Financial Goals
-
ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది రాష్ట్రాలు ముందుంటున్నాయి. పట్టణవాసుల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మందికి బీమా రక్షణ ఉంటోంది. బీమాపై అవగాహన, జీవిత బీమా పాలసీ కలిగి ఉండటం, ఆర్థిక భద్రతను మెరుగుపర్చుకోవడంపై ఇక్కడి వారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. దీనికి సంబంధించి బీమా సంస్థ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మార్కెటింగ్ డేటా కాంతార్ నిర్వహించిన 6వ విడత ఇండియా ప్రొటెక్షన్ కోషంట్ (ఐపీక్యూ) సర్వేలో దక్షిణాది 49 పాయింట్లు దక్కించుకుంది. దీని ప్రకారం 44 పీక్యూతో దక్షిణాది మెట్రోల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి తెలిపారు. దక్షిణ భారతంలో ప్రతి నలుగురిలో ఒకరికి అధిక ప్రీమియం అనేది టర్మ్ ప్లాన్ కొనుగోలుకు అవరోధంగా ఉంటోందని పేర్కొన్నారు. దక్షిణాది వారు రిటైర్మెంట్ ప్లానింగ్‌కి మరింతగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌వాసులు ఆరోగ్యకరమైన అలవాట్ల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో పాటు పిల్లల భవిష్యత్‌పైనా ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లు వివరించింది. 25 నగరాల వ్యాప్తంగా 4,700 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. -
ఇంటి ఋణ భారం తగ్గే దారేది..!
ఇంటిని కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో అదిపెద్ద ఆర్ధిక లక్ష్యం. ఇందుకోసం భారీ మొత్తం అవసరంపడుతుంది. ఎన్నో ఏళ్లపాటు కష్టార్జితాన్ని పొదుపు, మదుపు చేసి ఇల్లు కొనుక్కోవడం ఒక మార్గం అయితే, 20–25 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇంటిని సమకూర్చుకోవడం రెండో మార్గం. రెండు దశాబ్దాల క్రితం అయితే ఎక్కువ మంది జీవితాంతం కష్టపడి పొదుపు చేసి ఇంటిని సమకూర్చుకునే వారు. కానీ, ఇందులో మార్పు వచి్చంది. రుణం మార్గంలో చిన్న వయసులోనే సొంతింటివారయ్యే అవకాశం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. కానీ, ఇదేమంత చిన్న విషయం కానే కాదు. తీసుకున్న అసలు రుణాన్ని, వడ్డీ సహా చెల్లించుకోవాలి. పైగా రుణం ఎంత ఇవ్వాలి, ఎంత వడ్డీ, ఎన్నేళ్ల కాల వ్యవధి అనే అంశాలను రుణమిచ్చే సంస్థే నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో రుణదాతకు ఉన్న స్వేచ్ఛ తక్కువ. అందుకే రుణంపై ఇంటిని సమకూర్చుకునే వారు తప్పకుండా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం పాటు రుణ బాధ్యత మోయకుండా, ఆ భారాన్ని దింపుకునే, తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి చాలా పెద్ద మొత్తమే అవుతుంది. నెలవారీ ఆర్జనలో 30–40 శాతం వరకు ఉండొచ్చు. 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. గడువు పూర్తయ్యే నాటికి రుణదాత చెల్లించే మొత్తం రెట్టింపు అవుతుంది. అంటే తీసుకున్న రుణం ఎంతో, అంత మేర వడ్డీ కూడా ఇక్కడ చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఆరి్థక కోణం నుంచి చూస్తే ఇదేమంత లాభదాయక విషయం కాదన్నది వాస్తవం. ఇంటి రుణం విషయంలో కొంత లాభపడాలంటే ఆ రుణాన్ని వీలైనంత తొందరగా ముగించేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ‘రుణ’ వాటా తగ్గాలి ఇంటిని కొనుగోలు చేసే వారు రుణాన్ని వీలైనంత తక్కువకు పరిమితం చేసుకోవాలన్నది ప్లాన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. అంటే రుణం వీలైనంత తక్కువగా ఉండాలి. కానీ, ఆచరణలో ఎక్కువ కేసుల్లో దీనికి విరుద్ధంగా జరుగుతుందంటున్నారు అమోల్ జోషి. ‘‘ఇంటి రుణం తీసుకునే వారు సరిపడా సైజు, చక్కని వసతులు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనివల్ల వారు తీసుకోవాల్సిన రుణం మొత్తం పెరిగిపోతుంటుంది’’అని జోషి వివరించారు. కానీ, రుణం వస్తుంది కదా అని ఖరీదైన ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం కాకుండా, తిరిగి నెలవారీ ఎంత మేర చెల్లించాల్సి వస్తుందన్నది కూడా పట్టించుకోవాలి. ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. 8.5 శాతం వార్షిక వడ్డీపై 20 ఏళ్లకూ కలిపి అసలుకు సరిపడా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు రూ. కోటి రుణం తీసుకుంటే 8.5 శాతం రేటుపై, 20 ఏళ్లలో రూ.1.08 కోట్లను వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ భారం తగ్గాలంటే..? పైన చెప్పుకున్నట్టు అసలుకు సమానంగా వడ్డీ చెల్లించకూడదని మీరు కోరుకునేట్టు అయితే, రుణాన్ని నిర్ధేశిత గడువు కంటే ముందుగానే చెల్లించేసేలా ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం చక్కని మార్గం. అది కూడా రుణాన్ని తీసుకున్న తొలినాళ్లలోనే ముందస్తు అదనపు చెల్లింపులను ప్రారంభించాలి. ఎందుకంటే ఆరంభంలోనే రుణంపై వడ్డీ భారం ఎక్కువ పడుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ భారం తగ్గుతూ, అసలులో ఎక్కువ జమ అవుతుంది. పైన చెప్పుకున్న ఉదాహరణలో రూ.కోటి రుణాన్ని తీసుకున్న మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ ఈఎంఐకి అదనంగా ముందస్తు చెల్లింపులు మొదలు పెట్టి.. రుణాన్ని 14–15 ఏళ్లలోనే తీర్చేసేట్టు అయితే, రూ.20–25 లక్షల వరకు వడ్డీ రూపంలో ఆదా చేసుకోవచ్చు. అలా కాకుండా అదనపు ముందస్తు చెల్లింపులను జాప్యం చేశారనుకుంటే.. పదో ఏట తర్వాతే మొదలు పెట్టేట్టు అయితే అప్పుడు వడ్డీ రూపంలో ఆదా చేసుకునేది స్వల్పంగానే ఉంటుంది. అందుకే రుణం తీసుకున్న తర్వాత వీలైనంత ముందుగా అదనపు చెల్లింపుల మార్గాలను అన్వేషించుకోవాలి. ‘‘వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ఇంకొంత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కనుక వడ్డీ భారాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు ముందస్తు చెల్లింపులు మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి తగ్గుముఖం పడితే ముందస్తు చెల్లింపుల రూపంలో వడ్డీని మరింత మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది’’అని సృజన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వ్యవస్థాపక భాగస్వామి దీపాలి సేన్ సూచించారు. ముందస్తు చెల్లింపుల్లో మరో ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. ఈఎంఐ రుణ కాలవ్యవధి అంతటా మారకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, వేతన జీవి ఆదాయం ఏటా పెరుగుతూ వెళుతుంది. దీనికి తగ్గట్టుగా రుణ ఈఎంఐని ఏటా పెంచుకుంటూ, మధ్యలో అదనంగా సమకూరే మొత్తాన్ని కూడా ముందస్తు చెల్లింపులకు వినియోగించుకుంటే, 20 ఏళ్ల రుణాన్ని 10 ఏళ్లలోనే ముగించేయవచ్చు. దీనివల్ల వడ్డీ రూపంలో గణనీయమైన మొత్తం ఆదా అవుతుంది. ఏటా ఈఎంఐ పెంచుకోవడాన్ని స్టెపప్ ఈఎంఐగా చెబుతారు. పెరిగే వేతనాలు, బోనస్‌లను ఇందుకు వినియోగించుకోవాలి. వీలైనంత ముందుగా.. నిరీ్ణత గడువు కంటే ముందుగానే గృహ రుణాన్ని వదిలించుకోవడం వల్ల వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే ఆదా అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. కనుక దీన్ని విస్మరించకూడదు. అయితే, రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యమే అంతిమంగా దీన్ని నిర్ణయిస్తుంది. భారతీయుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు రుణ భారాన్ని మోయడానికి ఇష్టపడని వారేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ‘‘పదేళ్ల క్రితం వరకు ఎక్కువ శాతం రుణాలు ఏడు నుంచి 9 ఏళ్ల మధ్యలోనే ముగించినట్టు మా డేటా తెలియజేస్తోంది. కాకపోతే ముందస్తుగా రుణాన్ని తీర్చేయడం అన్నది ఇప్పుడు 9–12 ఏళ్లకు మారింది. భారత్‌లో ఎక్కువ మంది రుణాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు’’అని మార్ట్గేజ్ వరల్డ్ సీఈవో విపుల్ పటేల్ తెలిపారు. ఏక మొత్తంలో కొంత రుణాన్ని తీర్చి వేయడానికి సాధారణంగా మూడు నుంచి ఐదేళ్లు అయినా వ్యవధి అవసరం పడొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత సమకూర్చుకోవడానికి ఇంత మేర కాల వ్యవధి అవసరం కనుక. ఏటా ఈఎంఐను పెంచుతూ చెల్లించడం ఒక ఆప్షన్ అయితే, మధ్యలో వచ్చే బోనస్, ఇతరత్రా వెసులుబాటు లభించినప్పుడు అదనంగా ఒకే విడత చెల్లించడం మరో మార్గం. ‘‘రుణ గ్రహీత తన ఇష్టం ప్రకారం ఈఎంఐని పెంచి చెల్లించడం కాకుండా, స్టెపప్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈఎంఐ పెరుగుతుంది. లేకపోతే కొన్ని ఆకర్షణీయమైన ఖర్చులతో ముందస్తు చెల్లింపులపై ప్రభావం పడుతుంది’’అని దీపాలిసేన్ సూచించారు. అన్ని అంశాలు చూసిన తర్వాతే వ్యక్తిగత ఆరి్థక అంశాల్లో గృహ రుణం అన్నది ఒక్క భాగం మాత్రమే. కనుక ముందస్తుగా రుణాన్ని చెల్లించే ముందు, ఇతర బాధ్యతలు, అవసరాలు, వెసులుబాటును కూడా చూసుకోవాలన్నది నిపుణుల సూచన. అందరి ఆరి్థక పరిస్థితులు ఒకే మాదిరిగా ఉండవు. తమ క్లయింట్ల విషయంలో భిన్న వ్యవహార శైలిని చూస్తుంటామని అమోల్ జోషి వెల్లడించారు. ‘‘పెరుగుతున్న జీవనశైలి ఖర్చులతో నెలవారీ పొదుపు కష్టంగా మారుతోంది. కనుక వ్యక్తులు సింగిల్ షాట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాదికోసారి ముందస్తు చెల్లింపునకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని జోషి వివరించారు. జీవితంలో ఎన్నో అవసరాలు పెరుగుతుంటాయి. కనుక వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయాలని భావించే వారు తమ ఆదాయపన్ను కోణంలోనూ దీన్ని ఓ సారి విశ్లేíÙంచుకోవాలి. ఎందుకంటే పాత పన్ను విధానంలో గృహ రుణంపై అసలు, వడ్డీ మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. కనుక రూ. 9 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి గృహ రుణం రూపంలో గణనీయమైన మొత్తమే ఆదా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల మొత్తం వడ్డీ చెల్లింపులకే పన్ను ప్రయోజనం సెక్షన్ 24(బీ) కింద ఉంటుంది. సెక్షన్ 80సీ కింద అసలుకు జమ చేసే రూ.1.5 లక్షలకు కూడా పన్ను ఆదా ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక ఆరి్థక సంవత్సరంలో గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల లోపునకు తగ్గిపోయినప్పుడు, పన్ను పరిధిలో ఉన్న వారు ముందస్తు చెల్లింపుల వైపు మొగ్గు చూపించొచ్చు. ‘‘గృహ రుణం పెద్ద మొత్తంలో తీసుకుంటే, సమీప కాలంలో వేరే ఇతర పెద్ద ఆరి్థక లక్ష్యాలు లేకుంటే.. వీలైనంత అదనపు మొత్తంతో రుణాన్ని ముందుగా తీర్చివేయడమే మంచిది. అది నెలవారీ కావచ్చు, ఏడాదికోసారి కావచ్చు. మిగిలిన గృహ రుణం కొంతే ఉంటే, అప్పుడు మిగులు మొత్తాన్ని పెట్టుబడులు, ముందస్తు చెల్లింపులు అనే రెండు భాగాలుగా విభజన చేసుకోవాలి’’అని దీపాలి సేన్ సూచించారు. గృహ రుణం అనేది పెద్ద బాధ్యత. సొంతింటి కల సాకారానికి దీని సాయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, ఈఎంఐ రూపంలో నెలవారీ ఎంత చెల్లింపుల సామర్థ్యం తమకు ఉంది, తమ కుటుంబ ఆదాయం, అవసరాలు, ఆరోగ్య చరిత్ర, ఇతర ఆరి్థక బాధ్యతలు ఇలాంటి ఎన్నో అంశాలు విశ్లేషించిన తర్వాతే దీనిపై స్పష్టతకు రావడానికి వీలుంటుంది. ఈ విషయంలో నిపుణుల సహాయం తీసుకునేందుకు వెనుకాడకూడదు. చెల్లింపుల సామర్థ్యం పూర్తి స్థాయిలో లేదంటే, ఇంటి కొనుగోలుకు అయ్యే వ్యయంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాతే, గృహ రుణం విషయంలో ముందుకు వెళ్లడం ఆరి్థక సౌకర్యాన్నిస్తుంది. భారం ఎంత తగ్గుతుంది.. ► గృహ రుణం: రూ.కోటి ► కాలవ్యవధి: 20 ఏళ్లు ► వడ్డీ రేటు: 8.5 శాతం ► ఈఎంఐ: రూ.86,782 ► నికర వడ్డీ చెల్లింపు: 1.08 కోట్లు ► ఉదాహరణ: మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ రూ. 20వేలు అదనంగా చెల్లించడం/మూడేళ్ల తర్వాత నుంచి ఏటా ఒకేసారి రూ. 2 లక్షల చొప్పున చెల్లించడం/ఏడేళ్ల తర్వాత ఒకే విడత రూ.20 లక్షలు జమ చేయడం ► నికర వడ్డీ భారం: రూ.77.67 లక్షలు/రూ.79.39 లక్షలు/రూ.79.45లక్షలు ► ఆదా అయ్యే వడ్డీ: రూ.30.63 లక్షలు/రూ.28.91లక్షలు/రూ.28.85 లక్షలు ► రుణం ముగింపు కాలం: 14ఏళ్లు/15ఏళ్లు/15ఏళ్లు -
ప్లాన్ చెయ్.. గోల్ వెయ్!
మంచి వేతనం.. వీలైనంత పెట్టుబడి.. వీటితో ఆర్థిక లక్ష్యాల సాధన సులభమే అనుకుంటున్నారా..? ఎంత సంపాదించామన్నది కాదు.. భవిష్యత్తు కోసం ఎంత ప్రణాళికాబద్దంగా మదుపు చేశామన్నది ముఖ్యమనే ఆర్థిక సూత్రం గుర్తుకు తెచ్చుకోండి. ఆర్థిక లక్ష్యాల సాధనకు దగ్గరి దారి అంటూ లేదు. అనుకున్నంత సులభమూ కాదు..! సరైన అంచనాలు, రాబడులు, అంచనాలకు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని జోడించడం, వివిధ సాధనాల మధ్య సమతూకమైన కేటాయింపులు, అత్యవసరాలకు సన్నద్ధత, జీవితానికి, రుణాలకు, ఆరోగ్యానికి రక్షణలు.. ఇటువంటివన్నీ ఎంతో కీలకమవుతాయి. ఒకటి అనుకోవచ్చు. కానీ, ఫలితం మరో రకంగా ఉండొచ్చు. తుది ఫలితంపై ప్రభావం చూపించే అంశాలు ఎన్నో ఉంటాయి. మెరుగైనవి అనుకున్న ప్రణాళికలు కూడా బెడిసి కొట్టొచ్చు. ఇందుకు కారణం మీరు వేసే తప్పటడుగులు కావచ్చు. తప్పుడు అంచనాలు కూడా కావచ్చు. ఆర్థిక లక్ష్యాల సాధనలో పొరపాట్లు, తప్పులకు అవకాశం లేకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడమే ఈ కథనం ప్రధాన ఉద్దేశం. పునాదులు బలంగా ఉంటేనే నిర్మాణం చాలా కాలం పాటు నిలుస్తుంది. మీ ఆర్థిక ప్రణాళికకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అకాల మరణం సంభవిస్తే.. పెద్ద ప్రమాదానికి లోనైతే.. తీవ్ర అనారోగ్యం బారిన పడితే.. అనుకోకుండా ఉద్యోగాన్ని కోల్పోతే ప్రణాళికలపై పెద్ద ప్రభావమే పడుతుంది. ముఖ్యంగా గత రెండేళ్లలో (కరోనా నాటి నుంచి) ఎన్ని అనూహ్య పరిణామాలను వ్యక్తులుగా మనం ఎదుర్కోవాల్సి వచ్చిందో గుర్తు చేసుకోవాలి. ఉద్యోగాలు కోల్పోయిన వారు, వేతన కోతలను ఎదుర్కొన్నవారు, ఆస్పత్రుల్లో చికిత్సల కోసం రూ.లక్షలు ధారపోసిన వారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా.. చాలకుండా ఇబ్బంది పడ్డవారు చాలా మందే ఉన్నారు. జీవిత బీమా లేకుండా, కరోనాతో మరణించిన వ్యక్తుల (స్థితిమంతులు కానివారు) కుటుంబాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. అందుకే తగినంత జీవిత బీమా, వైద్య బీమా రక్షణ, రుణాలకు రక్షణ కవరేజీలతోపాటు అత్యవసర నిధి అంటూ ఒకదానిని సమకూర్చుకోవాలని ఈ పరిణామాలు తెలియజేశాయి. బీమా రక్షణ ఎంత తీసుకోవాలి? దీనికి.. అందరికీ ఒక్కటే సమాధానం కాబోదు. వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, ఆరోగ్య చరిత్ర, వయసు ఇలా ఎన్నో అంశాలు ప్రామాణికం అవుతాయి. ఎంతలేదన్నా కనీసం 10 ఏళ్ల వార్షిక ఆదాయానికి తగ్గకుండా బీమా రక్షణ ఉండాలన్నది నిపుణుల సూచన. నెలవారీ మీ కుటుంబ జీవనానికి అవుతున్న ఖర్చులు, చెల్లించాల్సిన రుణ ఈఎంఐలు కీలకం అవుతాయి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి జీవిత బీమా అంటూ ఇతమిద్ధమైన ప్రామాణికం లేదు. భారీగా అప్పులు తీసుకుని ఏదోలా నెట్టుకు వస్తున్న వారికి అధిక కవరేజీ అవసరం. మీ ఆదాయ వ్యయాలు, తీర్చాల్సిన రుణ బాధ్యతలు, పెట్టుబడులు అన్నీ కూడా జీవిత బీమా కవరేజీ కోసం పరిగణనలోకి తీసుకోవాలని ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకుడు మృణ్ అగర్వాల్ సూచించారు. వైద్య బీమా విషయానికొస్తే కనీసం రూ.5 లక్షల కవరేజీ అవసరం. మెట్రోల్లో నివసించే వారికి కనీసం రూ.7–10 లక్షల కవరేజీ అయినా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుటుంబానికి కనీసం రూ.15 లక్షల ఫ్లోటర్ పాలసీ ఉండడం సహేతుకమన్నది ఆర్థిక సలహాదారు సూచన. ఇందుకోసం బేసిక్‌గా కొంత కవరేజీ తీసుకుని దానికి సూపర్ టాపప్ జోడించుకోవడం ద్వారా తక్కువ ప్రీమియానికే మెరుగైన రక్షణ ఉండేలా చూసుకోవచ్చు. అత్యవసర నిధితో అనుకోకుండా ఎదురయ్యే అవసరాలను గట్టెక్కవచ్చు. ‘ఆర్థిక ప్రణాళిక అత్యవసర నిధితోనే మొదలవ్వాలి. ఎందుకంటే మిగులు నిల్వలుంటేనే ప్రణాళిక మొత్తం సాఫీగా నడిచిపోతుంది’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు తరుణ్ బిరాని సూచించారు. కనీసం వచ్చే ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అదనంగా మరో 3–6 నెలల అవసరాలకు కూడా నిధిని సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో నిశ్చింతను ఇస్తుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ము ఖ్యంగా ఉద్యోగ భద్రత లేని వారు ఏడాది అవసరాలకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. వీటికి అదనంగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ తీసుకోవాలి. తీవ్ర అనారోగ్యాల్లో (కిడ్నీలు, మూత్ర పిండాలు, గుండె జబ్బులు, కేన్సర్ వంటివి) బేసిక్ హెల్త్ కవరేజీ చాలకపోవచ్చు. ఒక్కటిగానే.. లేక విడిగానా ఒక్కో లక్ష్యానికి విడిగా పెట్టుబడులు పెట్టుకోవడమా? లేదంటే అన్నింటినీ కలిపి ఒక్కటే విధానం అనుసరించడమా? ఉద్యోగం లేదా వృత్తి జీవితం కొత్తల్లో చాలా మంది తమకు మిగులుతున్నంత మేరకు తీసుకెళ్లి ఒక్కటే పెట్టుబడిగా నిర్వహిస్తుంటారు. చాలా మంది యువతకు ప్రణాళికల పట్ల ఆసక్తి అంతగా కనిపించడదు. కేవలం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళుతుంటారు అంతే. తమ ఆర్థిక లక్ష్యాలకు అంకెలను జోడించకపోతే అందులో సమగ్రత లోపిస్తుంది. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత మీ జీవన అవసరాలకు ఎంత నిధి కావాలన్నదానిపై స్పష్టత ఉండకపోతే.. ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలోనూ స్పష్టత ఉండదు. వీలున్నంత చేసుకుంటూ వెళితే చివర్లో ఆ నిధి సరిపడకపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పైగా ప్రతీ లక్ష్యం వారీగా పెట్టుబడుల ప్రణాళిక లేకపోతే.. ఒక్కటే పెట్టుబడి నిధి కొనసాగుతుంది. అప్పుడు సమీప కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం ఈ ఏకీకృత నిధి నుంచి ఎక్కువ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీంతో భవిష్యత్తు లక్ష్యాలకు కొంతే మిగులుతుంది. ఉదాహరణకు రుణంపై ఇల్లు సమకూర్చుకునేందుకు డౌన్ పేమెంట్ కోసమని కొంత వెనక్కి తీసుకుంటే.. అప్పుడు పిల్లల ఉన్నత విద్య, విశ్రాంత జీవన అవసరాలపై ప్రభావం కచ్చితంగా పడుతుంది. అందుకే అన్నింటికీ ఒక్కటే నిధి కాకుండా.. విడిగా ప్రతీ అవసరం, లక్ష్యానికి ప్రత్యేక ప్రణాళిక, కేటాయింపులు ఉండేలా చూసుకోవాలి. ప్రతీ బకెట్‌లోనూ ప్రత్యేక పెట్టుబడులు అవసరమని కాదు దీని ఉద్దేశ్యం. భిన్న లక్ష్యాలకు ఒకే విధమైన మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడి సాధనాలను వినియోగించుకోవచ్చు. కాకపోతే ప్రతీ లక్ష్యానికి విడిగా కేటాయింపుల ప్రణాళిక ఉండాలి. అంటే లక్ష్యం వారీగా సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే పూర్తి స్పష్టత ఉంటుంది. ‘‘అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామనే దానిపై స్పష్టత ఉంటే ప్రణాళిక అమలు సులభంగా మారుతుంది’’ అని గెట్టింగ్ యూ రిచ్ సీఈవో రోహిత్‌షా అన్నారు. అంచనాలు సరిగ్గా ఉంటేనే.. అన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత.. విడిగా ఒక్కో లక్ష్యానికి ఇన్వెస్ట్ చేస్తే మీ బాధ్యత తీరినట్టు కాదు.. లక్ష్యాన్ని చేరినట్టు కానే కాదు. ఫలానా లక్ష్యానికి పెట్టుబడులు ప్రారంభింస్తే సగమే పూర్తయినట్టు అనుకోవాలి. కొన్నేళ్ల తర్వాతి అవసరానికి ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకునే ముందు కరెన్సీ విలువను, కొనుగోలు శక్తిని తగ్గించేసే ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంపిక చేసుకునే సాధనాల్లో రాబడులపై కచ్చితమైన అంచనాలు ఉండాలి. అధిక రాబడుల అంచనాలు వేసుకుంటే అది చివర్లో అయోమయానికి దారితీయవచ్చు. అందుకే రాబడుల అంచనాలు సహేతుకంగా, చారిత్రక గణాంకాలకు సన్నిహితంగా ఉండేలా చూసుకోవాలి. మీ పెట్టుబడికి ఆ రాబడి అంచనా రేటును జోడిస్తే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నదానిపై స్పష్టత సాధించొచ్చు. ఇక ద్రవ్యోల్బణ రేటు అన్నింటికీ ఒకటే మాదిరిగా ఉండదు. విద్య, వైద్యానికి సంబంధించి మన దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. నిత్యావసర ఉత్పత్తులపై ద్రవ్యోల్బణం మోస్తరుగా ఉంటుంది. ఇళ్ల ధరల ద్రవ్యోల్బణం 3–4 శాతం స్థాయిల్లోనే ఉంటే.. విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం స్థాయిలో ఉంటుంది. అంటే ఫలానా కోర్సుకు ప్రస్తుతం రూ.లక్ష ఖర్చవుతుంటే.. ఏడాది తర్వాత అదే కోర్సు కోసం రూ.1.10 లక్షలు అవసరమవుతాయి. పెట్టుబడులపై రాబడులను అధికంగా ఊహించుకోవడం కూడా విఘాతం కలిగించేదే. ఈక్విటీలపై రాబడులు 11–13% దీర్ఘకాలంలో వస్తాయని ఆశించడం సమంజసంగానే ఉంటుంది. అంతేకానీ, 22–24% స్థాయి రాబడులు వస్తాయని అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళితే చివర్లో కావాల్సిన మొత్తానికంటే తక్కువే సమకూరొచ్చు. అందరికీ ఈక్విటీ కేటాయింపులు అధికంగా ఉండాలనేమీ లేదు. ఈక్విటీలకు తక్కువ కేటాయింపులతోనూ దీర్ఘకాలంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. కాకపోతే అప్పుడు రాబడులపై అంచనాలు మోస్తరుగానే ఉండాలి. అందుకు కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్... ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం, లక్ష్యానికి ఉన్న వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనాలు, రాబడుల అంచనాలకు అనుగుణంగా ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయమవుతుంది. అప్పుడే వివిధ సాధనాల మధ్య ఎంత చొప్పన ఇన్వెస్ట్ (అస్సెట్ అలోకేషన్) చేసుకోవాలన్న స్పష్టతకు రాగలరు. ఆర్జన మొదలు పెట్టిన కొత్తలో ఈక్విటీలకు 75–80 శాతం కేటాయింపులు సరైన విధానమే అవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ, లక్ష్యాలకు చేరువ అవుతున్న తరుణంలోనూ ఈక్విటీలకు కేటాయింపులను 80 శాతం చొప్పున కొనసాగించుకుంటూ వెళ్లడం సరికాదు. ముఖ్యంగా గడిచిన 18–24 నెలల రాబడులను ప్రామాణికంగా చూడొద్దు. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మార్కెట్లు కుప్పకూలి తిరిగి భారీ ర్యాలీ చేశాయి. 15–20 ఏళ్లలో ఈక్విటీల నుంచి 11–12 శాతం రాబడులు ఆశించడం సహేతుకం అవుతుంది. అదే డెట్, ఈక్విటీల కలబోతపై రాబడులు 9–10 శాతం స్థాయిలో ఉంటాయని ఆశించొచ్చు. స్థిరాదాయ సాధనాల నుంచి 7–8 శాతం రాబడులకు మించి ఆశించొద్దు. సమీక్ష, దిద్దుబాటు.. మీరు చేస్తున్న పెట్టుబడులపై రాబడి అంచనాలకు తగ్గట్టుగా లేదనుకోండి.. లేదంటే మీరు వేసుకున్న అంచనాలకు మించి ద్రవ్యోల్బణం ఉందని గుర్తించినట్టయితే.. తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఒక శాతం ఎక్కువ ఉన్నా అదనంగా సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇందుకు వీలుగా పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. ఏటా పెట్టుబడిని నిర్దేశిత శాతం మేర పెంచుకుంటూ వెళ్లడం ఒక పరిష్కారం అవుతుంది. అస్సెట్ రీబ్యాలన్స్ను అమలు చేయాలి. లక్ష్యానికి చేరువ అవుతున్న సమయంలో అస్సెట్ అలోకేషన్ పక్కాగా ఉండాలన్నది నిపుణుల సూచన. అనుకున్నట్టుగా ఆర్థిక ప్రణాళిక ముందుకు వెళ్లడం లేదని ఎప్పుడు భావించినా.. నిపుణులైన ఆర్థిక సలహాదారుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. లక్ష్యాన్ని సమీపిస్తుంటే... లక్ష్యానికి చేరువు అవుతున్న క్రమంలో స్టాక్ మార్కెట్ ఏదైనా సంక్షోభం కారణంగా కుప్పకూలితే పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మరింత పెట్టుబడికి మొగ్గు చూపించొచ్చు. తద్వారా తక్కువ ధరలకే ఎక్కువ యూనిట్లు సమకూరతాయి. కాకపోతే ఈక్విటీ మార్కెట్ బేర్ దశ నుంచి బయటకు వచ్చేందుకు 2–3 ఏళ్ల సమయం పట్టొచ్చు. అరుదుగా ఐదేళ్లు అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే అప్పుడు ఏం చేయాలన్నది కూడా ముందుగానే నిర్ణయించుకోవాలి. కనుక లక్ష్యానికి మరో 3–4 ఏళ్లు వ్యవధి ఉండగానే ఈక్విటీ పెట్టుబడుల నుంచి ప్రతీ నెలా నిర్ణీత శాతం చొప్పున డెట్ సాధనాలకు మళ్లించుకోవాలి. ఇందుకు సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లక్ష్యం మరో 18 నెలలు ఉందనగా అనుకున్నంత సమకూరడం లేదని తెలిస్తే.. అప్పుడు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంతరాన్ని పూడ్చుకుందామనుకుంటే తప్పు చేసినట్టు అవుతుంది. మరో 2–3 ఏళ్ల వ్యవధి ఉంటే ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవడం సరికాదు. దీనికి బదులు వీలైతే ఆ లక్ష్యాన్నే వాయిదా వేసుకోవడం ఒక మార్గం. విశ్రాంత జీవనం, పిల్లల ఉన్నత విద్య లక్ష్యాలకు ఈ వాయిదా కుదరదు. కానీ, కారు కొనుగోలు, ఇల్లు కొనుగోలు, ఇతర విలాస వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఇతర లక్ష్యాల నిధి నుంచి కొందరు తీసేసుకుంటారు. కారు కొనుగోలు వంటి అవసరం కాని నిధి నుంచి తీసుకుంటే తప్పులేదు. కానీ, పిల్లల విద్య, విశ్రాంత జీవనం లక్ష్యాల నుంచి తీసుకోవడం సరికాదు. అటువంటప్పుడు విద్యా రుణం వంటి మార్గాలను పరిశీలించొచ్చని షా సూచించారు. -
వస్తున్నది సరే...దాస్తున్నది ఎంత?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోడానికి తమకు తగిన పెట్టబడి మార్గాలలో మదుపు చూస్తూ ఉన్నారు. కానీ ఆ మదుపు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత మేర తాము అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే మదుపు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ⇔ మొదటిగా... మీరు సంపాదించిన దానిలో ఎంతో కొంత మీకు సాధ్యమైనంత మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో తప్పకుండా పెట్టుబడి పెట్టండి. ఇది ఒక అత్యవసరమైన ఖర్చు అనుకుని మదుపు చెయ్యండి. అలాగే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ కాలపరిమితి కంటే ముందు వెనక్కు తీయకండి. ఖర్చులకు వాడకండి. ⇔ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఏదైనా స్టాక్ బ్రోకర్ దగ్గర ఖాతాను ప్రారంభించాలి. అలాగే డి.పి. (డిపాజిటరీ పార్టిసిపెంట్) దగ్గర డీ-మ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. కానీ ఇప్పటికీ చాలామంది ఖాతాలను ప్రారంభించకుండా తమ స్నేహితుల ఖాతాలలో లేదా సహ ఉద్యోగుల / కుటుంబీకుల / బంధువుల ఖాతాలలో లావాదేవీలు జరుపుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. ఎందుకంటే ఖాతా ఎవ రైతే కలిగి ఉన్నారో వారికే ఆ ఖాతాకు సంబంధించిన హక్కులు ఉంటాయి. ⇔ అలాగే డీ-మ్యాట్ ఖాతా ఇన్స్ట్రక్షన్ స్లిప్ బుక్‌ని అందులో ఏమీ రాయకుండా మీ బ్రోకర్‌కి ఇవ్వకండి. మీ డీ-మ్యాట్ ఇన్స్ట్రక్షన్ స్లిప్ బుక్ మీ చెక్ బుక్ తో సమానం. బ్లాంక్ చెక్ సంతకం చేసి ఎలా అయితే మీరు ఎవ్వరికీ ఇవ్వరో అదే విధంగా మీ డీ-మ్యాట్ ఖాతా ఇన్స్ట్రక్షన్ స్లిప్ బుక్‌ని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ⇔ మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా.. అంటే, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్స్, బాండ్స్, ఇన్సూరెన్స్ తదితరాలలో పెట్టుబడి పెట్టినప్పుడు నామినీని తప్పనిసరిగా నమోదు చేయాలి. ⇔ ఏయే పెట్టుబడి మార్గాలలో ఎంతెంత పెట్టుబడి పెట్టారు? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? వాటికి సంబంధించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయి? సంబంధిత వ్యక్తుల కాంటాక్టు నంబర్లు మొదలైన వాటి గురించి మీ కుటుంబ సభ్యులతో తరచు చర్చిస్తూ ఉండండి. వారికి ఒక అవగాహన ఏర్పరచండి. ⇔ మీరు నివసించే చిరునామా, మీరు ఉపయోగించే కాంటాక్టు నెంబర్లు మారినట్లయితే వాటిని మీరు ప్రారంభించిన అన్ని ఖాతాలలోనూ మార్పించండి. కాంటాక్టు నెంబరును, ప్రత్యామ్నాయ కాంటాక్టు నెంబరును కచ్చితంగా పొందుపరచండి. ⇔ అన్ని పెట్టుబడులను సాధ్యమైనంత వరకు చెక్ / ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా చెయ్యండి. నగదు రూపేణా చేయడం తగ్గించండి. ఒక వేళ నగదు రూపేణా చేసినా రసీదు తప్పనిసరిగా తీసుకోండి. దానిని భద్రపరుచుకోండి. ⇔ చిన్న మొత్తమైనా తక్కువ వయసు నుండే మొదలు పెట్టడం మంచిది. తద్వారా రిటైర్మెంట్ సమయానికి మీకు తగిన మొత్తం చేకూరుతుంది. వయసు గడిచాక ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టినా అంత మొత్తం రాదు. ఉదాహరణకు రామ్, శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులు ఈ కింది విధంగా పెట్టుబడి పెడితే వారికి 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఎలాంటి ఫలితాలు అందాయో చూడండి. ⇔ పై ఉదాహరణలో చూసినట్లయితే శ్యామ్ 2000 రూపాయలు పెట్టినా రామ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు! ⇔ మీ పెట్టుబడిని మొత్తం ఒకే మార్గంలో పెట్టకండి. వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టండి. దీని వల్ల మీరు రిస్క్‌ని తగ్గించుకోగలుగుతారు. ⇔ కనీసం 6 నెలలకు ఒకసారైనా లేక ఏడాదికొకసారైనా మీ పెట్టుబడులను పునఃసమీక్షించుకోండి. మార్పులు చేర్పుల చేయవలసి వస్తే వాటిని అమలు పరచండి. ⇔ ఏమేమి పెట్టుబడి మార్గాలు ఉన్నాయి? వాటి వివరాలు ఏంటి? రిస్క్ రిటర్న్‌లు ఎలా ఉంటాయి? ఏ విధంగా ప్రారంభించాలి అనే విషయాలు ప్రస్తుత పరిస్థితుల్లో సేకరించడం, అవగాహన ఏర్పరచుకోవడం చాలా సులువు. కానీ వాటిని ఆచరించడం చాలా కష్టమైన పని! కానీ అనుకుంటే, ముఖ్యంగా మహిళలు అనుకుంటే సాధించలేని ఏదీ ఉండదు. కనుక స్థిర నిశ్చయంతో మీరు ఏ విధంగా ముందుకు పోవాలనుకున్నారో దానికి ప్రణాళికను సిద్ధం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే మీ ఆర్థిక లక్ష్యాలను కచ్చితంగా చేరుకుంటారు. బెస్ట్ ఆఫ్ లక్. -
రెండవ పాలసీ అవసరమంటారా?
రఘుకు ఇప్పుడు 40 సంవత్సరాలు. భార్య, ఏడేళ్ల బాబుతో సంతోషంగా, ఉన్నదానితో తృప్తిగా జీవితం గడుపుతున్నాడు. వెనకా ముందూ ఆస్తిపాస్తులేవీ లేవు. రెక్కల కష్టమే బతుకు బండికి ఆధారం. వివాహానికి ముందు 15 సంవత్సరాల కాల వ్యవధితో 10 లక్షలకు జీవిత బీమా పాలసీ ఒకటి తీసుకున్నాడు. ఇప్పుడూ క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తున్నాడు. పెళ్లికి ముందు ఏ బాదరబందీ లేదు. కాబట్టి ఆ మొత్తానికి బీమా చాలు. అయితే ఇప్పుడు అవసరాలు వేరు. తన పై భార్య, బాబు ఆధారపడి ఉన్నారు. వారి భవిష్యత్‌కి బంగారు బాట వేయడం కూడా ఇప్పుడు రఘు బాధ్యత. ఆర్థికంగా లేదా వైద్య పరంగా.. లేదా మరేతర అనుకోని ఇబ్బంది వచ్చినా... రఘు సంపాదనమీద ఆధారపడినవారి జీవితానికీ కొంత భద్రత అవసరం. అవసరాలు మారుతుంటాయ్ రఘుకు సంబంధించి ముఖ్య విషయాలను గమనించాలి. అవి రఘు విషయంలోనే కాదు దాదాపు ప్రతి ఒక్కరికీ వర్తించేవే. మనిషి ఆర్థిక అవసరాలు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతుంటాయి. ఆయా అంశాలకు, కాలగమనంలో ఏర్పడే అవసరాలకు అనుగుణంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటుండాలి. ఆయా క్రమంలో జీవిత బీమా కీలకమైనది. ఒక పాలసీ ఉండగా మరొకటి తీసుకోవడం అవసరమా? అన్న ఒకరి సందేహానికి మరొకరు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి వారు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా సందర్భాల్లో ప్రధానంగా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని పరిశీలిస్తే... ఆర్థిక లక్ష్యాలు: ప్రతి వారూ తన వ్యక్తిగత లేదా కుటుంబ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్యాలను సాధించుకోవడానికి అనుగుణమైన ఆర్థిక భరోసా, భద్రత ఉందా లేదా అన్న అంశాలను స్వయంగా పరిశీలించుకోవాలి. అనుకోని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా... అవి లక్ష్యాలను సాధించుకునే దిశలో ఇబ్బందిని, వైఫల్యాన్ని సృష్టించకూడదు. ఈ క్రమంలో జీవిత బీమా కీలకమైనది. ప్రస్తుతం ఉన్న బీమా పరిమాణం లక్ష్య సాధన క్రమంలో సహాయపడుతుందో లేదో తొలుత నిర్ణయించుకోవాలి. లేదంటే మరో పాలసీ తీసుకోవడానికి సందేహించనక్కర్లేదు. ఉద్యోగుల విషయంలో..: సహజంగా ఉద్యోగులకు యాజమాన్యం వైపునుంచి జీవిత బీమా సౌలభ్యం ఉంటుంది. ఈ గ్రూప్ పాలసీలు సర్వసాధారణంగా దాదాపు వ్యక్తులందరికీ జీవన క్రమంలో ఎదురయ్యే వైద్య, ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొనే రీతిలో ఉంటాయి. ఈ పాలసీల సౌలభ్యత మన పూర్తి అవసరాలకు సరిపడుతుందా లేదా అన్న అంశాన్ని పరి శీలించుకోవాలి. యాజమాన్యం వైపు నుంచి తీసుకునే బీమా పరిమాణం మన అవసరాలకన్నా తక్కువగా ఉందనుకుంటే... మన అవసరాల మేరకు ప్రత్యేకంగా మరో పాలసీని తీసుకోవడానికి ఆలోచించనక్కర్లేదు. అవగాహన అవసరం: మన వార్షిక ఆదాయానికి 9 నుంచి 10 రెట్లు అదనపు లైఫ్ కవర్ ఉండడం మంచిదన్నది ఈ రంగంలో నిపుణుల సలహా. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పాలసీల ప్రయోజనాల మీద పూర్తి అవగాహన అవసరం. జీవితానికి ఇబ్బంది ఎదురైతే కుటుంబ భవిష్యత్, పిల్లల విద్య, తత్సంబంధ లక్ష్యాలు, రిటైర్మెంట్ ఇలా ప్రతి విషయాన్నీ పరిశీలించాలి. ఆ మేరకు తగిన పాలసీ భరోసా తక్షణం అందుబాటులో ఉందో లేదో చూడాలి. ముఖ్యంగా నగదు విలువ లేకుండా, నిర్దిష్ట కాలానికి కవరేజ్ అందించే టర్మ్ పాలసీల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. రైడర్లూ కీలకమే: పాలసీకి అనుబంధంగా తీసుకునే వీలున్న ‘రైడర్ల’పై చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. బీమా ప్రయోజనాలను అధికంగా పొందేందుకు ఈ రైడర్లు దోహదపడతాయి. స్వల్ప వ్యయాలతో ప్రస్తుత పాలసీ లబ్ధి అదనంగా మరిన్ని ప్రయోజనాలను అందించేదే... రైడర్. ఉదాహరణకు ‘క్రిటికల్ ఇల్నెస్’ పాలసీని తీసుకుందాం. ఈ పాలసీని డెరైక్ట్‌గా (స్టాండెలోన్) తీసుకోవచ్చు. లేదా ఒక పాలసీకి అదనంగా... రైడర్‌గానూ తీసుకోవచ్చు. ప్రీమియం రద్దు, ప్రమాదవశాత్తు మరణం, ఆదాయం ప్రయోజనం, సర్జికల్-హాస్పిటల్ కేర్ ఇలా రైడర్లలో పలు రకాలు ఉన్నాయి.