
మంచిమాట
జీవితంలో పైకి రావాలనుకున్న వారెవరికైనా ముందుగా తాము చేస్తున్న పని పట్ల, తమ లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తమపట్ల తమకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను అన్న నమ్మకం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ఆశలను చిగురింప చేస్తుంది. కావల్సినంత బలాన్నిస్తుంది. అందువల్ల జీవితంలో ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా మనలో ఉన్న మన ఆత్మవిశ్వాసమే మనల్ని విజయ తీరాల వైపు తీసుకువెళుతుందన్న విషయాన్ని
గుర్తించాలి.
తమ లక్ష్యాలను సాధించి జీవితంలో విజయ బావుటా ఎగురవేసిన వారిని మనం నిత్యజీవితంలో అనేక మందిని చూస్తుంటాం. వింటూ ఉంటాం. అయితే వారివారి విజయ గాధలలో ఆయా వ్యక్తుల సాఫల్యాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటాం కానీ ఆ విజయం వెనుక సదరు వ్యక్తులు పడిన తపన, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవరోధాల గురించి మనం పట్టించుకోం.
నిజానికి ప్రతి విజయ గాధ వెనుక ఎన్నో అపజయాలు, మరెన్నో అవరోధాలు ఉంటాయని తెలుసుకోలేం. నేడు సమాజంలో ఉన్నత స్థితికి వచ్చిన ఏ వ్యక్తినైనా తీసుకోండి. వారి విజయం వెనుక వారెన్ని కష్టాలు, ఇబ్బందులు పడ్డారో తేటతెల్లమవుతుంది. ఎన్నో అపజయాలు, ఓటములు అనుభవించిన తరువాత గానీ, ఆయా వ్యక్తులకు విజయం సిద్ధించలేదన్న విషయం బోధపడుతుంది.
జీవితంలో ఎవ్వరైనా తాము అనుభవిస్తున్న, అనుభవించిన అవమానాలు, అపజయాలు, ఓటముల ద్వారానే పాఠాలు నేర్చుకోవాలి. ఆయా పాఠాలు నేర్పిన గుణపాఠాలను ఆత్మవిశ్వాసం ద్వారా అధిగమించాలి. తమమీద తాము విశ్వాసాన్ని పెంచుకుని అపజయాన్ని విజయానికి సోపానంగా మార్చుకున్న వారే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సాధించగలరు. అందువల్ల ఆత్మవిశ్వాసమే ఆశావహుల ఆభరణమని తెలుసుకోవాలి.
మనం చిన్నపుడు తాబేలు, కుందేలు కథ విని ఉంటాం. నిదానంగా, నెమ్మదిగా పరుగెత్తే తాబేలు, అత్యంత వేగంగా పరుగెత్తే కుందేలుతో పరుగెత్తి విజయం సాధించిందని ఆ కథ సారాంశం. మరి ఈ కథలో తాబేలుకు విజయం వరించడానికి ప్రధానమైన కారణమే ఆత్మవిశ్వాసం. ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే వేగంగా కదలలేని తాబేలు, వేగంగా పరుగెత్తే కుందేలు తో పందెం కడుతుంది.
ఎంత ఆత్మవిశ్వాసముంటే తాబేలు కుందేలుతో పోటీపడి గెలుస్తుంది. ఎంత అతి విశ్వాసముంటే, పోటీలో గెలిచే సామర్ధ్యమున్నా, కుందేలు విజయానికి దూరంగా ఉందన్న విషయం అవగతమవుతోంది. ఈ కథ ద్వారా జీవితంలో పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో తెలుస్తుంది. అలాగే, మన లక్ష్యాలను గమ్యాలను దూరం చేసే అతి విశ్వాసం పనికిరాదని తేటతెల్లమవుతుంది.
ఆత్మవిశ్వాసంతో ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుదు అబ్రహాం లింకన్ జీవిత గాథ మనకు అవగతం చేస్తుంది. విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించి విజేతగా నిలిచిన గొప్ప వ్యాపారవేత్త కల్నల్ సాండర్స్. కనుక జీవితంలో విజేతగా నిలవాలనుకున్న ప్రతిఒక్కరూ కష్టాలకు నెరవకుండా, అనుభవాలను పాఠాలుగా నేర్చుకుంటూ ముందుకి వెళితే విజయం తప్పక వరిస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకుని మసలుకోవాలి.
– దాసరి దుర్గా ప్రసాద్