![45 percent of Women to be Single by 2030: Morgan Stanley Study](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Solo-life.jpg.webp?itok=ydFdiZil)
వివాహ బంధంలోకి అడుగు పెట్టడం, పిల్లల్ని కనడంపై విముఖత
ఎలాంటి బాదరబందీ లేకుండా కొనసాగడం పైనే ఆసక్తి
వ్యక్తిగత స్వేచ్ఛ, కెరీర్‌లో ముందుకు దూసుకెళ్లడంపైనే దృష్టి
మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం వెల్లడి
‘పెళ్లిపై నమ్మకం లేదు.పెళ్లి చేసుకోవడమంటే స్వేచ్ఛను కోల్పోవడమే. అలా బతకడం నాకే మాత్రం ఇష్టం లేదు. ఒక్కసారి వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సొంత ఆలోచనలకు, అభిప్రాయాలకు, ఆకాంక్షలకు, చివరకు అభిరుచులకూ అవకాశం ఉండదు. ఇలా ఎంతోమందిని చూశాను. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను..’ ఇది 35 ఏళ్ల విజయ (పేరు మార్చాం) బలమైన అభిప్రాయం. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) సమీపంలోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఒక మహిళల హాస్టల్లో ఉంటున్నారు.
చాలామంది మహిళలు ఇటీవలి కాలంలో వివాహ బంధం, దాంపత్య జీవితంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాతికేళ్ల వయసు దాటినా పెళ్లి (Marriage) ఊసు ఎత్తేందుకు కూడా ఇష్టపడని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయలా స్వతంత్రంగా జీవించాలనుకునే వారితో పాటు వృత్తిపరమైన బాధ్యతల వల్ల కొందరు, మంచి కెరీర్ (Career) కోసం ప్రయత్నించే క్రమంలో ఒత్తిడికి గురవుతూ మరికొందరు వివాహం విషయంలో నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం వెల్లడించింది. తమ జీవితాన్ని తమకు ఇష్టమైన విధంగా గడపడానికి వీలవుతుందనే భావనే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.
ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది. భారత్ (India) సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 2030 నాటికి ఒంటరి మహిళల సంఖ్య 45 శాతానికి పెరగవచ్చునని అంచనా వేసింది. వీరిలో 25–44 ఏళ్ల లోపు వయసున్న వారే అత్యధిక సంఖ్యలో ఉంటారని పేర్కొంది. వ్యక్తిగత అభివృద్ధి, తాము ఎంచుకున్న రంగాల్లో పురోగతికే యువతులు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించింది. మరోవైపు కుటుంబ బాధ్యతలూ ఇందుకు కారణమవుతున్నాయి.
బాధ్యతలు పంచుకుంటూ.. కెరీర్ కోసం
కష్టపడుతూ.. సాధారణంగా అమ్మాయిలు 25 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా కుటుంబ బాధ్యతలను పంచుకుంటున్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. తోబుట్టువుల కెరీర్ కోసం కష్టపడుతున్నారు. అదే సమయంలో జీవితంలో స్వేచ్చను కోరుకుంటున్నారు. అల్వాల్‌కు చెందిన సుజాత (పేరు మార్చాం.) ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ‘పదేళ్ల క్రితమే నాన్న చనిపోయారు. అప్పటి నుంచి తమ్ముడు, చెల్లి, అమ్మను చూసుకోవడం నా వంతైంది. చూస్తూండగానే 40 ఏళ్లు వచ్చేశాయి..’అంటూ నవ్వేశారు ఆమె.
సుజాత లాగానే చాలామంది అమ్మాయిలు కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వయసు దాటి పోయిందనే భావనతో వివాహ బంధానికి దూరమవుతున్నారు. కానీ కొంతమంది యువతుల్లో స్వేచ్ఛాయుత జీవితంపై ఆసక్తి పెరుగుతోంది. వారి ఆలోచనలు, అభిప్రాయాలు వైవాహిక జీవితానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఎల్‌బీనగర్ ప్రాంతానికి చెందిన శైలజ.. ‘పెళ్లి కంటే ఆర్ధిక స్వాతంత్య్రం ఎంతో ముఖ్యం. అది లేకుండా పెళ్లి చేసుకోవడం ఆత్మహత్యాసదృశం..’అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె ప్రస్తుతం ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పటికే 28 ఏళ్లు దాటాయి. అయినా ఒంటరిగానే ఉండిపోవాలని కోరుకుంటున్నారు.
పిల్లలూ భారమేనా..!
పెళ్లి చేసుకున్నప్పటికీ మరికొంతమంది మహిళలు పిల్లల్ని కనేందుకు వెనుకాడుతున్నారు. ‘ఈ రోజుల్లో పిల్లల్ని కనడం. పెంచడం ఎంతో ఖరీదైన విషయం. ఆ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది..’ అని ఒక యువతి వ్యాఖ్యానించారు.
నేను, నా స్వేచ్ఛ అనే భావన బలపడుతోంది
దేశంలో అలాగే హైదరాబాద్‌లోనూ ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. మా అమ్మాయి పెళ్లిచేసుకోవడం లేదంటూ ఇటీవల కొందరు తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చినపుడు.. పెళ్లి ఎందుకు, ఆ అవసరం ఏమిటీ, పిల్లలు ఇతర బాదరాబందీ అంతా ఎందుకంటూ అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. పెళ్లితో తమ స్వేచ్ఛ, కెరీర్ దెబ్బతింటుందని, ఒకవేళ వివాహానికి ఒప్పుకున్నా పిల్లలు వద్దనుకునే వాళ్లనే చేసుకోడానికి సిద్ధమని చెబుతున్నారు. కొంతమంది చదువు, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటూ స్వేచ్ఛా జీవితం గడిపాక.. ఇక కుటుంబం, సంతానం వంటివి వద్దనుకుంటున్నారు. మనం అనే ఉమ్మడి భావన పోయి నేను, నా స్వేచ్ఛ, నా కెరీర్ అనే భావన బలపడుతోంది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇలాంటి వారికి మేం కౌన్సెలింగ్ ఇస్తున్నాం.
– పి.జ్యోతిరాజా, సైకాలజిస్ట్, శ్రీదీప్తి కౌన్సెలింగ్ సెంటర్
నచ్చిన వరుడు, మెచ్చిన ఉద్యోగం కోసంఎదురుచూస్తూ..
మరోవైపు నచ్చిన వరుడు లభించకపోవడం కూడా కొంతమంది అమ్మాయిలకు శాపంగా మారుతోంది. ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన యవతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మంచి విద్యార్హతలు, ఉద్యోగం, కెరీర్ అవకాశాలు, వ్యక్తిత్వం, అభిరుచులు తమకు నచ్చినట్లు ఉంటేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. అలాంటి అబ్బాయి లభించే వరకు నిరీక్షిస్తున్నారు. మరోవైపు విదేశీ సంబంధాల కోసం ఎదురుచూసే కుటుంబాల్లోనూ అమ్మాయిలకు పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంతమంది సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి చదువుతున్నారు. లక్ష్యాన్ని సాధించేవరకు పెళ్లికి దూరంగా ఉండాలనే భావనతో ఐదారేళ్లకు పైగా గడిపేస్తున్నారు.అప్పటికే పెళ్లి వయసు దాటిపోతోంది.
చదవండి: ఏం చేయాలో అర్థం కావడం లేదు.. పారిపోవాలనిపిస్తోంది!
భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు!
వచ్చే 10, 15 ఏళ్లలో వివాహ బంధానికి సంబంధించి మరింత ఎక్కువగా సవాళ్లు ఎదురుకావొచ్చు. ప్రస్తుతం 20 నుంచి 25 ఏళ్లు పైబడిన యువతుల్లో కొంతమంది పెళ్లి అంటే విముఖత వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ఈ ఆలోచన విధానం అమ్మాయిల్లో పెరుగుతోంది. వివాహం అనగానే బాధ్యతల్లో చిక్కుకుపోవడం, పిల్లల్ని కని వారి సంరక్షణలో, సంసార బాధ్యతల్లో మునిగిపోవడం అని అనుకుంటున్నారు. తమ స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని భయపడుతున్నారు. ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి ఉద్యోగం చేస్తున్నా.. మళ్లీ కుటుంబపరంగా ఎన్నో బరువు బాధ్యతలు మోయాల్సి రావడం కూడా ఇందుకు కారణమవుతోంది. అమ్మాయిల్లో పెళ్లి, పిల్లల పట్ల విముఖత పెరగడానికి పురుషుల మనస్తత్వాల్లో మార్పు రాకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు.
– సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment