రోడ్లపక్కన జీవిస్తున్న శరణార్థులను చేరదీస్తూ..
మతిస్థిమితం లేని వారికి ఆశ్రయం కల్పిస్తూ..
అనాథ శవాలకు దహన సంస్కారాలు చేస్తూ..
తల్లిలా సేవలందిస్తున్న ‘మాతృదేవోభవ’ సంస్థ
మతిస్థిమితం కోల్పోయిన మానసిక వికలాంగులకు, అనాథలకు అండగా నిలుస్తోంది.. ఏ చిరునామా లేని అభ్యాగులకు ఓ కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. రుచికరమైన భోజనం వడ్డించడంతో పాటు దుస్తులు, పడుకునేందుకు మంచం, దుప్పటి వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.. తమకు ఎవరూ లేరనే బాధ నుంచి అక్కడ ఉన్నవారంతా తమవారే అన్న భరోసా ఇస్తోంది.. కుల మత, భాషా బేధాలతో సంబంధం లేకుండా అభాగ్యులందరినీ చేరదీస్తోంది. అంతేకాదు అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ మానసిక దివ్యాంగుల ఆశ్రమం.
– బడంగ్‌పేట్
ఒక్కరితో 2018లో ప్రారంభమైన ఈ ఆశ్రమ సేవలు ప్రస్తుతం 150 మందికి చేరుకున్నాయి. మధ్య వయసులో మతి స్థిమితం కోల్పోయి.. జుట్టు, గడ్డాలు, మీసాలు పెరిగి గుర్తుపట్టలేని స్థితిలో అర్ధనగ్నంగా వీధుల్లో సంచరిస్తున్న వారితో పాటు నగరంలోని ప్రధాన రోడ్ల వెంట, డ్రైనేజీలు, చెత్త డబ్బాల పక్కన దీనంగా పడి ఉన్న అనాథలను ఆశ్రమానికి తరలిస్తున్నారు మాతృదేవోభవ సంస్థ నిర్వాహకులు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కోలుకున్న వారిని తిరిగి ఇళ్లకు పంపుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 280 మందికి పునర్జన్మను ప్రసాదించారు. ఆశ్రమ సేవలు గుర్తించిన సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి వారు కూడా అభాగ్యులకు సేవలు అందిస్తుండటం విశేషం. పండగలు, పర్వదినాలు, పుట్టిన రోజులు ఇలా అన్ని సందర్భాల్లోనూ వారు భాగస్వాములు అవుతున్నారు.
‘ఈయన పేరు డి.శివుడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. ఆరేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి.. ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఊరే కాదు చివరకు జిల్లా సరిహద్దులు దాటుకుని చివరకు ఉప్పల్ చేరుకున్నాడు. రోడ్డు వెంట అనాథగా తిరుగుతున్న ఆయనను మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించి వైద్యం అందించారు. కోలుకున్న తర్వాత బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ వృద్ధాప్యంతో మంచం పట్టిన తల్లికి సపర్యలు చేస్తున్నాడు’
అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు
ఏదైనా ప్రమాదాల్లో చనిపోయిన అనాథ శవాలనే కాకుండా ఆశ్రమంలో ఉంటూ వృద్ధాప్యం, ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారికి ఆయా మతాల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతిమ యాత్రలో మాతృదేవోభవ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకుడు గిరితో పాటు అతడి భార్య ఇందిర, అమ్మ ముత్తమ్మ, కొడుకు అభిరాం, కూతురు లోహిత ఆ నలుగురిలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 60 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. సేవలను గుర్తించిన పలు సంస్థలు గిరిని గౌరవ డాక్టరేట్‌తో పాటు 300 అవార్డులతో సత్కరించాయి.
నాడు
‘చిత్రంలోని ఈయన పేరు కావూరి నాగభూషణం. పశి్చమగోదావరి జిల్లా పొలమూరు మండలం నాగిళ్లదిబ్బ గ్రామం. ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి బంజారాహిల్స్ చేరుకున్నాడు. చినిగిన దుస్తులు, మాసిన గడ్డం, పెరిగిన జుట్టుతో తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ.. తిరుగుతూ కని్పంచాడు. మాతృదేవోభవ ఆశ్రమం నిర్వాహకులు ఆయనను చేరదీసి, ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు తెలుపగా.. ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆయన్ను బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం సొంత ఊరిలో రెండు ఆవులను చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాడు’
నేడు
నాడు
‘చిత్రంలో కనిపిస్తున్న ఇతడి పేరు వట్టేం రమేష్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం, శివపురం గ్రామం. నాలుగేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ చివరకు నగరానికి చేరుకున్నాడు. మాతృదేవోభవ అనాథ ఆశ్రమ నిర్వాహకులు చేరదీసి ఆశ్రమం కల్పించారు. అతడికి మెరుగైన చికిత్సతో పాటు ప్రశాంత వాతావరణం కల్పించడంతో నాలుగేళ్లకు ఆరోగ్యం కుదుటపడింది. కుటుంబ వివరాలు తెలుసుకుని, చివరకు వారికి అప్పగించారు. ప్రస్తుతం సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు’
నేడు
కొంత స్థలం కేటాయించాలి
శాశ్వత భవనం లేకపోవడంతో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలిక షెడ్లు వేసి, వాటిలో వసతి కలి్పస్తున్నాం. స్థలం కేటాయిస్తే మరింత మందికి సేవలు అందిస్తాం. ఆశ్రమంలో ఉన్న వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ సహా ఆరోగ్యశ్రీకార్డు, రేషన్ బియ్యం ఉచితంగా
అందజేయాలి.
– గట్టు గిరి, ‘మాతృదేవోభవ’ఆశ్రమ వ్యవస్థాపకుడు
Comments
Please login to add a commentAdd a comment