కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానానికి మళ్లడం అన్నది దేశ పొదుపు రేటునకు ఎంత మాత్రం ప్రమాదకరం కాబోదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడి సాధనాల్లో గృహ పొదుపులు కేవలం రూ.4 లక్షల కోట్లుగానే ఉన్నాయని, మొత్తం పొదుపు నిధుల్లో (రూ.25 లక్షల కోట్లు) ఇవి 16 శాతమేనని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చడం తెలిసిందే.
కొత్త పన్ను విధానంలో రూ.7.5 లక్షల వరకు (రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ సహా) ఎలాంటి పన్ను లేదు. ఆ తర్వాత కూడా తక్కువ పన్ను రేటు ప్రతిపాదించారు. కాకపోతే ఎలాంటి పన్ను మిహాయింపులు, తగ్గింపులు ఉండవు. దీనిపై వ్యక్తమవుతున్న ఆందోళనను తొలగించే ప్రయత్నాన్ని మల్హోత్రా చేశారు. ‘‘దేశ జీడీపీలో గృహ పొదుపు నిధులు నేడు 27–30 శాతంగా ఉన్నాయి. బడ్జెట్‌లో భాగంగా వృద్ధులు, మహిళలకు ప్రకటించిన పథకాలు దేశ పొదుపు రేటును పెంచుతాయి’’అని చెప్పారు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, సెక్షన్ 80డీ కింద 60 ఏళ్లలోపు వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ.25,000, 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000, గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు సహా ఎన్నో రకాల పన్ను ప్రయోజనాలు ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment