సరైన ఆచరణతోనే ఆర్థిక స్వేచ్ఛ
ఇందుకు పక్కా ప్రణాళిక అవసరం
సంపాదనలో పెట్టుబడికి వాటా ఇవ్వాలి
రుణ బంధాలకు గుడ్‌బై చెప్పాలి
ఆర్థిక శ్రేయస్సే సంకల్పం కావాలి
కేలండర్‌లో నంబర్ మారిపోతోంది. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామంటే ఏదో తెలియని హుషారు. కొత్త ఏడాదిలో కలలు సాకారం కావాలని, మరిన్ని విజయాలు వరించాలని, గొప్ప అవకాశాలను అందుకోవాలని, వృత్తి/వ్యాపారం/ఉద్యోగంలో రాణించాలని ఇలా.. ఎన్నెన్నో ఆకాంక్షలు. ఈ జాబితాలో ఆర్థిక లక్ష్యాలకూ చోటు ఉండాల్సిందే. అయితే ఆర్థిక నిర్ణయాలకు ఫలితాలు వెంటనే కనిపించవు. కొన్నేళ్ల ప్రయాణం తర్వాతే విజయాలు సాకారం అవుతాయి. పెట్టుబడి వృద్ధి అన్నది ఒక్క
ఏడాదితో అయ్యేది కాదు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ దిశగా ఆచరణ పక్కాగా ఉండాలి. కారు, సొంతిల్లు, పిల్లల విద్య, రిటైర్మెంట్.. తదితర కీలక లక్ష్యాలను సరైన ప్రణాళికతోనే చేరుకోగలరు. ప్రస్తుత ఏడాది ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులు, రుణాలను ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన తరుణం కూడా ఇదే. ఆర్థిక సన్నద్ధతను పరీక్షించుకోవాల్సిన సందర్భం కూడా ఇదే.
బడ్జెట్ రూపకల్పన
రూపాయి ఆదా చేయడం తిరిగి సంపాదించడంతో సమానం. అందుకే డబ్బు విషయంలో లెక్క పక్కాగా ఉండాలి. ఇందుకు వీలు కలి్పంచేదే ఆర్థిక ప్రణాళిక. ఈ దిశగా మొదట చేయాల్సింది కుటుంబానికి బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం. కానీ, అందరికీ ఆర్థిక అంశాలపై అవగాహన ఉండదు. అటువంటప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ తదితర నిపుణుల సాయంతో బడ్జెట్ రూపొందించుకోవాలి. ముందుగా మీ ఆర్థిక స్థితిపై అవగాహన అవసరం. వివిధ మార్గాల్లో వస్తున్న మొత్తం ఆదాయం, వ్యయాలు, అవసరాలు, కోరికలు, జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలు, వాటిని నెరవేర్చుకునేందుకు సమకూర్చుకోవాల్సిన వనరులు తదితర సమాచారం ఆధారంగా నిపుణులు మీకంటూ ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళికను సూచిస్తారు. ఆర్థిక స్వేచ్ఛకు స్పష్టమైన మార్గసూచీ మీకు లభిస్తుంది.
50/30/20 సూత్రం
ఆర్థిక క్రమశిక్షణతో మెలిగేవారికి 50/30/20 సూత్రం ఆచరణీయం. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపులు పోను మిగులు ఆదాయంలో 50 శాతాన్ని అవసరాలకు వెచి్చంచుకోవాలి. రోజువారీ జీవన వ్యయాలు (గ్రోసరీ, ఇంటి అద్దె, ఫోన్, గ్యాస్, వాహన ఇంధన వ్యయాలు, పిల్లల స్కూల్/కాలేజీ ఫీజులు/ఔషధాలు, చికిత్సల ఖర్చులు), ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవన్నీ అవసరాల కిందకే వస్తాయి. 30 శాతాన్ని కోరికలకు కేటాయించుకోవచ్చు. జీవనానికి కచ్చితంగా అవసరం లేనివి ఈ విభాగంలోకి వస్తాయి.
రెస్టారెంట్లలో విందులు, విహార యాత్రలు, ఖరీదైన ఎల్రక్టానిక్ వస్తువులు, లగ్జరీ ఉత్పత్తులు, వినోదం ఈ విభాగం కిందకు వస్తాయి. మిగిలిన 20 శాతాన్ని పెట్టుబడులకు కేటాయించుకోవాలి. ఈ పెట్టుబడులు జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఉండాలి. ఇల్లు కొనుగోలు, పిల్లల ఉన్నత విద్య, పిల్లల వివాహాలు, ప్రశాంతమైన విశ్రాంత జీవనం వీటన్నింటికీ మద్దతుగా నిలవాలి. అవసరమైతే ముఖ్యమైన జీవన లక్ష్యాల కోసం 30–40 శాతం మేర పెట్టుబడులకు కేటాయించుకుని, కోరికలకు 20–10 శాతం బడ్జెట్‌తో సరిపెట్టుకున్నా తప్పులేదు. రోజువారీ ముఖ్యమైన జీవన అవసరాలు మొదటి ప్రాధాన్యంగా, ముఖ్యమైన జీవిత లక్ష్యాలు రెండో ప్రాధాన్యంగా పెట్టుబడుల ప్రణాళిక సాగిపోవాలి.
పన్ను ప్రయోజనాలు
పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల రాబడి పెంచుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవాలంటే అందుకు ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ అనుకూలం. రిటైర్మెంట్ ఫండ్‌కు వీలైన పీపీఎఫ్, ఎన్‌పీఎస్ సాధనాల్లో చేసే పెట్టుబడులకూ పన్ను ప్రయోజనాలున్నాయి. అందుకే పెట్టుబడులను పన్ను ప్రయోజనాలతో సమన్వయం చేసుకోవాలి. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలను సైతం వినియోగించుకోవాలి. అంతేకాదు, పన్నుల్లోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. వీటికి అనుగుణంగా నిర్ణయాల్లో సవరణలు కూడా అవసరం కావొచ్చు.
స్పష్టమైన ఆచరణ
ముఖ్యమైన లక్ష్యాలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ లక్ష్యాలకు ఎంత మొత్తం అవసరం అన్నది నిపుణుల సాయంతో తేల్చుకోవాలి. ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు మెరుగైన పెట్టుబడి సాధనాలను గుర్తించాలి. 10 ఏళ్లు అంతకుమించిన సాధనాలకు ఈక్విటీలు మెరుగైనవి. కానీ, వీటిల్లో స్వల్పకాలానికి (మూడేళ్లలోపు) రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ రిస్క్ ప్రభావం తగ్గిపోయి రాబడులు అధికంగా ఉంటాయి. ఐదేళ్ల కంటే తక్కువ కాల లక్ష్యాలకు డెట్ సాధనాలు అనుకూలం. ఐదు– ఏడేళ్ల కాల లక్ష్యాలకు డెట్, ఈక్విటీ కలయికగా పెట్టుబడులు ఉండాలి. మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతం బంగారానికీ కేటాయించుకోవాలి.
లక్ష్యాలకు కావాల్సిన రాబడుల కోసం ఏ ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణులను అడిగి తెలుసుకోవాలి. సరైన అస్సెట్ అలోకేషన్ (వివిధ సాధనాల మధ్య వర్గీకరణ) వ్యూహం అమలు చేయాలి. ఈక్విటీ పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. ప్రతి నెలా నిర్ణయించిన మేర ఆటోమేటిగ్గా వాటిల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. ఆదాయం వచి్చన వెంటనే ముందు చేయాల్సింది పెట్టుబడి. ఆ తర్వాతే మిగిలిన అవసరాల సంగతి చూడాలి. రిటైర్మెంట్ కోసం ఎన్‌పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సంపాదన మొదలు పెట్టిన మొదటి నెల నుంచే పెట్టుబడులు కూడా ప్రారంభం కావాలి. ఎందుకంటే పెట్టుబడి సంపదగా మారడంలో కాంపౌండింగ్ (రాబడిపై రాబడి) కీలకం అవుతుంది. ఈ కాంపౌండింగ్‌కు ఎక్కువ కాలం కావాలి. ఎంత ఎక్కువ వ్యవధి ఉంటే అంత అధికంగా సంపద సమకూర్చుకోవచ్చు.
అత్యవసర నిధి
కుటుంబానికి అత్యవసర నిధి తప్పనిసరి. కారణం ఏదైనా ఉన్నట్టుండి ఆదాయం ఆగిపోతే.. కుటుంబ అవసరాలు, పెట్టుబడుల లక్ష్యాలు నిలిచిపోకూడదు. ముఖ్యమైన అవసరాలు, పెట్టుబడులకు ప్రతి నెలా ఎంత మెత్తం వెచి్చస్తున్నారో చూసుకుని.. కనీసం ఆరు నెలల నుంచి 12 నెలలకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వేగంగా వెనక్కి తీసుకో వచ్చు.
బీమా రక్షణ
అత్యవసర నిధితోపాటే బీమా రక్షణ కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి జరగరానికి జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్లకుండా జీవిత బీమా రక్షణ (టర్మ్ లైఫ్) కలి్పస్తుంది. రోడ్డు ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైతే ఆరోగ్య బీమా అండగా నిలుస్తుంది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా, ఆర్థిక కష్టాలను ఆహా్వనించినట్టే అవుతుంది. అంతేకాదు బడ్జెట్ ప్రణాళికలు తల్లకిందులవుతాయి. తన కుటుంబ జీవనం, కీలక లక్ష్యాలకు సంబంధించి పెట్టుబడులకు ఒక ఏడాదిలో ఎంత వ్యయం అవుతుందో.. అంతకు 20 రెట్ల మొత్తం టర్మ్ లైఫ్ అష్యూరెన్స్ తీసుకోవాలి. యాక్సిడెంటల్ డెత్, డిస్‌మెంబర్‌మెంట్ (వైకల్యం) రైడర్ జోడించుకోవాలి. ఒక కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ పాలసీతోపాటు, రూ.50 లక్షలకు (రూ.5–10 డిడక్టబుల్) సూపర్ టాపప్ ప్లాన్, క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ కూడా ఉండాలి.
రుణపడొద్దు..
ఒక్కసారి బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత దాని పరిధిలోనే లక్ష్మణ రేఖ దాటకుండా నడుచుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం నేటి కోరికలను నియంత్రించుకోవడం ఆర్థిక శాస్త్ర పరంగా ఎంత మాత్రం తప్పుకాదు. ఖర్చులు ఆర్జనను మించరాదు. మరీ ముఖ్యంగా ఆర్జనలో 70 శాతం దాటిపోకుండా చూసుకుంటేనే, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా చూసుకోవడం సాధ్యపడుతుంది. ఇందులో భాగంగా బై నౌ పే లేటర్, క్రెడిట్ కార్డు రుణాలకు దూరంగా ఉండాలి. రేపటి వనరులను కూడా నేడే ఖర్చు పెట్టేందుకు వీలు కల్పించే సాధనాలు ఇవి. వీటికి అలవాటుపడితే బయటకురావడం అంత సులభం కాదు. ఆర్థిక స్వేచ్ఛకు అతిపెద్ద అవరోధం రుణమే.
గృహ రుణం, విద్యా రుణం మినహా మరే ఇతర రుణం జోలికి పోవకపోవడమే మంచిది. తప్పనిసరి అయి ఏదైనా రుణాన్ని ఆశ్రయించినట్టయితే.. పెట్టుబడి కంటే ముందే ఈ రుణాన్ని తీర్చివేసేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండేలా కాపాడుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్‌లో విద్యా, గృహ రుణాలు సులభంగా, తక్కువ రేటుకు పొందొచ్చు. పెట్టుబడులను రుణాల కోసం త్యాగం చేయాల్సి వస్తే.. అప్పుడు భవిష్యత్ లక్ష్యాల్లోనూ రాజీపడాల్సి వస్తుంది. అందుకే వచి్చన ఆదాయం పరిధిలోనే జీవించడం నేర్చుకోవాలి. ఒకవేళ రుణఊబిలోకి దిగి, బయటకు వచ్చే మార్గం తోచకపోతే ఆలస్యం చేయకుండా నిపుణుల సాయం తీసుకోవాలి. అవసరమైతే ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేíÙంచాలి. ఇలా చేయడం వల్ల రుణాల నుంచి బయటపడడంతోపాటు, దీర్ఘకాల లక్ష్యాలకు కావాల్సిన పెట్టుబడిని సమకూర్చుకోవచ్చు.
నామినీ/వీలునామా
ఇక పెట్టుబడులకు నామినేషన్ ఇవ్వడం మర్చిపోవద్దు. బ్యాంక్ ఖాతా, లైఫ్ ఇన్సూరెన్స్,, మ్యూచువల్ పండ్స్, డీమ్యాట్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి. అనుకోనిది జరిగితే, ఆయా పెట్టుబడులు తమ వారికి సులభంగా బదిలీ అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి వీలునామా రాయడం మంచి చర్య అవుతుంది. నామినేషన్ అన్నది కేవలం క్లెయిమ్ అర్హత కలి్పస్తుంది. కానీ, వీలునామా అన్నది చట్టపరమైన హక్కులకు మార్గాన్ని సులభం చేస్తుంది. వారసుల మధ్య వివాదాలను నివారిస్తుంది. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఆస్తుల బదిలీకి చట్టబద్ధమైన డాక్యుమెంట్‌గా సాయపడుతుంది.
ముగ్గురిలో ఇద్దరు రుణగ్రస్తులే
→ మన దేశంలో రుణభారం లేని వారు 38 శాతమేనట. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆర్థిక సంస్థలకు రుణపడి ఉన్నట్టు తెలుస్తోంది.
→ మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారిలోనూ 31 శాతం మంది ఈఎంఐ చెల్లింపులతో సతమతం అవుతున్నారు.
→ 40 శాతం మందికి అత్యవసర నిధి లేదు
→ 27 శాతం మందికి మెరుగైన పన్నుల ప్రణాళిక లేదు.
→ దేశంలో 74 శాతం మందికి సరిపడా బీమా కవరేజీ లేదు. వీరిలో కొందరికి అసలు బీమా రక్షణే లేదు.
→ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలోనూ 54 శాతం మందికి కాంపౌండింగ్ గురించి తెలియకపోవడం విడ్డూరం
(ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ ‘ఫిన్నోవేట్’ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో తెలిసిన ఆసక్తికర అంశాలు ఇవి)
– సాక్షి, బిజినెస్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment