రెండవ పాలసీ అవసరమంటారా? | is there need second policy ? | Sakshi
Sakshi News home page

రెండవ పాలసీ అవసరమంటారా?

Published Sun, Aug 10 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

రెండవ పాలసీ అవసరమంటారా?

రెండవ పాలసీ అవసరమంటారా?

 రఘుకు ఇప్పుడు 40 సంవత్సరాలు.  భార్య, ఏడేళ్ల బాబుతో సంతోషంగా, ఉన్నదానితో తృప్తిగా జీవితం గడుపుతున్నాడు.  వెనకా ముందూ ఆస్తిపాస్తులేవీ లేవు. రెక్కల కష్టమే బతుకు బండికి ఆధారం. వివాహానికి ముందు 15 సంవత్సరాల కాల వ్యవధితో 10 లక్షలకు జీవిత బీమా పాలసీ ఒకటి తీసుకున్నాడు. ఇప్పుడూ క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తున్నాడు. పెళ్లికి ముందు ఏ బాదరబందీ లేదు.

 కాబట్టి ఆ మొత్తానికి బీమా చాలు. అయితే ఇప్పుడు అవసరాలు వేరు. తన పై భార్య, బాబు ఆధారపడి ఉన్నారు. వారి భవిష్యత్‌కి బంగారు బాట వేయడం కూడా ఇప్పుడు రఘు బాధ్యత. ఆర్థికంగా లేదా వైద్య పరంగా.. లేదా మరేతర అనుకోని ఇబ్బంది వచ్చినా... రఘు సంపాదనమీద ఆధారపడినవారి జీవితానికీ కొంత భద్రత అవసరం.

 అవసరాలు మారుతుంటాయ్
 రఘుకు సంబంధించి ముఖ్య విషయాలను గమనించాలి. అవి రఘు విషయంలోనే కాదు దాదాపు ప్రతి ఒక్కరికీ వర్తించేవే. మనిషి ఆర్థిక అవసరాలు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతుంటాయి. ఆయా అంశాలకు, కాలగమనంలో ఏర్పడే అవసరాలకు అనుగుణంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటుండాలి. ఆయా క్రమంలో జీవిత బీమా కీలకమైనది. ఒక పాలసీ ఉండగా మరొకటి తీసుకోవడం అవసరమా? అన్న ఒకరి సందేహానికి మరొకరు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి వారు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా సందర్భాల్లో ప్రధానంగా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

వీటిని పరిశీలిస్తే...
 ఆర్థిక లక్ష్యాలు: ప్రతి వారూ తన వ్యక్తిగత లేదా కుటుంబ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్యాలను సాధించుకోవడానికి అనుగుణమైన ఆర్థిక భరోసా, భద్రత ఉందా లేదా అన్న అంశాలను స్వయంగా పరిశీలించుకోవాలి. అనుకోని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా... అవి లక్ష్యాలను సాధించుకునే దిశలో ఇబ్బందిని, వైఫల్యాన్ని సృష్టించకూడదు. ఈ క్రమంలో జీవిత బీమా కీలకమైనది. ప్రస్తుతం ఉన్న బీమా పరిమాణం లక్ష్య సాధన క్రమంలో సహాయపడుతుందో లేదో తొలుత నిర్ణయించుకోవాలి. లేదంటే మరో పాలసీ తీసుకోవడానికి సందేహించనక్కర్లేదు.

 ఉద్యోగుల విషయంలో..: సహజంగా ఉద్యోగులకు యాజమాన్యం వైపునుంచి జీవిత బీమా సౌలభ్యం ఉంటుంది. ఈ గ్రూప్ పాలసీలు సర్వసాధారణంగా దాదాపు వ్యక్తులందరికీ జీవన క్రమంలో ఎదురయ్యే వైద్య, ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొనే రీతిలో ఉంటాయి.  ఈ పాలసీల  సౌలభ్యత మన పూర్తి అవసరాలకు సరిపడుతుందా లేదా అన్న అంశాన్ని పరి శీలించుకోవాలి. యాజమాన్యం వైపు నుంచి తీసుకునే బీమా పరిమాణం మన అవసరాలకన్నా తక్కువగా ఉందనుకుంటే... మన అవసరాల మేరకు ప్రత్యేకంగా మరో పాలసీని తీసుకోవడానికి ఆలోచించనక్కర్లేదు.

 అవగాహన అవసరం: మన వార్షిక ఆదాయానికి 9 నుంచి 10 రెట్లు అదనపు లైఫ్ కవర్ ఉండడం మంచిదన్నది ఈ రంగంలో నిపుణుల సలహా. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పాలసీల ప్రయోజనాల మీద పూర్తి అవగాహన అవసరం. జీవితానికి ఇబ్బంది ఎదురైతే కుటుంబ భవిష్యత్, పిల్లల విద్య, తత్సంబంధ లక్ష్యాలు, రిటైర్‌మెంట్ ఇలా ప్రతి విషయాన్నీ పరిశీలించాలి. ఆ మేరకు తగిన పాలసీ భరోసా తక్షణం అందుబాటులో ఉందో లేదో చూడాలి. ముఖ్యంగా నగదు విలువ లేకుండా, నిర్దిష్ట కాలానికి కవరేజ్ అందించే టర్మ్ పాలసీల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

 రైడర్లూ కీలకమే: పాలసీకి అనుబంధంగా తీసుకునే వీలున్న ‘రైడర్ల’పై చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. బీమా ప్రయోజనాలను అధికంగా పొందేందుకు ఈ రైడర్లు దోహదపడతాయి. స్వల్ప వ్యయాలతో ప్రస్తుత పాలసీ లబ్ధి అదనంగా మరిన్ని ప్రయోజనాలను అందించేదే... రైడర్. ఉదాహరణకు ‘క్రిటికల్ ఇల్‌నెస్’ పాలసీని తీసుకుందాం. ఈ పాలసీని డెరైక్ట్‌గా (స్టాండెలోన్) తీసుకోవచ్చు. లేదా ఒక పాలసీకి అదనంగా...  రైడర్‌గానూ తీసుకోవచ్చు. ప్రీమియం రద్దు, ప్రమాదవశాత్తు మరణం, ఆదాయం ప్రయోజనం, సర్జికల్-హాస్పిటల్ కేర్ ఇలా రైడర్లలో పలు రకాలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement