ఈ ఏడాదికి పెట్టుబడి అస్త్రాలు! | Choice of instruments for investments in year of 2025 | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదికి పెట్టుబడి అస్త్రాలు!

Published Mon, Jan 6 2025 6:09 AM | Last Updated on Mon, Jan 6 2025 7:59 AM

Choice of instruments for investments in year of 2025

ఈక్విటీలది లాభాల బాటే.. 

బంగారం, వెండి ర్యాలీ ముందుకే

డెట్‌లో లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అనుకూలం

రీట్‌లు, ఇన్విట్‌లలో రాబడుల స్థిరత్వం

2025పై నిపుణులు, విశ్లేషకుల అంచనాలు

‘ఈ రోజు గడిస్తే చాలులే.. రేపటి రోజు గురించి ఇప్పుడు ఎందుకు?’.. ఈ తరహా ధోరణి ఆర్థిక విజయాలకు పెద్ద అడ్డంకి. ఆర్థిక స్వేచ్ఛ కోరుకునే ప్రతి ఒక్కరూ రేపటి రోజు కోసం కచ్చితమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎందుకంటే పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్, సొంతిల్లు లక్ష్యాలు ఒక నెల సంపాదనతో సాధించేవి కావు. వీటి కోసం దీర్ఘకాలం పాటు పొదుపు, మదుపు చేయాల్సిందే. 

ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామన్నది కీలకం. పొదుపును మెరుగైన సాధనంలో పెట్టుబడిగా మార్చి, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లిన వారే ఆకాంక్షలను నెరవేర్చుకోగలరు. వివిధ సాధనాల మధ్య చక్కని పెట్టుబడుల కేటాయింపులతో ముందుకు వెళ్లడం ద్వారా జీవిత లక్ష్యాలను త్వరగా సాకారం చేసుకోవచ్చు. ఈ ఏడాది పెట్టుబడుల కోసం ఏ సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు? వాటి పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై నిపుణుల సూచనలను ఓ సారి పరిశీలిద్దాం.  

రూ.5 వేలతో కోటి.. 
గతంతో పోల్చితే నేడు ఆదాయ స్థాయిల్లో ఎంతో మార్పు వచ్చింది. నెలకు రూ.5 వేలు పొదుపు చేయడం చాలా మందికి సాధ్యమే. రూ.5 వేలను ప్రతి నెలా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా 15 శాతం రాబడులను ఇచ్చే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. అప్పుడు రూ.1,64,20,369 సమకూరుతుంది. ఇందులో పెట్టుబడి రూ.15 లక్షలే. మిగిలిన రూ.కోటిన్నర కాంపౌండింగ్‌ మాయతో సమకూరిన సంపద. ఒకవేళ రాబడి ఇంకాస్త అధికంగా ఏటా 18 శాతం వచ్చిందని అనుకుంటే సమకూరే సంపద రూ.2.91 కోట్లు. అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఖర్చులు ఎదురైనా పెట్టుబడిని విస్మరించకూడదు.

 అలాగే, మొత్తం పెట్టుబడిని ఈక్విటీల్లో పెట్టేయకూడదు. వివిధ సాధనాల మధ్య పెట్టుబడిని వైవిధ్యం చేసుకోవడం ద్వారా రిస్‌్కను అధిగమించొచ్చు. పెట్టుబడిని కాపాడుకోవచ్చు. రాబడులను పెంచుకోవచ్చు. ఈక్విటీలతోపాటు డెట్‌ సెక్యూరిటీలు, బంగారం, రియల్‌ ఎస్టేట్‌ సాధనాలను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాలి. ఈక్విటీలు అధిక రాబడులను ఇస్తాయి. కానీ అస్థిరతలు ఎక్కువ. డెట్‌లో అస్థిరతలు తక్కువ, రాబడులూ తక్కువే. బంగారం, రియల్‌ ఎస్టేట్‌లో అస్థిరతలు తక్కువగా, రాబడులు మోస్తరుగా ఉంటాయి.  

ఈక్విటీలు..
ఈక్విటీల విలువలు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో, ఇటీవలి దిద్దుబాటు తర్వాత కూడా షేర్ల ధరలు కొంత అధికంగా ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించాలని, రాబడుల అంచనాలు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మెరుగైన పనితీరు చూపిస్తాయన్నది విశ్లేషకుల అంచనా. నాణ్యమైన, పటిష్ట వృద్ధి అవకాశాలతో, సహేతుక విలువల వద్దనున్న స్టాక్స్‌ను పరిశీలించొచ్చు. 

టాప్‌–50 కంపెనీల విలువ మొత్తం మార్కెట్‌ విలువలో ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయిల వద్ద ఉండడాన్ని గమనించొచ్చు. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఐదేళ్ల కాలానికి మెరుగైన రాబడులను ఇస్తాయని, వీటి నుంచి ఏటా సగటున 20 శాతం రాబడిని ఆశించొచ్చని అవెండస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ, సీఐవో సౌరభ్‌ రుంగ్తా సూచించారు. ‘‘2025 లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ వంతు. ప్రైవేటు బ్యాంక్‌లు, టెలికం, ఎఫ్‌ఎంసీజీ మెరుగైన పనితీరు చూపించొచ్చు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ కూడా రాబడులను ఇస్తాయి. కానీ అంచనాలు తగ్గించుకోవాలి.

 మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారు ఫ్లెక్సీక్యాప్‌ వైపు చూడొచ్చు’’ అని నువమా వెల్త్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌జైన్‌ వివరించారు. ‘‘పెట్టుబడులను వివిధ అసెట్‌ క్లాస్‌ల మధ్య విస్తరించుకోవడం చక్కని అవకాశాలను సొంతం చేసుకోవడానికి ఉన్న మెరుగైన మార్గం’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ సీఐవో శంకరన్‌ నరేన్‌ సూచించారు. హైబ్రిడ్‌ ఫండ్స్, మల్టీ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్స్, డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 ‘‘ఇటీవలి మార్కెట్‌ కరెక్షన్‌తో లార్జ్‌క్యాప్‌లో విలువలు దిగొచ్చాయి. కానీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విలువలు చారిత్రక సగటు కంటే ఎగువన ట్రేడ్‌ అవుతున్నాయి. కనుక సమీప కాలానికి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌పై అధిక వేయిటేజీ ఇవ్వొచ్చు. మిడ్, స్మాల్‌క్యాప్‌లో ఎంపిక ఆచితూచి ఉండాలి’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సూచించింది. నేరుగా స్టాక్స్‌ కంటే నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. నిఫ్టీ 2024లో 9 శాతం లాభాలతో ముగిసింది. 2025లో 28,800 వరకు ర్యాలీ చేయొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేస్తోంది.  

రియల్టీ / ఏఐఎఫ్‌లు
పట్టణీకరణ విస్తరిస్తూ ఉంది. మెరుగైన ఉపాధి కల్పనతో ఆదాయ స్థాయిల్లో మార్పు వస్తోంది. ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. కనుక రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌చేసుకోవాలని నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తోంది. వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి మౌలిక వసతులు కీలకం. కనుక ఇన్వెస్టర్లు రీట్‌లతోపాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌)ల్లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని ఐసీఐసీఐ ఏఎంసీ సూచిస్తోంది. 

రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్‌ చేసే ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఆర్‌ఈ ఏఐఎఫ్‌లు) కూడా ఉన్నాయి. ‘‘ప్రత్యేకమైన ఆర్‌ఈ ఏఐఎఫ్‌లు అత్యున్నత గ్రేడ్‌ కమర్షియల్‌ ఆఫీస్, లగ్జరీ నివాస గృహాల పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడుల అవకాశాలను కలి్పస్తాయి. వీటిపై అధిక రాబడులకుతోడు, మెచ్యూరిటీ సమయంలో మూలధన లాభాలను సైతం పొందొచ్చు’’అని అవెండస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ, సీఐవో సౌరభ్‌ రుంగ్తా సూచించారు. రియల్‌ ఎస్టేట్‌లో ఒకరు విడిగా ఇన్వెస్ట్‌ చేయాలంటే పెద్ద మొత్తం అవసరం పడుతుంది. రీట్‌లు, ఏఐఎఫ్‌ల ద్వారా అయితే రూ.100–500 నుంచి కూడా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. భౌతిక ప్రాపరీ్టకి బదులు వీటిల్లో పెట్టుబడులు కలిగి ఉంటే, అవసరం వచ్చినప్పుడు వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. వీటిల్లో అస్థిరతలు తక్కువ.

ఎఫ్‌అండ్‌వో/ క్రిప్టోలు
ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో), క్రిప్టో ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎఫ్‌అండ్‌వోలో ట్రేడ్‌ చేసే 1.13 కోట్ల మందిలో 92.8 శాతం మంది 2021–22 నుంచి 2023–24 మధ్య ఒక్కొక్కరు సగటున రూ.2 లక్షలు నష్టపోయినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది. అంతా కలిపి పోగొట్టుకున్న మొత్తం ఈ కాలంలో రూ.1.81 లక్షల కోట్లు. టాప్‌ 3.5 శాతం ట్రేడర్లు అయితే విడిగా ఒక్కొక్కరు రూ.28 లక్షల చొప్పున నష్టపోయారు.

 ‘‘ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ మీ లాభాలను రెట్టింపు చేయడమే కాదు, నష్టాలను రెట్టింపు చేస్తుంది. దాంతో ఏళ్లపాటు చేసిన పొదుపు అంతా తుడిచిపెట్టుకుపోతుంది’’ అని ఈక్విరస్‌ వెల్త్‌ ఎండీ, సీఈవో అభిజిత్‌ భవే హెచ్చరించారు. క్రిప్టో అసెట్స్‌ కూడా ఒకరి నియంత్రణలో నడిచేవి కావు. ఫండమెంటల్స్‌తో సంబంధం లేకుండా.. డిమాండ్‌–సరఫరా, స్పెక్యులేషన్‌ ఆధారంగా వీటి విలువలు భారీ అస్థిరతలకు లోనవుతుంటాయి. దీంతో వీటిల్లో పెట్టుబడికి రక్షణ తక్కువ. కనుక రిస్క్‌ తీసుకునే వారు క్రిప్టోల కంటే పటిష్టమైన నియంత్రణల మధ్య నడిచే స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. భారీ లాభాల కంటే పెట్టుబడిని కాపాడుకోవడం ముఖ్యమని 5నాన్స్‌ ఫౌండర్‌ దినేష్‌ రోహిరా సూచించారు

బంగారమాయే..
అనిశి్చత పరిస్థితుల్లో, ఈక్విటీ తదితర సాధనాల్లో ప్రతికూలతలు నెలకొన్నప్పుడు పోర్ట్‌ఫోలియోకి బంగారం కొంత స్థిరత్వాన్ని తెస్తుంది. బంగారం 2024లో 24–26 శాతం మేర రాబడులు కురిపించింది. సామాన్యుడి నుంచి సెంట్రల్‌ బ్యాంకుల వరకు అందరికీ బంగారం ఆకర్షణీయంగా మారిపోయింది. పసిడికి డిమాండ్‌ ఈ ఏడాది కూడా కొనసాగొచ్చన్నది అంచనా. డాలర్‌కు బదులు సెంట్రల్‌ బ్యాంక్‌లు బంగారం రూపంలో నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వడం డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. రూపాయి విలువ క్షీణత రూపంలోనూ బంగారం పెట్టుబడులపై అదనపు ప్రయోజనం లభిస్తుంది. 

కనీసం 18–24 నెలల కాలానికి బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతం బంగారానికి కేటాయించుకోవచ్చు. ‘‘2025లో ఈక్విటీలు తదితర రిస్కీ అసెట్స్‌లో అస్థిరతలు కొనసాగితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉంటే, సురక్షిత సాధనమైన బంగారంలో పనితీరు ఇతర సాధనాలతో పోల్చితే స్థిరంగా ఉండొచ్చు’’అని నిప్పన్‌ ఇండియా ఏఎంసీ కమోడిటీస్‌ హెడ్‌ విక్రమ్‌ ధావన్‌ అభిప్రాయపడ్డారు. బంగారంలో రాబడులు ఈ ఏడాది మోస్తరుగా ఉండొచ్చని ఆనంద్‌రాఠి కమోడిటీస్, కరెన్సీస్‌ డైరెక్టర్‌ నవీన్‌ మాధుర్‌ తెలిపారు. 

పన్ను ప్రయోజనాల దృష్ట్యా గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మెరుగైన ఎంపికగా పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో తులం బంగారం ధర రూ.86,000కు చేరుకోవచ్చని, తగ్గినప్పుడు కొనుగోలు చేయడమనే విధానాన్ని అనుసరించొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. బంగారం ఈ ఏడాది రూ.82,000–85,000 శ్రేణిలో ట్రేడ్‌ కావొచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ జతీన్‌ త్రివేది అంచనా. వెండి సైతం రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు ర్యాలీ చేయొచ్చని అంచనా వ్యక్తీకరించారు. మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌కు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రవీణ్‌ సింగ్‌ మాత్రం ఈ ఏడాది చివరికి బంగారం 10 గ్రాములు రూ.90,000–93,000కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.  

డెట్‌లో అవకాశాలు..
స్థిరాదాయ (డెట్‌) సాధనాల్లో రాబడులు  వడ్డీ రేట్ల గమనంపై ఆధారపడి ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడులకు స్టాక్స్‌ విలువలను ఎలా అయితే పరిశీలిస్తామో.. డెట్‌లో పెట్టుబడులకు సమీప కాలంలో వడ్డీ రేట్ల తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. యూఎస్‌ ఫెడ్‌ ఇప్పటికే రెండు విడతలుగా వడ్డీ రేట్ల కోత నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాదికి రెండు కోతలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఆర్‌బీఐ వేచి చూసే ధోరణితో ఉంది. వచ్చే ఫిబ్రవరి, ఏప్రిల్‌లో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున ఈ దశలో లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయన్నది నిపుణుల సూచన. ‘‘రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నియంత్రిత బ్యాండ్‌లోనే ఉంది. వృద్ధి నిదానించింది. వడ్డీ రేట్లు గరిష్టాలకు చేరాయని మేము భావిస్తున్నాం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీలు), ఎన్‌సీడీలు, బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే వారు తమ పెట్టుబడులను అధిక రాబడుల (రేట్లు) వద్ద లాకిన్‌ చేసుకోవాలి. సంప్రదాయ సాధనాలకు వెలుపల క్రెడిట్‌ ఫండ్స్, వెంచర్‌ డెట్‌ ఫండ్స్, స్పెషల్‌ సిచ్యుయేషన్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ ఫండ్స్‌ రిస్క్‌ను మించి రాబడులను ఇస్తాయి. దీంతో మొత్తం మీద డెట్‌ పోర్ట్‌ఫోలియో రాబడులను పెంచుకోవచ్చు’’అని నువమా వెల్త్‌ ఎండీ రాహుల్‌జైన్‌ సూచించారు.  

సైబర్‌ రక్షణ
2023–24లో సైబర్‌ మోసాలు 300 శాతం (2,92,800 ఘటనలు) పెరిగాయి. 2024లో మొదటి తొమ్మిది నెలల్లోనే 11,333 కోట్ల నష్టం వాటిల్లింది. ‘‘మన దేశ వాసులు ఒక్కొక్కరు సగటున ఒక రోజులో 194 నిమిషాలు సోషల్‌ మీడియాపై గడుపుతున్నారు. టీనేజర్లు సైతం 3–6 గంటలు వెచ్చిస్తున్నారు. ఫిషింగ్, గుర్తింపు చోరీతోపాటు సైబర్‌ దాడులు పెరిగాయి’’అని టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నజీమ్‌ బిల్‌గ్రామి తెలిపారు. నేడు చాలా మంది స్మార్ట్‌ ఫోన్‌ నుంచే స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. చెల్లింపులు, నగదు బదిలీ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 

అదే స్మార్ట్‌ ఫోన్‌ నుంచి సోషల్‌ మీడియా బ్రౌజింగ్‌ చేస్తున్నారు. ఇలాంటి వారు సైబర్‌ దాడుల రూపంలో పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక సైబర్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ‘‘సైబర్‌ సెక్యూరిటీ ఇన్సూరెన్స్‌ అన్నది ఆన్‌లైన్‌ మోసాలు, అనధికారిక లావాదేవీలు, డేటా లీకేజీ రూపంలో వ్యక్తులకు కలిగే ఆర్థిక నష్టం, చట్టబద్ధమైన బాధ్యతల నుంచి రక్షణనిస్తుంది’’ అని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ ఎస్‌.బ్రహ్మజోస్యుల వెల్లడించారు. సైబర్‌ సెక్యూరిటీ ఇన్సూరెన్స్‌ రూ.10,000 నుంచి రూ.కోటి వరకు తీసుకోవచ్చు. వ్యక్తులు, కుటుంబ సభ్యులకూ కలిపి తీసుకునే వెసులుబాటు ఉంది. సైబర్‌ ఇన్సూరెన్స్‌తోపాటు, ఎవరూ ఊహించని విధంగా పాస్‌వర్డ్‌లు, మొబైల్‌లో సైబర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ ఉండేలా చూసుకోవాలి. ఓటీపీ, వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతా, ఆధార్, చిరునామా వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు.

ఏవి.. ఎందుకు..? 
ఈక్విటీ ఫండ్స్‌: అధిక వృద్ధి అవకాశాలతో దీర్ఘకాల లక్ష్యాలకు అనుకూలం.  

డెట్‌ ఫండ్స్‌: స్థిరమైన, ఊహించదగిన రాబడులు ఇచ్చేవి.
హైబ్రిడ్‌ ఫండ్స్‌: ఈక్విటీ, డెట్‌ కలసినవి. పెట్టుబడుల వృద్ధి, రిస్‌్కను సమతుల్యం చేసేవి. 
ఈఎల్‌ఎస్‌ఎస్‌: ఈక్విటీ పెట్టుబడికి అదనంగా సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనాలు ఆఫర్‌  చేసేవి. 
ఎన్‌పీఎస్‌: చాలా చౌక చార్జీలకే ఈక్విటీ, డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతూ, రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన మెరుగైన సాధనం. పన్ను ప్రయోజనాలతో కూడినది.
రీట్‌లు/ఇన్విట్‌లు: కార్యకలాపాలు నిర్వహించే ఆఫీస్, రిటైల్‌ ప్రాపర్టీలు.. ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో యూనిట్ల రూపంలో పెట్టుబడికి వీలు కలి్పంచేవి.
గోల్డ్‌ ఈటీఎఫ్‌: స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ ద్వారా బంగారంలో పెట్టుబడులకు వీలు కల్పించే ఎలక్ట్రానిక్‌ సాధనం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement