
-
16 కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లకు మంచిరోజులు!
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న 16 కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లు.. ఒక్కొక్కరికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద గరిష్టంగా రూ.5 లక్షల వరకు దక్కనుంది. డీఐసీజీసీ 21 బ్యాంకులతో ఒక జాబితాను రూపొందించగా.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సహా ఐదు బ్యాంకులను ఈ పథకం కింద మినహాయించింది. డీఐసీజీసీ కింద బ్యాంకులు సంక్షోభం పాలైతే.. డిపాజిట్ దారునకు గరిష్టంగా రూ.5లక్షలు పరిహారం చెల్లించే బిల్లుకు పార్లమెంటు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆమోదం తెలుపగా.. సెప్టెంబర్ 1న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు..
Armored Truck Spills Cash On Highway: కాలిఫోర్నియా: స్థలం: అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారి. సమయం: శుక్రవారం ఉదయం 9.15 గంటలు. దృశ్యం: రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు, ఒకరితో ఒకరు పోటీ పడుతూ వాటిని జేబుల్లో నింపుకుంటున్న జనం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాన్‌డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో అకస్మాత్తుగా తెరుచుకుంది. కొన్ని సంచులు కిందపడి పోయాయి. వాటిలోని డబ్బులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. చాలావరకు ఒక డాలర్, 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. గమనించిన వాహనదారులు వాటిని జేబుల్లో వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువైపులా రోడ్డును దిగ్బంధించారు. వాహనదారులను అడ్డుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో కొందరు ఇచ్చేశారు. చాలామంది అక్కడి నుంచి జారుకున్నారు. డెమీ బాగ్బీ అనే బాడీ బిల్డర్ ఈ దృశ్యాలన్నీ ఫోన్లో చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఎన్ని డబ్బులు పోయాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బ్యాంకుపై ఆంక్షలు... డిపాజిట్లు భద్రమేనా..?
బ్యాంకుల్లో మన నగదు భద్రంగా ఉంటుందన్న భరోసాయే... వడ్డీ రాబడి తక్కువైనా కానీ ఇప్పటికీ చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి కారణం. కావాలనుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చు. లిక్విడిటీ విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు. ఈ వెసులుబాట్లే ఎఫ్‌డీల ఆదరణకు కారణమని చెప్పొచ్చు. కానీ, బ్యాంకు సంక్షోభంలో పడితే, మీ డిపాజిట్ పరిస్థితి ఏంటి..? మీ ఇష్టానికి అనుగుణంగా దానిని వెంటనే వెనక్కి తీసుకోలేరు.! బ్యాంకు పరిస్థితులు చక్కబడిన తర్వాతే తీసుకునేందుకు అనుమతిస్తామంటే..? తలచుకుంటేనే భయమేస్తోంది కదూ..! డిపాజిట్‌దారులకు ఉన్న రక్షణ కవచం ఏంటి? ఆర్బీఐకి ఉన్న అధికారాలు, పరిమితులు... ఇలాంటి వివరాలన్నీ మీ కోసం... తాజాగా ముంబైకి చెందిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు(పీఎంసీ)లో అవకతవకల గురించి వార్తల్లో చూసే ఉంటారు. మొండి బాకీలను ఈ బ్యాంకు తక్కువ చేసి చూపించింది. ఈ బ్యాంకు మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో రూ.8,800 కోట్లలో రూ.6,500 కోట్లను ఒక్క హెచ్‌డీఐఎల్ ఖాతాకు ఇవ్వడమే కాదు... దాన్ని ఆర్బీఐకి తెలియకుండా దాచిపెట్టింది. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు అమల్లో పెట్టింది. ఒక్కో ఖాతా నుంచి కేవలం రూ.1,000 మాత్రమే వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. రెండు రోజుల తర్వాత రూ.10,000కు పెం చింది. వారం రోజుల తర్వాత తాజాగా రూ.25,000కు పెంచింది. దీంతో డిపాజిట్ దారుల్లో ఆందోళన పెరిగిపోయింది. బ్యాంకు శాఖల వద్దకు చేరుకుని తమ డిపాజిట్లు వెనక్కిచ్చేయాలంటూ వారు డిమాండ్ చేయడం కూడా చూశాం. ఈ తరహా సందర్భాలు ఎదురైతే ఏంటన్న విషయమై ఖాతాదారులు, డిపాజిట్ దారు ల్లో అవగాహన తక్కువే. రోజువారీ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఈ తరహా పరిస్థితులు దిక్కుతోచనీయవు. కోఆపరేటివ్ బ్యాంకులతోపాటు వాణిజ్య బ్యాంకులపైనా ఆర్బీఐ ఈ విధమైన ఆంక్షలు విధించేందుకు అధికారాలు ఉంటాయి. ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) బీమా కవరేజీ పరిధిలో ఉంటాయి. ప్రాథమిక సహకార సొసైటీలు మాత్రం దీని పరిధిలోకి రావు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని కోఆపరేటివ్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా డీఐసీజీసీ కింద బీమా తీసుకోవాల్సి ఉంటుందని ‘మైమనీమంత్రా డాట్ ఇన్’ వ్యవస్థాపకుడు రాజ్‌ఖోస్లా తెలిపారు. ‘‘ప్రతీ డిపాజిట్ దారునికి గరిష్టంగా రూ. లక్ష బీమా ఉంటుంది. ఒకవేళ పీఎంసీ బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారునికి గరిష్టంగా రూ.లక్ష లభిస్తుంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు తమ డిపాజిట్లు పొందేందుకు మాత్రం చాలా సమయం తీసుకుంటుంది’’ అని ఖోస్లా వివరించారు. అసలు డిపాజిట్, దానిపై వడ్డీ సహా మొత్తం రూ.లక్ష పరిహారమే డీఐసీజీసీ ద్వారా లభిస్తుంది. పైగా ఒక్కో ఖాతాదారునికి సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో ఉన్నా కానీ దక్కే పరిహారం గరిష్టంగా రూ.లక్ష మాత్రమే. ఏ తరహా డిపాజిట్లకు రక్షణ? సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంటు, రికరింగ్ డిపాజిట్లు అన్నీ కూడా డీఐసీజీసీ పరిధిలో బీమా కవరేజీ కిందకు వస్తాయి. కాకపోతే విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, ఇంటర్‌బ్యాంక్ డిపాజిట్లు, విదేశాల నుంచి స్వీకరించిన డిపాజిట్లు డీఐసీజీసీ పరిధిలోకి రావు. ఒకే బ్యాంకుకు సంబంధించి ఒకటికి మించిన శాఖల్లో ఒకే వ్యక్తికి వేర్వేరు డిపాజిట్లు ఉంటే..? అప్పుడు కూడా గరిష్టంగా రూ.లక్ష వరకే డీఐసీజీసీ కింద దక్కుతుంది. అదే వివిధ బ్యాంకుల్లో ఒకే వ్యక్తికి డిపాజిట్లు ఉంటే మాత్రం అప్పుడు ప్రతీ బ్యాంకులోని డిపాజిట్లపై గరిష్టంగా రూ.లక్ష పొందొచ్చు. ఉదాహరణకు ఎస్బీఐలో, పీఎన్బీలో ఒక వ్యక్తికి డిపాజిట్లు ఉంటే, అప్పుడు రెండు బ్యాంకుల్లోనూ బీమా కవరేజీ కింద గరిష్టంగా ఒక్కో రూ.లక్ష చొప్పున లభిస్తుంది. ఉమ్మడి ఖాతాలు అయితే... ఒక్కరి పేరు మీద (సింగిల్) లేదా ఉమ్మడి ఖాతాల (జాయింట్) విషయంలో కవరేజీ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు రవికి తన పేరుతో ఒక సేవింగ్స్ ఖాతా ఉంది. అలాగే, భార్య పేరుతోనూ రవికి జాయింట్ ఖాతా ఉందనుకోండి. బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు డీఐసీజీసీ కింద రెండు ఖాతాలకూ బీమా కవరేజీ ఉంటుంది. సిప్‌లు, ఈసీఎస్‌ల పరిస్థితి..? బ్యాంకు సంక్షోభంలో పడి ఆర్బీఐ ఆంక్షలు అమల్లోకి వస్తే... అప్పటికే మీ ఖాతా నుంచి రిజిస్టర్ అయి ఉన్న ఈసీఎస్‌లు, సిప్‌లు ఆగిపోయినట్టే. వాటికి సంబంధించిన మొత్తాలను మీ ఖాతా నుంచి డెబిట్ కావని రాజ్‌ఖోస్లా తెలిపారు. కనుక మీరు మరో ఖాతా నుంచి సిప్, ఈఎంఐలకు సంబంధించి ఈసీఎస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తలే కాపాడతాయి... పీఎంసీ బ్యాంకు అనుభవం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే కోపరేటివ్ బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. అంటే రిస్క్ కొంచెం ఎక్కువే ఉంటుందని అర్థం చేసుకోవాలి. వీటిని ఆర్బీఐతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యవేక్షిస్తుంటాయి. ‘‘కోఆపరేటివ్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల విషయంలో నిబంధనల పరంగా ఆర్బీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తుంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చినప్పుడు ఆర్బీఐ కఠినంగానే వ్యవహరించింది. కనుక వ్యక్తులు ఒకే బ్యాంకులో ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ఆర్బీఐ ఆంక్షలతో నిధులు పొందలేని పరిస్థితి ఎదురవుతుంది’’అని ఖోస్లా సూచించారు. బ్యాంకు కస్టమర్లు తమ బ్యాంకుల ఆరోగ్య పరిస్థితులపై ఒక కన్నేసి ఉంచడం ఎంతో అవసరమని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లు అయితే ఇది ఇంకా అవసరం. బ్యాంకుకు సంబంధించి ఆస్తులపై రాబడులు (ఆర్వోఏ), నికర ఎన్పీఏల రేషియోను గమనించడం ద్వారా ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సామాన్యులు అయినా కానీ, వ్యాపారులు అయినా కానీ ఒకే ఖాతాపై ఆధారపడకుండా, వేర్వేరు బ్యాంకుల్లో కనీసం రెండు ఖాతాల పరిధిలో తమ డిపాజిట్లను వేరు చేసుకోవడం ద్వారా ఈ తరహా సంక్షోభ పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. -
గోల్డ్ స్కీమ్స్‌తో జాగ్రత్త!
బంగారు వర్తకులు ఆఫర్ చేసే బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...? ఏడాది పాటు పొదుపు చేయడం వల్ల ఒక నెల మొత్తం బోనస్‌గా లభించడం, ఎటువంటి తరుగు లేకుండా నగలు కొనుగోలుకు అవకాశం కల్పించే ఆఫర్లు ఆకర్షిస్తున్నాయా..? కానీ, జ్యుయలర్స్ ఆఫర్ చేసే సేవింగ్స్ పథకాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి లేని డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాస్తవానికి అనుమతి లేని అన్ని పథకాలకు ఇది వర్తిస్తుందని భావించారు. జ్యుయలరీ సంస్థల పథకాలకు కూడా బ్రేక్ పడుతుందనుకున్నప్పటికీ... అవి మాత్రం ఇంతకుముందు మాదిరే నిధులను సమీకరిస్తూనే ఉన్నాయి. కాకపోతే చట్టంలో ఉన్న చిన్న వెసులుబాటును అనుకూలంగా మలచుకుని జ్యూయలరీ సంస్థలు తమ పొదుపు పథకాలను కేవలం పదకొండు నెలల కాలానికే పరిమితం చేస్తున్నాయి. చట్టానికి అతీతంగా జ్యుయలరీ సంస్థలు వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీల చట్టం 2014... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించే ఇతర సంస్థలకు షరతులు విధించింది. 365 రోజులకు మించిన కాలానికి డిపాజిట్లు తీసుకునే రిజిస్టర్డ్ సంస్థలు అన్నీ కూడా కచ్చితంగా తిరిగి చెల్లించే సామర్థ్యంపై రేటింగ్ తీసుకోవడంతోపాటు, డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాలి. పైగా డిపాజిట్‌పై వడ్డీని ఎన్‌బీఎఫ్‌సీల కంటే ఎక్కువ ఆఫర్ చేయరాదు. కానీ, జ్యుయలరీ సంస్థలు మాత్రం గతంలో 12, 24, 36 నెలల పథకాలను నిర్వహించగా, చట్టంలోని నిబంధనలు కఠినతరం కావడంతో తమ పథకాల కాల వ్యవధిని 11 నెలలకు కుదించుకున్నాయి. సంస్థ బిచాణా ఎత్తేస్తే? ఆభరణాల సంస్థలు వినియోగదారులను మోసం చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. ఇందుకు నిదర్శనం తమిళనాడుకు చెందిన నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ వ్యవహారమే. తమిళనాడులో బంగారు ఆభరణాల మార్కెట్లో మంచి పేరున్న సంస్థ. 75 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లో ఉన్న సంస్థ. కానీ 2017 అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆభరణాల దుకాణాలను ఆర్థిక సమస్యల కారణంగా ఈ సంస్థ మూసేసింది. ఖాతాల్లో అవకతవకలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వెలుగు చూశాయి. నాదెళ్ల బంగారు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఉసూరుమనక తప్పలేదు. కంపెనీ 2018 మే నెలలో దివాలా పిటిషన్ వేసింది. ఈ తరహా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ సంఘటన ఓ హెచ్చరిక వంటిది. బంగారు ఆభరణాల సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేస్తే, ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోను, ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లిస్తారు. మిగిలి ఉంటే సెక్యూర్డ్ రుణదాతలకు చెల్లింపులు చేస్తారు. ఆ తర్వాత అన్సెక్యూర్డ్ రుణదాతల వంతు వస్తుంది. బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు అన్సెక్యూర్డ్ ఆపరేషనల్ క్రెడిటర్ల కిందకు వస్తారని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కనుక కస్టమర్ల వంతు ఆఖరు అవుతుంది. లొసుగులు.. అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్... డిపాజిట్‌కు నిర్వచనం ఇచ్చింది. అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం లేదా రుణం, తిరిగి నగదు లేదా సేవ రూపంలో ఇస్తానన్న హామీతో తీసుకునే మొత్తాన్ని డిపాజిట్‌గా పేర్కొంది. ఎవరు డిపాజిట్ తీసుకున్నారన్నది ఇక్కడ అంశం కాదు. వ్యక్తి లేదా యాజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థ, కోపరేటివ్ సొసైటీ లేదా ట్రస్ట్ అయినా కావచ్చు. కనుక జ్యుయలర్స్ నిర్వహించే పథకాలు ఈ చట్టం పరిధిలోకే వస్తాయంటున్నారు కొందరు. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. బంధువుల నుంచి రుణాల రూపంలో తీసుకోవడం, వ్యాపార సరుకుల సరఫరా కోసం అడ్వాన్స్ రూపంలో తీసుకోవడానికి డిపాజిట్ నిర్వచనం నుంచి మినహాయింపు ఉంది. భవిష్యత్తులో ఆభరణాల కొనుగోలు సాధనాలుగా తాము బంగారం పొదుపు పథకాలను విక్రయిస్తున్నట్టు జ్యుయలరీ వర్తకులు సమర్థించుకుంటున్నారు. కనుక దీన్ని ముందస్తు వాణిజ్యంగా చూడాలని పేర్కొంటున్నాయి. డిపాజిట్లు కాదు... ‘‘జ్యుయలర్ల పొదుపు పథకాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురాలేదు. జ్యుయలర్స్ సమీకరించే నిధులు కేవలం ముందస్తు వాణిజ్య రూపంలోనే. దీన్ని డిపాజిట్‌గా చూడరాదు. ఈ పథకాల కింద కస్టమర్లకు తగ్గింపులు, బహుమానాలు ఆఫర్ చేయవచ్చా, స్పష్టం చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశాం’’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు వేరు అయితే, బంగారం డిపాజిట్ పథకాలు అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయా అన్న దానిపై అస్పష్టత నెలకొందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందస్తు వాణిజ్యం పేరుతో తప్పించుకోవడం కుదరదని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఓ కస్టమర్ కొన్ని నెలల పాటు నగదు ఉంచి, చివర్లో ఏది కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా ఆ డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అన్ని నెలల పాటు అతడు చెల్లించినది డిపాజిట్‌కు భిన్నమేమీ కాదు. వస్తువులకు ముందస్తుగా చెల్లించడం అంటే... మా అభిప్రాయం ప్రకారం ఆ సరుకులు ఏంటన్నది ముందే గుర్తించాల్సి ఉంటుంది. ఏదన్నది గుర్తించకుండా ముందుగానే అడ్వాన్స్‌గా ఎవరూ చెల్లించరు. కనుక ఈ తరహా పథకాలను నిషేధించాలి’’ అని వినోద్ కొతారి అండ్ కంపెనీ సీనియర్ అసోసియేట్ సీఎస్ శిఖా బన్సాల్ అభిప్రాయపడ్డారు. ఎవరి నియంత్రణ? బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ లేదా కంపెనీల చట్టం కింద నమోదైన ఓ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డిపాజిట్ చేసి చేతులు కాల్చుకుంటే... సంబంధిత నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, కార్పొరేట్ శాఖ, సెబీ ఫిర్యాదుల పరిష్కార బాధ్యత చూస్తాయి. బంగారం పొదుపు పథకాల విషయానికొస్తే వీటిని నియంత్రించే సంస్థ లేదు. చాలా వరకు ఈ జ్యుయలరీ సంస్థలు కంపెనీలుగా రిజిస్టర్డ్ అయినవి కావు. కనుక కార్పొరేట్ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకోదు. ఈ తరహా అనియంత్రిత డిపాజిట్ పథకాలకు సంబంధించి సమస్య ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప పరిష్కారం లేదు. కనుక పరిష్కారానికి సమయం తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
భారత్-అమెరికా సమాచార మార్పిడి ఒప్పందం
బ్యాంకింగ్ రెగ్యులేటర్ల సంతకాలు... ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), అమెరికా బ్యాంకింగ్ రెగ్యులేటర్ల ప్రతినిధులు ఫైనాన్షియల్ రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సంబంధించిన ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆర్థిక సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో సహకారం మరింత పెంపొందించుకోవడం లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. భారత్ ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ప్రకారం ఈ ఒప్పందం జరిగింది. ఆర్బీఐ, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్, కంప్ట్రోలర్ ఆఫ్ కరెన్సీ ఆఫీస్, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మధ్య ఆర్థిక సమాచార మార్పడి సంబంధాలు ఈ ఒప్పందంతో మరింత బలపడనున్నాయి. ఈ తరహాలో (ఫైనాన్షియల్ సమాచార మార్పిడి) ఇప్పటి వరకూ ఆర్బీఐ వివిధ దేశాల ఫైనాన్షియల్ రెగ్యులేటర్లతో 22 ఒప్పందాలను చేసుకుంది. ఎన్బీఎఫ్సీ కేవైసీ నిబంధనలు సరళతరం కాగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించిన ‘నో-యువర్-కస్టమర్’ (కేవైసీ) నిబంధనలను ఆర్బీఐ సరళతరం చేసింది. హై రిస్క్ ఇండివిడ్యువల్స్, కంపెనీలకు సంబంధించి ఆయా కంపెనీలు కనీసం ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవైసీ నిబంధలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాల్సి ఉంటుంది. తక్కువ స్థాయి రిస్క్‌కు సంబంధించి ఈ కాలపరిమితి 10 ఏళ్లుగా ఉంది. మీడియం రిస్క్ విషయంలో ఈ కాలం ఎనిమిదేళ్లు. ఇప్పటివరకూ లో రిస్క్ విషయంలో ఈ కాలపరిమితి ఐదేళ్లుకాగా, హై, మీడియం రిస్క్ విషయంలో రెండేళ్లుగా ఉంది. కాగా ఆయా అప్డేషన్ సందర్భాల్లో కస్టమర్లు స్వయంగా హాజరుకావాల్సిన అవసరం లేదని కూడా ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మైనర్ కస్టమర్లు మేజర్ అయినప్పుడు కొత్త ఫొటోలు తీసుకోవాలని పేర్కొంది. లో రిస్క్ కస్టమర్ల విషయంలో ఆయా వ్యక్తులు గత చిరునామాలోనే నివసిస్తున్నట్లయితే, అందుకు తాజా ఆధారాలు అవసరం లేదని తెలిపింది. ప్రొడక్ట్‌పై కంపెనీ పేర్లకు ఆదేశం ఇదిలాఉండగా, వైట్ లేబుల్ ఏటీఎంలు, స్మార్ట్ కార్డులు, ఈ-వాలెట్ వంటి సేవలను అందించే కంపెనీలు తాము అందించే ఆయా ప్రొడక్టులపై తమ కంపెనీల పేరును ప్రముఖంగా కనబడే లా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. పారదర్శకత లక్ష్యంగా ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపింది.