Achievements
-
సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!
-
కొత్త పన్ను కోడ్ అవసరం
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్య సాధనకు తక్కువ పన్ను రేట్లతో కూడిన సమగ్రమైన పన్నుల కోడ్‌ను తీసుకురావాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం, వసూళ్లు మెరుగుపరుచుకోవడం, నిబంధనల అమలును ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఇందుకు ‘ఎఫ్‌ఎల్‌ఏటీ’ నమూనాను ప్రస్తావిస్తున్నారు. కేవలం కొన్ని శ్లాబులు, తక్కువ రేట్లతో, వివాదాలను తగ్గించే విధంగా, పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసే విధంగా ఉండాలంటున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న నేపథ్యంలో నిపుణుల సూచనలకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘జీఎస్టీ కింద ఎన్నో రకాల రేట్లు ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. జీఎస్టీ అన్నది ఒక్కటే రేటుగా ఉండాలి. కానీ, మన దేశంలో ఒకటే రేటు అన్నది సాధ్యం కాదు’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మాజీ చైర్మన్ పీసీ ఝా అభిప్రాయపడ్డారు. కాకపోతే 5 శాతం, 16 శాతం, 28 శాతం చొప్పున మూడు పన్ను శ్లాబులను పరిశీలించాలని సూచించారు. థింక్ చేంజ్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై మాట్లాడారు. ప్రస్తుత పన్ను వ్యవస్థలోని నిబంధనలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ రాజీవ్ ఛుగ్ సైతం సమరి్థంచారు. ‘‘పన్ను రేట్లు తగ్గించడం వల్ల పౌరులు, కంపెనీలకు ఖర్చు పెట్టేందుకు వీలుగా నిధుల మిగులు పెరుగుతుంది. రేట్లను క్రమబద్దీకరిస్తే అది ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుంది’’అని ఛుగ్ వివరించారు. -
Gukesh Dommaraju: అతను.. ఒత్తిడిని అధిగమించే 'ఎత్తులమారి'!
30 నవంబర్, 2017.. అండర్–11 జాతీయ చాంపియన్‌గా నిలిచిన అబ్బాయిని ‘నీ లక్ష్యం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే.. ‘చెస్‌లో ప్రపంచ చాంపియన్ కావడమే’ అని సమాధానమిచ్చాడు. సాధారణంగా ఆ స్థాయిలో గెలిచే ఏ పిల్లాడైనా అలాంటి జవాబే చెబుతాడు. అతను కూడా తన వయసుకు తగినట్లుగా అదే మాట అన్నాడు. కానీ ఆరున్నరేళ్ల తర్వాత చూస్తే అతను వరల్డ్ చాంపియన్ కావడానికి మరో అడుగు దూరంలో నిలిచాడు. ఆ కుర్రాడిలోని ప్రత్యేక ప్రతిభే ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది.పిన్న వయసులో భారత గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందడం మొదలు వరుస విజయాలతో వరల్డ్ చాంపియన్‌కు సవాల్ విసిరే చాలెంజర్‌గా నిలిచే వరకు అతను తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ కుర్రాడి పేరే దొమ్మరాజు గుకేశ్. చెన్నైకి చెందిన ఈ కుర్రాడు ఇటీవలే ప్రతిష్ఠాత్మక వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే ఎంతో బలమైన, అనుభవజ్ఞులైన గ్రాండ్మాస్టర్లతో తలపడి అతను ఈ అసాధారణ ఘనతను సాధించాడు.క్యాండిడేట్స్‌తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు నమోదు చేశాడు. ఈ ఏడాది చివర్లో.. చైనా ఆటగాడు డింగ్ లారెన్తో జరిగే పోరులోనూ గెలిస్తే అతను కొత్త జగజ్జేత అవుతాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 37 ఏళ్లుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి మన దేశం తరఫున అగ్రస్థానాన్ని అందుకున్నప్పుడే గుకేశ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే జోరులో సాధించిన తాజా విజయంతో ఈ టీనేజర్ చెస్ చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.‘త్యాగం’.. తనకు నచ్చని పదం అంటారు గుకేశ్ తండ్రి రజినీకాంత్. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధానికి త్యాగం అనే మాటను జోడించడం సరైంది కాదనేది ఆయన అభిప్రాయం. గుకేశ్ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత అతని కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారు త్యాగాలు చేశారని చెబుతుంటే ఆయనలా స్పందించారు. చెన్నైలో స్థిరపడిన తెలుగువారు ఆయన. రజినీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా, గుకేశ్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్‌గా ఒక ఆస్పత్రిలో పని చేస్తున్నారు. గుకేశ్‌తో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు ఆయన చాలాసార్లు తన వృత్తిని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం సమయం కేటాయించాల్సి వచ్చిందనేది వాస్తవం.‘పిల్లలను పోషించడం తల్లిదండ్రుల బాధ్యత. వారి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా పేరెంట్స్ కాక ఇంకెవరు శ్రమపడతారు! నేను గుకేశ్‌లో ప్రతిభను గుర్తించాను. అందుకు కొంత సమయం పట్టింది. ఒక్కసారి అది తెలిసిన తర్వాత అన్ని రకాలుగా అండగా నిలిచాం. నాకు టెన్నిస్ అంటే పిచ్చి. దాంతో మా అబ్బాయిని అందులోనే చేర్పిద్దాం అనుకున్నాను. కానీ బాబు చెస్‌లో ఆసక్తి చూపిస్తున్నాడని నా భార్య చెప్పింది.ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో..అంతే.. ప్రోత్సహించేందుకు మేం సిద్ధమైపోయాం. చెన్నై చుట్టుపక్కల ఎన్ని టోర్నీలు జరుగుతాయి, ఎలాంటి శిక్షణావకాశాలు ఉన్నాయి, వేరే నగరాలకు వెళ్లి ఎలా ఆడాలి.. ఇలా అన్నీ తెలుసుకున్నాం.. ప్రోత్సహించాం.. అబ్బాయి చదరంగ ప్రస్థానం మొదలైంది’ అని రజినీకాంత్ అన్నారు. గుకేశ్ క్యాండిడేట్స్ గెలిచిన సమయంలో అతని పక్కనే ఉన్న ఆ తండ్రి ఆనందం గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. విజయానంతరం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు గుకేశ్‌ను హత్తుకొని తల్లి కళ్లు చెమర్చాయి.అంచనాలకు అందకుండా రాణించి..కొన్నాళ్ల క్రితం వరకు కూడా క్యాండిడేట్స్ టోర్నీకి గుకేశ్ అర్హత సాధించడం సందేహంగానే కనిపించింది. వరుసగా కొన్ని అనూహ్య పరాజయాలతో అతను వెనకబడ్డాడు. చివరకు చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ గెలవడంతో అతనికి అవకాశం దక్కింది. అయితే టోర్నీకి ముందు.. గుకేశ్ గెలవడం కష్టమంటూ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్య తనపై కాస్త సందేహాన్ని రేకెత్తించింది. అంచనాలు అన్నీ నిజం కావు కానీ కార్ల్సన్ చెప్పడంతో మనసులో ఎక్కడో ఒక మూల కాస్త సంశయం.సాధారణంగా గుకేశ్ టోర్నీలు ఆడే సమయంలో ప్రతి రోజూ రెండుసార్లు తన తల్లికి ఫోన్ చేసేవాడు. గేమ్ ఓడినప్పుడైతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరేవాడు. అప్పుడా అమ్మ.. తన కొడుకుకి.. క్రీడల్లో పరాజయాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో మళ్లీ సత్తా చాటి పైకెగసిన పలువురు దిగ్గజ క్రీడాకారుల గురించి చెబుతూ స్ఫూర్తినింపేది. ఆ ప్రయత్నం ఇటీవల రెండు సార్లు ఫలితాన్నిచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు ఓటములు ఎదురైనప్పుడు మళ్లీ అతను ఆత్మవిశ్వాసం సాధించి పట్టుదలగా బరిలోకి దిగేందుకు ఇది ఉపకరించింది.రెండోసారి ఈ మెగా టోర్నీలో ఏడో రౌండ్లో అలీ రెజా చేతిలో ఓటమి తర్వాత అమ్మ మాటలు మళ్లీ ప్రభావవంతంగా పనిచేశాయి. గుకేశ్ స్వయంగా చెప్పినట్లు ఆ ఓటమే తన విజయానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. క్యాండిడేట్స్ టోర్నీ 14 రౌండ్లలో ఈ ఒక్క గేమ్‌లోనే ఓడిన అతను ఆ తర్వాత తిరుగులేకుండా దూసుకుపోయాడు. గుకేశ్ వాళ్లమ్మ మాటల్లో చెప్పాలంటే.. గతంలో టోర్నీలో ఒక మ్యాచ్ ఓడితే ఆ తర్వాతి రౌండ్లలో అతని ఆట మరింత దిగజారేది. పూర్తిగా కుప్పకూలిపోయేవాడు. కానీ ఇప్పుడు గుకేశ్ ఎంతో మారిపోయాడు. నిజానికి 17 ఏళ్ల వయసులో ఇంత పరిపక్వత అంత సులువుగా రాదు. ఒక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ సమరోత్సాహంతో బరిలోకి దిగడాన్ని అతను నేర్చుకున్నాడు.ఆత్మవిశ్వాసంతో..గుకేశ్ గతంలో ఏ ప్రశ్ననైనా అవును, కాదు అంటూ రెండేరెండు జవాబులతో ముగించేవాడు. కానీ ఇప్పుడు విజయాలు తెచ్చిన ఆత్మవిశ్వాసం అతని వ్యక్తిత్వంలోనూ ఎంతో మార్పు తెచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు అతనికి 24 గంటలూ చెస్ ధ్యాసే. మరో జీవితమే లేకుండా పోయింది. కానీ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా అతను చెస్‌తో పాటు ఇతర అంశాల్లో కూడా సమయం వెచ్చించాడు. యోగా, టెన్నిస్ ఆడటం, సినిమాలు, మిత్రులను కలవడం, తగినంత విశ్రాంతి.. ఇలా అన్ని రకాలుగా అతను తనను తాను మలచుకున్నాడు. ఈ కీలక మార్పు కూడా అతని విజయానికి ఒక కారణమైంది.తల్లిదండ్రులతో..ఒత్తిడిని అధిగమించి..గుకేశ్‌కు ఇది తొలి క్యాండిడేట్స్ టోర్నీ. ఈ టోర్నీలో అతను అందరికంటే చిన్నవాడు కూడా. ప్రత్యర్థుల్లో కొందరు నాలుగు లేదా ఐదుసార్లు ఈ టోర్నమెంట్లో ఆడారు. రెండుసార్లు విజేతైన ఇవాన్ నెపొమినియాచి కూడా ఉన్నాడు. కానీ వీరందరితో పోలిస్తే గుకేశ్ ఒత్తిడిని సమర్థంగా అధిగమించాడు. పైగా ఇందులో రెండో స్థానం వంటి మాటకు చాన్స్ లేదు. అక్కడ ఉండేది ఒకే ఒక్క విజేత మాత్రమే.‘టొరంటోకు నేను ఒకే ఒక లక్ష్యంతో వెళ్లాను. టైటిల్ గెలవడం ఒక్కటే నాకు కావాల్సింది. ఇది అంత సులువు కాదని నాకు తెలుసు. నా వైపు నుంచి చాలా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను. ప్రత్యర్థులతో పోలిస్తే నా ఆటలో కూడా ఎలాంటి లోపాలు లేవనిపించింది. అందుకే నన్ను నేను నమ్మాను’ అని గుకేశ్ చెప్పాడు. అయితే గుకేశ్ తల్లిదండ్రులు మాత్రం అతని విజయంపై అతిగా అంచనాలు పెట్టుకోలేదు. ఇక్కడి అనుభవం.. వచ్చే క్యాండిడేట్స్ టోర్నీకి పనికొస్తే చాలు అని మాత్రమే తండ్రి అనుకున్నారు. కానీ వారి టీనేజ్ అబ్బాయి తల్లిదండ్రుల అంచనాలను తారుమారు చేశాడు.అండర్ 12 వరల్డ్ చాంపియన్‌గా.. , క్యాండిడేట్స్ టోర్నీ గోల్డ్ మెడల్‌తో.. సవాల్‌కు సిద్ధం..గుకేశ్ ఐదేళ్ల క్రితం 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి ఆ ఘనతను అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దానికే పరిమితం కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు సరైన రీతిలో పురోగతి సాధిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు.ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 8వ స్థానానికి చేరిన అతను 2700 ఎలో రేటింగ్ (ప్రస్తుతం 2743) దాటిన అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. వేర్వేరు వ్యక్తిగత టోర్నీలు గెలవడంతో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో తొలి 8 గేమ్‌లలో ఎనిమిదీ గెలిచి ఎవరూ సాధించని అరుదైన రికార్డును సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత విజేత, చైనాకు చెందిన డింగ్ లారెన్తో గుకేశ్ తలపడతాడు.31 ఏళ్ల డింగ్‌కు మంచి అనుభవం ఉంది. 2800 రేటింగ్ దాటిన ఘనత పొందిన అతను చైనా చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు. ఒక దశలో వరుసగా 100 గేమ్‌లలో ఓటమి ఎరుగని రికార్డు అతనిది. అయితే ఇప్పుడు గుకేశ్ చూపిస్తున్న ఆట, ఆత్మవిశ్వాసం, సాధన కలగలిస్తే డింగ్ని ఓడించడం అసాధ్యమేమీ కాదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
సరికొత్త శిఖరాలకు...
కాలక్రమంలో మరో ఏడాది గడిచిపోనుంది... ఒకప్పుడు ప్రాతినిధ్యానికి పరిమితమైన భారత క్రీడాకారులు... ఏడాదికెడాది తమ ప్రతిభకు పదును పెడుతున్నారు... అంతర్జాతీయ క్రీడా వేదికలపై అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. కొన్నేళ్లక్రితం వరకు అందని ద్రాక్షలా కనిపించిన స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సగర్వంగా తమ మెడలో వేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఏడాదీ భారత క్రీడాకారులు విశ్వ క్రీడారంగంలో తమదైన ముద్ర వేసి సరికొత్త శిఖరాలకు చేరుకున్నారు. ఊహించని విజయాలతో భారత క్రీడా భవిష్యత్ బంగారంలా ఉంటుందని విశ్వాసం కల్పించారు. కేవలం విజయాలే కాకుండా ఈ సంవత్సరం కూడా వీడ్కోలు, వివాదాలు భారత క్రీడారంగంలో కనిపించాయి. రెండు దశాబ్దాలుగా భారత మహిళల టెన్నిస్‌కు ముఖచిత్రంగా ఉన్న సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలకడం... దేశానికి తమ పతకాలతో పేరు ప్రతిష్టలు తెచ్చిన మహిళా మల్లయోధులు తాము లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్నామని వీధుల్లోకి రావడం... ఈ వివాదం ఇంకా కొనసాగుతుండటం విచారకరం. –సాక్షి క్రీడా విభాగం తొలిసారి పతకాల ‘సెంచరీ’ గత ఏడాదే జరగాల్సిన ఆసియా క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిచ్చిన ఈ క్రీడల్లో భారత బృందం తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఏకంగా 107 పతకాలతో ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పతకాల సెంచరీ మైలురాయిని దాటింది. భారత క్రీడాకారులు 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు గెల్చుకున్నారు. ముఖ్యంగా ఆర్చరీ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది. పీటీ ఉష తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ బంగారు పతకాలు గెలిచిన భారత క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది. బ్యాడ్మింటన్‌లో ఈ ఏడాది పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి అదరగొట్టింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో తొలిసారి డబుల్స్‌లో స్వర్ణ పతకాలు అందించిన ఈ ద్వయం స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు ఆశించిన ఫలితాలు లభించలేదు. ఆమె కేవలం ఒక టోర్నీలో (స్పెయిన్ మాస్టర్స్) మాత్రమే ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. నిఖత్ పసిడి పంచ్... గత ఏడాది తాను సాధించిన ప్రపంచ టైటిల్ గాలివాటం ఏమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఈ సంవత్సరం నిరూపించింది. న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్ మళ్లీ తన పంచ్ పవర్ చాటుకుంది. 50 కేజీల విభాగంలో నిఖత్ స్వర్ణం సాధించి వరుసగా రెండో ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ నాలుగు స్వర్ణాలు సాధించి ఓవరాల్ చాంపియన్‌గా అవతరించడం విశేషం. ఆసియా క్రీడల్లోనూ నిఖత్ రాణించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మన బల్లెం బంగారం... భారత అథ్లెటిక్స్‌కు ఈ ఏడాది సూపర్‌గా గడిచింది. రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి అందర్నీ అబ్బురపరిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి ఆశ్చర్యపరిచాడు. ఈ ఏడాది మరింత ఎత్తుకు ఎదిగిన నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా స్వర్ణ పతకంతో మెరిశాడు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో నీరజ్ జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరి విశ్వవిజేతగా అవతరించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా అథ్లెట్ జ్యోతి యెర్రాజీ కూడా ఈ సంవత్సరం మెరిపించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. సానియా అల్విదా... రెండు దశాబ్దాలుగా భారత టెన్నిస్‌కు ముఖచిత్రంగా నిలిచిన సానియా మీర్జా ఈ ఏడాది తన కెరీర్‌కు ముగింపు పలికింది. ప్రొఫెషనల్ ప్లేయర్ హోదాలో ఫిబ్రవరిలో దుబాయ్ ఓపెన్‌లో ఆమె చివరిసారిగా బరిలోకి దిగింది. మార్చి 5వ తేదీన సానియా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేశారు. గతంలో డబుల్స్‌లో తన భాగస్వాములుగా ఉన్న ఇవాన్ డోడిగ్, కారా బ్లాక్, బెథానీ మాటెక్, రోహన్ బోపన్నలతో కలిసి సానియా ఈ వీడ్కోలు మ్యాచ్ ఆడింది. మాయని మచ్చలా... ఈ ఏడాది జనవరి 18న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ ఆసియా చాంపియన్ వినేశ్ ఫొగాట్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, బజరంగ్ పూనియా, సంగీత ఫొగాట్ తదితరులు ఆందోళన చేపట్టారు. అనంతరం క్రీడా శాఖ కమిటీ ఏర్పాటు చేసి రెజ్లర్ల ఆరోపణలపై విచారణ చేపట్టారు. బ్రిజ్‌భూషణ్ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినా ఆయనపై మాత్రం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. తాజాగా రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి మలిక్ తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ తమ ‘ఖేల్‌రత్న, పద్మశ్రీ, అర్జున’ పురస్కారాలను వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ఘనత
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్–2 (కృష్ణ) విభాగంలో ఉత్పత్తి 50 మిలియన్ టన్నులకు చేరింది. ఈ విభాగం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 50 మిలియన్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి సాధించి మరో మైలురాయికి చేరుకుంది. ఈ విభాగంలో ఉత్పత్తి 1992 మార్చి 21న ప్రారంభమైంది. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్న సందర్భంగా విభాగంలో గురువారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ అతుల్ భట్ మాట్లాడుతూ ప్లాంట్‌కు అత్యంత కీలక విభాగమైన బ్లాస్ట్ ఫర్నేస్ మరో మైలురాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె.బాగ్జి, సీజీఎం (వర్క్స్) ఎన్.వి.స్వామి, సీజీఎం (ఐరన్) ఆర్.మొహంతి, విభాగాధిపతి ఉదయ్‌నాగ్ పాల్గొన్నారు. -
అటు సన్నద్ధానికి, ఇటు సహనానికి.. మళ్లీ.. మళ్లీ ‘పరీక్షే’
సాక్షి, హైదరాబాద్: సర్కారు కొలువు సాధించడం ఓ యజ్ఞమే. దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడేవారు కొందరు ఉంటున్నారు. అన్నీ వదిలేసి కోచింగ్ తీసుకునేవారు మరికొందరు ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసేవారు, దీర్ఘకాలిక సెలవు పెట్టేవారూ ఉంటారు. అయితే లీకేజీల మకిలీ, పరీక్షల వాయిదా, పరీక్షల రద్దు ఇలా వరుస ఘటనలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ప్రిపరేషనే ఓ పరీక్ష అయితే...సహనానికీ పరీక్ష పెట్టినట్టుగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తెలంగాణస్టేట్ పబ్లిక్‌సర్విస్ కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా ఇప్పటివరకు 30 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఏకంగా 503 ఉద్యోగాలతో గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారిలో ఎంతో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, ఇంజనీరింగ్ ఉద్యోగాలతోపాటు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ టీచర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, లైబ్రేరియన్స్, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్, హార్టీకల్చర్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, టౌన్ ప్లానింగ్.. ఇలా దాదాపు 30వేల ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించింది. రెండో ‘సారీ’ ప్రశ్నపత్రాల లీకేజీతో డీఏఓ, గ్రూప్–1, ఏఈఈ పరీక్షలు రద్దు చేయగా, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, హార్టికల్చర్ ఆఫీసర్ తదితర పరీక్షలు చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ క్రమంలో దాదాపు ఏడున్నర లక్షల మందికిపైగా అభ్యర్థులంతా రెండోసారి పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఇందులో అత్యధికంగా గ్రూప్–1కు 3.80 లక్షల మంది, డీఏఓ పరీక్షకు దాదాపు 1.6లక్షల మంది అభ్యర్థులున్నారు. ఒకసారి పరీక్ష రాశాక, రెండోసారి మళ్లీ పరీక్షకు సన్నద్ధం కావడమనేది మానసికంగా తీవ్రఒత్తిడి కలిగించే విషయమే. ఇక గ్రూప్–1 విషయానికి వస్తే పరీక్ష నిర్వహణలోపాల కారణంగా రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు రెండుసార్లు ఆదేశించింది. గ్రూప్–1 పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అత్యంత ఉత్తమమైన సర్విసు. రాష్ట్రస్థాయి సివిల్ సర్విసుగా భావించే దీనికి ప్రిపరేషన్ అంత ఈజీ కాదు. రోజుకు 18గంటల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి వారికి తాజాగా హైకోర్టు నిర్ణయం షాక్‌కు గురిచేసింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తే హాజరశాతం గణనీయంగా పడిపోయే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాతే హాజరులో స్పష్టత గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 11వ తేదీ సాయంత్రం టీఎస్పీ ఎస్సీ హాజరైన అభ్యర్థుల ప్రాథమిక సమాచారం పేరిట ప్రకటన విడుదల చేసింది. పరీక్ష కేంద్రాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు చెబుతున్నా, ఓఎంఆర్ జవాబుపత్రాలు స్వా«దీనం చేసుకున్న తర్వాత పక్కా గణాంకాలు ఇస్తామని తెలిపింది. సాధారణంగా పరీక్షల హాజరుశాతం గణాంకాలపై స్పష్టత రావాలంటే వెంటనే సాధ్యం కాదు. అన్ని కేంద్రాల నుంచి పక్కా సమాచారం సేకరించడానికి సమయం పడుతుంది. ఈమేరకు టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొన్నా, మరుసటి ప్రకటనలో నెలకొన్న గందరగోళం అభ్యర్థులను కొంత అనుమానాలకు గురిచేసింది. ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ చేసిన ప్రకటనలో స్పష్టత ఇచ్చినా, అభ్యర్థులకు మాత్రం అనుమానాలు తొలగలేదు. ఇక బయోమెట్రిక్ హాజరుతీరు పట్ల కూడా అనుమానాలు నెలకొనడంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో బయోమెట్రిక్ హాజరులో ఎదుర్కొన్న పలు సమస్యల కారణంగానే, బయోమెట్రిక్ వద్దనుకున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థులకు వారం రోజుల ముందే పంపించిన హాల్‌టికెట్లలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశామని చెబుతున్నాయి. అయి తే రెండోసారి జారీ చేసిన హాల్ టికెట్లలో బయోమెట్రిక్ చెక్ఇన్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. -
ఈమెను గుర్తు పట్టారా? సేల్స్ వుమన్ నుంచి...
భారతదేశంలో ఎందరో మహిళలు అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. అత్యంత ప్రభావంతమైన పదవులను నిర్వహించారు.. నిర్వహిస్తున్నారు. అలాంటి కోవకు చెందినవారే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman). నేడు (ఆగస్ట్ 18) ఆమె పుట్టిన రోజు. 64 ఏళ్లు పూర్తయి 65వ యేడులోకి అడుగుపెట్టారు. భారతదేశ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఇంటరాక్టివ్ లీడర్షిప్ స్టైల్‌కు పేరుగాంచారు. కీలకమమైన ఈ పదవిని నిర్వహించిన రెండవ మహిళ, పూర్తి సమయం మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొదటి మహిళ నిర్మలా సీతారామన్. సేల్స్ వుమన్ నుంచి.. సేల్స్ వుమన్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అయ్యే వరకు నిర్మలా సీతారామన్ ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. ఆమె పదునైన వాక్పటిమ, చతురత, అంకితభావం, ప్రతిభకు ముఖ్యమైన ఆర్థిక మంత్రి పదవి దక్కింది. తమిళనాడులోని మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1959 ఆగస్టు 18న నిర్మలా సీతారామన్ జన్మించారు. ఆమె తల్లి సావిత్రి సీతారామన్ గృహిణి. తండ్రి నారాయణ్ సీతారామన్ రైల్వేలో పనిచేశారు. విద్యాభ్యాసం తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాల నుంచి ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేసిన నిర్మలా సీతారామన్ 1984లో జేఎన్‌యూ నుంచి మాస్టర్స్ డిగ్రీని అభ్యసించించారు. ఇండో-యూరోపియన్ టెక్స్టైల్ ట్రేడ్‌పై పరిశోధనలో పీహెచ్డీ కూడా చేశారు. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PWC)లో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. కొంత కాలం పాటు బీబీసీతో కూడా ఆమెకు అనుబంధం ఉంది. ఆర్థిక మంత్రిగా ముద్ర.. పార్లమెంట్ వర్షాకాల సెషన్లో, ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లపై 28 శాతం ట్యాక్స్ ప్రవేశపెట్టడంతోపాటు జీఎస్టీ చట్టాలకు ముఖ్యమైన సవరణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవిత బీమా పథకాలు, ఆర్థిక చేరికకు సంబంధించిన పథకాల అమలులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) ప్రాముఖ్యతను నిర్మలా సీతారామన్ నొక్కిచెప్పారు. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం ద్వారా కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లను ప్రవేశపెట్టడం ఆమె సాధించిన ముఖ్యమైన విజయాలలో ఒకటి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి నాయకత్వం వహించడంలో సీతారామన్ కీలక పాత్ర పోషించారు. ఈ చర్యను 2020లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వ్యూహాత్మక పునర్నిర్మాణం వల్ల ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. బ్యాంకుల విలీనంతో భారత బ్యాంకింగ్ రంగం మరింత సామర్థ్యం చేకూరింది. -
Yelavarthy Nayudamma: అసమాన ప్రతిభావంతుడు
భారత తోళ్ల పరిశ్రమకు నిరుపమాన సేవలందించినవారు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1922 సెప్టెంబరు 10న జన్మించారు. భారత్‌లో విద్యాభ్యాసం అనంతరం అమెరికా చర్మ శుద్ధి పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అద్భుత విజయాలను సాధించారు. తిరిగి మాతృ దేశానికి వచ్చి, తాను చదువుకున్న సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ ట్లో చేరి చివరకు దాని డైరెక్టర్ అయ్యారు. నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డీ హైడ్స్ వంటి వాటి కలయిక, నిర్మాణశైలిపై కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్లను పదును చేసే వినూత్న ఏజంట్స్‌గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అనేక పరిశోధనలలో అగ్రగామిగా భాసిల్లారు. నాయుడమ్మ పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మంతో తయారైన వస్తువులకు విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అలీన దేశాలకు, ఇతర దేశాలకు మధ్య స్నేహవారధిగా నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచారు. నూతన లేబరేటరీలకు ప్రణాళికలు రచించి, స్వయంగా రూపకల్పన చేసి, స్థాపింప జేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్లను దేశ స్థాయిలో తొలిసారిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. ‘లెదర్ సైన్స్’ మాస పత్రికకు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్–ఛాన్స్ లర్గా (1981–1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందారు. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు పొందారు. 1986 నుండి ఆయన పేరుమీద నెలకొల్పిన అవార్డును సైన్స్, టెక్నాలజీ రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ఏటా అందిస్తున్నారు. – డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి (శాస్త్రవేత్త నాయుడమ్మ శతజయంతి) -
జయహో..భారత్
-
లక్ష్యసిద్ధికి త్రికరణశుద్ధి
మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. ఏదయినా పనిని మనసా, వాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపునకు వస్తుంది. మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి. మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసు వల్లనేనని పెద్దల ఉవాచ. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు. అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యక్తిగతంగా తాము చేసే పనులు కూడా శుద్ధమైన మనసుతో ఆచరిస్తే, విజయాలు సాధించవచ్చు. మధ్యయుగం కాలంలోని ఒక చిన్న కథ ద్వారా ఆ సందేశాన్ని తెలుసుకుందాం. ఒక గురువు గారు నదికి అవతలి ఒడ్డున తన శిష్యులతో నిలిచి ఉన్నారు. నదిలో వారిని దాటించే పడవవాడు వెళ్ళిపోయాడు. కానీ గట్టుకు రెండోవేపు ఒక శిష్యుడు నిలిచిపోయాడు. గురువుగారు, వేగంగా రమ్మని ఆ శిష్యుని ఆజ్ఞాపించారు. వెంటనే, ఆ శిష్యుడు నీటిమీద వేగంగా నడుచుకుని అవతలి గట్టుకు వెళ్ళిపోయాడు. గురువుగారు, శిష్యునికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘నాయనా.. ఏ విద్యతో అంత వేగంగా నీటిమీద నడుచుకుంటూ రాగలిగావు’’ అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించగా, శిష్యుడు’’ భలేవారే.. గురువుగారు... మీకు తెలియని విద్యలేవి ఉన్నాయి నా దగ్గర..!! మీరు తొందరగా రమ్మని ఆజ్ఞాపించారు. నేను మదిలో నది ఒడ్డుకు రావాలన్న తలపును త్రికరణశుద్ధిగా ఆచరించాను. విజయవంతంగా మీ దగ్గరకు చేరుకున్నాను’’ అంటూ వినయంగా సెలవిచ్చాడు. ఇందులో శిష్యుడు చూపిన అగణితమైన ప్రతిభకన్నా, అతని అంకితభావం, నదిని విజయవంతంగా దాటే సమయాన మనసా, వాచా, కర్మణా ఒకే పద్ధతిలో ముందుకు సాగడం పెద్ద పెద్ద లక్ష్యాలను తలపోసే అందరికీ అనుసరణీయం. త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎన్నో శాస్త్రాలను, విజ్ఞానాన్ని శిష్యులకు క్షుణ్ణంగా బోధించిన ఓ గురువుగారి జీవనప్రస్థానపు అంతిమఘడియల్లో అమృతతుల్యమైన ఈ సత్యం విశదం అయింది. మహా విజ్ఞాననిధియై జీవితాన్ని గడిపిన గురువుగారికి అంత్యకాలం చేరువ అయ్యింది. ఆయన శిష్యులందరిలో ఎడతెగని విచారం. ఆయన ఆశ్రమ ప్రాంతమంతా విషాద వీచికలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యశిష్యునిగా వ్యవహరిస్తూ, ఆశ్రమ యోగక్షేమాలు చూసే అతనిలో మరీ విచారం..!! ఈ వాతావరణాన్ని పరికిస్తున్న గురువుగారికి జీవన విషమస్థితిలోనూ ఏ మాత్రం మింగుడుపడడం లేదు. గురువు తన ముఖ్యశిష్యుణ్ణి దగ్గరకు పిలిచి ‘‘ఎందుకు మీరంతా అంతగా బాధపడిపోతున్నారు’’ అని ప్రశ్నించగా, అతను గద్గద స్వరంతో ‘‘గురువుగారూ.. మీరు మా నుంచి వెళ్ళిపోతున్నారు. మీవల్ల ఈ ఆశ్రమానికి వచ్చిన గొప్ప గుర్తింపు, ఎనలేని కాంతి మీ తదనంతరం మాయమవుతుంది. మాలో ఈ కారణం చేతనే రోజురోజుకూ అశాంతి పెరుగుతోంది’’ అన్నాడు. దానికి గురువు నవ్వుతూ ‘‘పిచ్చివాడా.. ఎంత అవివేకంతో మాట్లాడుతున్నావు నాయనా..!! నువ్వు చెప్పిన విధంగా జరిగితే, నేను ఇన్ని రోజులూ మీ అందరికీ చేసిన విద్యాబోధన అంతా వృథానే సుమా.. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే.. నేను నేర్పించిన విషయాలను అన్నిటా ఆచరణలో పెడుతూ, మిమ్మల్ని మీరే దివ్యమైన జ్యోతుల్లా వెలిగించుకోండి. అది కేవలం మీరు త్రికరణశుద్ధితో చేసే పనులవల్లనే సదా సాధ్యమవుతుంది’’ అన్నాడు. శిష్యునికి జ్ఞానోదయ మయింది. మిగిలిన వారికీ ఇదే సందేశాన్ని అందించి, గురువు బోధలను మనసా వాచా కర్మణా ఆచరించి విజేతగా నిలిచాడు. త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరందభరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరి గా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. ‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పస కలిగిన పటుత్వం కలుగుతాయి. బుద్ధిమంతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!! ఈ లక్షణం కలిగినవారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి.. త్రికరణ శుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడంప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
దివికేగిన ‘విజయ’ తార
సాక్షి, హైదరాబాద్ : సినీ దిగ్గజం విజయ నిర్మల అంత్యక్రియలు శుక్రవారం చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్లో ముగిశాయి. ఆమె కడచూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆమె భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. బాలనటిగా సినీరంగంలోకి ప్రవేశించిన విజయ నిర్మల.. హీరోయిన్గా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ చరిత్రలోనే ఏ మహిళా దర్శకురాలికి సాధ్యం కాని విధంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. -
దివికేగిన ‘విజయ’ తార
-
నాలుగేళ్ల పాలనలో మోదీ సాధించిందేంటి...?
-
నరేంద్ర మోదీ @4
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రచారంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టనుంది. నిర్ణీత గడువు ప్రకారమైతే వచ్చే ఏప్రిల్,మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు కొన్ని నెలలు ముందుగానే అంటే ఈ ఏడాది చివర్లోనే జరగొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రాంతీయ, తదితర పార్టీల మధ్య కొనసాగుతున్న అనైక్యత కాస్తా కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కొంత సయోధ్య కుదిరే దిశకు మళ్లింది. నాలుగేళ్ల క్రితం అధికారాన్ని చేపట్టినపుడు బీజేపీ ఇచ్చిన ‘అచ్చేదిన్’,‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ వంటి ఆకర్షణీయమైన నినాదాల అమలు ఏమైందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 2022 వరకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండింతలు, ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన, అవినీతిరహిత పాలన వంటి ప్రధాన అంశాలను లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోఉత్పత్తుల ధరలు గరిష్టస్థాయికి చేరుకోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల లేమి, శాంతి,భద్రతల సమస్య వంటివి ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్ 48 ఏళ్ల పాలనతో పోల్చితే మోదీ ప్రభుత్వం 48 నెలల్లో సాధించిన విజయాలంటూ బీజేపీ కార్యాచరణను చేపట్టనుంది. విజయాలు : విద్యుత్‌రంగంలో సాధించిన విజయాలు. అన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లు,రోజుకు 28 కి,మీ మేర రోడ్ల నిర్మాణం, ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ వంటివి బీజేపీ ప్రభుత్వ విజయాల్లో భాగంగా ఉన్నా... ప్రధానంగా జీఎస్టీ :గత పదేళ్లుగా కసరత్తు జరుగుతున్నా గతేడాది జులైలో వస్తు,సేవా పన్ను (జీఎస్టీ) విధానం అమలు. తొలిదశలో దీని అమల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ ప్రత్యక్ష పన్నుల విధానం ద్వారా మేలు చేకూరింది. విదేశీ విధానం : ప్రధానిగా మోదీ 53 దేశాల్లో పర్యటించారు. ఈ విదేశీ పర్యటనలపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. చైనా తదితర దేశాలతో మిత్రత్వం సాధించగలిగారు. డోక్లామ్ వద్ద చైనాతో తలెత్తిన ఘర్షణలు నెమ్మదిగా సమసిపోయాయి. అయితే జమ్మూ,కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో సమస్య అలాగే కొనసాగుతోంది. దాయాది దేశం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారడంతో అక్కడ ఉద్రిక్తతలు సాగుతున్నాయి. ఆర్థిక ఎగవేతదారుల బిల్లు : దేశంలోని బ్యాంకుల నుంచి వేలకోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు చెక్కేసిన విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, తదితరుల విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విమర్శలొచ్చాయి. అయితే విదేశాలకు పారిపోయిన ఈ ఎగవేతదారుల ఆస్తుల స్వాధీనానికి గత ఏప్రిల్‌లో తీసుకొచ్చిన చట్టం ప్రశంసలు అందుకుంది. అవినీతిరహిత ముద్ర : మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు రాలేదు. అందుకు భిన్నంగా యూపీఏ ప్రభుత్వంపై పెద్దెత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా అవి నిరూపితం కాలేదు. ట్రిపుల్ తలాఖ్ : అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్, ఫోన్, లే ఖల ద్వారా మూడుసార్లు తలాఖ్ అంటూ ఇచ్చే విడాకులు (తలాఖ్–ఏ బిద్దత్–ఇన్స్టంట్ తలాఖ్) చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2017 ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. వైఫల్యాలు : పెద్దనోట్ల రద్దు : నల్లధనం అదుపు, నకిలీనోట్ల నియంత్రణకు పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే ఆశించిన మేర ఫలితాలు మాత్రం పెద్దగా రాలేదు. లెక్కలోకి రాని సంపద దేశ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఇతర రూపాల్లో రాకుండా అడ్డుకోలేకపోయారు. కొత్తగా వచ్చిన కరెన్సీ నోట్లకు కూడా నకిలీల జాడ్యం పట్టిపీడిస్తోంది. నకిలీ కరెన్సీ ముద్రణకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మేకిన్ ఇండియా : మేకిన్ ఇండియా పేరిట స్వదేశంలో తయారయ్యే వస్తువులకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించారు. వివిధ ఉత్పత్తులను స్థానికంగానే తయారుచేయడంతో పాటు కొత్త నైపుణ్యాల సృష్టికి ఉపయోగపడుతుందని భావించిన ఈ కార్యక్రమం పెద్దగా విజయవంతం కాలేదు.గత జనవరి వరకు కేవలం 74 స్టార్టప్అప్ కంపెనీలు మాత్రమే పన్ను ప్రయోజనాలు పొందాయి. వసూలు కాని రుణాలు : ప్రభుత్వాన్ని 9 లక్షల కోట్లకు (ట్రిలియన్ల) పైగా వసూలు కాని రుణాలు పట్టి పీడిస్తున్నాయి. గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా ఈ సమస్య వచ్చినా దీని ప్రభావం మోదీ సర్కార్‌పైనా పడింది. ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకులను కాపాడేందుకు 2 లక్షల కోట్లకు పైగా ఉద్ధీపన ప్రణాళిక తీసుకొచ్చింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.13 వేల కోట్లకు పైగా కుంభకోణంలో మునగడం, ఇతర బ్యాంకుల్లో సైతం అడపాదడపా కుంభకోణాలు బయటపడడం ప్రతిబంధకంగా మారింది. వ్యవసాయం : కేంద్ర ప్రభుత్వాన్ని బాధిస్తున్న వాటిలో వ్యవసాయరంగ సమస్యలు ముఖ్యమైనవే. జీడీపీ వృద్ధిలో ఈ రంగం నుంచి అందుతున్న సహకారం అంతంత మాత్రమే. 2018 బడ్జెట్‌కు పూర్వం చేసిన ఆర్థిక సర్వే ప్రకారం... దీర్ఘకాలికంగా చూస్తే వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయరంగ ఆదాయం 25 శాతం వరకు తగ్గిపోయే అవకాశాలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో రుణమాఫీ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఏటా కోటి ఉద్యోగాలు : ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసినా గత నాలుగేళ్లలో పదిలక్షల ఉద్యోగ అవకాశాలు మాత్రమే కల్పించారు. ఈ ఏడాది బడ్జెట్లో జాతీయ ఉద్యోగ, ఉపాధి విధానాన్ని ప్రకటిస్తారని భావించినా అది జరగలేడు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగరంగంపై ప్రత్యేక దృష్టి నిలిపేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
12 ఏళ్లు..లక్ష కేసులు!
అలహాబాద్: అలహాబాద్ హైకోర్టు సీనియర్ జడ్జీగా పనిచేస్తున్న సుధీర్ అగర్వాల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2005 అక్టోబర్ 5వ తేదీన అలహాబాద్ హైకోర్టులో అదనపు జడ్జీగా నియమితులైన ఈయన బుధవారం నాటికి (12 ఏళ్లలో) లక్ష కేసులను పరిష్కరించారు. హైకోర్టు లక్నో బెంచ్‌లో ఉండగానే జడ్జి సుధీర్ అగర్వాల్ 10వేల కేసులను పరిష్కరించారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. -
విజయాల వేటలో మీరెక్కడ?
సెల్ఫ్‌చెక్ విజయం రుచి చూసినవారు దాన్ని వదులుకోవటానికి ఇష్టపడరు. దానికోసం ఎటువంటి కష్టాన్న యినా భరించగలుగుతారు. ఈ స్పృహ ఉన్నవారు నిరంతర శ్రామికులు. లక్ష్యం చేరాక వారు పడిన శ్రమలన్నీ తేలికగా అనిపిస్తాయి. విజయం అవసరంలేదు అనుకొనేవారు సోమరులు. సక్సెస్ సాధించాలి అనే కోరిక మనిషిని హుషారుగా ఉంచుతుంది. విజయాలు చేరుకోవాలనే తృష్ణ మీలో ఉందోలేదో ఒకసారి చెక్ చేసుకోండి. 1. సమాజంలో బాగా పేరున్న వారితో పరిచయం పెంచుకోవాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. ఏరోజు పని ఆరోజు పూర్తి చేస్తారు. ఎ. అవును బి. కాదు 3. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. ఎ. అవును బి. కాదు 4. అందరిలో ఉన్నతంగా కనిపించాలనే తపన మీకుంది. ఎ. అవును బి. కాదు 5. ప్రతికూల అంశాలనూ మీ బలంగా మార్చుకోగలరు. ఎ. అవును బి. కాదు 6. వివిధ రకాల కళలలో మీకు ప్రవేశం ఉంది. ఎ. అవును బి. కాదు 7. సమాజంతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎ. అవును బి. కాదు 8. ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలరు. ఎ. అవును బి. కాదు 9. ఎక్కువగా కష్టపడగలరు, స్ఫూర్తి నింపే వారిని ఇష్టపడతారు. ఎ. అవును బి. కాదు 10. మంచిమాటలు ఎవరు చెప్పినా, వాటిని ఫాలో అవుతారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే మీరు విజయాలను సులువుగా చేరుకోగలరు లేదా దానికోసం చివరివరకు ప్రయత్నిస్తారు. ఏ రంగంలోకి వెళ్లినా పట్టుదలను వదులుకోరు. ఓటమిని అంగీకరించే మనస్తత్వం మీకు ఉండదు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే సక్సెస్ రేస్‌లో వెనకబడతారు. విజయానికి కావలసింది కష్టపడటం. ‘ఎ’లను సూచనలుగా భావించి, సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ నింపుకొని విజయాలబాటలో నడవడానికి ప్రయత్నించండి. -
బాంబే నుంచి బార్సిలోనా వరకు!
ఆదర్శం కొందరు ముందుకు దూసుకుపోతారు. విజయాలను ఆస్వాదించడానికి మాత్రమే పరిమితమైపోతారు. కానీ మరికొందరు ముందుకు దూసుకుపోతారు. ఒకవైపు విజయాలను ఆస్వాదిస్తూనే వెనక్కి తిరిగి చూసుకుంటారు. తమ కష్టాలను, కన్నీళ్లను గుర్తు చేసుకుంటారు. అలాంటి కష్టాలు మరెవరూ పడకుండా చేయాలని తపన పడతారు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే అమీన్ షేక్. అమీన్ ముంబైలో ఒక కారు రెంటల్ కంపెనీకి యజమాని. ఒక మంచి రచయిత. కానీ ఒకప్పుడు తను ముంబై టీ కొట్టులో పనివాడు. మారుతండ్రి తనను హోటల్లో పనికి కుదిర్చితే విధి లేక మౌనంగా చేసేవాడు అమీన్. కొట్టు యజమానితో పాటు, కస్టమర్లు కూడా తిట్టేవారు, ఈసడించేవారు. సాయంత్రం ఇంటికి వస్తే మరో బాధ. మారుతండ్రి చిన్న చిన్న కారణాలతో దండించేవాడు. దాంతో ఈ బాధలు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయాడు అమీన్. ఆదరించేవాళ్లు లేరు. ఆకలి తీర్చే వాళ్లు లేరు. కడుపు కాలితే చెత్తకుండీలు వెదికేవాడు. కన్ను మూతపడితే పార్క్ బెంచి మీద వాలేవాడు. తన చిట్టి కడుపు నింపుకోవడం కోసం బూటు పాలిష్ దగ్గ ర్నుంచి చిన్నా చితకా పనులు ఎన్నో చేశాడు. అలాంటి సమయంలో ఒకరోజు ‘స్నేహసదన్’ అనే స్వచ్ఛందసంస్థ దృష్టిలో పడ్డాడు. వీధి బాలలు, అనాథ బాలలకు అండగా నిలబడే ఈ సంస్థ అమీన్‌కు ఆశ్రయం ఇచ్చింది. చదువు చెప్పించడంతో పాటు డ్రైవింగ్ నేర్పించి సర్టిఫికెట్ ఇప్పించింది. తర్వాత ఆ సంస్థకు సన్నిహితుడైన ఒక పెద్దాయన దగ్గర అమీన్ డ్రైవర్‌గా చేరాడు. అది అతని జీవితాన్నే మార్చేసింది. అమీన్‌లోని కష్టపడేతత్వం, అంకిత భావం చూసి ఆ పెద్దాయన ముచ్చట పడ్డాడు. అమీన్ సొంతంగా కార్ రెంటల్ కంపెనీని మొదలు పెట్టడానికి కావలసిన సహాయ సహకారాలు అందించాడు. దాంతో ‘స్నేహ ట్రావెల్స్’ పేరుతో సొంతంగా ట్రావెల్ కంపెనీని పెట్టి, ఆర్థికంగా స్థిరపడ్డాడు అమీన్. కానీ అక్కడితో ఆగిపోలేదు. ఒకసారి గతంలోకి చూసుకున్నాడు. తాను పడినట్లు ఎవరూ బాధ పడకుండా ఉండేందుకు తన వంతుగా ఏదైనా చేయాలను కున్నాడు. ‘బాంబే టు బార్సి లోనా’ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించి వీధి బాలల కనీస అవసరాలు తీర్చడం మొదలు పెట్టాడు. బాంబే సరే... ఈ బార్సిలోనా ఏమిటి అంటే అమీన్ ఇలా చెప్తాడు... ‘‘నేను ముంబై నుంచి వెళ్లి తొలి సారిగా చూసిన నగరం స్పెయిన్‌లోని బార్సిలోనా. ఈ నగరం నాకు ఎంతగానో నచ్చింది. అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఏర్పడ్డారు. దీంతో డబ్బు పొదుపు చేసుకుని ప్రతి సంవత్సరం అక్కడకు వెళ్లి వస్తుండేవాడిని. అక్కడ నా ఫ్రెండ్స్ చేసే రకరకాల స్వచ్ఛంద కార్యక్రమాలను గమనించేవాడిని. దాంతో సేవ గురించి లోతైన అవగాహన వచ్చింది. ఈసారి నాతో పాటు ముగ్గురు అనాథపిల్లల్ని కూడా తీసుకెళ్లి సంతోషపెట్టాను.’’ అమీన్ అంతే. అనాథ పిల్లల కళ్లలో కాస్త సంతోషం చూసినా మురిసిపోతాడు. ‘లైఫ్ ఈజ్ లైఫ్.. అయామ్ బికాజ్ ఆఫ్ యూ’ పేరుతో తాను రాసిన పుస్తకం మీద వచ్చిన లాభాలను కూడా వీధి పిల్లల కోసం కేటాయించాడు. అది మాత్రమే కాక ‘బాంబే టు బార్సిలోనా’ పేరుతో ముంబైలో తాను నడపనున్న కేఫ్ మీద వచ్చిన లాభాలను కూడా వీధిబాలల విద్యకు, ఉపాధికి కేటాయించాలను కుంటున్నాడు. ఈ కేఫ్‌లో టీ తాగి కబుర్లు చెప్పుకోవడమే కాదు... మంచి మంచి పుస్తకాలు కూడా చదువుకోవచ్చు. డొనేషన్ బాక్స్ కూడా ఉంటుంది. దాతలు అందులో తమకు తోచినంత విరాళాన్ని వెయ్యవచ్చు. ఆ మొత్తాన్నీ వీధిబాలల సంరక్షణ కోసం ఖర్చు చేస్తాడు అమీన్. ప్రసుత్తం ఎనిమిది మంది పిల్లలను దత్తత చేసుకుని, వారి సంరక్షణా బాధ్యతలను చూస్తున్నాడు అమీన్. భవిష్యత్‌లో మరింత మంది బాధ్యతను స్వీకరించాలనుకుంటున్నాడు. మంచి మనసుతో అనుకున్నది నెరవేరకుండా ఉంటుందా! -
తుపాకీ ‘రాయ్’డు
‘యత్రాహం విజయస్థత్రా’ ఇదీ భారత సైన్యంలోని ‘గూర్ఖా రైఫిల్స్’ నినాదం. ఒకరకంగా ‘గూర్ఖా రైఫిల్స్’ విజయానికి రూపకాలంకారం. ఓటమిని అస్సలు ఇష్టపడరు. ఎంతకష్టమైనా అనుకున్నది సాధిస్తారు. అందుకే గూర్ఖా రైఫిల్స్‌కు సైన్యంలో ప్రత్యేకమైన స్థానం. భారత సైన్యంలో ‘11 గూర్ఖా రైఫిల్స్’ రెజిమెంట్‌లో సిపాయిగా చేరిన జీతూ రాయ్.. ఇదే విజయ మంత్రాన్ని పుణికి పుచ్చుకున్నాడు. తుపాకీతో శత్రువులను తుద ముట్టించాల్సిన తను... అదే ఆయుధంతో పతకాల పంట పండిస్తూ దేశం గర్వించేలా విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా ఏషియాడ్‌లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం గెలిచి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు సెప్టెంబర్ 20, 2014.. ఇంచియాన్లోని ఆంగ్నియాన్ షూటింగ్ రేంజ్... పురుషుల 50 మీ. ఎయిర్ పిస్టల్... అందరి కళ్లు స్టార్ షూటర్లు వాంగ్ ఝివీ (చైనా), జోంగో (దక్షిణ కొరియా)పైనే... కానీ ఈ ఇద్దరు ఫైనల్స్‌కు ముందే ఇంటిదారి పట్టారు. దీంతో చూపు హోంగ్ పుంగ్ (వియత్నాం)పై నిలిచింది. స్వర్ణంపై గురి అతనిదేనని అంతా భావించారు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ భారత షూటర్ జీతూ రాయ్ చివరి ప్రయత్నంలో లక్ష్యంవైపు పిస్టల్ పేల్చి స్వర్ణం అందించాడు. అంతే షూటింగ్ రేంజ్లో ఒక్కసారిగా హర్షధ్వానాలు.. సాక్షాత్తు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ సైతం చప్పట్లు కొట్టారంటే జీతూ రాయ్ సాధించిన విజయం ఎంత అమూల్యమైనదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పడిలేచిన కెరటం షూటింగ్ కెరీర్‌ను జీతూరాయ్ ఆకస్మికంగా ఎంచుకోవాల్సి వచ్చింది. గూర్ఖా రెజిమెంట్‌లో సిపాయిగా శిక్షణ సమయంలో రాయ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ బ్లడ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటడంతో ఓ అధికారి అతన్ని షూటింగ్ బృందంలోకి ఎంపిక చేశారు. ఇది సరిగ్గా నాలుగేళ్ల కిందట జరిగింది. అయితే ట్రైనింగ్‌లో చూపిన ప్రతిభను మహూలోని ఆర్మీ మార్క్స్మన్షిప్ యూనిట్ (ఏఎంయూ)లో కనబర్చలేకపోయాడు. ఫలితంగా ఏఎంయూ నుంచి తిరిగి రెజిమెంట్‌కు వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ సత్తా చాటడంతో తిరిగి ఏఎంయూలో శిక్షణకు ఎంపికయ్యాడు. ఈసారీ అదే ఫలితం. అధికారులు మళ్లీ తనని రెజిమెంట్‌కు పంపారు. ఏఎంయూ నుంచి నైపుణ్యం లేదన్న కారణంగా తనను బయటకు పంపడాన్ని రాయ్ జీర్ణించుకోలేక పోయాడు. పోయిన చోటే వెతుక్కున్నాడు. షూటింగ్ కెరీర్‌ను సవాలుగా తీసుకున్నాడు. లక్ష్యంపై గురిపెట్టాడు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. దేశవాళీ పోటీలనే ఇందుకు వేదికగా చేసుకున్నాడు. చివరికి సఫలమయ్యాడు. తనను వద్దన్న వాళ్లే తిరిగి ఏంఎంయూలోకి ఎంపిక చేసేలా చేశాడు. అదే ఉత్సాహాన్ని కొనసాగించి గత ఏడాది భారత్ బృందంలో చోటు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి జీతూ రాయ్ వెనుదిరిగి చూడలేదు. పాల్గొన్న ప్రతీ చాంపియన్‌షిప్‌లోనూ లక్ష్యంవైపు గురిపెట్టి విజయవంతమయ్యాడు. ఫలితంగా తాను పాల్గొన్న తొలి ఏషియాడ్‌లోనే స్వర్ణం సాధించి భారత్‌కు ఇంచియాన్‌లో తొలి స్వర్ణం దక్కేలా చేశాడు. పిస్టల్ కింగ్ లక్ష్యం దిశగా తుపాకీని గురిపెట్టి విజయం సాధించడంలో జీతూ రాయ్‌ని మించిన షూటర్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. అందుకే అతన్ని ‘పిస్టల్ కింగ్’ అని అంతా ముద్దుగా పిలుచుకుంటారు. 10 మీ. ఎయిర్ పిస్టల్, 50 మీ. ఫ్రీ పిస్టల్ ఈవెంట్లలో నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది నిలకడగా మంచి ఫలితాలు సాధించడం ద్వారా మ్యూనిచ్ (జర్మనీ), చాంగ్వాన్ (దక్షిణ కొరియా) ప్రపంచ కప్‌లలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇక ఈ ఏడాదైతే అత్యంత విజయవంతమైన భారత షూటర్‌గా జీతూ రాయ్ రికార్డులకు ఎక్కాడు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 50 మీటర్ల ఫ్రీ పిస్టల్‌లో స్వర్ణాలు కైవసం చేసుకోవడం అతని ప్రతిభకు తార్కాణం. ఇంచియాన్లోనే 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గాడు. ఇక ప్రపంచకప్లలోనైతే తన షూటింగ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. తొమ్మిది రోజుల్లో ప్రపంచకప్‌లలో మూడు పతకాలు నెగ్గి ఔరా అనిపించుకున్నాడు. మ్యూనిచ్ ప్రపంచకప్‌లో 10మీ. ఎయిర్ పిస్టల్‌లో రజతం గెలిచాడు. మరిబోర్ ప్రపంచకప్‌లో 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో బంగారు, 50 మీ. ఫ్రీ పిస్టల్‌లో రజత పతకాలు నెగ్గాడు. ఒక ప్రపంచకప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత షూటర్‌గా ఘనత సాధించాడు. ఈ రెండు ప్రపంచకప్‌లలో సత్తా చాటడంతో అంతర్జాతీయ ర్యాంకుల్లో ఈ భారత షూటర్ టాప్-5లో స్థానం సంపాదించగలిగాడు. ప్రస్తుతం 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో అగ్రస్థానం, 50 మీ. ఫ్రీ పిస్టల్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం ఏడు పతకాలు సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. 2014లో తన ప్రదర్శనపై జీతూ రాయ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. షూటింగ్లో తన విజయానికి ఆర్మీ సహకారమే కారణమని చెప్పాడు. ‘నేను ఎంతో సాధిస్తానని కొన్నేళ్ల కిందట అస్సలు అనుకోలేదు. నేను ఆర్మీకి ఎంతో రుణపడి ఉన్నా. అంతర్జాతీయంగా నేను రాణించడానికి ఆర్మీయే కారణం. ఒకవేళ ఆర్మీ సహకారమే లేకపోతే నేను బ్రిటన్‌లోనో లేదంటే స్వగ్రామంలో ఆలుగడ్డలు పండించుకుంటూ ఉండేవాడిని’ అని జీతూ రాయ్ అన్నాడు. లక్ష్యం ఒలింపిక్స్... భారత్ నుంచి 2016 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి షూటర్ కూడా జీతూనే. షూటింగ్ కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతున్న జీతూ రాయ్‌పై ఇప్పుడు అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న జోరును తను మరో రెండేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ భారత షూటర్ పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే రియో ఒలింపిక్స్ వరకు ఫామ్‌ను కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే భారత త్రివర్ణ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించడం ఖాయం. షూటర్ల ఫ్యాక్టరీ... ఆగస్ట్ 17, 2004.. ఏథెన్స్ ఒలింపిక్స్... మార్కోపోలో షూటింగ్ రేంజ్... పురుషుల డబుల్ ట్రాప్ పోటీల్లో భారత షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకం నెగ్గి చరిత్ర సృష్టించాడు. తను పతకం గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు. అయితే రాథోడ్ విజయానికి కావడానికి మధ్యప్రదేశ్‌లోని మహూలో ఉన్న ఆర్మీ మార్క్స్మన్షిప్ యూనిట్ (ఏఎంయూ) కారణం. ఏథెన్స్ ఒలింపిక్స్‌కు నాలుగేళ్ల ముందటి నుంచి రాథోడ్ ఇక్కడే సాధన చేస్తున్నాడు. అంతర్జాతీయ షూటింగ్లో అలా మొదలైన ఏఎంయూ షూటర్ల ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. జీతూ రాయ్‌తో పాటు విజయ్ కుమార్, గుర్ప్రీత్ సింగ్, ఏడీ పీపుల్స్, ఇమ్రాన్ హసన్ ఖాన్, సీకే చౌదరి, హరి ఓం సింగ్, సుశీల్ గాలే, ప్రవీణ్ దాహియా, సీమా తోమర్ లాంటి అంతర్జాతీయ షూటర్లు ఏఎంయూలో శిక్షణ పొందిన వారే. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ భారత్‌కు పతకాలు అందించి పెడుతున్నారు. ఇంకా అంతర్జాతీయంగా తమ సత్తా చాటేందుకు ఎంతో మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో... మార్క్స్‌మన్ అంటే లక్ష్యాన్ని గురిచూసి కొట్టడం.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిపెట్టడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్‌లోని మహూలో ఆర్మీ మార్క్స్మన్షిప్ యూనిట్ (ఏఎంయూ)లో అత్యాధునిక సౌకర్యాలతో షూటింగ్ రేంజ్‌ను నెలకొల్పారు. 50 మీ. రేంజ్ (60 షూటింగ్ లేన్లు), 25 మీ. రేంజ్ ( 6 షూటింగ్ బేలు), 10 మీ. ఎయిర్ కండీషన్ రేంజ్ (60 షూటింగ్ లేన్లు), రెండు ట్రాప్, స్కీట్ రేంజ్‌లు, 250 మంది షూటర్లు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఫలితంగా ఆర్మీ షూటర్లకు అత్యాధునిక షూటింగ్ రేంజ్ అందుబాటులోకి వచ్చింది. సుశిక్షితులైన షూటింగ్ కోచ్‌ల సాయంతో అనతి కాలంలోనే ఏఎంయూకు చెందిన భారత షూటర్లు అంతర్జాతీయంగా సత్తా చాటడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే ఏఎంయూ భారత కీర్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. తండ్రి మరణంతో మారిన గమ్యం జీతూ రాయ్ పుట్టింది, పెరిగింది నేపాల్‌లోనే. సంకువసాబా జిల్లాలోని సిత్తల్పాటి-8 అనే మారుమూల గ్రామంలో పేదరికంలోనే పెరిగిన జీతూ... ఇంటికి సమీపంలోనే ఉన్న పొలంలో వ్యవసాయం చేసే తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. వరి, మొక్కజొన్న, ఆలుగడ్డలు పండించడంలో తల్లికి సహకరించే వాడు. 2006లో తన తండ్రి మరణంతో అతని గమ్యం మారింది. స్థానికంగా చాలా మంది యువకులు భారత సైన్యంలో చేరడంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని తానూ ఆర్మీలో చేరాడు. టీనేజ్‌లో గూర్ఖా రైఫిల్స్‌లో సిపాయిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే తనలోని నైపుణ్యం బయట పడేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. అప్పటిదాకా సాధారణ సిపాయిలా గూర్ఖా రెజిమెంట్‌లో కఠోర శిక్షణ తీసుకున్నాడు. అలా రాటుదేలిన జీతూ గమ్యం వైపు సాగి విజయవంతమయ్యాడు. శభాష్ గూర్ఖా... భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో నేపాల్ దేశస్తులైన గూర్ఖా సైనికులకు స్థానం ఉంటుంది. ఇందులో నేపాల్‌కు చెందిన రాయ్, లింబూ తెగలకు చెందిన వాళ్లే ప్రధానంగా ఉంటారు. అయితే ఈ తెగలకు చెందిన వారిని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. వీరిది అత్యంత దృడ నిర్మాణం, కఠినమైన స్వభావం. మహాభారత పురాణాల ప్రకారం అర్జునుడిని ఈ తెగలకే చెందిన కిరాంత్ వంశస్తులు ఓడించినట్లు చెబుతారు. ఇదే తెగలకు చెందిన జీతూ రాయ్ ఇప్పుడు అంతర్జాతీయ షూటింగ్లో రాణిస్తూ శభాష్ గూర్ఖా అనిపించు కుంటున్నాడు. -
ఝున్ఝున్వాలాఆర్థిక సూత్రాలు...
ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒక కళ. అంతర్జాతీయంగా ఇన్వెస్ట్మెంట్ గురుగా పేరొందిన వారెన్ బఫెట్, దేశీయంగా రాకేశ్ ఝున్ ఝున్‌వాలా ఈ కళను ఔపోశన పట్టిన వారిలో అగ్రగణ్యులు. ఝున్‌ఝున్‌వాలాను దేశీ వారెన్ బఫెట్ అని కూడా అంటారు. అత్యధిక లాభాలు అందించగలిగే స్టాక్స్‌ను ఒడిసిపట్టుకోగలిగే నేర్పు ఆయన సొంతం. ఆయన ప్రస్తుత సంపద విలువ రూ. 6,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇన్వెస్టరుగా విజయాలు సాధించేందుకు ఆయన పాటించే సూత్రాలు ఇవి.. 1.ఆశావహంగా ఉండాలి. ఇన్వెస్టరుకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన గుణం ఇదే. 2.వాస్తవిక రాబడులనే ఆశించాలి. అత్యాశకు పోవద్దు.. అలాగని అతిగా భయపడనూ కూడదు. 3.నాలుగు అక్షరాల ఇంగ్లిష్ పదం రిస్క్‌ను గుర్తుంచుకోవాలి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. 4.క్రమశిక్షణ ఉండాలి. ప్రణాళికంటూ ఉండాలి. 5.సందర్భాన్ని బట్టి ఊసరవెల్లిలాగా వ్యూహాన్ని మార్చుకోగలగాలి. 6.భిన్నంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయగలగాలి. 7.ఏది కొంటున్నామన్నది ముఖ్యం. ఎంతకు కొంటున్నాం అన్నది అంతకన్నా ముఖ్యం. 8.ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నమ్మకం, ఓపిక ఉండాలి. అప్పుడే ప్రతిఫలం దక్కుతుంది. 9.సందర్భాన్ని బట్టి లాభనష్టాలు, సెంటిమెంటు నిమిత్తం లేకుండా వైదొలగాలి. 10.ఉచిత సలహాలపై ఆధారపడొద్దు. అరువు జ్ఞానంతో లాభాలు రావు. స్వయంగా అధ్యయనం చేసి ముందడుగు వేయాలి. -
రమీజా..మజాకా!
టీవీ క్విజ్‌ల్లో వరుస విజయాలు మా టీవీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లోనూ ప్రతిభ చదివింది నర్సింగ్.. సాధిస్తున్నది బుల్లితెర బహుమతులు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడేళ్లలో మూడు కార్యక్రమాల్లో ప్రతిభ చాటి హ్యాట్రిక్ సాధించాడు. అతనే మదనపల్లెకు చెందిన మహమ్మద్ రమీజ్. మా టీవీ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పాల్గొని రూ.3.20 లక్షలు గెలుచుకున్నాడు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఆదివారం మాటీవీలో ప్రసారమైంది. మదనపల్లె సిటీ : మదనపల్లెలో ఓ విద్యార్థి టీవీ క్విజ్ పోటీల్లో దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో అదరహో అనిపిస్తున్నాడు. ఇం దిరానగర్లోని ఫైరోజ్, జాహిదా దంపతులు. వీరి మొదటి కుమారుడు రమీజ్. 2012లో సోనీ టీవీలో అమితాబచ్చన్‌తో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో, 2013లో విజయ్ టీవీలో ప్రసారమైన ప్రకాష్‌రాజ్‌తో తమిళంలో ‘నీంగళ్ వెలలామ్ ఒరుకోడి’ (నీవు ఒక కోటి గెలవచ్చు) కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అమితాబ్, ప్రకాష్‌రాజ్‌తో కలిసి పలు క్విజ్‌లకు జావాబులిచ్చి అధిక మొత్తంలో బహుమతులను గెలుపొందాడు. తాజాగా మా టీవీ కార్యక్రమంలో మీలో ఎవరు కోటీశ్వరుడులోనూ అర్హత సాధించి రాయలసీమలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. రమీజ్ వృత్తిరీత్యా నర్సింగ్ కోర్సును పూర్తి చేశాడు. ఉద్యోగాన్వేషణలో భాగంగా ప్రతి రోజూ పత్రికలతో పాటు జీకే, కరెంట్ అఫైర్స్ పుస్తకాలను చదివేవాడు. ఈ నేపథ్యంలో వరుసగా మూడు సంవత్సరాల్లో మూడు ప్రధాన కార్యక్రమాల్లో ఎంపికై హ్యాట్రిక్ సాధించాడు. అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇతని విజయం పట్ల రాజీవ్ విద్యామిషన్ అకడమిక్ మానిటరింగ్ అధికారి మహమ్మద్‌ఖాన్, టైలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. ఎస్.నజీర్, అంజుమన్ కమిటీ సభ్యులు ఖాదర్‌హుస్సేన్, సయ్యద్‌బాషా, ఎస్.హెచ్.రహమా న్, అలీ ఖాన్, రఫీవుల్లాఖాన్ అభినందించారు. ఓటమే గెలుపునకు రాచబాట క్విజ్ కార్యక్రమాల్లో చిన్నచిన్న తప్పిదాలతో అద్భుత విజయాలు దూరమవుతాయి. నిరాశ, నిస్ఫృహలకు లోనుకాకూడదు. మరింత పట్టుదలతో ముందుకెళితే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చు. ఓటమి గెలుపునకు రాచబాట. మాటీవీ కార్యక్రమంలో రూ.25 లక్షలు గెలుపు వరకు వెళ్లా. ఓ చిన్నపొరబాటుతో దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎప్పటికైనా కోటి రూపాయల క్విజ్‌ను సాధించి తీరుతా. - మహమ్మద్ రమీజ్ -
రుచులు ఆరేయండి..!
రుతువు మారగానే రుచులూ మారతాయి. నాల్కలు సంప్రదాయ షడ్రుచులను కోరతాయి. అందుకే... ఆరారా తినడానికి ఆరు రుచుల వంటలివే... నాలుకతో నెయ్యానికి తియ్యగా చెరుకు పానకం. పులుపుతో పచ్చిపులుసుదే జిహ్వపై గెలుపు. మిగులు చలికి విరుగుడీ మిర్చిమసాలా చలి ‘మంట’! వగరు రుచి కోసమే మామిడి మెంతిబద్దల విగరు. ‘వేప్పువ్వు పొడి’చే పోటు - అనారోగ్యాన్ని ఆవలికి నెట్టడానికే. చిటికెడంత తాను లేకపోతే అసలు రుచే లేదంటూ... ఇక అన్నింటా తానై ఉన్నానని చిటికేసి చెప్పే ‘ఉప్పు’! జయనామ సంవత్సరంలో విజయాలు సాధించే ముందర నాలుకపై రుచులను ‘ఆరే’యండి... షడ్రుచులపై మనసు పారేయండి! షడ్రుచుల ఉగాది పచ్చడి కావలసినవి: అరటిపండు ముక్కలు - కప్పు; చెరకు ముక్కలు - కప్పు; చింతపండు - కొద్దిగా; నీళ్లు - 6 కప్పులు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; వేప పువ్వు - 3 టేబుల్ స్పూన్లు; బెల్లం తురుము - 3 కప్పులు; ఉప్పు - చిటికెడు; మామిడికాయ ముక్కలు - పావు కప్పు తయారి: చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి ఒక పాత్రలో చింతపండురసం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, మామిడికాయ ముక్కలు, వేపపువ్వు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. పుల్లటి పచ్చిపులుసు కావలసినవి: చింతపండు - 50 గ్రా.; నీళ్లు - 4 కప్పులు; నువ్వులపొడి - 50 గ్రా.; ఉల్లిపాయ ముక్కలు- కప్పు; కారం - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; ఎండుమిర్చి - 4; తాలింపుగింజలు - టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు తయారీ: చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి ఉల్లిపాయముక్కలు, కారం, కొత్తిమీర, నువ్వులపొడి, ఉప్పు అందులో వేసి బాగా కలపాలి బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించాలి చింతపండు రసంలో వేసి అన్నీ కలపాలి (ఇష్టమైనవారు తీపి వేసుకోవచ్చు) చిరుచేదుగా వేపపువ్వు పొడి కావలసినవి: వేపపువ్వు - అర కప్పు; ధనియాలు - 2 టీ స్పూన్లు; నువ్వులు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండుమిర్చి - 10; మెంతులు - కొద్దిగా; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: వేపపువ్వును శుభ్రం చేసి ఎండబెట్టాలి బాణలిలో వేసి దోరగా వేయించి తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి. నువ్వులు వేసి వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తయారుచేసి ఉంచుకున్న అన్ని పొడులకు వేపపువ్వు జత చేసి మరోమారు మిక్సీలో వేసి తీసేయాలి వేడివేడి అన్నంలో, కమ్మటి నెయ్యి జతచేసి ఈ పొడి తింటే రుచిగా ఉండటమే కాకుండా, అనేక రోగాలను రాకుండా నివారిస్తుంది. కారం కారంగాపచ్చిమిర్చి మసాలా కూర కావలసినవి: పచ్చిమిర్చి - పావు కేజీ (బజ్జీ మిర్చి అయితే రుచి బాగుంటుంది); శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; పల్లీలు - గుప్పెడు; నువ్వుపప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; గసగసాలు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 10; ఉప్పు - తగినంత; నూనె - 4 టేబుల్ స్పూన్లు. తయారీ ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఒక వైపు గాట్లు పెట్టి గింజలు తీసేయాలి బాణలిలో నూనె వే సి కాగాక పచ్చిమిర్చి అందులో వేసి వేయించి పక్కన ఉంచాలి అదే బాణలిలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి తీసేయాలి పల్లీలు, నువ్వుపప్పు విడివిడిగా వేసి వేయించి పక్కన ఉంచాలి పై పదార్థాలన్నీ(పచ్చిమిర్చి తప్పించి) చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బాణలిలో మరి కాస్త నూనె వేసి అందులో పచ్చిమిర్చి, పొడులు, గసగసాలు, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గించి దింపేయాలి. వగరు మామిడికాయ మెంతి బద్దలు కావలసినవి: మామిడిపిందెలు - 2; ఉప్పు - తగినంత; మెంతులు - టీ స్పూను; నూనె - 4 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; ఎండుమిర్చి - 15; ఇంగువ - పావు టీ స్పూను తయారీ: ముందుగా మామిడిపిందెలను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు చేయాలి బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఒక గిన్నెలో మామిడికాయ ముక్కలు, వేయించి పొడి చేసుకున్న మెంతిపొడి మిశ్రమం వేసి బాగా కలపాలి ఉప్పు వేసి మరోమారు కలిపి, ఇంగువ, నూనె వేసి బాగా కలిపి, రెండో రోజు వాడుకోవాలి. తియ్యటి చెరకు పానకం కావలసినవి: చెరకురసం - 2 గ్లాసులు; తేనె - 2 టీ స్పూన్లు; మిరియాలపొడి - టేబుల్ స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను; ఐస్ క్యూబ్స్ - తగినన్ని తయారీ: ఒక పాత్రలో చెరకు రసం పోసి అందులో తేనె వేసి కలపాలి మిరియాలపొడి, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి రసాన్ని గ్లాసులలోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. సేకరణ: డా. వైజయంతి ఫొటోలు: మోర్ల అనిల్ కుమార్