ప్లాన్‌ చెయ్‌.. గోల్‌ వెయ్‌! | Financial planning in the practice of financial goals | Sakshi
Sakshi News home page

ప్లాన్‌ చెయ్‌.. గోల్‌ వెయ్‌!

Published Mon, Dec 20 2021 4:28 AM | Last Updated on Mon, Dec 20 2021 4:28 AM

Financial planning in the practice of financial goals - Sakshi

మంచి వేతనం.. వీలైనంత పెట్టుబడి.. వీటితో ఆర్థిక లక్ష్యాల సాధన సులభమే అనుకుంటున్నారా..? ఎంత సంపాదించామన్నది కాదు.. భవిష్యత్తు కోసం ఎంత ప్రణాళికాబద్దంగా మదుపు చేశామన్నది ముఖ్యమనే ఆర్థిక సూత్రం గుర్తుకు తెచ్చుకోండి. ఆర్థిక లక్ష్యాల సాధనకు దగ్గరి దారి అంటూ లేదు.

అనుకున్నంత సులభమూ కాదు..! సరైన అంచనాలు, రాబడులు, అంచనాలకు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని జోడించడం, వివిధ సాధనాల మధ్య సమతూకమైన కేటాయింపులు, అత్యవసరాలకు సన్నద్ధత, జీవితానికి, రుణాలకు, ఆరోగ్యానికి రక్షణలు.. ఇటువంటివన్నీ ఎంతో కీలకమవుతాయి. 

ఒకటి అనుకోవచ్చు. కానీ, ఫలితం మరో రకంగా ఉండొచ్చు. తుది ఫలితంపై ప్రభావం చూపించే అంశాలు ఎన్నో ఉంటాయి. మెరుగైనవి అనుకున్న ప్రణాళికలు కూడా బెడిసి కొట్టొచ్చు. ఇందుకు కారణం మీరు వేసే తప్పటడుగులు కావచ్చు. తప్పుడు అంచనాలు కూడా కావచ్చు. ఆర్థిక లక్ష్యాల సాధనలో పొరపాట్లు, తప్పులకు అవకాశం లేకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడమే ఈ కథనం ప్రధాన ఉద్దేశం.
 
పునాదులు బలంగా ఉంటేనే నిర్మాణం చాలా కాలం పాటు నిలుస్తుంది. మీ ఆర్థిక ప్రణాళికకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అకాల మరణం సంభవిస్తే.. పెద్ద ప్రమాదానికి లోనైతే.. తీవ్ర అనారోగ్యం బారిన పడితే.. అనుకోకుండా ఉద్యోగాన్ని కోల్పోతే ప్రణాళికలపై పెద్ద ప్రభావమే పడుతుంది. ముఖ్యంగా గత రెండేళ్లలో (కరోనా నాటి నుంచి) ఎన్ని అనూహ్య పరిణామాలను వ్యక్తులుగా మనం ఎదుర్కోవాల్సి వచ్చిందో గుర్తు చేసుకోవాలి.

ఉద్యోగాలు కోల్పోయిన వారు, వేతన కోతలను ఎదుర్కొన్నవారు, ఆస్పత్రుల్లో చికిత్సల కోసం రూ.లక్షలు ధారపోసిన వారు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నా.. చాలకుండా ఇబ్బంది పడ్డవారు చాలా మందే ఉన్నారు. జీవిత బీమా లేకుండా, కరోనాతో మరణించిన వ్యక్తుల (స్థితిమంతులు కానివారు) కుటుంబాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. అందుకే తగినంత జీవిత బీమా, వైద్య బీమా రక్షణ, రుణాలకు రక్షణ కవరేజీలతోపాటు అత్యవసర నిధి అంటూ ఒకదానిని సమకూర్చుకోవాలని ఈ పరిణామాలు తెలియజేశాయి.  

బీమా రక్షణ ఎంత తీసుకోవాలి? దీనికి.. అందరికీ ఒక్కటే సమాధానం కాబోదు. వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, ఆరోగ్య చరిత్ర, వయసు ఇలా ఎన్నో అంశాలు ప్రామాణికం అవుతాయి. ఎంతలేదన్నా కనీసం 10 ఏళ్ల వార్షిక ఆదాయానికి తగ్గకుండా బీమా రక్షణ ఉండాలన్నది నిపుణుల సూచన. నెలవారీ మీ కుటుంబ జీవనానికి అవుతున్న ఖర్చులు, చెల్లించాల్సిన రుణ ఈఎంఐలు కీలకం అవుతాయి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి జీవిత బీమా అంటూ ఇతమిద్ధమైన ప్రామాణికం లేదు. భారీగా అప్పులు తీసుకుని ఏదోలా నెట్టుకు వస్తున్న వారికి అధిక కవరేజీ అవసరం.

మీ ఆదాయ వ్యయాలు, తీర్చాల్సిన రుణ బాధ్యతలు, పెట్టుబడులు అన్నీ కూడా జీవిత బీమా కవరేజీ కోసం పరిగణనలోకి తీసుకోవాలని ఫిన్‌సేఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు మృణ్‌ అగర్వాల్‌ సూచించారు. వైద్య బీమా విషయానికొస్తే కనీసం రూ.5 లక్షల కవరేజీ అవసరం. మెట్రోల్లో నివసించే వారికి కనీసం రూ.7–10 లక్షల కవరేజీ అయినా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుటుంబానికి కనీసం రూ.15 లక్షల ఫ్లోటర్‌ పాలసీ ఉండడం సహేతుకమన్నది ఆర్థిక సలహాదారు సూచన. ఇందుకోసం బేసిక్‌గా కొంత కవరేజీ తీసుకుని దానికి సూపర్‌ టాపప్‌ జోడించుకోవడం ద్వారా తక్కువ ప్రీమియానికే మెరుగైన రక్షణ ఉండేలా చూసుకోవచ్చు. 

అత్యవసర నిధితో అనుకోకుండా ఎదురయ్యే అవసరాలను గట్టెక్కవచ్చు. ‘ఆర్థిక ప్రణాళిక అత్యవసర నిధితోనే మొదలవ్వాలి. ఎందుకంటే మిగులు నిల్వలుంటేనే ప్రణాళిక మొత్తం సాఫీగా నడిచిపోతుంది’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు తరుణ్‌ బిరాని సూచించారు.  కనీసం వచ్చే ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అదనంగా మరో 3–6 నెలల అవసరాలకు కూడా నిధిని సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో నిశ్చింతను ఇస్తుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ము ఖ్యంగా ఉద్యోగ భద్రత లేని వారు ఏడాది అవసరాలకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. వీటికి అదనంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ తీసుకోవాలి. తీవ్ర అనారోగ్యాల్లో (కిడ్నీలు, మూత్ర పిండాలు, గుండె జబ్బులు, కేన్సర్‌ వంటివి) బేసిక్‌ హెల్త్‌ కవరేజీ చాలకపోవచ్చు.  

ఒక్కటిగానే.. లేక విడిగానా
ఒక్కో లక్ష్యానికి విడిగా పెట్టుబడులు పెట్టుకోవడమా? లేదంటే అన్నింటినీ కలిపి ఒక్కటే విధానం అనుసరించడమా? ఉద్యోగం లేదా వృత్తి జీవితం కొత్తల్లో చాలా మంది తమకు మిగులుతున్నంత మేరకు తీసుకెళ్లి ఒక్కటే పెట్టుబడిగా నిర్వహిస్తుంటారు. చాలా మంది యువతకు ప్రణాళికల పట్ల ఆసక్తి అంతగా కనిపించడదు. కేవలం ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళుతుంటారు అంతే. తమ ఆర్థిక లక్ష్యాలకు అంకెలను జోడించకపోతే అందులో సమగ్రత లోపిస్తుంది. ఉదాహరణకు రిటైర్మెంట్‌ తర్వాత మీ జీవన అవసరాలకు ఎంత నిధి కావాలన్నదానిపై స్పష్టత ఉండకపోతే.. ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలన్న విషయంలోనూ స్పష్టత ఉండదు.

వీలున్నంత చేసుకుంటూ వెళితే చివర్లో ఆ నిధి సరిపడకపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పైగా ప్రతీ లక్ష్యం వారీగా పెట్టుబడుల ప్రణాళిక లేకపోతే.. ఒక్కటే పెట్టుబడి నిధి కొనసాగుతుంది. అప్పుడు సమీప కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం ఈ ఏకీకృత నిధి నుంచి ఎక్కువ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీంతో భవిష్యత్తు లక్ష్యాలకు కొంతే మిగులుతుంది. ఉదాహరణకు రుణంపై ఇల్లు సమకూర్చుకునేందుకు డౌన్‌ పేమెంట్‌ కోసమని కొంత వెనక్కి తీసుకుంటే.. అప్పుడు పిల్లల ఉన్నత విద్య, విశ్రాంత జీవన అవసరాలపై ప్రభావం కచ్చితంగా పడుతుంది.

అందుకే అన్నింటికీ ఒక్కటే నిధి కాకుండా.. విడిగా ప్రతీ అవసరం, లక్ష్యానికి ప్రత్యేక ప్రణాళిక, కేటాయింపులు ఉండేలా చూసుకోవాలి.  ప్రతీ బకెట్‌లోనూ ప్రత్యేక పెట్టుబడులు అవసరమని కాదు దీని ఉద్దేశ్యం. భిన్న లక్ష్యాలకు ఒకే విధమైన మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా ఇతర పెట్టుబడి సాధనాలను వినియోగించుకోవచ్చు. కాకపోతే ప్రతీ లక్ష్యానికి విడిగా కేటాయింపుల ప్రణాళిక ఉండాలి. అంటే లక్ష్యం వారీగా సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే పూర్తి స్పష్టత ఉంటుంది. ‘‘అసలు ఎందుకు ఇన్వెస్ట్‌ చేస్తున్నామనే దానిపై స్పష్టత ఉంటే ప్రణాళిక అమలు సులభంగా మారుతుంది’’ అని గెట్టింగ్‌ యూ రిచ్‌ సీఈవో రోహిత్‌షా అన్నారు.

అంచనాలు సరిగ్గా ఉంటేనే..  
అన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత.. విడిగా ఒక్కో లక్ష్యానికి ఇన్వెస్ట్‌ చేస్తే మీ బాధ్యత తీరినట్టు కాదు.. లక్ష్యాన్ని చేరినట్టు కానే కాదు. ఫలానా లక్ష్యానికి పెట్టుబడులు ప్రారంభింస్తే సగమే పూర్తయినట్టు అనుకోవాలి. కొన్నేళ్ల తర్వాతి అవసరానికి ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకునే ముందు కరెన్సీ విలువను, కొనుగోలు శక్తిని తగ్గించేసే ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంపిక చేసుకునే సాధనాల్లో రాబడులపై కచ్చితమైన అంచనాలు ఉండాలి. అధిక రాబడుల అంచనాలు వేసుకుంటే అది చివర్లో అయోమయానికి దారితీయవచ్చు.

అందుకే రాబడుల అంచనాలు సహేతుకంగా, చారిత్రక గణాంకాలకు సన్నిహితంగా ఉండేలా చూసుకోవాలి. మీ పెట్టుబడికి ఆ రాబడి అంచనా రేటును జోడిస్తే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంత ఇన్వెస్ట్‌ చేయాలన్నదానిపై స్పష్టత సాధించొచ్చు. ఇక ద్రవ్యోల్బణ రేటు అన్నింటికీ ఒకటే మాదిరిగా ఉండదు. విద్య, వైద్యానికి సంబంధించి మన దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. నిత్యావసర ఉత్పత్తులపై ద్రవ్యోల్బణం మోస్తరుగా ఉంటుంది. ఇళ్ల ధరల ద్రవ్యోల్బణం 3–4 శాతం స్థాయిల్లోనే ఉంటే.. విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం స్థాయిలో ఉంటుంది.

అంటే ఫలానా కోర్సుకు ప్రస్తుతం రూ.లక్ష ఖర్చవుతుంటే.. ఏడాది తర్వాత అదే కోర్సు కోసం రూ.1.10 లక్షలు అవసరమవుతాయి.  పెట్టుబడులపై రాబడులను అధికంగా ఊహించుకోవడం కూడా విఘాతం కలిగించేదే. ఈక్విటీలపై రాబడులు 11–13% దీర్ఘకాలంలో వస్తాయని ఆశించడం సమంజసంగానే ఉంటుంది. అంతేకానీ, 22–24% స్థాయి రాబడులు వస్తాయని అంచనా వేసుకుని ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే చివర్లో కావాల్సిన మొత్తానికంటే తక్కువే సమకూరొచ్చు. అందరికీ ఈక్విటీ కేటాయింపులు అధికంగా ఉండాలనేమీ లేదు. ఈక్విటీలకు తక్కువ కేటాయింపులతోనూ దీర్ఘకాలంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. కాకపోతే అప్పుడు రాబడులపై అంచనాలు మోస్తరుగానే ఉండాలి. అందుకు కావాల్సినంత ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది.  

అస్సెట్‌ అలోకేషన్‌...
ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ సామర్థ్యం, లక్ష్యానికి ఉన్న వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనాలు, రాబడుల అంచనాలకు అనుగుణంగా ఎంత ఇన్వెస్ట్‌ చేయాలన్నది నిర్ణయమవుతుంది. అప్పుడే వివిధ సాధనాల మధ్య ఎంత చొప్పన ఇన్వెస్ట్‌ (అస్సెట్‌ అలోకేషన్‌) చేసుకోవాలన్న స్పష్టతకు రాగలరు. ఆర్జన మొదలు పెట్టిన కొత్తలో ఈక్విటీలకు 75–80 శాతం కేటాయింపులు సరైన విధానమే అవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ, లక్ష్యాలకు చేరువ అవుతున్న తరుణంలోనూ ఈక్విటీలకు కేటాయింపులను 80 శాతం చొప్పున కొనసాగించుకుంటూ వెళ్లడం సరికాదు. ముఖ్యంగా గడిచిన 18–24 నెలల రాబడులను ప్రామాణికంగా చూడొద్దు. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మార్కెట్లు కుప్పకూలి తిరిగి భారీ ర్యాలీ చేశాయి. 15–20 ఏళ్లలో ఈక్విటీల నుంచి 11–12 శాతం రాబడులు ఆశించడం సహేతుకం అవుతుంది. అదే డెట్, ఈక్విటీల కలబోతపై రాబడులు 9–10 శాతం స్థాయిలో ఉంటాయని ఆశించొచ్చు. స్థిరాదాయ సాధనాల నుంచి 7–8 శాతం రాబడులకు మించి ఆశించొద్దు.
 
సమీక్ష, దిద్దుబాటు..
మీరు చేస్తున్న పెట్టుబడులపై రాబడి అంచనాలకు తగ్గట్టుగా లేదనుకోండి.. లేదంటే మీరు వేసుకున్న అంచనాలకు మించి ద్రవ్యోల్బణం ఉందని గుర్తించినట్టయితే.. తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఒక శాతం ఎక్కువ ఉన్నా అదనంగా సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇందుకు వీలుగా పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. ఏటా పెట్టుబడిని నిర్దేశిత శాతం మేర పెంచుకుంటూ వెళ్లడం ఒక పరిష్కారం అవుతుంది. అస్సెట్‌ రీబ్యాలన్స్‌ను అమలు చేయాలి. లక్ష్యానికి చేరువ అవుతున్న సమయంలో అస్సెట్‌ అలోకేషన్‌ పక్కాగా ఉండాలన్నది నిపుణుల సూచన. అనుకున్నట్టుగా ఆర్థిక ప్రణాళిక ముందుకు వెళ్లడం లేదని ఎప్పుడు భావించినా.. నిపుణులైన ఆర్థిక సలహాదారుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు.   

లక్ష్యాన్ని సమీపిస్తుంటే...
లక్ష్యానికి చేరువు అవుతున్న క్రమంలో స్టాక్‌ మార్కెట్‌ ఏదైనా సంక్షోభం కారణంగా కుప్పకూలితే పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మరింత పెట్టుబడికి మొగ్గు చూపించొచ్చు. తద్వారా తక్కువ ధరలకే ఎక్కువ యూనిట్లు సమకూరతాయి. కాకపోతే ఈక్విటీ మార్కెట్‌ బేర్‌ దశ నుంచి బయటకు వచ్చేందుకు 2–3 ఏళ్ల సమయం పట్టొచ్చు. అరుదుగా ఐదేళ్లు అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే అప్పుడు ఏం చేయాలన్నది కూడా ముందుగానే నిర్ణయించుకోవాలి. కనుక లక్ష్యానికి మరో 3–4 ఏళ్లు వ్యవధి ఉండగానే ఈక్విటీ పెట్టుబడుల నుంచి ప్రతీ నెలా నిర్ణీత శాతం చొప్పున డెట్‌ సాధనాలకు మళ్లించుకోవాలి. ఇందుకు సిస్టమ్యాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

లక్ష్యం మరో 18 నెలలు ఉందనగా అనుకున్నంత సమకూరడం లేదని తెలిస్తే.. అప్పుడు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అంతరాన్ని పూడ్చుకుందామనుకుంటే తప్పు చేసినట్టు అవుతుంది. మరో 2–3 ఏళ్ల వ్యవధి ఉంటే ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవడం సరికాదు. దీనికి బదులు వీలైతే ఆ లక్ష్యాన్నే వాయిదా వేసుకోవడం ఒక మార్గం. విశ్రాంత జీవనం, పిల్లల ఉన్నత విద్య లక్ష్యాలకు ఈ వాయిదా కుదరదు. కానీ, కారు కొనుగోలు, ఇల్లు కొనుగోలు, ఇతర విలాస వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఇతర లక్ష్యాల నిధి నుంచి కొందరు తీసేసుకుంటారు. కారు కొనుగోలు వంటి అవసరం కాని నిధి నుంచి తీసుకుంటే తప్పులేదు. కానీ, పిల్లల విద్య, విశ్రాంత జీవనం లక్ష్యాల నుంచి తీసుకోవడం సరికాదు. అటువంటప్పుడు విద్యా రుణం వంటి మార్గాలను పరిశీలించొచ్చని షా సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement