వస్తున్నది సరే...దాస్తున్నది ఎంత? | story on woman empowerment and savings | Sakshi
Sakshi News home page

వస్తున్నది సరే...దాస్తున్నది ఎంత?

Published Mon, Aug 8 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

వస్తున్నది సరే...దాస్తున్నది ఎంత?

వస్తున్నది సరే...దాస్తున్నది ఎంత?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోడానికి తమకు తగిన పెట్టబడి మార్గాలలో మదుపు చూస్తూ ఉన్నారు. కానీ ఆ మదుపు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత మేర తాము అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే మదుపు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

మొదటిగా... మీరు సంపాదించిన దానిలో ఎంతో కొంత మీకు సాధ్యమైనంత మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో తప్పకుండా పెట్టుబడి పెట్టండి. ఇది ఒక అత్యవసరమైన ఖర్చు అనుకుని మదుపు చెయ్యండి. అలాగే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ కాలపరిమితి కంటే ముందు వెనక్కు తీయకండి. ఖర్చులకు వాడకండి.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారు ఏదైనా స్టాక్ బ్రోకర్ దగ్గర ఖాతాను ప్రారంభించాలి. అలాగే డి.పి. (డిపాజిటరీ పార్టిసిపెంట్) దగ్గర డీ-మ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. కానీ ఇప్పటికీ చాలామంది ఖాతాలను ప్రారంభించకుండా తమ స్నేహితుల ఖాతాలలో లేదా సహ ఉద్యోగుల / కుటుంబీకుల / బంధువుల ఖాతాలలో లావాదేవీలు జరుపుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. ఎందుకంటే ఖాతా ఎవ రైతే కలిగి ఉన్నారో వారికే ఆ ఖాతాకు సంబంధించిన హక్కులు ఉంటాయి.

అలాగే డీ-మ్యాట్ ఖాతా ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ బుక్‌ని అందులో ఏమీ రాయకుండా మీ బ్రోకర్‌కి ఇవ్వకండి. మీ డీ-మ్యాట్ ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ బుక్ మీ చెక్ బుక్ తో సమానం. బ్లాంక్ చెక్ సంతకం చేసి ఎలా అయితే మీరు ఎవ్వరికీ ఇవ్వరో అదే విధంగా మీ డీ-మ్యాట్ ఖాతా ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ బుక్‌ని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలి.

మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా.. అంటే, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్స్, బాండ్స్, ఇన్సూరెన్స్ తదితరాలలో పెట్టుబడి పెట్టినప్పుడు నామినీని తప్పనిసరిగా నమోదు చేయాలి.

ఏయే పెట్టుబడి మార్గాలలో ఎంతెంత పెట్టుబడి పెట్టారు? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? వాటికి సంబంధించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయి? సంబంధిత వ్యక్తుల కాంటాక్టు నంబర్లు మొదలైన వాటి  గురించి మీ కుటుంబ సభ్యులతో తరచు చర్చిస్తూ ఉండండి. వారికి ఒక అవగాహన ఏర్పరచండి.

మీరు నివసించే చిరునామా, మీరు ఉపయోగించే కాంటాక్టు నెంబర్లు మారినట్లయితే వాటిని మీరు ప్రారంభించిన అన్ని ఖాతాలలోనూ మార్పించండి. కాంటాక్టు నెంబరును, ప్రత్యామ్నాయ కాంటాక్టు నెంబరును కచ్చితంగా పొందుపరచండి.

అన్ని పెట్టుబడులను సాధ్యమైనంత వరకు చెక్ / ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చెయ్యండి. నగదు రూపేణా చేయడం తగ్గించండి. ఒక వేళ నగదు రూపేణా చేసినా రసీదు తప్పనిసరిగా తీసుకోండి. దానిని భద్రపరుచుకోండి.

చిన్న మొత్తమైనా తక్కువ వయసు నుండే మొదలు పెట్టడం మంచిది. తద్వారా రిటైర్‌మెంట్ సమయానికి మీకు తగిన మొత్తం చేకూరుతుంది. వయసు గడిచాక ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టినా అంత మొత్తం రాదు. ఉదాహరణకు రామ్, శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులు ఈ కింది విధంగా పెట్టుబడి పెడితే వారికి 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఎలాంటి ఫలితాలు అందాయో చూడండి.

పై ఉదాహరణలో చూసినట్లయితే శ్యామ్ 2000 రూపాయలు పెట్టినా రామ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు!

మీ పెట్టుబడిని మొత్తం ఒకే మార్గంలో పెట్టకండి. వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టండి. దీని వల్ల మీరు రిస్క్‌ని తగ్గించుకోగలుగుతారు.

కనీసం 6 నెలలకు ఒకసారైనా లేక ఏడాదికొకసారైనా మీ పెట్టుబడులను పునఃసమీక్షించుకోండి. మార్పులు చేర్పుల చేయవలసి వస్తే వాటిని అమలు పరచండి.

ఏమేమి పెట్టుబడి మార్గాలు ఉన్నాయి? వాటి వివరాలు ఏంటి? రిస్క్ రిటర్న్‌లు ఎలా ఉంటాయి? ఏ విధంగా ప్రారంభించాలి అనే విషయాలు ప్రస్తుత పరిస్థితుల్లో సేకరించడం, అవగాహన ఏర్పరచుకోవడం చాలా సులువు. కానీ వాటిని ఆచరించడం చాలా కష్టమైన పని! కానీ అనుకుంటే, ముఖ్యంగా మహిళలు అనుకుంటే సాధించలేని ఏదీ ఉండదు. కనుక స్థిర నిశ్చయంతో మీరు ఏ విధంగా ముందుకు పోవాలనుకున్నారో దానికి ప్రణాళికను సిద్ధం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే మీ ఆర్థిక లక్ష్యాలను కచ్చితంగా చేరుకుంటారు. బెస్ట్ ఆఫ్ లక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement