రుచులు ఆరేయండి..! | ugadi special recipes | Sakshi
Sakshi News home page

రుచులు ఆరేయండి..!

Published Fri, Mar 28 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

ugadi special recipes

రుతువు మారగానే రుచులూ మారతాయి.
 నాల్కలు సంప్రదాయ షడ్రుచులను కోరతాయి.
 అందుకే... ఆరారా తినడానికి ఆరు రుచుల వంటలివే...
 నాలుకతో నెయ్యానికి తియ్యగా చెరుకు పానకం.
 పులుపుతో పచ్చిపులుసుదే జిహ్వపై గెలుపు.
 మిగులు చలికి విరుగుడీ మిర్చిమసాలా చలి ‘మంట’!
 వగరు రుచి కోసమే మామిడి మెంతిబద్దల విగరు.
 ‘వేప్పువ్వు పొడి’చే పోటు - అనారోగ్యాన్ని ఆవలికి నెట్టడానికే.
 చిటికెడంత తాను లేకపోతే అసలు రుచే లేదంటూ...
 ఇక అన్నింటా తానై ఉన్నానని చిటికేసి చెప్పే ‘ఉప్పు’!
 జయనామ సంవత్సరంలో విజయాలు సాధించే ముందర నాలుకపై రుచులను ‘ఆరే’యండి...
 షడ్రుచులపై మనసు పారేయండి!

 
 షడ్రుచుల ఉగాది పచ్చడి
 
 కావలసినవి:
 అరటిపండు ముక్కలు - కప్పు; చెరకు ముక్కలు - కప్పు; చింతపండు - కొద్దిగా; నీళ్లు - 6 కప్పులు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; వేప పువ్వు - 3 టేబుల్ స్పూన్లు; బెల్లం తురుము - 3 కప్పులు; ఉప్పు - చిటికెడు; మామిడికాయ ముక్కలు - పావు కప్పు
 
 తయారి:  
 చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి  


 ఒక పాత్రలో చింతపండురసం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి  
 
 చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, మామిడికాయ ముక్కలు, వేపపువ్వు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.
 
 పుల్లటి పచ్చిపులుసు
 
 కావలసినవి:
 చింతపండు - 50 గ్రా.; నీళ్లు - 4 కప్పులు; నువ్వులపొడి - 50 గ్రా.; ఉల్లిపాయ ముక్కలు- కప్పు; కారం - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; ఎండుమిర్చి - 4; తాలింపుగింజలు - టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు
 
 తయారీ:  
 చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి   
 
 ఉల్లిపాయముక్కలు, కారం, కొత్తిమీర, నువ్వులపొడి, ఉప్పు అందులో వేసి బాగా కలపాలి
 
 బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించాలి   


 చింతపండు రసంలో వేసి అన్నీ కలపాలి   
 
 (ఇష్టమైనవారు తీపి వేసుకోవచ్చు)
 
 చిరుచేదుగా వేపపువ్వు పొడి
 
 కావలసినవి:
వేపపువ్వు - అర కప్పు; ధనియాలు - 2 టీ స్పూన్లు; నువ్వులు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండుమిర్చి - 10; మెంతులు - కొద్దిగా; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత
 
 తయారీ:
 వేపపువ్వును శుభ్రం చేసి ఎండబెట్టాలి  
 
 బాణలిలో వేసి దోరగా వేయించి తీసేయాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి.
 
 నువ్వులు వేసి వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
 
 అదే బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
 
 తయారుచేసి ఉంచుకున్న అన్ని పొడులకు వేపపువ్వు జత చేసి మరోమారు మిక్సీలో వేసి తీసేయాలి  
 
 వేడివేడి అన్నంలో, కమ్మటి నెయ్యి జతచేసి ఈ పొడి తింటే రుచిగా ఉండటమే కాకుండా, అనేక రోగాలను రాకుండా నివారిస్తుంది.
 
 కారం కారంగాపచ్చిమిర్చి మసాలా కూర
 
 కావలసినవి:
 పచ్చిమిర్చి - పావు కేజీ (బజ్జీ మిర్చి అయితే రుచి బాగుంటుంది); శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; పల్లీలు - గుప్పెడు; నువ్వుపప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; గసగసాలు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 10; ఉప్పు - తగినంత; నూనె - 4 టేబుల్ స్పూన్లు.
 
 తయారీ
 ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఒక వైపు గాట్లు పెట్టి గింజలు తీసేయాలి
     
 బాణలిలో నూనె వే సి కాగాక పచ్చిమిర్చి అందులో వేసి వేయించి పక్కన ఉంచాలి
     
 అదే బాణలిలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి తీసేయాలి
     
 పల్లీలు, నువ్వుపప్పు విడివిడిగా వేసి వేయించి పక్కన ఉంచాలి
     
 పై పదార్థాలన్నీ(పచ్చిమిర్చి తప్పించి) చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
 
 బాణలిలో మరి కాస్త నూనె వేసి అందులో పచ్చిమిర్చి, పొడులు, గసగసాలు, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గించి దింపేయాలి.
 
 వగరు మామిడికాయ మెంతి బద్దలు
 
 కావలసినవి:
 మామిడిపిందెలు - 2; ఉప్పు - తగినంత; మెంతులు - టీ స్పూను; నూనె - 4 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; ఎండుమిర్చి - 15; ఇంగువ - పావు టీ స్పూను
 
 తయారీ:   
 ముందుగా మామిడిపిందెలను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు చేయాలి  
 
 బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి  
 
 ఒక గిన్నెలో మామిడికాయ ముక్కలు, వేయించి పొడి చేసుకున్న మెంతిపొడి మిశ్రమం వేసి బాగా కలపాలి  
 
 ఉప్పు వేసి మరోమారు కలిపి, ఇంగువ, నూనె వేసి బాగా కలిపి, రెండో రోజు వాడుకోవాలి.
 
 తియ్యటి చెరకు పానకం

 
 కావలసినవి:
 చెరకురసం - 2 గ్లాసులు; తేనె -  2 టీ స్పూన్లు; మిరియాలపొడి - టేబుల్ స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను; ఐస్ క్యూబ్స్ - తగినన్ని
 
 తయారీ:   
 ఒక పాత్రలో చెరకు రసం పోసి అందులో తేనె వేసి కలపాలి  
 
 మిరియాలపొడి, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి
 
 రసాన్ని గ్లాసులలోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి.
 
 సేకరణ: డా. వైజయంతి

 ఫొటోలు: మోర్ల అనిల్ కుమార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement