flavors
-
హైదరాబాద్ వేదికగా ‘ఫ్లేవర్స్ ఇన్నోవేషన్ సెంటర్’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా ఫ్లేవర్స్, ఫ్రాగ్రన్స్ పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఫ్రాన్స్‌కు చెందిన ‘మనే’ ఫ్రాగ్రన్స్ అండ్ ఫ్లేవర్స్ అగ్రగామి తయారీ సంస్థ చైర్మన్ జీన్ మనే తెలిపారు. మనే గ్రూప్స్ ఆధ్వర్యంలో నగరంలోని రాయదుర్గ్ వేదికగా మంగళవారం ఫ్లేవరస్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆహారం, పరిమళాలకు సంబంధించిన పరిశ్రమల్లో అవసరమైన ఫ్లేవర్స్‌ను అందించడంలో భాగంగా పరిశోధనాభివృద్ధి కార్యకలాపాల కోసం 3 మిలియన్ యూరోల వ్యయంతో ఈ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీన్ మనే మాట్లాడుతూ., భారత్‌లో ఫ్లేవర్స్ రంగంలో అతిపెద్ద వేదికగా ఈ సెంటర్‌ను ప్రారంభించామని, రానున్న మూడేళ్లలో సంస్థ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా 45 మిలియన్ యూరోలను వెచ్చించనున్నామని తెలిపారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఆహార పదార్థాలు, పానియాలు, చాక్లెట్, బేకరీ ఉత్పత్తులు, స్వీట్, కన్ఫెక్షనరీ తదితరాలకు అవసరమయ్యే ఫ్లేవర్స్‌ను సేకరించి ఉత్పత్తి సంస్థలకు అందిస్తామని వెల్లడించారు. తమ సంస్థ 56 శాతం గ్లోబల్ రెవెన్యూతో అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉందని, ఇందులో 8 శాతం భారత్ నుంచే ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. మనే ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఫ్లేవర్స్ ఇన్నోవేషన్ సెంటర్, ముంబైలో ఫ్రాగ్రన్స్ స్టూడియోను నిర్వహిస్తున్నామన్నారు. ఫ్లేవర్స్‌ను సేకరించే ప్లాంట్లను ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళలో నిర్వహిస్తున్నామని, స్పైస్ కోసం ఇక్కడ లభించే మిరప అత్యుత్తమమైనదని చెప్పారు. తెలంగాణలోని దుండిగల్‌లో కూడా తమ ఉత్పత్తి కేంద్రం సేవలందిస్తోందని వివరించారు. నగరంలోని ఈ ఇన్నోవేషన్ సెంటర్ అధునాతన సాంకేతిక విధానంలో పరిశోధనలు చేస్తూ పారిశ్రామికంగా అవసరమైన ఫార్ములాలను రూపొందిస్తోందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ దాస్ గుప్తా తెలిపారు. పరిశోధనాభివృద్ధి కోసం అధునాతన ల్యాబరేటరీలను కొనసాగిస్తున్నామని గ్రూప్ ఆసియా పసిఫిక్ డైరెక్టర్ బె ర్నార్డ్ లేనౌడ్ పేర్కొన్నారు. ఈ సంస్థ భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్‌లలో సేవలందిస్తోందని చెప్పారు. -
రుచీ మిలే మేరా తుమ్హారా
దేశంలో ఎన్నో భాషలు...ఎన్నో సంస్కృతులు...ఎన్నో రుచులు..కానీభాషలు, రుచులు, సంస్కృతులను కలిపి వండితేనే టేస్ట్ ఆఫ్ ఇండియా బీహార్ లిట్టి చోఖా కావలసినవి: లిట్టి కోసం... గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – పావు టీ స్పూను; నెయ్యి లేదా నూనె – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – ముప్పావు లేదా ఒక కప్పు. స్టఫింగ్ కోసం... సెనగ పిండి – ఒక కప్పు (దోరగా వేయించాలి); జీలకర్ర – అర టీ స్పూను; సోంపు – అర టీ స్పూను; వాము – అర టీ స్పూను; కలోంజీ – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); అల్లం తురుము – ఒక టీ స్పూను; వెల్లుల్లి తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నల్ల ఉప్పు – పావు టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; ఆవ నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – కొద్దిగా. తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి ∙నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙బాగా మెత్తగా అయ్యేలా ఎక్కువ సేపు కలిపి పక్కన ఉంచాలి. స్టఫింగ్ తయారీ.. ∙మిక్సీలో జీలకర్ర, సోంపు వేసి కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి వేసి, జీలకర్ర పొడి మిశ్రమం జత చేయాలి ∙వాము, కలోంజీ, మిరప కారం, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు, నల్ల ఉప్పు, రాళ్ల ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙నిమ్మరసం, ఆవ నూనె జత చేసి మరోమారు కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి, కొద్దిగా గట్టిగా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙గోధుమ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙పొడి పిండి అద్దుతూ చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి ∙సెనగ పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని అందులో ఉంచి, గుండ్రంగా చేతితో చేసి, అంచులు తడి చేసి, మూసేయాలి. ఇలా అన్నీ తయారుచేసుకుని ఒక పాత్రలో ఉంచాలి. ఆ పాత్ర మీద తడి బట్ట వేసి ఉంచాలి. లేదంటే ఎండిపోతాయి ∙ఇలా తయారు చేసుకున్నవాటిని బేకింగ్ ట్రే మీద ఉంచాలి ∙200 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసిన అవెన్‌లో ఈ ట్రే ఉంచాలి. సుమారు 40 మిషాల తరవాత బయటకు తీసేయాలి ∙కరిగించిన నేతిని వీటి మీద పూయాలి ∙చిన్న గిన్నెలో నెయ్యి వేసి అందించాలి. గుజరాతీ థేప్లా కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; సెనగ పిండి – అర కప్పు; మెంతి ఆకులు – ఒక కప్పు, పెరుగు – అర కప్పు; అల్లం ముద్ద – అర టీ స్పూను; పచ్చి మిర్చి ముద్ద – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; గసగసాలు – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – ఒక టీ స్పూను. తయారీ: ∙ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలుపుకోవాలి ∙మూత ఉంచి సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి ∙అరగంట తరవాత ఒక టేబుల్ స్పూను నూనె జత చేసి పిండిని మళ్లీ బాగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙పొడి పిండి అద్దుతూ చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, పెనం మీద కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయాలి ∙ఒత్తి ఉంచుకున్న థేప్లాను వేసి రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి ∙పచ్చడి, పెరుగులతో వేడివేడి థెప్లాలను అందించాలి. మహారాష్ట్ర వడ పావ్ కావలసినవి: స్టఫింగ్ కోసం... ఆలుగడ్డలు – రెండు (కొద్దిగా పెద్దవి); పచ్చి మిర్చి + వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. పిండి తయారీ కోసం... సెనగ పిండి – ఒకటిన్నర కప్పులు; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; బేకింగ్ సోడా – చిటికెడు; నీళ్లు – అర కప్పు; ఉప్పు – తగినంత. గ్రీన్ చట్నీ కోసం... కొత్తిమీర తరుగు – ఒక కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2; నిమ్మరసం – 3 చుక్కలు; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3; ఉప్పు – తగినంత.శొంఠి చట్నీ కోసం... గింజలు లేని చింతపండు – అర కప్పు; నీళ్లు – 2 కప్పులు; జీలకర్ర – అర కప్పు; శొంఠి పొడి – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; మిరప కారం – పావు టీ స్పూను; బెల్లం పొడి – ఒక కప్పు; నూనె – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. వడ పావ్ కోసం మరి కొన్ని... రెడ్ చట్నీ – 2 టేబుల్ స్పూన్లు; పావ్ లేదా బ్రెడ్ రోల్స్ – తగినన్ని; ఉప్పులో కలిపి వేయించిన పచ్చి మిర్చి – తగినన్ని. తయారీ: గ్రీన్ చట్నీకి చెప్పిన పదార్థాలకు తగినన్ని నీళ్లు జతచేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. కొద్దిగా గట్టిగా ఉండేలా జాగ్రత్తపడాలి. శొంఠి చట్నీ తయారీ... ∙తగినన్ని నీళ్లలో చింతపండును సుమారు గంటసేపు నానబెట్టాక, చేతితో మెత్తగా పిసికి, పిప్పిలాంటిది తీసేసి, చిక్కటి రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నూనె వేసి కాచాలి ∙మంట తగ్గించి, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ∙శొంఠిపొడి, మిరప కారం, ఇంగువ జత చేసి కలపాలి ∙చింతపండు రసం జత చేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి ∙బెల్లం పొడి, ఉప్పు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ∙మిశ్రమం బాగా చిక్కబడ్డాక దింపి చల్లారనివ్వాలి ∙గాలిచొరని డబ్బాలో నిల్వచేసుకోవచ్చు. వడా పావ్ తయారీ... ∙ఒక పాత్రలో బంగాళ దుంపలకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ∙తొక్క తీసేసి, చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ∙ఆవాలు జత చేసి చిటపటలాడించాలి ∙ కరివేపాకు, ఇంగువ వేసి కొద్దిగా వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు + పచ్చిమిర్చి ముద్ద జత చేయాలి ∙పసుపు జత చేసి మరోమారు వేయించాలి ∙బాగా వేగిన తరవాత ఈ మిశ్రమాన్ని బంగాళ దుంపకు జతచేసి బాగా కలపాలి ∙కొత్తిమీర, ఉప్పు జత చేయాలి ∙ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, కొద్దిగా ఫ్లాట్‌గా ఉండేలా చేతితో ఒత్తుకోవాలి ∙మరొక పాత్రలో సెనగ పిండి, పసుçపు, ఇంగువ, బేకింగ్ సోడా, ఉప్పు, అర కప్పు నీళ్లు వేసి బజ్జీ పిండిలా తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న బంగాళదుంప ఉండలను సెనగ పిండిలో ముంచి, నూనెలో వేయాలి ∙బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌టవల్ మీదకు తీసుకోవాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి ∙పావ్లను మధ్యలోకి కట్ చేసి, తయారుచేసుకున్న వడను మధ్యలో ఉంచాలి ∙తయారుచేసి ఉంచుకున్న చట్నీలతో అందించాలి. ఆంధ్ర గోంగూర పచ్చడి కావలసినవి: గోంగూర – అర కేజీ; ఎండు మిర్చి – 100 గ్రా.; మెంతులు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నువ్వుల నూనె – 100 గ్రా.; ఉల్లి తరుగు – పావు కప్పు. తయారీ: ∙గోంగూరను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద నీడలో (పూర్తిగా తడిపోయే వరకు) ఆరబోయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర వేసి పచ్చి పోయేవరకు సుమారు పావు గంటసేపు వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి, మంట ఆర్పేయాలి ∙మిక్సీలో ముందుగా ఎండుమిర్చి మిశ్రమం వేసి మెత్తగా పొడి చేయాలి ∙గోంగూర జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉల్లి తరుగు జతచేయాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి కాచి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక గోంగూరలో వేసి కలపాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ మద్రా కావలసినవి: కాబూలీ చనా – 2 కప్పులు; ఆవ నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఇంగువ – పావు టీ స్పూను; లవంగాలు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు – 1; మిరియాలు – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూను; పసుపు – అర టేబుల్ స్పూను; మిరప కారం – తగినంత; ఉప్పు – తగినంత; తరిగిన పచ్చి మిర్చి – 3; గడ్డ పెరుగు – 2 కప్పులు; బియ్యిప్పిండి – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙మిక్సీలో ఏలకులు, మిరియాలు, లవంగాలు వేసి పొడి (మరీ మెత్తగా లేకుండా) చేయాలి ∙ఒక పాత్రలో బియ్యప్పిండికి తగినన్ని నీళ్లు జత చేసి కలిపి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేయాలి ∙సన్నటి మంట మీద కాగిన తరవాత, ఇంగువ, జీలకర్ర, దాల్చిన చెక్క పొడి వేసి వేయించాలి ∙పొడి చేసుకున్న మిగతా మసాలా దినుసులను జత చేయాలి ∙ఉల్లి తరుగు జత చేసి వేయించాలి ∙గరం మసాలా, ధనియాల పొడి జత చేసి బాగా కలపాలి ∙ఉడికించిన సెనగలను వేసి బాగా కలిపిన తరవాత మసాలా, ఉప్పు, మిరప కారం వేసి కలియబెట్టాలి ∙పచ్చి మిర్చి తరుగు జత చేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాక, మంట బాగా తగ్గించేయాలి ∙పెరుగు జత చేసి బాగా కలియబెట్టాలి ∙మంట పెంచి, ఆపకుండా కలుపుతుండాలి ∙బియ్యప్పిండి కలిపిన నీళ్లు, నెయ్యి వేసి కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి ∙గ్రేవీ కొద్దిగా గట్టి పడిన తరవాత దింపేసి, చల్లారాక వేడివేడి అన్నంలోకి వడ్డించాలి. ఒడిశా చెన్నా పోడా కావలసినవి: పనీర్ లేదా సెనగలు – పావు కేజీ; పంచదార లేదా బెల్లం పొడి – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బియ్యప్పిండి – అర టేబుల్ స్పూను; జీడి పప్పులు, కిస్మిస్లు – తగినన్ని; నెయ్యి – కొద్దిగా. తయారీ: ∙అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ∙పనీర్ లేదా ఉడికించిన సెనగ పప్పును పొడి పొడిగా చేయాలి ∙అర కప్పు పంచదార లేదా బెల్లం పొడి జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా పాలు జత చేయాలి ∙ఏలకుల పొyì , బియ్యప్పిండి జత చేయాలి ∙కిస్మిస్, జీడి పప్పు పలుకులు కూడా జత చేయాలి ∙ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో వేసి సమానంగా పరిచి, అవెన్‌లో ఉంచి, 45 నిమిషాలు బేక్ చేయాలి ∙బయటకు తీసి చల్లారనివ్వాలి ∙చాకుతో జాగ్రత్తగా స్లయిసెస్‌లా కట్ చేయాలి ∙భోజనం చేశాక ఈ స్వీట్‌ను తింటారు. సిక్కిం మామోస్ కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; నూనె – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని స్టఫింగ్ కోసం... సన్నగా తరిగిన కూర ముక్కలు – రెండు కప్పులు (క్యాబేజీ, క్యారట్లు, ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్ వంటివి); ఉల్లికాడల తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 3; సోయా సాస్ – ఒక టీ స్పూను; మిరియాల పొడి – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. స్టఫింగ్ తయారీ... ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ∙వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙కూరగాయల తరుగు జత చేసి, సన్నని మంట మీద వేయించాలి ∙సోయాసాస్, ఉప్పు, మిరియాల పొడి జత చేసి బాగా కలిపి దింపేయాలి ∙ఉల్లికాడల తరుగు జత చే సి బాగా కలపాలి. మామోస్ తయారీ: ∙మైదా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙ఒక్కో ఉండను తీసుకుని పూరీ ప్రమాణంలో ఒత్తుకోవాలి ∙స్టఫింగ్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పూరీ మధ్యలో ఉంచి, అంచులను ముడతలు వచ్చేలా చేస్తూ, అన్నివైపులా మూసేయాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙వీటి మీద తడి వస్త్రం వేసి ఉంచాలి ∙కుకర్‌లో నీళ్లు పోసి మరిగించాలి ∙తయారుచేసి ఉంచుకున్న మామోస్‌ను ఇడ్లీ రేకులలో ఉంచి, కుకర్‌లో పెట్టాలి ∙సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి ∙వీటిని ప్లేట్లోకి తీసుకుని, ఉల్లికాడలతో అలంకరించి, టొమాటో చిల్లీ సాస్, రెడ్‌చిల్లీ గార్లిక్ చట్నీలతో అందించాలి. కశ్మీరీ పులావ్ కావలసినవి: నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు 2; జీలకర్ర – 2 టీ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒక కప్పు; పాలు – ముప్పావు కప్పు; నీళ్లు – ఒకటింపావు కప్పులు; ఉప్పు – తగినంత; కుంకుమ పువ్వు – పావు టీ స్పూను; తాజా క్రీమ్ – 3 టీ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన బాదం పప్పులు + జీడి పప్పులు + వాల్నట్స్ + పిస్తాలు – ముప్పావు కప్పు; పంచదార – 2 టీ స్పూన్లు; వేయించిన ఉల్లి తరుగు – పావు కప్పు. తయారీ: ∙బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, దాలిన చెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి ∙జీలకర్ర జత చేసి మరోమారు కలపాలి ∙బాస్మతి బియ్యం జత చేసి రెండు మూడు నిమిషాలు కలియబెట్టాలి ∙పాలు, నీళ్లు జత చేసి కలపాలి ∙ఉప్పు, కుంకుమ పువ్వు, క్రీమ్ జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙మూత పెట్టి, సన్నని మంట మీద సుమారు 20 నిమిషాలు పాటు ఉడికించాలి ∙బాగా ఉడికిన తరవాత పంచదార, కిస్మిస్ వేసి కలపాలి ∙వేయించిన బాదం పప్పులు, జీడి పప్పులు, వాల్నట్న్, పిస్తాలు వేసి బాగా కలిపి మరో మూడు నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙రైతాతో అందించాలి. (దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు). జార్ఖండ్ థేకువా కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; బెల్లం పొడి – ముప్పావు కప్పు; కొబ్బరి తురుము – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; చీజ్ 2 టేబుల్ స్పూన్లు; ఏలకులు – 5. తయారీ: ∙ఒక పాత్రలో బెల్లం పొడి, అర కప్పు నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, మరిగించాలి ∙బెల్లం పూర్తిగా కరిగేవరకు ఉంచి, దింపేసి వడపోయాలి ∙బెల్లం నీళ్లలో నెయ్యి వేసి కలియబెట్టాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి వేసి, ఏలకుల పొడి, కొబ్బరి తురుము జత చేయాలి ∙బెల్లం నీళ్లు పోస్తూ, పిండిని గట్టిగా కలుపుకోవాలి ∙ఈ పిండితో థేకువాలు తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ∙గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ∙చేతులకు నూనె పూసుకుని, ఒక ఉండ చేతిలోకి తీసుకుని, చేతితో మృదువుగా ఒత్తాలి ∙మనకు నచ్చిన ఆకారంలో దానిని తయారుచేసుకోవాలి ∙అంటే ఆకు ఆకారం ఇష్టపడితే, ఆకులా చేతి, గోళ్లతో గీతలు గీయాలి ∙లేదంటే గుండ్రంగా కూడా చేసుకోవచ్చు ∙ మంటను మధ్యస్థంగా ఉంచి, తయారుచేసి ఉంచుకున్న థేకువాలను నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి ∙చల్లారాక గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి ∙ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. పంజాబ్ సర్సోంకా సాగ్ కావలసినవి: ఆవ ఆకులు – ఒక కట్ట; బచ్చలి ఆకు – అర కట్ట; పాల కూర – అర కట్ట; ముల్లంగి ఆకుల తరుగు – ఒక కప్పు; ముల్లంగి – చిన్న ముక్క; మెంతి ఆకు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; నీళ్లు – 3 కప్పులు; మొక్క జొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత.సాగు కోసం... ఉల్లి తరుగు – అర కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉడికించిన సగ్గు బియ్యం – 3 కప్పులు తయారీ: ∙అన్ని ఆకు కూరలను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన ఉంచాలి ∙కుకర్‌లో పైన చెప్పిన పదార్థాలన్నిటినీ (మొక్క జొన్న పిండి కాకుండా) వేసి మూత పెట్టి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ∙చల్లారిన తరవాత, మొక్కజొన్న పిండి జత చేసి మెత్తగా అయ్యేవరకు కవ్వంతో బాగా గిలకొట్టి, ఈ మిశ్రమాన్ని ఒక బాణలిలో పోసి, స్టౌ మీద ఉంచి, బాగా చిక్కబడేవరకు సుమారు అరగంట సేపు సన్నని మంట మీద ఉడికించి దింపేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె లేదా నెయ్యి వేసి కాచాలి ∙ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉడికించి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని జత చేయాలి ∙మంట బాగా తగ్గించి కలుపుతుండాలి ∙ఉడికించిన ఆకు కూరల మిశ్రమం కూడా జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ∙ఉల్లి చక్రాలు, పచ్చిమిర్చితో అలంకరించాలి ∙రోటీలతో తింటే రుచిగా ఉంటుంది. తెలంగాణ గుత్తి దోసకాయ కావలసినవి: బుడమకాయలు (చిన్న చిన్న దోసకాయలు) – 5; కారం – టీ స్పూన్; ఉప్పు – తగినంత; పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేసుకోవాలి); నువ్వుల పొడి – టీ స్పూన్; ధనియాల పొడి – అర టీ స్పూన్; అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – తగినంత; నూనె – టేబుల్ స్పూన్; జీలకర్ర, ఆవాలు – అర టీ స్పూన్; పసుపు – కొద్దిగా; ఉల్లిపాయలు – 1 (సన్నగా తరగాలి). తయారీ: ∙దోసకాయల ముచ్చికల వద్ద కొద్దిగా కట్ చేసి, చేదుగా ఉందో లేదో చెక్ చేయాలి. నాలుగువైపులా (గుత్తి వంకాయను కట్ చేసినట్టుగా) కట్ చేయాలి. లోపల కొద్దిగా గింజలు తీయాలి. ఈ గింజలను కూడా మెత్తగా రుబ్బి కూరలోకి వాడుకోవచ్చు ∙కారం, ఉప్పు, ధనియాలపొడి, నువ్వుల పొడి (దోసకాయలు పులుపు లేకపోతే కొద్దిగా చింతపండు వాడుకోవచ్చు) కలిపి రోట్లో దంచాలి. ఈ మిశ్రమాన్ని దోసకాయల్లో కూరాలి ∙పొయ్యిమీద గిన్నెపెట్టి వేడయ్యాక నూనె వేయాలి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి కలపాలి. పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, సిద్ధంగా ఉంచుకున్న దోసకాయలను వేసి కలపాలి ∙గిన్నె మీద ఆవిరిమూత (కొద్దిగా నీళ్లుపోసిన మరొక గిన్నె) పెట్టి సన్నని మంటమీద ఉడకనివ్వాలి ∙మధ్యమధ్యలో దోసకాయలను కలుపుతూ, గ్రేవీకి అవసరమైనంతగా నీళ్లు ఊరుతున్నాయో లేదో సరిచూసుకోవాలి. చాలకపోతే కొద్దిగా నీళ్లు జతచేయవచ్చు ∙ముక్క ఉడికి, నూనె తేలినట్టుగా కనిపిస్తే కొద్దిగా ధనియాలపొడి, కొత్తిమీర చల్లి దించేయాలి ∙అన్నం, రోటీల్లోకి ఈ గుత్తి దోసకాయ రుచికరంగా ఉంటుంది. కేరళ ఇడియాప్పమ్ కావలసినవి: బియ్యప్పిండి–ఒక కప్పు; కొబ్బరి తురుము – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నూనె/నెయ్యి – ఇడ్లీ ప్లేట్‌కు రాయడానికి తగినంత. తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక బియ్యప్పిండి వేసి కొద్దిసేపు వేయించి తీసేయాలి ∙స్టౌ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి దింపేయాలి ∙ఆ నీళ్లలో బియ్యప్పిండి, ఉప్పు వేసి మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి ∙తడి వస్త్రం మూతలా వేయాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుని జంతికల గొట్టంలో ఉంచాలి ∙ఇడ్లీ రేకులకు నెయ్యి లేదా నూనె పూయాలి ∙కొద్దిగా కొబ్బరి ఈ రేకులలోకి బియ్యప్పిండిని చక్రాల మాదిరిగా తిప్పాలి ∙అలా అన్ని రేకులలో వేసుకుని, కుకర్‌లో ఉంచి ఆవిరి మీద ఉడికించి, దింపేయాలి ∙ప్లేటులోకి తీసుకుని, కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో అందించాలి. కర్ణాటక బిసిబేళ బాత్ కావలసినవి: ధనియాలు – 4 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ఏలకులు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; గసగసాలు – 2 టీ æస్పూన్లు; నువ్వులు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; కాశ్మీరీ ఎండు మిర్చి – 12; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; క్యారట్ – 1 (చిన్నది); బీన్స్ – 5; పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్లు; బంగాళదుంప – అర చెక్క (ముక్కలు చేయాలి); పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – ముప్పావు కప్పు (కొంచెం చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – అర టీ స్పూను; ఉల్లి పాయ – అర చెక్క (ముక్కలు చేయాలి); ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; అన్నం – రెండున్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను పోపు కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; జీడిపప్పులు – 10 తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో కూరగాయ ముక్కలు, పల్లీలు, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి ∙ముక్కలు బాగా ఉడికిన తరవాత చింతపండు రసం, బెల్లంపొడి, ఉల్లి తరుగు వేసి సుమారు పదినిమిషాల పాటు ఉడికించాలి ∙ఉడికించిన పప్పు, అన్నం జతచేసి బాగా కలిపి మరో కప్పు నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టాలి ∙çకొద్దిసేపటి తరవాత 4 టీ స్పూన్ల బిసిబేళబాత్ మసాలా వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి లేదా నూనె వేసి కాగాక పోపు కోసం తీసుకున్న సరుకులను వేసి వేయించి, సిద్ధం చేసుకున్న బిసిబేళబాత్ మీద వేసి బాగా కలిపి, వేడివేడిగా అందించాలి. మధ్యప్రదేశ్ పోహా జిలేబీ కావలసినవి: గట్టి అటుకులు – 2 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; ఆలుగడ్డ తరుగు – పావు కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; సోంపు – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 3; కరివేపాకు – 2 రెమ్మలు; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – చిటికెడు. గార్నిషింగ్ కోసం... నిమ్మ చెక్కలు – రెండు; సేవ్ – అర కప్పు; దానిమ్మ గింజలు – అర కప్పు; కొబ్బరి తురుము – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు తయారీ: ∙అటుకులను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉప్పు, మిరపకారం జత చేసి కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, రెండు టీ స్పూన్ల నూనె వేసి కాచాలి ∙ఆవాలు వేసి చిటపటలాడించాక, సోంపు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఆలుగడ్డల తరుగు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి ∙అటుకుల మిశ్రమం జత చే సి బాగా కలిపి మూత పెట్టాలి ∙ ఐదు నిమిషాల తరవాత కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాల ∙గార్నిషింగ్‌లో చెప్పిన పదార్థాలతో అలంకరించి జిలేబీతో జత చేసి అందించాలి (మధ్యప్రదేశ్‌లో ముఖ్యంగా ఇండోర్‌లో దీనిని ఎక్కువగా ఇష్టపడతారు). జిలేబీ... కావలసినవి: మైదా పిండి – ముప్పావు కప్పు; కార్న్; స్టార్చ్ – పావు కప్పు; పెరుగు – ఒక కప్పు; ఫుడ్ కలర్ – చిటికెడు; వేడి నూనె – 2 టేబుల్ స్పూన్లు; కుంకుమ పువ్వు – చిటికెడు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి మెత్తగా వచ్చేలా బాగా కలిపి, పైన మూత పెట్టి సుమారు 24 గంటల సేపు వదిలేయాలి. పంచదార పాకం కోసం... పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – అర కప్పు తయారీ: ∙ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ∙సిద్ధమైన జిలేబీ పిండిని, కెప్ బాటిల్లోకి తీసుకోవాలి ∙మూతకు చిన్న రంధ్రం చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, అందులోకి జిలేబీ ఆకారంలో వచ్చేలా సీసాను గుండ్రంగా తిప్పుతూ వేయాలి ∙రెండువైపులా దోరగా కాలిన తరవాత, తీసి, పంచదార పాకంలో వేయాలి ∙ఈ విధంగా మొత్తం పిండితో తయారుచేసుకుని, పాకంలో వేసి ఒక గంటసేపు వదిలేయాలి ∙ఆ తరవాత తింటే జిలేబీలలోకి పాకం చేరి రుచిగా ఉంటాయి. తమిళనాడు కట్టు పొంగల్ కావలసినవి: పెసరపప్పు – 150 గ్రా.; కొత్త బియ్యం – 100 గ్రా.; మిరియాలు – 15 (పొడి చేయాలి); పచ్చి మిర్చి – 6; పచ్చి కొబ్బరి – ఒక కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడిపప్పులు – 15; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఎండుమిర్చి – 3; మినప్పప్పు + సెనగ పప్పు – 2 టేబల్ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు తగినంత ; ఇంగువ – కొద్దిగా తయారీ: ∙దళసరి పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి ∙పెసర పప్పు వేసి దోరగా వేయించాలి ∙బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా వేసి సుమారు ఐదు నిమిషాల పాటు బాగా వేయించి (తెలుపు రంగు పోకూడదు) తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక, మిరియాల పొడి వేసి వేయించాక, జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి, పచ్చి కొబ్బరి, వేయించిన బియ్యం, పెసరపప్పు ఇవన్నీ వేసి కుకర్‌లో వుంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దింపేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙అందులో ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న పొంగలిలో వేయాలి ∙ఉప్పు వేసి బాగా కలియబెట్టి వేడి వేడిగా సర్వ్ చేయాలి. -
పల్లె రుచులు
చిత్తూరు నుంచి బెంగళూరుకి వెళ్లే మార్గంలో, పలమనేరు ప్రాంతం దగ్గర పడుతుండగా ప్రయాణికులను పల్లె రుచులు కట్టిపడేస్తాయి. ఎంత హడావుడిగా ప్రయాణిస్తున్నవారైనా ఒకసారి రుచి చూద్దాంలే అనుకుంటూ ఆ హోటల్లోకి ప్రవేశిస్తారు. ఒక్కసారిగా వారి వారి పల్లెలు వారికి గుర్తుకువస్తాయి. అమ్మమ్మ చేతి భోజనం తిన్నంత తృప్తిగా కడుపు నింపుకుని, ఆరోగ్యంగా బయటకు వస్తారు. వ్యవసాయ అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తి వినూత్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘పల్లెరుచులు’. పూరిగుడిసెలోనే, రోలులో రుబ్బుతూ, కట్టెల పొయ్యిపై 64 రకాల రుచులను తయారుచేయిస్తున్నారు. బైరొడ్ల బియ్యపు అన్నం, రాగి సంగటి, కూరాకు పులగూర, గొజ్జు, చింతనీళ్ళు, ఎరినూగుల ఊరి బిండి (చట్నీ)... చాలామంది ఈ వంటకాల పేర్లు కూడా విని ఉండరు. పలమనేరుకి చెందిన అమర్నాథ్ రెడ్డి ఇలాంటి సంప్రదాయ వంటకాలను తయారుచేసి ప్రజలకు రుచి చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో బొమ్మిదొడ్డి క్రాస్ దగ్గర ఈ వంటకాలు దొరుకుతున్నాయి. కాస్త కొత్తగా ఉండాలనే.... అమర్నాథ్ రెడ్డి సొంతవూరు పెద్ద పంజాణి మండలం గోనుమాకుల పల్లి. ఆయనది వ్యవసాయ కుటుంబం కావడంతో, పల్లెవాసనలు ఒంటబట్టాయి. పుంగనూరులో డిగ్రీ దాకా చదువుకొని ప్రైవేటు చక్కెర కర్మాగారంలో వ్యవసాయ అధికారిగా పనిచేశారు అమర్నాథ్ రెడ్డి. సమాజానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో, చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏపీ టూరిజం హోటల్లో పనిచేశారు. అక్కడి ఫాస్ట్‌ఫుడ్ విధానం, తద్వారా ప్రజలకు వస్తున్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఊబకాయ సమస్యలపై ఆయన చలించిపోయారు. ఆహారపు అలవాట్లతోనే యువత రుగ్మతల బారిన పడుతోందని గ్రహించారు. గ్రామీణ వంటల వల్ల అక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకుని, ‘పల్లెరుచులు – మిల్లెట్ రెస్టారెంట్’ ప్రారంభించి అందరికీ ఆరోగ్యం అందించడం కోసం ఆ రుచులను పరిచయం చేస్తున్నారు. పల్లె జీవనం ఉట్టిపడేలా.... ముగ్గులు, మామిడి తోరణాలతో పల్లెవాతావరణాన్ని తలపించేలా హోటల్‌ను రూపొందించారు. హోటల్ ముందు రుబ్బురోలు, కట్టెల పొయ్యి, మట్టి పాత్రలు ఏర్పాటుచేశారు. పల్లె పడుచులతో వంటలు చేయించడం ప్రారంభించారు. కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నల వంటి చిరుధాన్యాలతో వంటలు చేయిస్తున్నారు. తాడిపత్రి, కదిరి, అనంతపూర్, నంద్యాల, కర్ణాటక ప్రాంతాల నుంచి వీటిని తెప్పించి వండిస్తున్నారు. అరటి ఆకులలో మాత్రమే వడ్డిస్తున్నారు. పాత వంటకాలను పరిచయం చేస్తున్నారు.. ప్రస్తుతం మేము బైరొడ్ల అన్నం, కొర్రలు, సామలన్నం, రాగి, సజ్జ, జొన్న రొట్టెలు, ఎర్రినూగుల చట్నీ, సెనగ కాయల ఊరిబిండి, ఎర్రగారం, పచ్చిగొజ్జు, ఉలవచారు, నాటుకోడి పులుసు, చేపల పులుసు, అలసంద బోండా, వడ, కూరాకు పులగూరలు, చిట్టిముత్యాల బిర్యానీ, కొర్ర పాయసం, ఎర్రగడ్ల చట్నీ వంటివి తయారు చేస్తున్నారు. సాయంకాలం శొంఠితోను, అల్లంతోను టీ తయారుచేసి, పంచదార బదులు బెల్లం ఉపయోగించి అందిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు రాగిసంగటి కోసం ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడకు వచ్చి ఈ ఆహారం తిన్నవారు, ‘ఆరోగ్యప్రదాతా సుఖీభవ!’ అని ఆయనను ప్రశంసిస్తున్నారు. ఆరోగ్య సమాజం కోసం... పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు, అక్కడి ఫాస్ట్çఫుడ్ కల్చర్‌ను గమనించాను. ఆ తిండి ఒంటికి మంచిదికాదని తెలుసుకున్నాను. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందచేయాలనుకున్నాను. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ‘పల్లె రుచులు’. ఈ వ్యాపారం వల్ల నష్టం వస్తుంది, వద్దని స్నేహితులు వారించినా, ధైర్యం చేశాను. దేశంలో 80 శాతం మంది పల్లెలలో పుట్టినవారే, పల్లె రుచులను తప్పక ఆదరిస్తార నే నమ్మకంతో ఈ హోటల్ ప్రారంభించాను. పల్లె ప్రజల వేషధారణలో హోటల్‌కి వస్తాను. మా కుటుంబీకులు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా నడుస్తోంది. పి. సుబ్రహ్మణ్యం, పలమనేరు, సాక్షి -
టేస్టీ దోస్త్
భిన్న అభిరుచులు ఉన్నవారే మంచి దోస్తులు అవుతారంటారు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా టేస్టీ దోస్తుల్ని లాగించి ఎంజాయ్ చేయండి. ఉప్మా పెసరట్టు ఉప్మా కోసం కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూన్; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూన్; మినప్పప్పు – ఒక టీ స్పూన్; నూనె – ఒక టేబుల్ స్పూన్ తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి నీళ్లు మరిగించాలి ∙మంట బాగా తగ్గించి బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా పోస్తూ ఆపకుండా కలపాలి ∙జీడి పప్పులు జత చేసి బాగా కలిపి ఉడికించి, దింపేయాలి. పెసరట్టు కోసం కావలసినవి: పెసలు – రెండు కప్పులు; బియ్యం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ: ∙ముందు రోజు రాత్రి ఒక గిన్నెలో పెసలు, బియ్యం, తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, పెసల మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి గరిటెతో పెసరపిండిని దోసెలా వేసి, చుట్టూ నూనె వేసి పెసరట్టును దోరగా కాల్చాలి ∙కొద్దిగా ఉప్మాను పెసరట్టు మీద ఉంచి, మధ్యకు మడిచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙పెసరట్టుతో జత కలిసిన ఉప్మా పెడితే, మరో ఉప్మా పెసరట్టు అని అడగకుండా ఉండలేరు ∙భిన్న రుచుల స్నేహమంటే ఇదే. ఐస్ క్రీమ్ దోసె దోసెకు కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు; బియ్యం – 2 కప్పులు; మెంతులు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నూనె – తగినంత; తేనె – కొద్దిగా; నట్స్ – కొద్దిగా తయారీ:ముందురోజు రాత్రి ఒక పాత్రలో బియ్యం, మినప్పప్పు, మెంతులు వేసి తగిన న్ని నీళ్లు పోసి నానబెట్టాలి ∙మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, బియ్యం మిశ్రమాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బుకోవాలి ∙ఉప్పు జత చేసి మరోమారు గ్రైండ్ చేయాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక దోసెలు వేయాలి ∙పైన కొద్దిగా తేనె, నట్స్ వేయాలి. ఐస్ క్రీమ్: ∙మార్కెట్లో మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ను తెచ్చుకోవాలి ∙దోసె కాలగానే, ఐస్ క్రీమ్‌ను దోసె మీద వేసి సమానంగా పరిచి మధ్యకు మడిచి, చల్లటి దోసెను వేడివేడిగా అందించాలి ∙కోపమనే వేడిని చల్లబరిచే స్నేహం అంటే ఇదేనేమో. కోవా కజ్జికాయ కావలసినవి :స్టఫింగ్ కోసంనెయ్యి – ఒక టేబుల్ స్పూన్; కొబ్బరి తురుము – 2 కప్పులు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూన్పైభాగం కోసంకోవా – పావు కేజీ; పంచదార పొడి – 6 టేబుల్ స్పూన్లు తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక, పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙బెల్లం తరుగు జత చేసి బాగా కలపాలి ∙ఏలకుల పొడి జత చేసి, మిశ్రమం కొద్దిగా గట్టిపడేవరకు కలుపుతుండాలి. (ఎక్కువ గట్టిపడకూడదు. అలా చేయడం వల్ల తినడానికి బావుండదు) ∙మందపాటి అడుగు ఉన్న పాత్రలో పచ్చి కోవా వేసి సన్నని మంట మీద కలుపుతుండాలి ∙కొద్దిగా వేడిగా అయిన తరవాత పంచదార పొడి జత చేసి మరోమారు కలపాలి ∙పంచదార బాగా కలిసి కోవా గట్టిపడిన తరవాత ఒక పళ్లెంలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారిన తరవాత చేతితో బాగా కలపాలి ∙తియ్యటి కోవా తయారవుతుంది ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙కోవాను నిమ్మకాయ పరిమాణంలో చేతిలోకి తీసుకుని, ఒక కొబ్బరి ఉండను అందులో ఉంచి, కొబ్బరి ఉండ కనిపించకుండా కోవాతో మూసేయాలి ∙కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుని నునుపుగా మెరిసేలా ఉండ చేయాలి ∙తియ్యటి కోవా, తీపి కజ్జికాయతో చేసిన స్నేహంతో రెండింతల రుచి అందుతుంది. బ్రెడ్ ఆమ్లెట్ కావలసినవి :బ్రెడ్ స్లయిసెస్ – 4; నెయ్యి – కొద్దిగా; కోడి గుడ్లు – 4; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూన్; ఉప్పు – కొద్దిగా; మిరప కారం – కొద్దిగా; నూనె – తగినంత తయారీ: ముందుగా స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక బ్రెడ్ స్లయిసెస్‌ను దోరగా కాల్చి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో కోడిగుడ్డు సొనలు వేసి బాగా గిలకొట్టాలి ∙ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, మిరప కారం జత చేసి బాగా గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక కోడి గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా వేయాలి ∙పచ్చిగా ఉండగానే బ్రెడ్ స్లయిస్ దాని మీద ఉంచి, మరి కాస్త ఆమ్లెట్ మిశ్రమం బ్రెడ్ మీద వేయాలి ∙చుట్టూ నూనె వేసి కాలాక, రెండో వైపు కూడా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ∙బ్రెడ్‌తో జత కట్టడంతో ఆమ్లెట్ డిమాండు పెరిగింది. గంగ – జమున గంగ (కలాకండ్) కోసం కావలసినవి: స్వీట్ కండెన్స్డ్ మిల్క్ – ఒకటిన్నర కప్పు (400 గ్రాములు); పనీర్ – 2 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూన్; పంచదార – టేబుల్ స్పూన్; రోజ్ వాటర్ – టేబుల్ స్పూన్; పిస్తా పప్పు – 12; జీడిపప్పు లేదా బాదం పప్పు – 12; కుంకుమపువ్వు – కొద్దిగా తయారీ: ∙ బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, వేడయ్యాక సన్నగా తరిగిన పిస్తా పప్పు, సన్నగా తరిగిన జీడిపప్పు లేదా బాదం పప్పు, కుంకుమ పువ్వు రేకలు వేసి కొద్దిగా వేయించి, దించాలి ∙పనీర్ తురుముతుంటే విరిగిపోతుంటుంది. అందుకని డీప్ ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి తీసి, తురిమి పక్కనుంచాలి ∙మందపాటి పాత్రలో స్వీట్ కండెన్స్డ్ మిల్క్ పోసి, తరిగిన పనీర్ వేసి బాగా కలపాలి ∙దీంట్లో పంచదార వేసి మళ్లీ కలపాలి ∙సన్నని మంట మీద ఈ మిశ్రమం ఉన్న పాత్ర పెట్టాలి ∙కండెన్స్డ్ మిల్క్‌లో పనీర్ కరిగి, అడుగు అంటకుండా మిశ్రమం చిక్కబడేలా ఉడకనివ్వాలి ∙మిశ్రమం చిక్కపడుతుందనగానే, కిందకు దింపి చల్లారనివ్వాలి ∙నోట్: గట్టి కలాకండ్ను స్పూన్‌తో అదిమి, కొద్దిగా పాలు పోసి తయారు చేసుకోవచ్చు. జమున (జామూన్) కోసం కావలసినవి: పాల పొడి – ఒక కప్పు; మైదా – పావు కప్పు; నెయ్యి – ఒక టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; బేకింగ్ సోడా – చిటికెడు; పెరుగు – ఒక టేబుల్ స్పూన్; పిస్తా పప్పులు – కొద్దిగా (అలంకరించడానికి) తయారీ: ∙ఒక పాత్రలో పాల పొడి, మైదా పిండి, బేకింగ్ సోడా వేసి కలపాలి ∙నెయ్యి జత చేయాలి ∙కొద్దికొద్దిగా పెరుగు జత చేస్తూ, మిశ్రమం మెత్తగా వచ్చేలా బాగా కలపాలి ∙మిశ్రమం మృదువుగా వచ్చేలా జాగ్రత్త పడాలి ∙మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి సన్నని మంట మీద కాగనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న జామూన్లను నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. పంచదార పాకం కోసం: నీళ్లు – 2 కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – ఒక టీ స్పూన్; కుంకుమ పువ్వు – చిటికెడు; రోజ్ వాటర్ – ఒక టీ స్పూను పాకం తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచాలి ∙పంచదార కరిగేవరకు కలపాలి (తీగ పాకం కూడా రాకూడదు) ∙రోజ్ వాటర్ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙తయారుచేసిన జామూన్లను పాకంలో వేసి గంటసేపు పక్కన ఉంచాలి ∙వెడల్పాటి కప్పులో స్పూన్‌తో ఒకవైపు జామూన్, మరోవైపు కలాకండ్ వేసి సర్వ్ చేయాలి. తెల్లగా ఉంటుంది కాబట్టి కలాకండ్‌ని గంగ అని బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి జామూన్‌ని జమున అని అంటారు. ఈ రెండూ ఒకేసారి తినడంలో ఉండే తియ్యదనం, రుచి మధురంగా ఉంటుంది. -
భారత్‌లోనే ఖరీదైన ఐస్‌క్రీమ్ ఇదే..
ఈ ఐస్‌క్రీమ్ మీరు తిన్నారా.? పోనీ.. దీని గురించి విన్నారా.? ఇది హైదరాబాద్ స్పెషల్ ఐస్‌క్రీమ్. దేశంలో మరెక్కడా లేని గోల్డెన్ ఐస్‌క్రీమ్. భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్. ధర ఎంతో తెలుసా.? జస్ట్ రూ.1100 మాత్రమే. అంతేనా... దీని పేరు వెనకో పురాణ గాథ దాగుంది. అసలేంటీ ఐస్‌క్రీమ్... ఎందుకింత స్పెషల్? ‘సాక్షి’ వీకెండ్లో... సాక్షి, సిటీబ్యూరో ; వెనీలా, చాక్లెట్, స్ట్రాబెరీ, బటర్ స్కాచ్... ఇలా చాలా రకాల ఐస్‌క్రీమ్‌లు మీరు తిని ఉంటారు. కానీ.. గోల్డెన్ ఐస్‌క్రీమ్ తిన్నారా.? భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ ఇది అని మీకు తెలుసా.? దీని వెనకో పురాణ గాథ ఉందని ఊహించగలరా? అసలేంటి ఐస్‌క్రీమ్ అంటారా.. అదే ‘మైటీ మిదాస్.. ది గోల్డెన్ ఐస్‌క్రీమ్’. బంజారాహిల్స్‌లోని హ్యూబర్ అండ్ హోలీ రెస్టారెంట్ ఎక్స్‌క్లూజివ్ ఐస్‌క్రీమ్ ఇది. ‘పురాతన కాలంలో ‘మిదాస్’ అనే అత్యాశ గల ఒక మహారాజు ఎన్నో ఏళ్లు తపస్సు చేయగా, భగవంతుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకొమ్మని అంటాడు. అప్పుడు మహారాజు తాను తాకినదల్లా బంగారమైపోయేలా వరం ఇవ్వాలని కోరుకుంటాడు. తధాస్తు.. అని దీవించి దేవుడు మాయమైపోతాడు. ఆ తర్వాత రాజు సింహాసనాన్ని తాకినా, చెట్లని తాకినా, పండ్లు ఫలహారాలను తాకినా... ఇలా దేన్ని తాకినా బంగారమైపోతాయి. చివరికి తన ప్రాణానికి ప్రాణమైన కూతురు దగ్గరికి ఆప్యాయంగా పలకరిస్తూ రాగా.. పట్టుకోవడంతో చిన్నారి సైతం బంగారు విగ్రహంలా మారిపోతుంది. ఆ రాజు పేరు మీదుగానే ఈ హైదరాబాదీ ఎక్స్‌క్లూజివ్ ఐస్‌క్రీమ్‌కు ‘మైటీ మిదాస్ గోల్డెన్ ఐస్‌క్రీమ్’ అని పేరు పెట్టాన’ని చెప్పారు నిర్వాహకులు శ్రీనివాస్‌రెడ్డి. సెలబ్రిటీలూ ఫిదా... ఇందులో 18 రకాల సీక్రెట్ ఇంగ్రిడియంట్స్, మూడు రకాల టాపింగ్స్, రెండు రకాల సాసెస్, ఇంపోర్టెడ్ ఫ్రూట్ సిరప్స్ మాత్రమే కాకుండా 23 క్యారట్ ఎడిబుల్ గోల్డ్ లీఫ్ సైతం ఉంటుంది. దీని ధర రూ.1100. ఏడు స్కూప్లలో నిండి ఉండే ఈ ఐస్‌క్రీమ్ దేశంలోనే అత్యంత ఖరీదైనదని చెప్పారుశ్రీనివాస్రెడ్డి. మంచు లక్ష్మి, చార్మి, అనూష్క తదితర సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ ఐస్‌క్రీమ్‌కు దాసోహులే. ఇందులోని బంగారు పూతతో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ముఖంలో తేజస్సు వస్తుందన్నారు. సూపర్ కాన్సెప్ట్... నేను ఫుడ్ లవర్ని. సిటీలో ఏర్పాటు చేసే వెరైటీ ఫుడ్ టేస్ట్ చేస్తుంటాను. ఇక్కడి గోల్డెన్ ఐస్‌క్రీమ్ చాలా నచ్చింది. పూర్వం రాజుల కాలంలో బంగారు బిందెలతో నీరుపట్టి తాగేవారని, అలా తాగడంతోనే ఎలాంటి రోగాలు లేకుండా ఎక్కువ కాలం బతికే వారని మా అమ్మమ్మ చెప్పేది. ఇప్పుడు అదే బంగారాన్ని ఐస్‌క్రీమ్‌పై పూతగా వేసి సర్వ్ చేయడమనే కాన్సెప్ట్ సూపర్బ్. – నిహాల్, మంగళూర్ న్యూ ఫ్లేవర్... ఐస్‌క్రీమ్స్‌లో అన్ని ఫ్లేవర్స్ ట్రై చేస్తుంటాను. ఈ ఫ్లేవర్ చాలా కొత్తగా ఉంది. మా ఫ్రెండ్స్‌తో తరచూ ఇక్కడికి వస్తాను. ఒక్క ఐస్‌క్రీమ్‌ని నలుగురం తినొచ్చు. ఈ గోల్డెన్ ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం. ఇందుకోసమైనా ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయొచ్చు. -
ముసురుతో పొత్తు...
మబ్బులు ముసిరిన వేళ బండి మీద అమ్మే మొక్కజొన్నపొత్తులు వెచ్చగా రారమ్మంటాయి. చింత నిప్పుల మీద అవి కాలుతుంటే చూసేవారి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి... వాన వేళ వేడిని పుట్టించడానికి మాత్రమే కాదు వంట గదిలో రుచులను దట్టించడానికి కూడా తొలకరి చినుకులతో మొక్కజొన్నల పొత్తు రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఆస్వాదించే ఎత్తు!! బేబీ కార్న్ బజ్జీ కావలసినవి: బేబీకార్న్ – 100 గ్రాములు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – చిటికెడు, మైదా, కార్న్‌ఫ్లోర్ – 20 గ్రాములు, బేకింగ్ సోడా – 2 గ్రాములు, నూనె – 100గ్రా. తయారి: ∙ముందుగా బేబీకార్న్‌ను ఉడికించి పక్కన ఉంచాలి. ఒకగిన్నె తీసుకుని అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక చిన్న గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాలపొడి, నీళ్లు పోసి గరిటజారుగా కలపాలి. ఇందులో బేబీకార్న్‌ను ముంచి, కడాయిలో నూనె కాగాక అందులో పిండిలో ముంచిన బేబీకార్న్‌లను వేసి, గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని టొమాటో సాస్‌తో సర్వ్ చేయాలి. రుచికిరుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. మొక్క జొన్న గారెలు కావలసినవి: మొక్కజొన్నగింజలు – 2 కప్పులు, ఉల్లిపాయ– 1 (ముక్కలుగా కట్ చేయాలి), కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి – 2 (తగినన్ని), జీలకర్రæ – టీ స్పూన్, అల్లం తరుగు – టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ∙మొక్కజొన్న గింజలను అల్లం, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. తర్వాత దీంట్లో పైవన్నీ కలిపి, మరికాస్త నూరి గారెలకు సిద్ధం చేసుకోవాలి. కాటన్ క్లాత్ మీద చిన్న చిన్న పిండి ముద్దలు వేసి, వెడల్పుగా అదిమి, మధ్యలో వేలితో చిల్లు పెట్టి, కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా దోరగా వేయించి, తీయాలి. వీటిని టొమాటో పచ్చడి లేదా సాస్‌తో వడ్డించాలి. కార్న్ మినీ పిజ్జా కావలసినవి: పిజ్జా బేస్ – 4 (చిన్నవి), ఉడికించిన స్వీట్ కార్న్ – పావు కప్పు, బీన్స్, క్యారట్, క్యాప్సికమ్, క్యాబేజీ తరుగు – పావు కప్పు, టొమాటో సాస్ – 3 టేబుల్ స్పూన్లు, చీజ్ తురుము – పావు కప్పు, పనీర్ ముక్కలు – టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, చిల్లీ ఫ్లేక్స్ – 2 టీ స్పూన్లు, ఉల్లికాడల తరుగు – 3 టీ స్పూన్లు తయారి: ∙చిన్న సైజు పిజ్జా బేస్ తీసుకొని పలుచగా టొమాటోసాస్ పూయాలి. దాని పైన సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఉల్లికాడలు, క్యారట్, బీన్స్ ముక్కలు వేయాలి. దానిపైన చీజ్ తురుము, పనీర్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, స్వీట్‌కార్న్ వేసి పది నిమిషాలు లేదా చీజ్ కరిగేంతవరకు బేక్ చేయాలి. అవెన్ లేకుంటే నాన్ స్టిక్ లేదా మందపాటి పాన్ వేడి చేసి అందులో ఈ పిజ్జాలు పెట్టి, పైన మూతపెట్టి పదినిమిషాలు ఉంచాలి. చీజ్ కరిగిన తర్వాత తీయాలి. క్రిస్పీ కార్న కెర్నల్స్ కావలసినవి: మొక్కజొన్న గింజలు – 80 గ్రాములు, ఉల్లిపాయ తరుగు – 20 గ్రాములు, పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు, మైదా – 15 గ్రాములు, కార్న్‌ఫ్లోర్ – రెండు టీ స్పూన్లు, రిఫైన్డ్ ఆయిల్ – వేయించడానికి తగినంత, ఉప్పు –తగినంత, నల్లమిరియాలు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు తయారి: ∙వెడల్పాటి పాత్రలో మొక్కజొన్న గింజలు, మొక్కజొన్న పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి కలపాలి. కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేయాలి. తర్వాత మొక్కజొన్న గింజలను కాగుతున్న నూనెలో వేసి, బంగారువర్ణం వచ్చేంతవరకు వేయించాలి. నూనె పీల్చుకునే పేపర్‌టవల్ పైన వేయించిన గింజలు వేయాలి. మరొక పాన్‌లో టేబుల్‌స్పూన్ నూనె వేసి, కాగిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తర్వాత పోపు గింజలు, వేయించిన మొక్కజొన్న గింజలు, ఉప్పు, నల్ల మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్ వేసి కలపాలి. ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. కార్న్‌ఫ్లేక్స్ టొమాటో బాస్కెట్స్ కావలసినవి: కార్న్‌ఫ్లేక్స్ – అర కప్పు, పచ్చి బఠాణీ – అర కప్పు, పచ్చికొబ్బరి కోరు – అర కప్పు, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, గరం మసాలా – కొద్దిగా, కారం బూందీ – ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా, టొమాటో కెచప్ – టేబుల్‌స్పూన్, పుదీన, కొత్తిమీర, ఉప్పు – తగినంత, క్యారట్ తురుము – అర కప్పు, బెంగళూరు టొమాటోలు – ఆరు (పెద్దవి) తయారి: ∙ముందుగా టొమాటోలను ఫొటోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. కట్‌చేసిన తర్వాత లోపల ఉన్న గుజ్జుని తీసేయాలి. లోపల ఉప్పు రాసి బోర్లించాలి. ఇలా చేయడం వల్ల టొమాటోలోని నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు టొమాటో లోపల గరం మసాలా రాయాలి. ఒక పాత్ర తీసుకుని కారం బూందీ, ఉల్లిపాయ తరుగు, పచ్చి బఠాణి, పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టొమాటో బాస్కెట్లో నింపి పైన కార్న్ఫ్లేక్స్వేసి దాని మీద కెచప్ పెట్టాలి. చివరగా కొబ్బరి తురుము చల్లి సర్వ్ చేయాలి. క్రిస్పీ కార్న్ సూప్ కావలసినవి: మొక్కజొన్న గింజలు – 1 కప్పు(పచ్చివి) (మూకుడులో టీ స్పూన్ నూనె వేసి వేయించాలి), క్యారెట్ – 1, బీన్స్ – గుప్పెడు, కార్న్‌ఫ్లోర్ – పావు కప్పు, ఉప్పు – తగినంత, మిరియాలు – 4, పంచదార – టీ స్పూను, కూరగాయ ముక్కలు లేదా పప్పు ఉడికబెట్టిన నీళ్లు – 3 కప్పులు తయారి : ∙అడుగు మందంగా వున్న పాత్రలో కూరగాయలు లేదా పప్పు ఉడికించిన నీళ్ళుపోసి వేడిచేసి మొక్కజొన్న గింజలు, కూరగాయముక్కలు, పంచదార, ఉప్పు, మిరియాలువేసి ఉడికించాలి. కూరగాయ ముక్కలు ఉడికిన తరువాత స్టౌ పై నుంచి దించి నీటిని వడకట్టాలి. వడకట్టిన కూరగాయలను గ్రైండ్‌చేసి వడకట్టిన నీటిని కూడా కలిపి మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. సూప్ కప్పులో పోసి, పైన వేయించిన మొక్కజొన్న గింజలు, సన్నగా కట్ చేసిన కీరా ముక్క వేసి సర్వ్ చేయాలి. -
రుచుల గుట్ట
ప్రాంతాలు వేరు కావచ్చు. ప్రాంతాల పేర్లు మారొచ్చు.మనుషుల్ని ఎప్పటికీ కలిపి ఉంచేవి కిచెన్లే! ఈ జిల్లా... ఆ జిల్లా అని లేదు. ఈ రాష్ట్రం... ఆ రాష్ట్రం అని లేదు. ‘భోజనం రెడీ’ అవగానే... మనుషులంతా ఒక్కటే.. భూగోళమంతా... విస్తరే! ఈ వారం సాక్షి ఫ్యామిలీ యాదాద్రి భువనగిరి నుంచి...క్యారియర్ తెచ్చింది.టేస్ట్ చెయ్యండి. పుంటికూర (గోంగూర)బోటి కావాల్సినవి: పుంటికూర ఆకులు – 250 గ్రాములు, బోటి (మేక మాంసం) – 500 గ్రాములు, కొత్తిమీర – తగినంత, పుదీన – గుప్పెడు, ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి), అల్లం– వెల్లుల్లిపేస్ట్ – 2 టీ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, మసాలా – టీ స్పూన్, గసగసాలు – టీ స్పూన్ తయారీ విధానం: ∙మేక మాంసం తీసుకొని వేడినీటిలో 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. పొయ్యి మీద గిన్నెపెట్టి నూనె వేసి, వేడిచేయాలి. ఆ తరువాత అల్లం– వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి తాలింపు చేయాలి. ఆ తరువాత బోటిని వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి. 15 నిమిషాల తరువాత తరిగిన పుంటికూర ఆకులు వేసి ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి దించాలి. పచ్చికొబ్బరి షర్బత్ కావాల్సినవి: బెల్లం –1 కిలో, నీళ్లు – 2 లీటర్లు, పచ్చి కొబ్బరి – 250 గ్రాములు, పచ్చిసోంపు – 150 గ్రాములు, కొత్త కుండ – 1 తయారీ: ∙ముందుగా పచ్చికొబ్బరిని, సోంపును కచ్చా పచ్చాగా దంచుకొని ముద్ద చేయాలి. ఆ తరువాత గిన్నెలో 2 లీటర్లు నీళ్లు పోసి, బెల్లం తురుము వేసి, గరిటెతో కలుపుతూ కరిగించాలి. ఈ బెల్లం నీళ్లను ఒక కొత్త కుండలో పోసి, మరికొద్దిసేపు ఒక గరిటెతో కలపాలి. కొబ్బరి, పచ్చిసోంపు ముద్ద వేసి, పైకి కిందకు కలపాలి. దానిని ఓ రెండు గంటలు ఉంచి, తరువాత తాగితే రుచిగా ఉంటుంది. చింతచిగురు ఎండుచేపలకూర కావాల్సినవి: చింతచిగురు – రెండుకప్పులు, వట్టిచేపలు (ఎండుచేపలు/రొయ్యలు) – 100 గ్రాములు, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – చిటికెడు, కారం – టీ స్పూన్ (తగినంత), ఉప్పు – తగినంత, నూనె – మూడు టేబుల్ స్పూన్లు, అల్లం – వెల్లుల్లి ముద్ద – టీ స్పూన్, గరం మసాలా – టీ స్పూన్, కొత్తిమీర తరుగు – టీ స్పూన్ తయారీ: ∙పొయ్యి వెలిగించి, మూకుడు పెట్టి వేడి అయ్యాక, కడిగి ఆరబెట్టిన ఎండు చేపలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో నూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన మిరపకాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. అందులో అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కలిపి తర్వాత కరివేపాకు, పసుపు వేయాలి. రెండు నిమిషాల తర్వాత నలిపిన చింతచిగురు వేసి, కలపాలి. ఎండుచేపలను వేసి, కలిపి అందులో కారం, ఉప్పు వేసి మూతపెట్టాలి. మూడు నిమిషాల తర్వాత మరోసారి కలియబెట్టి, వేగాక అందులో గరంమసాలా వేసి దించి కొత్తిమీరతో అలంకరించాలి. మలిదముద్దలు కావాల్సినవి: బియ్యప్పిండి/ సజ్జపిండి/ గోధుమపిండి – కిలో, బెల్లం – 500 గ్రాములు, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడినన్ని, యాలకుల పొడి‡– రెండు టీ స్పూన్లు, బాదం పప్పులు – 2 టేబుల్ స్పూనులు (ముక్కలు చేసినవి), జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు (ముక్కలు చేసినవి) తయారీ: ∙ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి, నీళ్లు పోస్తూ రొట్టె పిండిలా ముద్ద చేసుకొని, పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రొట్టెల పీట మీద రొట్టె మాదిరి మందంగా ఒత్తుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి, రొట్టెను రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత దానిని ఒక గిన్నెలో ముక్కలు ముక్కలుగా చేసుకొని, బెల్లం తురుము వేయాలి. వేడివేడిగా ఉన్న రొట్టె ముక్కలను, బెల్లంతో కలుపుతూ, యాలకుల పొడి, బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు పోయాలి. మళ్ళీ కలపాలి. ఆ తర్వాత కావల్సిన పరిమాణంలో గుండ్రంగా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ముద్దలు రుచిగా, బలవర్ధకంగా ఉంటాయి. చెన్నంగి(కసివింద)ఆకు పచ్చడి కావాల్సినవి: చెన్నంగి ఆకు–2 కప్పులు, ఎండు మిరపకాయలు –10, మిరియాలు – 10, వెల్లుల్లి రెబ్బలు –5, జీలకర్ర – టీ స్పూన్, చింతపండు– 10 గ్రాములు, మినప్పప్పు – 2 టీ స్పూన్లు, కరివేపాకు– రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, నూనె–2 టీ స్పూన్లు తయారీ: ∙పొయ్యి మీద మూకుడు పెట్టి మిరియాలు, జీలకర్ర, మినపప్పు వేయించుకోవాలి. తీసి గిన్నెలో వేసి, మూకుడులో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చెన్నంగి ఆకు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. చింతపండులో నారలు లేకుండా తీసి, మూకుడులో కొద్దిగా వేయించుకోవాలి. వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని తగినంత ఉప్పువేసి, మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో రోజూ రెండు ముద్దలు తింటే ఆరోగ్యానికి మంచిది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఇన్పుట్స్: వెల్మినేటి జహంగీర్, మోత్కూరు; మహ్మద్ జమాలుద్దీన్, భువనగిరి టౌన్ ; ఎం.వెంకటరమణ, భువనగిరి ఖిల్లా -
నట్‌ఇంట్లో
నట్ అంటే ఏంటని గింజుకోకండి! గింజల గురించి మాట్లాడుతున్నాం. గింజల్లో పోషకాలుంటాయని అందరికీ తెలుసు. మరి... ఇన్ని రుచులుంటాయని తెలుసా? వంటింట్లో చేయండి... నట్టింట్లో ఆస్వాదించండి. వదలకండి. నట్ బిగించండి!! ఉలవల రసం కావలసినవి: ఉలవలు - 100 గ్రా; చింతపండు - 50 గ్రా మిరియాలు - 10 గ్రా; ఉప్పు - తగినంత వెల్లుల్లి రేకలు- నాలుగు; కరివేపాకు- రెండు రెమ్మలు ఎండు మిర్చి - మూడు; పచ్చిమిర్చి- మూడు కారం- 20 గ్రా; జీలకర్ర- 10 గ్రా; కొత్తిమీర- చిన్న కట్ట ధనియాలు- 10 గ్రా; నూనె- ఒక టేబుల్ స్పూన్ తయారీ: ఉలవలను మూడు గంటల సేపు నానబెట్టాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో మెత్తగా ఉడికించి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. రుబ్బేటప్పుడు ఉలవకట్టు (ఉడికించిన ప్పుడు మిగిలిన నీరు), చింతపండు రసం కలపాలి. తగినంత ఉప్పు చేర్చాలి. ఇప్పుడు తాలింపు పెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత, కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఉలవల రసం మిశ్రమాన్ని పోయాలి. చివరగా కొత్తిమీర వేసి వేడెక్కిన తర్వాత ఆపేయాలి. ఈ రసం వర్షాకాలం ఆరోగ్యానికి మంచిది. రాజ్మా మసాలా కర్రీ కావలసినవి: రాజ్మా గింజలు- 200 గ్రా నూనె - 4 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి- 6 టొమాటోలు- 4 పెద్దవి; వెల్లుల్లి రేకలు- 4 గరం మసాలా పొడి- 10 గ్రా కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు- తగినంత ఉల్లిపాయలు- 2 (మీడియం సైజు) క్రీమ్ - ఒక టీ స్పూన్; ఉప్పు- తగినంత నెయ్యి- ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి- ఒక టీ స్పూన్ ధనియాలపొడి - ఒక టీ స్పూన్ రాజ్మా మసాలా పొడి- ఒక టేబుల్ స్పూన వెన్న- ఒక టేబుల్ స్పూన్; కారం : టీ స్పూన్ తయారీ: రాజ్మా గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఉడికించి పక్కన పెట్టాలి. టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి తరగాలి. మందపాటి పెనం తీసుకుని నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రేకలు వేసి వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగేటప్పుడు నెయ్యి వేయాలి. ఇప్పుడు ఉడికించిన రాజ్మా గింజలు (నీటితోపాటుగా), కారం, గరం మసాలా పొడి వేసి సన్నమంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, రాజ్మా మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. చివరగా వెన్న వేసి మంట తగ్గించి రెండు నిమిషాల తర్వాత క్రీమ్ వేసి దించేయాలి. బొబ్బర్ల వడలు కావలసినవి: అలసందలు (బొబ్బర్లు)- 100 గ్రా పచ్చి శనగలు- 25 గ్రా మినప్పప్పు- 15 గ్రా పచ్చిమిర్చి- 15 గ్రా ఉల్లిపాయ ముక్కలు- 10 గ్రా జీలకర్ర- 5గ్రా ఉప్పు- తగినంత అల్లం తరుగు- రెండు గ్రాములు నూనె- వేయించడానికి సరిపడినంత తయారీ: అలసందలు, పచ్చిశనగలు, మినప్పప్పు కడిగి రెండు గంటల సేపు నానబెట్టాలి. అన్నింటినీ కలిపి ఉప్పు వేసి కొంచెం పలుకుగా రుబ్బాలి. పిండి మరీ జారుడుగా ఉండకూడదు. వడ చేయడానికి వీలుగా ఉండాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసుకుని కాగిన తర్వాత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని వడలాగ వత్తి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీయాలి. ఈ వడలకు కొబ్బరి పచ్చడి, టొమాటో పచ్చడి చక్కటి కాంబినేషన్. ఇదే పిండిని పకోడీల్లా వేసుకుంటే సూప్‌తో స్టార్టర్‌గా తినడానికి కూడా బాగుంటాయి. కాజు-మోతీ పులావ్ కావలసినవి: బాసుమతి బియ్యం- 200 గ్రా బిర్యానీ ఆకులు - రెండు ఉప్పు - తగినంత జీడిపప్పు - 50 గ్రా తాలింపు కోసం: నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి- 5 (తరగాలి) పుదీన- ఒక కట్ట కొత్తిమీర- చిన్న కట్ట ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు జీలకర్ర- ఒక టీ స్పూన్ ధనియాలు- ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టేబుల్ స్పూన్ పన్నీర్ బాల్స్ కోసం: పనీర్- 50 గ్రా గరమ్ మసాలా పొడి- 10 గ్రా కార్న్‌ఫ్లోర్- ఒక టీ స్పూన్ ఉప్పు- తగినంత నూనె- రెండు టేబుల్ స్పూన్లు తయారీ: బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టాలి. పన్నీరును తురిమి ఉప్పు, గరం మసాలా పొడి, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలు చేయాలి. వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు బియ్యంలో బిర్యానీ ఆకులు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. బాణలి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పును నేతిలో వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నెయ్యితో తాలింపు దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. అందులో రైస్ కలిపి కాజు, వేయించిన పన్నీరు ఉండలతో గార్నిష్ చేయాలి. హాజల్‌నట్ సూప్ కావలసినవి: బటర్- 15 గ్రా; మైదా-100 గ్రా; ఉప్పు : తగినంత బే లీఫ్- ఒకటి; మిరియాలు- ఆరు గింజలు హాజల్‌నట్ - 50 గ్రా (వీటి బదులు బాదం తీసుకోవచ్చు) క్రీమ్- అర టీ స్పూన్; పాలు- 125 మి.లీ తయారీ: హాజల్ నట్ లేదా బాదం గింజలను పెనంలో దోరగా వేయించి చల్లారిన తర్వాత కొద్దిగా నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. గార్నిష్ కోసం కొన్ని పలుకులు పక్కన పెట్టుకోవాలి. పెనంలో వెన్న వేసి వేడెక్కిన తర్వాత మిరియాలు, బే లీఫ్, మైదా, ఉప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. మరొక పెనంలో పాలు పోసి కాగిన తర్వాత హాజల్‌నట్ లేదా బాదం గింజల పేస్టు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరగబెట్టాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మైదా మిశ్రమంలో నీటిని పోసి కలిపి మొత్తాన్ని పాలలో వేసి కలపాలి. మిశ్రమం వేడయిన తర్వాత దించి పైన క్రీమ్, బటర్, హాజల్‌నట్ లేదా బాదం పలుకులు వేసి సర్వ్ చేయాలి. ఆపిల్ వాల్నట్ సలాడ్ కావలసినవి: ఆపిల్ - 150 గ్రా వాల్నట్- 25 గ్రా సెలెరీ - రెండు కాడలు (ఇది ఆకుకూరల్లో ఒక రకం. అది లేనప్పుడు ఉల్లికాడలు తీసుకోవాలి) ఉప్పు - తగినంత క్రీమ్- 25 మి.లీ మయనైజ్ - 10 గ్రా లేదా వెన్న తయారీ: ఆపిల్‌ను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. సెలెరీ కాడలను సన్నగా తరగాలి. ఒక పాత్ర తీసుకుని ఆపిల్ ముక్కలు, సెలెరీ తరుగు, వాల్నట్, క్రీమ్, ఉప్పు, మయనైజ్ లేదా వెన్న వేసి కలపాలి. పిస్తా మిల్క్ షేక్ కావలసినవి: పిస్తా - 100 గ్రా క్రీమ్ - 75 గ్రా బటర్ - 15 గ్రా చక్కెర - 100 గ్రా వెనిలా ఐస్‌క్రీమ్ - 50 గ్రా (రెండు స్కూప్‌లు) పాలు- 100 మి.లీ పిస్తా ఎసెన్స్- రెండు చుక్కలు తయారీ: పిస్తా ను అర గంట సేపు నానబెట్టి కొన్ని పలుకులు పక్కన ఉంచుకుని మిగిలిన వాటిని మెత్తగా పేస్టు చేయాలి. అందులో క్రీమ్, బటర్, చక్కెర, పాలు, పిస్తా పలుకులు, ఎసెన్స్ వేసి బాగా కలపాలి. తర్వాత ఐస్‌క్రీమ్ ఒక స్కూప్ వేసి ఒక మోస్తరుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడవాటి గ్లాసులో పోసి మరొక ఐస్‌క్రీమ్ స్కూప్ వేసి పైన పిస్తా పలుకులతో గార్నిష్ చేయాలి. ఇష్టమైతే లిక్విడ్ చాకొలెట్ కూడా వేసుకోవచ్చు. చెఫ్: రాఘవేంద్ర హోటల్ ఇన్నర్ సర్కిల్, హైదరాబాద్ -
మన ఇంటి షెఫ్‌లు...
‘‘రండి రండి రండి.. దయచేయండి... ’’ అంటూ స్వాగతించే మీ గడుగ్గాయిల ఆహ్వానాన్ని ఆప్యాయంగా అందుకోండి. వారి చేత తిరిగిన గరిట అంచున కమ్మని రుచులను ఆస్వాదించడానికి సిద్ధమవ్వండి. ఇన్నాళ్లూ బడిలో తరగతి గదిలో నేర్చిన పాఠాలు బుర్రకు మేత పెడితే... ఇప్పుడు వంటిల్లు .. అందులోని వంటపాత్రలు.. బొజ్జకు మేత ఎలా సిద్ధం చేసుకోవాలో నేర్పించాయి. ఇన్నిరోజులూ మీరే వారి ఆలనాపాలనా చూసి ఉంటారు. ఈ వేసవి సెలవుల్లో అప్పుడప్పుడైనా మీ ఆలనాపాలనా చూసుకునే వారిని సిద్ధం చేయండి. అందుకు కమ్మని రుచుల శాస్త్రాన్ని పరిచయం చేయండి. వారి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని అద్భుతమని ప్రశంసించండి. ఒక్కరోజే కాదు నెలకు ఒకసారి, అటు నుంచి వారానికి ఒకసారి మీ వంటింటిని గారాల మమకారాలతో నింపండి. ఆప్యాయతానందాలను కడుపారా ఆరగించండి. సింపుల్ కుకింగ్... ముందుగా అన్నం.. కావల్సినవి: బియ్యం: 4 కప్పులు; నీళ్లు: 8-9 కప్పులు తయారి: బియ్యం రెండుసార్లు కడిగి, 8 కప్పుల నీళ్లు పోసి, స్టౌ వెలిగించి, దానిమీద పెట్టాలి. అన్నం పొంగకుండా, అడుగంటకుండా జాగ్రత్తపడాలి. (ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి పెద్దవారి సాయంతో వీటిని ఉపయోగించవచ్చు) నీళ్లన్నీ పోయి, అన్నం పూర్తిగా ఉడికాక, మంట తీసేసి, దించేయాలి. టొమాటో పప్పు కావల్సినవి: పెసరపప్పు - అర కప్పు; పచ్చిమిర్చి- 4; కారం - అర టీ స్పూన్; వెల్లుల్లి - 4 రెబ్బలు; టొమాటోలు - 2 (ముక్కలుగా కట్ చేయాలి); కరివేపాకు - రెమ్మ; కొత్తిమీర తరుగు - టీ స్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - అర టీ స్పూన్; ఆవాలు - పావు టీ స్పూన్; ఎండుమిర్చి - 2; పసుపు - పావు టీ స్పూన్; ఉల్లిపాయ - అర ముక్క (నిలువు ముక్కలుగా కట్ చేయాలి); ఉప్పు - తగినంత తయారి: పెసరపప్పును కడిగి పక్కనుంచాలి గిన్నెలో నూనె వేసి వేడి చేసి, జీలకర్ర-ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి పోపులో పదార్థాలువేగాక కరివేపాకు, టొమాటోలు, పెసరపప్పు, కప్పు నీళ్లు పోసి ఉడకనివ్వాలి పెసరపప్పు సగం ఉడికాక ఉప్పు-కారం వేసి కలిపి మెత్తగా అయ్యాక చివరగా కొత్తిమీర చల్లి దించాలి. చపాతీ కావల్సినవి: గోధుమపిండి - కప్పు; నీళ్లు - తగినన్ని తయారి: గోధుమపిండిలో కావాలనుకుంటే చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో తగినన్నినీళ్లు పోసి పిండి కలిపి, పైన మూత పెట్టి 10 నిమిషాలు పక్కనుంచాలి తర్వాత పండి ముద్దను బాగా కలిపి, నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి, రొట్టెల పీట మీద అప్పడాల కర్రతో గుండ్రంగా పిండిని వత్తాలి ఇలా చేసిన దానిని పెనం మీద అర టీ స్పూన్ నెయ్యి వేసి, రెండు వైపులా కాల్చుకోవాలి తయారుచేసుకున్న రోటీలను పప్పు కాంబినేషన్‌తో వడ్డించవచ్చు. పాయసం కావల్సినవి: పాలు - 2 కప్పులు; నీళ్లు - అర కప్పు; సేమియా - కప్పు; పంచదార - కప్పు; యాలకులు - 4; జీడిపప్పు పలుకులు - తగినన్ని; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు. తయారి: సేమియాను నెయ్యిలో వేయించి, పక్కనుంచాలి నీళ్లు, పాలు కలిపి సేమియాను ఉడికించాలి దీంట్లో పంచదార కలిపి కరిగేంతవరకు ఉడికించాలి చివరగా యాలకుల పొడి, మిగిలిన నెయ్యి, జీడిపప్పు పలుకులు వేసి 2-3 నిమిషాలు మరిగించి దించాలి స్వీట్ కప్పులలో పోసి అందించాలి. గుడ్డు కూర కావల్సినవి: కోడిగుడ్లు - 2; ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి - 2; ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు; అల్లం-వెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూన్; కరివేపాకు - కొన్ని ఆకులు; కొత్తిమీర తరుగు - అర టీ స్పూన్; నూనె - టీ స్పూన్ తయారి: ఉల్లిపాయలను టీ స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లిపేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కలపాలి ఉల్లిపాయలు వేగాక కోడిగుడ్లు పగలకొట్టి, లోపలి సొనను వేయాలి. 2-3 నిమిషాలు కదపకుండా ఉంచి, తర్వాత కూర అంతా కలపాలి దించే ముందు కొత్తిమీర తరుగు వేయాలి. ఎక్కిళ్ల నుంచి లెక్కల దాకా...! అన్నం తినమంటే ‘వద్దని’ ఎక్కిళ్లు పెట్టి ఏడ్చే మీరు వంట తయారీ వెనుక ఉన్న శ్రమ, శ్రద్ధ, నైపుణ్యం... తెలుసుకుంటే పాఠ్యాంశాలనూ ఎంచక్కా వంటింట్లోనే తెలుసుకోవచ్చు. అప్పుడు పాఠశాల తరగతి గది థియరీ క్లాస్ అయితే, వంటగది ప్రాక్టికల్స్‌ను నేర్పుతుంది. వంటలకు సంబంధించిన వివరాలను చదవడం, వాటికి సంబంధించిన పేపర్లను కట్ చేయడం, వంటగది గోడపై స్టిక్ చేయడం, సరుకుల లిస్ట్‌ను తయారుచేయడం, డబ్బులు చెల్లించేముందు ఎంత మొత్తం అయ్యిందో చెక్చేయడం ... ఇలాంటివన్నీ లెక్కల్లో నైపుణ్యాలను పెంచుతాయి. మార్కెట్‌కి వెళ్లేముందు ఏమేం కొనుక్కురావాలో ఓ లిస్ట్ తయారుచేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత లిస్ట్‌లో ఉన్న సరుకులన్నీ కరెక్ట్‌గా వచ్చాయో లేదా చూడమని గ్రూప్‌లో మరొకరికి చెప్పండి. ఏయే పదార్థాలు కలిపి వండితే ఎలాంటి రుచి వస్తుందో, రంగులు ఎలా మారుతాయో మొదలైన విషయాలు తెలుసుకోవచ్చు. నలుగురిలో కలిసి పనిచేసుకుంటే కలిగే ఆనందాన్ని అనుభవించవచ్చు. అవి సమాజంలో చొచ్చుకుపోయే నైపుణ్యాలను పెంచుతాయి. ఇవన్నీ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ప్రాక్టికల్స్లోనే థియరీని కూడా మిక్స్ చేయాలంటే... సంపద, ఊబకాయం, బేకరీ పదార్థాలు, చెడు ఆహారపు అలవాట్లు.. వంటి ముఖ్యమైన విషయాలను చర్చించడానికి అనువైన ప్రదేశం కిచెన్ ఒక్కటే. వంట చేయడానికి ముందు చేతులు కడుక్కోవాలని, కూరగాయలను శుభ్రపరిచిన తర్వాతే వండాలని తెలుస్తుంది. పాడైపోయిన పదార్థాలను ఎలా వేరు చేయాలి? మంచి వాటిని ఎలా ఎంచుకోవాలో అవగాహన కలుగుతుంది. వంటిల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే వ్యాధులు, మానసిక ఒత్తిడి, రకరకాల చికుకాలు.. కలిగిస్తాయనే అంశాలలో అవగాహన పెరుగుతుంది. వంటకు పదార్థాలను సిద్ధం చేసుకోవడం, వంట తయారు చేయడానికి పట్టే సమయం వంటివి సహనాన్ని అలవడేలా చేస్తాయి. కూరగాయలను కట్ చేయడం, వండటంలో ఉండే ఇన్వాల్మెంట్ ఏకాగ్రతను పెంచుతుంది. భోజనంలోకి ఏమేం ఐటమ్స్ ఉంటే బాగుంటుందో ప్లానింగ్ చేసే అవగాహన కలుగుతుంది. తాము తయారుచేసిన ఆహారం ప్లేట్లో వడ్డించాక తినడానికి గతంలో కన్నా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పప్పులు, దినుసులు, రకరకాల పదార్థాలు.. వాటి రంగు, రూపు, రుచి ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఏ వంటకం ఎలా ఉంటుంది? ఏదయితే బెస్ట్ అనే రివ్యూ మీటింగ్స్ పిల్లల మధ్య నిర్వహించడం వల్ల వారిలో ఆలోచన, వికాసం పెరుగుతాయి. వంటింటి పరిచయం వల్ల అతిథులను ఆహ్వానించడం, వారికి మర్యాదలు చేయడంలో ముందుంటారు. మొదటి షెఫ్ అమ్మే! చదువుకునే వయసులో వంటతో ఏం పని అని పెద్దవాళ్లు కసురుకుంటారు. కానీ, వంటిల్లే జీవిత పాఠాలను నేర్పగలదు అని మీరే ముందు వారికి షెఫ్‌గా పరిచయం అవ్వండి. పిల్లల కోసం వారికి అనువైన చిన్న స్టూళ్లు టేబుల్ దగ్గర లేదా కౌంటర్ టాప్, స్టౌ దగ్గర పెద్దల పర్యవేక్షణలో ఉంచాలి. కూరగాయలు కట్ చేయడానికి అనువైన కటింగ్ బోర్డ్స్ ఉండాలి. కత్తుల వాడకం - జాగ్రత్తల గురించి ముందే తెలియజేయాలి. కిందపడినా పగలని వస్తువులు, చేతులు తుడుచుకోవడానికి టవల్ వంటివి ఏర్పాటు చేయాలి. ఉడెన్ స్పూన్స్, మృదువుగా, రౌండ్‌గా హ్యాండిల్ గ్రిప్ ఉండే వస్తువులను ఎంచుకోవడం మేలు.ఐదు, పది నిమిషాల్లో పూర్తయ్యే వంటలను పరిచయం చేయాలి. వంటల పుస్తకాలను ఫాలో అవ్వచ్చు. ఒక టైమ్‌లో ఒకే ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. అదీ ఒకటే ఐటమ్‌కి. రక్షణకవచాలు తప్పనిసరి.... పిల్లలు వంట చేసేటప్పుడు పేరెంట్స్ దగ్గరగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ వారిని ఒంటరిగా వదిలి వెళ్లకూడదు. రక్షణకు సంబంధించిన వివరాలు తెలియజేసి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు అలెర్ట్‌గా ఉండటమెలాగో సూచించాలి. వంట చేసేటప్పుడు పిల్లలు కాటన్ దుస్తులు ధరించాలి. వేడి పాన్లు, గిన్నెలు తగలకుండా హెచ్చరించాలి. ఎలక్ట్రికల్ అప్లయెన్సులను, షార్ప్ వస్తువులను, వేడి పాత్రల వల్ల కలిగే ప్రమాదాలు, నివారణ చర్యల గురించి తెలియజేయాలి. -
దావత్-ఏ-మొఘల్
మొఘలులు వచ్చారు. ఏలారు. మనలో కలిసిపోయారు. వాళ్ల ఏలుబడి అంతరించింది. రుచులు ఇంకా ఏలుతూనే ఉన్నాయి. దర్బార్లు బంద్ అయ్యాయి. దావత్‌లు నడుస్తూనే ఉన్నాయి. మీరూ.. ఓ దావత్ మీ ఇంట్లో చేస్కోండి. అంగూర్ కా షర్బత్ కావల్సినవి: నల్లద్రాక్ష - 2 కప్పులు పంచదార పొడి - 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి - టీ స్పూన్; నిమ్మరసం - 2 టీ స్పూన్లు అల్లం రసం - టీ స్పూన్ (తగినంత) పుదీనా తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ద్రాక్ష పండ్లను శుభ్రపరిచి, మిక్సర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మూడున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. దీంట్లో పంచదార, జీలకర్రపొడి, నిమ్మరసం, అల్లం రసం వేసి కలిపి ప్రిజ్‌లో ఉంచాలి. గ్లాసులో పోసి చల్లగా అందించాలి. నోట్: దాల్చిన చెక్క, జాజికాయ పొడులను కూడా కలుపుకోవచ్చు. కార్న్, పొటాటో కబాబ్ కావల్సినవి: స్వీట్ కార్న్ గింజలు (ఉడికించినవి)- కప్పుడు బంగాళదుంపలు (ఉడికించి, తరుమాలి) - కప్పుడు పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి) గరం మసాలా - పావు టీ స్పూన్ నిమ్మరసం - 2 టీ స్పూన్లు; బ్రెడ్ స్లైసులు - 2 ఉప్పు - రుచికి తగినంత; నూనె - 2 టీ స్పూన్లు తయారీ: ఒక గిన్నెలో కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. నాలుగు సమ భాగాలు చేసుకోవాలి. సన్నని ఇనుపచువ్వ తీసుకొని, కార్న్ ముద్దను దానికి బాగా అదమాలి. ప్రతి కబాబ్ మిశ్రమంపై కొద్దిగా నూనె వేయాలి. బొగ్గులను మండించి, దానిపైన ఈ కబాబ్స్‌ను అన్నివైపులా గోధుమరంగు వచ్చేవరకు కాల్చాలి. తీసి, ముక్కలుగా కట్ చేసి, ఏదైనా పచ్చడితో సర్వ్ చేయాలి. నోట్: మార్కెట్లో ఉడెన్ కబాబ్ స్టిక్స్ దొరుకుతున్నాయి. ఇనుప చువ్వలకు బదులుగా వాటిని ఉపయోగించవచ్చు. అవధి గోష్ కావల్సినవి: బోన్‌లెస్ మటన్ - అర కేజీ; జీలకర్ర - అర టేబుల్ స్పూన్ ఉల్లిపాయల తరుగు - కప్పుడు; గసగసాల పేస్ట్ - అర కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - టేబుల్ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; కారం - అర టీ స్పూన్; బిర్యానీ ఆకులు - 2 లవంగా - 8 ; ఆకుపచ్చ ఇలాచీలు - 8; దాల్చిన చెక్క - ముక్క జాజికాయ పొడి - పావు టీ స్పూన్; నూనె - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - రుచికి తగినంత తయారీ: కడాయిలో లవంగాలు, ఇలాచీలు, జాజికాయ పొడి, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి వేయించి, పొడి చేయాలి. గిన్నెలో నూనె వేసి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీంట్లో మటన్ ముక్కలు, చేసి పెట్టిన గరం మసాలా, పసుపు, కారం వేసి, కప్పు నీళ్లు ఉప్పు వేసి ఉడికించాలి. చిక్కదనం బట్టి మరికొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు. చివరగా గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. వేడి వేడిగా అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి. షాహీ పనీర్ కావల్సినవి: పనీర్ - 200 గ్రా.లు; ఉల్లిపాయల తరుగు అర కప్పు, డ్రై ఫ్రూట్స్ అరకప్పు, నీళ్లు కప్పు ఇవన్నీ కలిపి మరిగించిన నీళ్లు - ఒకటిన్నర కప్పు; పెరుగు - అర కప్పు (మృదువుగా అయ్యేలా గరిటెతో గిలకొట్టాలి); అమూల్ క్రీమ్ లేదా పాల మీగడ - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - అర టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; గరం మసాలా - పావు టీ స్పూన్; ఇలాచీ పొడి - పావు టీ స్పూన్ కుంకుమపువ్వు రేకలు - 10 (చిదమాలి); ఎసెన్స్ - 2 చుక్కలు,ఉప్పు - రుచికి తగినంత గ్రేవీ కోసం.. ఉల్లిపాయ - 1 (తరగాలి); జీడిపప్పు పలుకులు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి); బాదాంపప్పులు (తరిగినవి) - టేబుల్ స్పూన్; బూడిదగుమ్మడి గింజలు - టేబుల్ స్పూన్ (నానబెట్టి పై తొక్క తీసేయాలి); వెల్లులి - 4 రెబ్బలు (తరగాలి) చిన్న అల్లం ముక్క - 1 (సన్నగా తరగాలి) తయారీ: ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదాంపప్పులు, గుమ్మడి గింజలు, అల్లం-వెల్లుల్లి, ఒకటిన్నర కప్పు నీళ్లు కలిపి 10 నిమిషాలు మరిగించాలి. నీళ్లు వడకట్టి, పై పదార్థాలను పేస్ట్ చేయాలి.కడాయిలో టీ స్పూన్ నూనె వేసి గరం మసాలా దినుసులన్నీ వేయించి, పొడి చేసి పక్కనుంచాలి.అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ- గ్రేవీ కోసం ఇచ్చిన పదార్థాల పేస్ట్, గరమ్ మసాలా వేసి వేయించాలి.మిగిలిన వడకట్టు నీళ్లు, పెరుగు, మీగడ, ఉప్పు, పంచదార కలిపి, దీనిని కూడా పై మిశ్రమంలో కలిపి 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ఇలాచీ పొడి, కుంకుమపువ్వు రేకలు వేసి, కలిపిన తర్వాత పనీర్ ముక్కలు వేసి 2 నిమిషాలు ఉడికించాలి. ఎసెన్స్ వేసి కలిపి, చివరగా కొత్తిమీర చల్లి దించాలి. ఈ కూర జీరా రైస్ లేదా రోటీస్, పుల్కాలకు చాలా బాగుంటుంది. ముర్గ్ బిర్యానీ కావల్సినవి: బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు చికెన్ - 200 గ్రా.లు దాల్చిన చెక్క - చిన్న ముక్క; బిర్యానీ ఆకు - 1 సాజీరా - టీ స్పూన్; లవంగాలు - 4 ఇలాచీలు - 3; నీళ్లు - 5 కప్పులు ఉప్పు - రుచికి తగినంత వైట్ పేస్ట్ మిశ్రమానికి: బాదాం పప్పులు - 10 (నీళ్లలో గంటసేపు నానబెట్టాలి) బూడిద గుమ్మడి గింజలు - టేబుల్ స్పూన్ పచ్చికొబ్బరి తురుము - టేబుల్ స్పూన్ నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు తయారీ: చికెన్‌ను శుభ్రపరచి పక్కన ఉంచాలి. బాస్మతీ బియ్యం కడిగి, అరగంట నాననివ్వాలి. తొక్కతీసిన బాదాం పప్పులు, బూడిదగుమ్మడి గింజలు, కొబ్బరి తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి మెత్తగా రుబ్బాలి. ఉల్లిపాయను స్లైసులుగా కోసి పక్కనుంచాలి. గిన్నెలో నీళ్లు పోసి మరుగుతుండగా అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, సాజీర వేయాలి. నీళ్లు బాగా మరుగుతుండగా అందులో ఉప్పు వేయాలి. పూర్తిగా వడకట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. అన్నం (75 శాతం మాత్రమే ఉడకాలి) పూర్తిగా ఉడకకముందు దించి, జల్లిలో పోసి, వడకట్టాలి విడిగా మరొక కడాయిలో నూనె వేసి, అందులో బాదాం పప్పులు, కిస్మిస్, జీడిపప్పు, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. సాజీర, సగం బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీంట్లో చికెన్ వేసి ఉడికించాలి. వైట్ పేస్ట్ మిశ్రమం, తగినంత ఉప్పు కలిపి మరో రెండు నిమిషాలుంచి దించాలి. విడిగా చిన్న గిన్నెలో మూడు స్పూన్ల పాలలో 7-8 కుంకుమ పువ్వు రేకలు వేసి కలపాలి.మరొక గిన్నె తీసుకొని అడుగున టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె రాసి, ఒక పొర చికెన్ ముక్కల మిశ్రమం, ఒక పొర ఉడికిన బాస్మతి బియ్యం, ఆ పైన చికెన్ మిశ్రమం .. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ పూర్తి అయ్యాక పైన కుంకుమపువ్వు మిశ్రమం, జీడిపప్పులు, కిస్మిస్, పుదీనా చల్లి, మూతపెట్టి, సన్నని మంట మీద ఉడకనివ్వాలి. మాడకుండా చూసుకొని, దించాలి. నోట్ 1: అవెన్ ఉన్నవారు బిర్యానీ గిన్నె మీద అల్యూమీనియమ్ ఫాయిల్‌తో కవర్ చేసి, 200 డిగ్రీల సెల్సియస్‌లో 20 నిమిషాలు ఉడికించాలి. నోట్ 2: బిర్యానీకి కాంబినేషన్‌గా 2 కప్పుల పెరుగు, కూరగాయలు-పచ్చిమిర్చి తరుగు, ఉప్పు కలిపి చేసిన రైతాను వాడుకోవచ్చు. ముర్గ్ బిర్యానీ బాదామి కెవ్రా సేవియాన్ కావల్సినవి: బాదాంపప్పుల పేస్ట్ - 4 టేబుల్‌స్పూన్లు బాదాంపప్పు (సన్నగా తరిగినవి) - పావు కప్పు ఎసెన్స్ - 4-5 చుక్కలు; నెయ్యి - టీ స్పూన్ సేమియా - అర కప్పు; వెన్నతీయని పాలు - 5 కప్పులు పంచదార - 5 టేబుల్ స్పూన్లు తయారీ: గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో సేమియా వేసి 2-3 నిమిషాలు వేయించాలి. పాలను విడిగా 15 నిమిషాలు మరిగించి, అందులో బాదాం పేస్ట్ వేసి మరో 2-3 నిమిషాలు ఉంచాలి. దీంట్లో సేమియా వేసి, కలుపుతూ 4-5 నిమిషాలు ఉడికించాలి. పంచదార వేసి, కలిపి, కెవ్రా ఎసెన్స్, బాదాం పప్పు పలుకులు వేసి కలిపి సర్వ్ చేయాలి. నోట్: 15 బాదాం పప్పులను తీసుకొని వేడినీళ్లలో 20 నిమిషాలు నానబెట్టి, తర్వాత పొట్టు తీసి, పావు కప్పు నీళ్లు కలిపి మిక్సర్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి ఉడికిస్తే సేవియా మరింత రుచిగా ఉంటుంది. -
ఇంట్లో ఇటాలియన్
ఇటాలియన్ ఫుడ్ తినాలంటే ఇటలీ వెళ్లనవసరం లేదు. ఇంట్లోకే ఇటలీని తెప్పించుకోవచ్చు! ఇక్కడ ఇచ్చినవన్నీ ఇండియాలో దొరికే పదార్థాలు. వాటిని మన ఇండియన్ కిచెన్‌లో వండినా ఇటలీ ఐటమ్స్ తయారు అవుతాయి. చేసి చూడండి. ఫారిన్ రుచులను ఆస్వాదించండి. నాచోస్ సగం కప్పు టొమాటో గుజ్జు, టీ స్పూన్ కొత్తిమీర, టీ స్పూన్ ఉల్లిపాయ తరుగు, తగినంత ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, రెండున్నర టీ స్పూన్ల టొమాటో సాస్.. ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని టొమాటో సాల్సా అంటారు. టీ స్పూన్ క్రీమ్, అర టీ స్పూన్ పెరుగు, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని సోర్ క్రీమ్ అంటారు.ఒక వెడల్పాటి గిన్నెలో 100 గ్రాముల మొక్కజొన్న చిప్స్ తీసుకోవాలి. దీని మీద రెండు టేబుల్ స్పూన్ల కరిగించిన ఛీజ్, అర కప్పు టొమాటో సాల్సా, టేబుల్‌స్పూన్ సోర్ క్రీమ్ వేయాలి. చివరగా సన్నగా తరిగిన కీరా, కొత్తిమీరతో అలంకరించాలి. మినెస్ట్రాన్ క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్‌లను సన్నగా తరిగి 2 టీ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల పాస్తా కలిపి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేడి చేసి, అందులో అర టీ స్పూన్ వెల్లుల్లి వేసి వేయించాలి. దీంట్లో కప్పుడు టొమాటో గుజ్జు, కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు, కప్పుడు నీళ్లు పోసి మిశ్రమం చిక్కగా అయ్యేలా ఉడికించాలి. ఇందులోనే ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని సూప్ బౌల్లో పోయాలి. 4 సన్నగా తరిగిన తులసి ఆకులను, అర టీ స్పూన్ ఛీజ్(మార్కెట్లో లభిస్తుంది) తరుగు వేసి అందించాలి. స్పినాచ్ కార్న్ ఫెటుచిని పాన్‌లో కొద్దిగా బటర్ వేసి వేడి చేసి దాంట్లో అర టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి వేయించాలి. దాంట్లో 50 గ్రా.ల తరిగిన పాలకూర వేసి కొద్దిగా ఉడికాక, టీ స్పూన్ పెరుగు కలపాలి. దీంట్లో అర కప్పుడు ఉడికించిన పాస్తా, పావు కప్పుడు వైట్ సాస్ (పాన్‌లో 2 టీ స్పూన్ల వెన్న, 2 టేబుల్ స్పూన్ల మైదా వేయించి, పావు కప్పు పాలు పోసి చేసిన మిశ్రమం) కలిపి, ఉప్పు, మిరియాలపొడి వేసి చివరలో బాగా కలిపిన పాల మీగడ జత చేయాలి. వడ్డించే ముందు ఛీజ్ తరుగు, కొత్తిమీర వేసి, గార్లిక్ బ్రెడ్‌తో అలంకరించాలి. ప్రాచుర్యం ఎక్కువ శతాబ్దాల చరిత్ర ఉన్న ఇటాలియన్ రుచులకు ప్రపంచంలోనే బాగా ప్రాచుర్యం ఉంది. ఉంది. ఐస్‌క్రీమ్‌లతో మొదలైన ఇటాలియన్ వంటకాలు పిజ్జాలతో పుంజుకుని కాఫీలతో కొనసాగి, పాస్తాలతో పరిపుష్టమైంది. టొమాటోను అధికంగా వాడే వీరి వంటకాలలో పెద్దవంకాయ, బ్లాక్-గ్రీన్ ఆలివ్స్, క్యాప్సికం తదితర కూరగాయల శాతం ఎక్కువ. దీంతో మన వంటకాలకు కాస్త సన్నిహితంగా అనిపిస్తాయి. అలాగే మిరియాలపొడితో చేసే సాస్‌లు, వెల్లుల్లి, పుదీనా, చికెన్ వెరైటీలు... వంటివి ఇటాలియన్ రుచులకు కేరాఫ్‌గా మారుస్తున్నాయి. ఇటలీ దేశస్థులకు స్పైసీగా అనిపించే ఇటాలియన్ రుచులు మన దగ్గర ఆధునికుల జిహ్వలకు సరిపడా ఉంటున్నాయి. ఇక ఈ వంటకాల తయారీలో ఆలివ్ ఆయిల్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. దాంతో ఆరోగ్యపరంగా కూడా ఇవి మేలనే ఆభిప్రాయం పెరిగింది. హార్వెస్ట్ వెజ్ పిజ్జా పిజా బేస్, పిజ్జా సాస్, పిజ్జా ఛీజ్‌లు రెడీమేడ్‌గా దొరుకుతాయి. టొమాటో, క్యాలీఫ్లవర్, పాలకూర, మొక్కజొన్న, 10 తులసి ఆకులు సన్నగా తరిగి 2 టీ స్పూన్ల చొప్పున తీసి, పక్కన ఉంచాలి. పిజ్జాబేస్ పైన సాస్ -దానిపైన తగినంత ఛీజ్ - ఆ పైన తరిగిన కూరగాయల ముక్కలు చల్లి అవెన్‌లో 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో బేక్ చేయాలి. అవెన్ లేని వారు దీనిని పిజాపాన్లో తయారుచేసుకోవచ్చు. చిపొట్లె చికెన్ స్క్యేర్స్ పావుకేజీ బోన్‌లెస్ చికెన్‌ని శుభ్రం చేసుకొని పైన టేబుల్‌స్పూన్ తేనె, అర టీ స్పూన్ చిపొట్లె టొబాస్కో (పండుమిర్చిని ముద్దగా నూరి వాడచ్చు), అర టీ స్పూన్ కారం వేసి, బాగా కలిపి పక్కన ఉంచాలి. మరొక గిన్నెలో పావు టీస్పూన్ పండుమిరప పేస్ట్, ఉప్పు, నల్ల మిరియాలపొడి, ఎండుకారం, కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల మెయోనేజ్ సాస్ (మార్కెట్లో దొరుకుతుంది) ఇది అందుబాటులో లేదంటే వెన్నలో కలిపి పక్కన ఉంచాలి. బాగా నానిన చికెన్ ముక్కలను వెదురుపుల్లలకు గుచ్చాలి. వీటిని పెనం మీద కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. పండుమిర్చి పేస్ట్‌తో తయారుచేసుకున్న సాస్‌లో ముంచి, ప్లేట్లో పెట్టి, కొత్తిమీరతో అలంకరించాలి. ఛీజ్ కేక్ ఒక పాత్రలో గుడ్డుసొన, అర టీ స్పూన్ పంచదార, చిన్న కప్పుడు వెన్నతీసిన పాలు, చిటికెడు జెలెటిన్ (ఇది వాడకపోతే కేక్ గట్టిగా అవదు. మార్కెట్లో దొరుకుతుంది), కప్పుడు విప్డ్ క్రీమ్ (దీని బదులు పాల మీగడను బాగా మిక్స్ చేసి వాడచ్చు) వేసి, కలిపి పక్కన ఉంచాలి. కేక్ అడుగు గట్టితనం కోసం 2 గుండ్రటి బిస్కట్లు తీసుకొని, వెన్న రాసి,10 ని.లు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. తర్వాత ఈ బిస్కెట్లను తీసి, కప్పు అడుగున ఉంచాలి. వీటి పైన ముందుగా చేసి ఉంచిన మిశ్రమాన్ని బిస్కెట్ల మీదుగా పోసి, 30 ని.లు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత దానిని బయటకు తీసి, మన ఇళ్లలో రోజూ వాడుకునే 3 టేబుల్ స్పూన్ల చిక్కటి బ్లాక్ కాఫీ డికాషన్‌లో వెనీలా ఎసెన్స్ కలిపి పోసి, చల్లగా అందించాలి. రాజ శేఖర్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఓరిస్ రుసి అండ్ ఐడోని బంజారా హిల్స్ హైదరాబాద్ -
వనాలలో... వెరైటీగా!
పసిరిక తొక్కడం, ఉసిరిక నమలడం రెండూ ఆరోగ్యమే. ఉసిరిచెట్టు కింద సహపంక్తి అంటేనే స్నేహాలు పురివిప్పడం. సిరి నాథుడినీ, హర దేవుడినీ విరివానతో తడపడం. లాలాజలాభిషేకంతో పరబ్రహ్మస్వరూపాన్ని పూజించడం. ఆరోగ్యప్రదాతలూ, అశ్వనీదేవతల అనుగ్రహం పొందడం. రండి... ఈ కార్తికంలో స్నేహామృతాలను ఆస్వాదిద్దాం. రుచులతో పాటు ఆరోగ్య సిరుల మూట విప్పుదాం. సెసేమ్ వెజ్ టోస్ట్ కావలసినవి: క్యారట్ తురుము - పావు కప్పు, ఫ్రెంచ్ బీన్స్ తరుగు - పావు కప్పు, బంగాళదుంప - 1, క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు, ఉల్లి తరుగు - పావుకప్పు, కొత్తిమీర తరుగు - టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, అల్లం తురుము - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, కార్న్ స్టార్చ్ - టేబుల్ స్పూను, సోయా సాస్ - అర టేబుల్ స్పూను, నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, బ్రెడ్ స్లైసులు - 5 (బ్రౌన్ లేదా గోధుమ బ్రెడ్), నూనె - డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి, తొక్క తీసి మెత్తగా మెదపాలి క్యారట్, బీన్స్ ముక్కలను కూడా ఉడకబెట్టి, గరిటెతో మెత్తగా మెదపాలి ఒక పాత్రలో బంగాళదుంప ముద్ద, క్యార ట్, బీన్స్ ముద్ద వేసి కలపాలి అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కార్న్‌ఫ్లోర్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, పూర్తిగా చల్లారేవరకు పక్కన ఉంచాలి వేరొక పాత్రలో కార్న్‌ఫ్లోర్‌కి తగినన్ని నీళ్లు జత చేసి ముద్దలా చేసి పక్కన ఉంచాలి బ్రెడ్ స్లైసులను త్రికోణాకారంలో కట్ చేయాలి బ్రెడ్ మీద ముందుగా కార్న్‌ఫ్లోర్ ముద్దను కొద్దిగా పూసి, ఆ పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వీటి మీద సమానంగా పరిచి, చేతితో కొద్దిగా ఒత్తి ఆ పైన మళ్లీ కార్న్‌ఫ్లోర్ ముద్దను ఉంచాలి పైన నువ్వులను చల్లి తేలికగా ఒత్తాలి. ముద్ద మీద చల్లడం వల్ల బాగా అతుక్కుంటాయి బాణలిలో నూనె కాగాక, నూనెలో వేసి, రెండువైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి. ఖజూర్ హల్వా కావలసినవి: బాదం తరుగు-టేబుల్ స్పూను, ఖర్జూరం తరుగు-పావు కేజీ, నెయ్యి-2 టేబుల్ స్పూన్లు, పాలు-అర లీటరు, మిల్క్ మెయిడ్-200 గ్రా. తయారీ: ఖర్జూరం తరుగును పాలలో సుమారు గంటసేపు నానబెట్టి, మిక్సీలో వేసి ముద్దలా చేయాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక, మిల్క్‌మెయిడ్, మెత్తగా చేసిన ఖర్జూరం ముద్ద వేసి ఆపకుండా కలుపుతూ, సన్నని మంట మీద ఉడి కించాలి బాదం తరుగుతో అలంకరించి అందించాలి. పనీర్ మంచూరియన్ డ్రై కావలసినవి: పనీర్ - 250 గ్రా., కార్న్ స్టార్చ్ - 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, పంచదార - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 3 టేబుల్ స్పూన్లు, సాస్ కోసం, టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ - అర టేబుల్ స్పూను, మిరియాల పొడి - పావు టీ స్పూను, రైస్ వెనిగర్ - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, నీళ్లు - పావు కప్పు, ఉల్లి తరుగు - కప్పు, క్యాప్సికమ్ తరుగు - అర కప్పు, అల్లం తురుము - టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, ఉప్పు - తగినంత. తయారీ: పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి, పొడిగా ఉన్న కిచెన్ టవల్ మీద సుమారు అరగంట సేపు ఆరబెట్టి, ఆ తరవాత పెద్ద పాత్రలోకి తీసుకోవాలి కారం, మిరియాల పొడి, ఉప్పు, కార్న్ స్టార్చ్ జత చేసి జాగ్రత్తగా కల పాలి బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక, పనీర్ ముక్కలు వేసి గోధుమ వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి పావు కప్పు నీళ్లకి, కార్న్‌స్టార్చ్, మసాలా దినుసులు జత చేసి బాగా కలిపి, ఉడుకుతున్న మిశ్రమంలో వేయాలి అర టేబుల్ స్పూను సోయా సాస్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ జత చేయాలి ఉప్పు, కారం, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి మిశ్రమ మంతా పనీర్‌కి బాగా పట్టి, చిక్కబడే వరకు కలపాలి వెనిగర్ జత చేసి, రెండు నిమిషాలు ఉంచి దించేయాలి ఉల్లి కాడల తరుగుతో అలంకరించి అందించాలి. షెజ్వాన్ పొటాటో చిల్లీ కావలసినవి: బంగాళదుంపలు - 3 (మీడియం సైజువి), కార్న్ ఫ్లోర్ - టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తరుగు - టీ స్పూను, ఉల్లి తరుగు - అర కప్పు, అల్లం తురుము - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను, ఎండు మిర్చి - 4 (కొద్దిగా నీళ్లు జత చేసి పేస్ట్ చేయాలి), ఎండు మిర్చి - 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి), సోయాసాస్ - 2 టీ స్పూన్లు, నీళ్లు - 4 టేబుల్ స్పూన్లు, తెల్ల వెనిగర్ - అర టీ స్పూను, కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను (2టేబుల్ స్పూన్ నీళ్లలో చిక్కగా కలపాలి), ఉప్పు, పంచదార, మిరియాల పొడి - తగినంత, కొత్తిమీర తరుగు - టీ స్పూను. తయారీ: బంగాళదుంపలను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి, చన్నీళ్లలో అరగంట సేపు ఉంచి, నీళ్లు వడకట్టి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేడయ్యాక, ఈ ముక్కలను అందులో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు డీప్ ఫ్రై చేసి, పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి వేరొక బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి తురుము వేసి బాగా కలపాలి మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు బాగా కలపాలి సోయాసాస్, ఎండు మిర్చి ముద్ద, ఉప్పు, పంచదార జత చేసి బాగా కలపాలి నీళ్లు జత చేసి సన్నని మంట మీద సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లలో టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న మిశ్రమానికి జత చేయాలి కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి, మిశ్రమం చిక్కబడేవరకు బాగా క లపాలి తయారుచేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు జత చేసి బాగా కలిపి దింపేయాలి కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి. బనానా స్ట్రాబెర్రీ స్వీట్ కావలసినవి: అరటిపండు - 1 (చిన్నది), పెరుగు - అర కప్పు, వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూను, స్ట్రాబెర్రీ పండ్లు - 10, బాదం తరుగు - టేబుల్ స్పూను తయారీ: ముందుగా ఒక పాత్రలో పెరుగు బాగా గొలక్కొట్టాలి స్ట్రాబెర్రీ పండ్ల పై ఉన్న తొడిమల్ని తీసేయాలి అరటిపండు తొక్క తీసి మెత్తగా మెదపాలి ఒక పాత్రలో పెరుగు, వెనిలా, బాదం తరుగు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని స్ట్రాబెర్రీల మీద ఉంచి, అందించాలి. ధాపా దహీ కావలసినవి: మిల్క్‌మెయిడ్ - 200 గ్రా., కిస్మిస్, జీడిపప్పులు - 25 గ్రా., పెరుగు - 3 కప్పులు, ఏలకుల పొడి - కొద్దిగా తయారీ: పెరుగును పల్చటి వస్త్రంలో గట్టిగా మూట గట్టి, అరగంట సేపు వేలాడదీయాలి (నీరంతా పోతుంది) మిల్క్‌మెయిడ్, ఏలకుల పొడి జత చేసిపైన వస్త్రంతో కప్పి ఉంచాలి మరిగించిన నీటి పాత్రలో ఈ పాత్రను సుమారు 20 నిమిషాలు ఉంచి, తీసి చల్లారనివ్వాలి కిస్మిస్, జీడిపప్పులతో అలంకరించి చల్లగా అందించాలి. గమనిక: కార్న్ స్టార్చ్ తయారీ కోసం... 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌కి 3 టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి బాగా కలిపితే స్టార్చ్ రెడీ. -
రుచుల్లో ఐదో ప్రధానమైనది... ‘ఊమమీ’!
మెడి క్షనరీ ఎరుపు, ఆకుపచ్చ, పసుపు అనే ముడు ప్రధాన రంగుల నుంచే అనేక వర్ణాల షేడ్స్ ఆవిర్భవించినట్లే... నాలుగు ప్రధాన రుచులు నుంచే నాలుకకు అనేక ఫ్లేవర్స్ తెలుస్తుంటాయి. ఇందులో ప్రధానమైన మొదటి నాలుగు రుచులు... తీపి, పులుపు, చేదు, ఉప్పు. దీనికి తోడు మరో ప్రధాన రుచి ఉందని జపాన్ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఈ ఐదో ప్రధాన రుచిని వారు 1908లో తెలుసుకున్నారు. మనం చికెన్, వేటమాంసం, చేపలు, చీజ్ తిన్నప్పుడు నాలుకకు చాలా రుచికరంగా అనిపిస్తుంది. అలా అనిపించడం అనే అనుభూతిని కలిగించే రుచి ఉప్పుదే. ఆయా పదార్థాల్లో ఉండే మోనోసోడియమ్ గ్లుటామేట్ అనే అమైనోయాసిడ్ వల్ల స్వాభావికమైన ఈ రుచి తెలుస్తుంది. ఏదైనా కాయ పండిన కొద్దీ రుచి పెరగడం అనేది ఈ గ్లుటామేట్ అనే పదార్థం వల్లనే జరుగుతుంటుంది. చైనా ఉప్పు వాడటం వల్ల వంటకాలకు, ఆహార పదార్థాలకు ‘ఊమమీ’ రుచి వస్తుంటుంది. -
రాజస్థానీ ఘుమఘుమలు
భారతీయ రాచరికపు రుచులను టేస్ట్ చేయాలనుకుంటున్నారా... అయితే ఈ రాజస్థానీ ఫుడ్ ఫెస్ట్ మీ కోసమే! ఎక్కువగా వెజిటేరియన్స్ అయిన రాజస్థానీలు స్వీట్స్‌లోనూ స్పెషలిస్టులు. సాధారణంగా మీల్స్ తరువాత స్వీట్స్ తింటాం. కానీ రాజస్థానీలు మాత్రం భిన్నం. భోజనానికి ముందే స్వీట్స్ కానిచ్చేస్తారు. కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులలాగా... రాజస్థాన్‌లోనూ జిల్లాకో ప్రత్యేక స్వీట్ ఉంది. 32 రకాల రాజస్థానీ స్పెషల్ డిషెస్తోపాటు ఇలాంటివెన్నో నగరవాసులకూ విందు చేయనున్నాయి. మార్చి ఒకటో తేదీ నుంచి స్క్వేర్, నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో పదిరోజుల పాటు ఈ రుచుల పండుగ కొనసాగనుంది. ఫుడ్ ఒక్కటే కాదు... చుట్టు పక్కల వాతావరణం రాజస్థాన్‌ను తలపించేలా డెకరేట్ చేస్తున్నారు. ఒంటె, గుర్రపు బొమ్మలు, చిలకల డోర్స్.. పూర్తిగా ఆ కల్చర్ ఉట్టిపడేలా ఇంటీరియర్ డిజైనింగ్ ఉండనుంది. వీటన్నింటికీతోడు రాజస్థానీ పప్పెట్ షో కూడా అలరించనుంది. ‘ముఖ్యంగా జైపూర్, మార్వార్, ఉదయపూర్ వంటి రాచరిక ప్రాంతాల వంటకాలు ఫెస్టివల్లో వడ్డించనున్నాం. చరకా ముర్గ్, రాజ్‌భోగ్ దాహి బార, లాల్ మాస్, రాజ్ పుటాన మాస్ కిచ్రీ, హల్దీకే సబ్జీ, గత్తేకా పలావ్... వంటివన్నీ రాజస్థానీ స్పెషల్స్. వీటితోపాటు లైవ్ జిలేబీ, గులాబీ రెక్కలు జోడించిన కలాకండ్‌తోపాటు స్పెషల్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫెస్ట్ కోసం రాజస్థాన్‌నుంచి స్కిల్డ్ చెఫ్‌లు వస్తున్నారు’ అని చెబుతున్నాడు నోవాటెల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ముత్తుకుమార్. సాక్షి, సిటీ ప్లస్ -
‘నాటుకోడి’ కూరతో సెట్ దోసె!
విధాన పరిషత్‌లో ఆసక్తికర చర్చ బెంగళూరు : ‘నాటుకోడి కూర, గింజల కూర, బోటి, సెట్‌దోసె....వహ్వా ఏమా రుచులు’ ఈ తరహా ఆసక్తికర చర్చ విధానపరిషత్‌లో గురువారం చోటుచేసుకుంది. విధానపరిషత్ కార్యకలాపాల్లో భాగంగా పరిషత్ సభ్యుడు రామచంద్రగౌడ ప్రస్తావించిన అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం ఇచ్చే సందర్భంలో ఈ చర్చ చోటుచేసుకుంది. సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘మైసూరులో 12 పైసలకు రెండు సెట్ దోసెలు ఇచ్చేవారు. నాటుకోడి కూర, గింజల కూర, బోటిలతో ఈ సెట్‌దోసెలు అందించేవారు. మైసూరులోని చడ్డి హోటల్, మైలారి హోటల్, రాజుహోటల్ల దగ్గర పొద్దుపొద్దున్నే క్యూలో జనాలు కనిపించేవాళ్లు. అప్పటి రుచులే వేరు. ఇప్పుడు ఆ రుచి కనిపించడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో విధానపరిషత్‌లో ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప కలగజేసుకుంటూ....‘ఇలా నాటుకోడి కూర, బోటి అంటూ మీరు చెబుతుంటే మాకు నోరూరుతోంది. ఇలాంటి ఆహారపదార్థాలన్నీ మేం కూడా రుచి చూసేందుకు ఏదైనా ఏర్పాటు చేయకూడదా?’ అంటూ చమత్కరించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మైసూరుకు రండి, నాటుకోడి కూరతో పాటు బోటి, తలమాంసం ఇలా అన్ని రకాల పదార్థాలు వండి, వడ్డిస్తాం’ అంటూ ఆహ్వానించారు. ఇక ఈ సంభాషణల మధ్య జేడీఎస్ సభ్యుడు ముజీర్ ఆగా కలగజేసుకుంటూ...‘కేవలం ఈశ్వరప్పనేనా మమ్మల్ని కూడా ఆహ్వానించేదేమైనా ఉందా’? అంటూ సిద్ధరామయ్యను ప్రశ్నించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మిమ్మల్ని వదిలి పెట్టి వేరే ఎవరినైనా ఆహ్వానించడం అసలు సాధ్యమేనా’ అనడంతో సభలో నవ్వులు విరబూశాయి. -
గ్రీన్ టీ.. రుచులు
టేస్ట్‌లో కాస్త తేడాగా ఉన్నా.. గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. గ్రీన్ టీ బెనిఫిట్‌ను మరింత పెంచే ప్రయత్నం చేసింది బేగంపేటలోని వివంతా తాజ్. గ్రీన్ టీతో ప్రత్యేకమైన రెసిపీస్ తయారు చేసింది. టెట్లే గ్రీన్ టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వివంతా తాజ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అర్జున్ యాదవ్ గ్రీన్ టీతో తయారు చేసిన స్పెషల్ రెసిపీస్ పరిచయం చేశారు. వెజిటబుల్ షమ్మీ, స్పైసీ గ్రీన్స్, మలాయ్ సాస్, స్నో పీస్ వంటి వంటకాలను గ్రీన్ టీ వాటర్ మిక్స్ చేసి తయారు చేశారు. గుడ్ హెల్త్ కోరుకునే వారు ఈ రెసిపీస్ టేస్ట్ చేయడం ద్వారా.. రుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. -
మన వంటలూ... మన బంధుత్వాలూ ఎంత సింపుల్‌గా ఉంటే అంత కమ్మగా ఉంటాయి!
అన్నపూర్ణ... ఆవిడ పేరులో సంప్రదాయం... ఆవిడ రుచులలోనూ సంప్రదాయమే... శాకాహారం మాత్రమే ఇష్టం... కృత్రిమ రంగులు, కృత్రిమ రుచులకు ఆమడ దూరం... కాలానుగుణంగా రుచులలో మార్పులు వచ్చినా... సీనియర్ సినీ - టీవీ నటి అన్నపూర్ణమ్మ వంటలు మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్లాగే ఉంటాయి... ఈ రోజు అన్నపూర్ణ పుట్టినరోజు... ఈ సందర్భంగా ఆమె ఇష్టపడే కొన్ని రుచులు మీ కోసం... సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్న అన్నపూర్ణగారి దగ్గరకు మా ఫొటోగ్రాఫర్ శివ మల్లాల కెమెరాతో వెళ్లగానే... ‘నాతో ఏం వంట చేయించాలని వచ్చారు’ అని ఆప్యాయంగా పలకరించారు అన్నపూర్ణమ్మ. మీరు ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారెందుకు... అన్నపూర్ణ: నాకు ఇంటర్వ్యూలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చెప్పినా ఒకటే ఉంటుంది! మీరు ‘అన్నపూర్ణ వంటలు - పిండివంటలు’ అనే పుస్తకం రాశారు కదా! అన్నపూర్ణ: మీకా విషయం భలే గుర్తుందే! ఈ పాటికి ఆ పబ్లిషరే మర్చిపోయి ఉంటాడు! మొదటి నుంచి మీరు వెజిటేరియనేనా... అన్నపూర్ణ: గతంలో నాన్ వెజ్ తినేదాన్ని. కానీ ఆరోగ్యరీత్యా చాలా కాలం క్రితమే మానేశాను. నాన్‌వెజ్‌లో మీరు బాగా చేసే వంటకం ఏది? అన్నపూర్ణ: తినడం మానేశాక వాటి గురించి మర్చిపోయాను. వెజిటేరియన్లో... అన్నపూర్ణ: పప్పులే! పప్పు కంటె మించింది ఈ ప్రపంచంలో ఇంకేముంది! పప్పులో ఏ కాయగూర వేసినా ఇష్టంగా తింటాను. ఇందులో కావలసినన్ని మాంసకృత్తులు ఉంటాయి. మా ఇంటికి ఎవరొచ్చినా అదే వండి పెడతాను. (నవ్వుతూ...) కోళ్లూ, మేకలూ మా ఇంటి చుట్టూ తిరగవు. అసలు మీరు బాగా ఇష్టంగా ఏవేం తింటారు? అన్నపూర్ణ: దోసకాయ పప్పు, దోసకాయ - వంకాయ పచ్చడి, బెండకాయ వేపుడు... ఇలా సాత్వికంగా ఉండేవన్నీ ఇష్టంగా తింటాను. అన్నట్లు, నాకు పులిహోర అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు కూడా మీరే వంట చేసుకుంటున్నారా! అన్నపూర్ణ: ప్రస్తుతం పనేం లేదు కదా! వంటలు చేసుకోవడమే పని. ఆ మాటకొస్తే... మనం తినేవి మనం చేసుకోవడమే మంచిది. మీ వంటను ఎవరైనా మెచ్చుకున్నారా! అన్నపూర్ణ: ఎవరు మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా నా వంటను నేను మెచ్చుకుంటాను. మనం మెచ్చుకుని తినేలా ఉందంటే వంట బాగా వచ్చినట్లే కదా... మీరు 40 సంవత్సరాలుగా సినీ రంగంలో ఉన్నారు కదా! ఎప్పుడైనా ఎవరికైనా చేసి పెట్టారా... అన్నపూర్ణ: (నవ్వుతూ...) ఇప్పటివాళ్ళలో శాకాహారం ఎవరు తింటున్నారండీ? ఎక్కువగా నాన్వెజే తింటారు. మరి, నేనేమో నాన్‌వెజ్ చేయను. కొత్తగా చాలా స్వీట్స్ వస్తున్నాయి కదా... అన్నపూర్ణ: నేనింకా పాతకాలంలోనే ఉన్నాను. లడ్డు, రవ్వ లడ్డు, తొక్కుడు లడ్డు, అరిసెలు, బూరెలు, కొబ్బరి బూరెలు, బొబ్బట్లు, పూర్ణాలు... ఇవన్నీ ఇష్టంగా తింటాను. పండగలకు ఏం చేస్తారు... అన్నపూర్ణ: ఒక్కో పండుగకు ఒక్కో వంటకం తప్పనిసరి కదా! దసరాల్లో... అమ్మవారికి తప్పకుండా పూర్ణాలు నైవేద్యం పెట్టాలి. సంక్రాంతికంటారా... తలకిందులుగా తపస్సు చేసినా అరిసెలు చేయక తప్పదు. ఇక, ఇంటికి అల్లుడొచ్చినప్పుడు అందరూ నాన్ వెజ్ చేస్తారు. కానీ నేను మాత్రం గారెలే చేస్తాను. ఇంకా... సున్నుండలు. అవి తింటే బలమే కాదు, ఒంటికి చలవ కూడా! మీరు చెప్పే నాలుగు మంచి మాటలు... అన్నపూర్ణ: మనిషి ఎప్పుడూ కాళ్లతోటి నడుస్తాడు. అదీ భూమి మీదే నడుస్తాడు. అంతేకానీ తలతో నడవలేడు కదా! అలాగే, మన వంటలూ, మన బంధుత్వాలూ ఎన్నటికీ మారకూడదు! వంటలైనా, బంధుత్వాలైనా.. సంక్లిష్టత లేకుండా, ఎంత సింపుల్‌గా ఉంటే అంత కమ్మగా ఉంటాయి. - సంభాషణ: డా. వైజయంతి మామిడికాయ పప్పు కావలసినవి: కందిపప్పు - కప్పు; మామిడికాయ - 1; పచ్చి మిర్చి - 4; ఎండు మిర్చి - 4; ఇంగువ - పావు టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి); ఉల్లి తరుగు - పావు కప్పు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; కారం - టీ స్పూను తయారి: ముందుగా మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి మునగకాడను ముక్కలు చేయాలి కందిపప్పుకి తగినంత నీరు చేర్చి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి కరివేపాకు వేసి వేగాక, మామిడికాయ ముక్కలు, మునగకాడ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి ఉడికించిన పప్పు జత చేసి బాగా కలపాలి పసుపు, కారం వేసి మరో మారు కలిపి కొత్తిమీర చల్లి దించేయాలి. ముక్కల పులుసు కావలసినవి: కూరగాయ ముక్కలు - 3 కప్పులు (బెండకాయలు, టొమాటో, మునగకాడ, సొరకాయ, ఉల్లిపాయలు, క్యారట్, ముల్లంగి, దోస, తోటకూర...); చింతపండు - పెద్ద నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి); ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; రసం పొడి - టీ స్పూను; ఎండు మిర్చి - 5; పచ్చి మిర్చి - 5 (మధ్యకు పొడవుగా కట్ చేయాలి); ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట; కరివేపాకు - 2 రెమ్మలు తయారి: ముందుగా అన్ని కూరగాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు, నీళ్లు జత చేసి ఉడికించాలి చింతపండు రసం వేసి మరిగించాలి చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి వేయించి, మరుగుతున్న పులుసులో వే యాలి బెల్లం పొడి వేసి మరోమారు కలపాలి చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లలో బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న పులుసులో వే సి మరిగించాలి కొత్తిమీర, కరివేపాకు, రసం పొడి, పసుపు వేసి బాగా కలిపి దించేయాలి. చేమదుంపల పులుసు కూర కావలసినవి: చేమదుంపలు - అర కేజీ; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 10 (మధ్యకు నిలువుగా కట్ చేయాలి); చింతపండు పులుసు - 5 టేబుల్ స్పూన్లు (చింతపండు నానబెట్టి పులుసు చిక్కగా తీయాలి); ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 6; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; మెంతి పొడి - పావు టీ స్పూను తయారి: చేమదుంపలను కుకర్‌లో ఉడికించి, తీసి చల్లారాక తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చి మిర్చి ముక్కలు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి చింతపండు పులుసు, ఉప్పు, కారం, బెల్లం పొడి వేసి ఉడికించాలి చేమదుంప ముక్కలు వేసి బాగా కలిపి సుమారు పది నిమిషాలు ఉంచాలి మెంతి పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. చిక్కుడుకాయ తీపికూర కావలసినవి: చిక్కుడు కాయలు - పావు కేజీ; ఇంగువ - కొద్దిగా; ఎండు మిర్చి - 6; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; శన గపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; చింతపండు గుజ్జు - అర టీ స్పూను; బెల్లం పొడి - టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; కరివేపాకు - రెండు రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా తయారి: ముందుగా చిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించాలి కరివేపాకు వేసి వేగాక చిక్కుడుకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత ఉంచాలి చిక్కుడుకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం పొడి, బియ్యప్పిండి వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి దించేయాలి. దొండకాయ - కొబ్బరి కారం వేపుడు కావలసినవి: దొండకాయలు - పావు కేజీ; ఎండుకొబ్బరి పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీస్పూను; ఆవాలు - అర టీ స్పూను; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించాలి); శనగపప్పు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు. తయారి: దొండకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి కరివేపాకు వేసి కొద్దిగా వేయించిన తర్వాత, దొండకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, రెండు నిమిషాలయ్యాక మూత ఉంచి, ముక్కలు మెత్తబడేవరకు సుమారు పావు గంట సేపు ఉడికించాలి మూత తీసి, కారం, కొబ్బరి పొడి, పల్లీలు వేసి బాగా కలిపి దించేయాలి. -
రుచుల సంజీవని
అన్ని దినుసులనూ ఎన్నుకొని, ఏరుకొని వండేవాడు కాదు... మిగిలిపోయిన దినుసులతో కూడా మరపురాని రుచులని అందించేవాడే వంటవాడంటే! ఆ నిర్వచనాన్నే రెసిపీగా మార్చి బ్రహ్మ వండిన వంట... సంజీవ్ కపూర్! 1-‘ఖానా ఖజానా’ ఎపిసోడ్ నంబర్ 255. పాలక్ కోఫ్తా... ఆరోజు వీక్షకుల కళ్లకు తినిపించబోయే వంటకం. పదహారు దినుసుల సమాహారం ఆ వంటకం. బాణలి తీసుకుని పని ప్రాంభించారు సంజీవ్. కావల్సిన దినుసులను కలుపుతుండగా ఒక ‘క్రియేటివ్ షాక్’ తగిలినట్టయి శరీరం అంతా అడ్రినలిన్ రష్! ఏమైందో కానీ, తనకు తెలియకుండానే టొమాటో గుజ్జుకి, లవంగాలు, కాజు, వెన్న, కాస్త చక్కెర వేసి, మఖ్నీ గ్రేవీ తయారు చేశాడు. అంతేకాదు, కాస్త తేనె, మెంతి ఆకులు వేసి పాలక్ కోఫ్తాను కొత్తగా మార్చేశాడు. ఆ తరువాత అదే అతని సిగ్నేచర్ డిష్‌గా పేరొందిన ‘షామ్ సవేరా’. మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు. ఏం చేసినా గొప్ప కావ్యం అవుతుందని తెలుసుకున్నారు సంజీవ్! 2- కొలంబో విమానాశ్రయంలో తన బ్యాగేజ్ కోసం ఎదురు చూస్తున్నారు సంజీవ్. ఒక యువతి వచ్చి, తన కాళ్ల మీద పడింది. వెంటనే కంగారుగా పక్కకి జరిగి ఆ అమ్మాయిని పైకి లేపారు సంజీవ్. ‘‘నా జీవితాన్ని కాపాడారు మీరు’’ అంది ఆ అమ్మాయి. ఏమీ అర్థం కానట్టు చూస్తున్నారు సంజీవ్. ఆ అమ్మాయి ఏడుస్తూ ‘‘సార్! నాకు పెళ్లయి చాలా ఏళ్లయింది. నాకు వంట చేతకాదని మా అత్తగారింట్లో ప్రతిరోజూ తిట్లు, చీవాట్లే. మీకు చిన్న విషయంలా అనిపించొచ్చు కానీ కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. తరువాత టీవీలో మీ కార్యక్రమాలు, మీ పుస్తకాలు చూసి వంట నేర్చుకున్నాను. మీరు చెప్పినట్టుగా నేను చేసిన వంటలు మా ఇంట్లో వాళ్లకు ఎంతో నచ్చాయి. ఇప్పుడు నన్ను వారు చాలా బాగా చూసుకుంటున్నారు. అంతేకాదు... పెళ్లైన తరువాత మా ఆయన నన్ను మొదటిసారి హనీమూన్‌కు తీసుకెళ్తున్నారు’’ అని చెప్పింది. అంతే... ఇన్నాళ్ళ తన శ్రమకు ప్రతిఫలం దొరికినట్లయింది సంజీవ్‌కు. 3- ‘‘ఆహారంలో రుచికరమైన పదార్థాలే కాదు.. ఎంతో ప్రేమ, అంకితభావం కలగలిపి వండుతారు. అలా వండిన వంట మిగిలిపోయినా, ఎక్కువై పారేసినా అది కేవలం ఆహారాన్ని వృథా చేయడం కాదు, ప్రేమను వ్యర్థం చేయడం. ప్రేమను డస్ట్‌బిన్‌లో పారేయడమే!’’ అని నమ్ముతారు సంజీవ్. తన హోటల్లో కస్టమర్ అయినా, ఇంట్లో తన కూతురు రచిత గబగబ తిని వదిలేసిన చపాతీ ముక్కలైనా సరే... మిగులు చూస్తే దిగులు ఆయనకి! ఊరుకోకుండా ఉండలేక, ఆ ముక్కలను తీసుకుని, కాస్త అల్లం, వెల్లుల్లి దట్టించి, సాస్, మిరియాలు, చీజ్ వేసి చపాతీలు ఎన్నడూ చరిత్రలో చూడని ‘చపాతీ లసాన్యా’ను తయారుచేశారు. 4- ‘‘సార్! మీ వంటకాలన్నింటినీ ఒక పుస్తకంగా వెయ్యచ్చు కదా?’’ పార్టీలో కలిసిన ఒక ఆవిడ సంజీవ్‌తో అన్న మాటలివి. ‘‘ఎందుకమ్మా! అన్ని వంటలనీ నేనే ఫ్రీగా టీవీలో చేసి చూపిస్తున్నాను కదా! మళ్లీ కొత్తగా పుస్తకం ఎందుకు? మీకు డబ్బులు దండగ’’ అని నవ్వారు సంజీవ్. కానీ ఇలా ఎన్నో రిక్వెస్టులు వచ్చాయి. ఎప్పుడూ వంట చేయనివాడు మొదటిసారి గరిటె పడితే, అతనికి వచ్చే సందేహాలన్నీ ముందుగానే ఊహించి, వాటిని నివృత్తి చేస్తూ తన మొదటి పుస్తకం ‘ఎనీ టైమ్ టెంప్టేషన్స్’ని సంజీవ్ రాశారు. అది మొదలు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. ‘హౌ టు కుక్ ఇండియన్’ అనే ఆయన రచన ఏకంగా కోటికి పైగా కాపీలు అమ్ముడైంది. 5- లైఫ్ అనేది ఒక డిష్ లాంటిది. అందులో ముఖ్యమైనది... అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవటమే. మానవత్వం, స్వ చైతన్యం, ఆశయాలను... ఒడుదొడుకుల్లో ఉడకపెట్టి, కష్టాలతో మగ్గబెట్టి, సుఖాలను టాపింగ్స్‌గా చేసిన మిశ్రమ ఆశ్రమమే జీవితమనే వంట. అనుకున్నవన్నీ జరగవు. అందుకే ఎవరూ జరగదనుకున్నదాన్ని జరిపించి చూపించు. చేసే పని పాతదే అయినా, చెయ్యడం కొత్తగా చెయ్యి! జీవితంలో ఏం కోల్పోయినా ‘నిన్ను నువ్వు కోల్పోకు, కోల్పోనివ్వకు, అదే నిన్ను నడిపిస్తుంది’. వంట గదిలోనే మగ్గిపోతున్న చెఫ్‌లను బయటకు తీసుకొచ్చి, చెఫ్గిరీని మార్కెట్‌కి పరిచయం చేసి, భారతీయ వంటకానికి ప్రపంచ స్థాయిలో ముఖచిత్రంగా మారిన సంజీవ్ జీవిత నిర్మాణంలో తెలుసుకున్నవి, తెలియజేసినవి ఇవే. కొన్ని కోట్ల మంది ప్రేమను కడుపారా నింపుకుంటుండగా, అలసిపోయిన గరిటె తడి మెరుపులో నవ్వుతుంది సంజీవ్‌కపూర్ ప్రతిబింబం. - జాయ్ -
కోటి రతనాలంటి రుచులు...
కోటి రతనాల రాగాలు పలికించే వీణ పట్టే చేతులు... కోటి రుచులను వండలేవా? వడ్డించలేవా? ఉద్యమాల గడ్డ మీద... వండే వంటల్లోనూ పవరుంటుంది... పౌరుషముంటుంది... నాలుకనంటగానే రుచిస్తుంటుంది. అసలు సిసలు తెలంగాణాంగణ ప్రాంగణపు వంటలైన శేవల పాయసం కేవలం రుచి చూస్తే సరిపోదు... మసాలా పూరీ తింటే మనసు నిండదు... మరి కాస్త తప్పక కావాలనిపిస్తుంది... నడుములెత్తకుండా కూర్చుని తినాలనిపించే ఆనపగింజ కుడుములు వారేవా అనిపించే వాక్కాయ ఆవకాయ వడివడిగా తినిపించే చేమకూర బడీలు పూర్ణం కట్టు చారుతోనే సంపూర్ణమయ్యే భోజనాలు... కోటి రుచుల్లో కొన్ని శాంపిల్ రుచులివి... రాష్ట్రాలుగా వేరైనంత మాత్రాన రుచులు వేరవుతాయా? స్టేటులుగా విడిపోయినంతనే టేస్టులు విడివడతాయా? ఒకటీ రెండు తింటేనే కోటి రుచుల పెట్టు ఈ తెలగాణ్యపు వంటలు ముద్ద నోట పెట్టగానే... నాలుక మాగాణ్యంపై రుచుల సిరుల పంటలు. మసాలా పూరీ కావలసినవి: గోధుమపిండి - 3 కప్పులు; సెనగపిండి - కప్పు; కరివేపాకు - 3 రెమ్మలు; పచ్చి మిర్చి - 3; పసుపు - కొద్దిగా; మిరప్పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత తయారీ: గోధుమపిండి, సెనగపిండి కలిపి జల్లించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్దలో కొన్ని నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి కరివేపాకు, పచ్చి మిర్చి సన్నగా తరిగి పిండిలో వేయాలి పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలపాలి తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత కొద్దిగా నూనె వేసి మృదువుగా అయ్యేలా కలిపి చిన్న ఉండలు చేసుకోవాలి ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి అన్నీ చేసుకుని, వేడి నూనెలో నిదానంగా రెండు వైపులా కరకరలాడేలా వేయించి తీసుకోవాలి. (పూరీలు మందంగా ఉంటే మెత్తబడిపోతాయి. నిల్వ ఉండవు) శేవల పాయసం కావలసినవి: గోధుమపిండితో చేసిన శేవలు - 200 గ్రా.; బెల్లం తురుము - 250 గ్రా.; నెయ్యి - 4 టీ స్పూన్లు; గసగసాలు - టీ స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను; పాలు - కప్పు; కొబ్బరి తురుము - కొద్దిగా తయారీ: ఒక గిన్నెలో బాగా ఎండిన శేవలు, తగినన్ని నీళ్లు పోసి శేవలను ఉడికించాలి బెల్లం తురుము, పాలు, నెయ్యి వేసి నెమ్మదిగా కలపాలి బాగా ఉడికిన తర్వాత ఏలకుల పొడి, గసగసాలు వేయాలి కొబ్బరితురుముతో గార్నిష్ చేసి దింపేయాలి వేడివేడిగా అందించాలి ఇష్టమైన వారు మరి కాస్త నెయ్యి వేసుకోవచ్చు శేవల తయారీ... గోధుమపిండికి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, చేతితో ఒత్తుతూ సన్నగా పొడవుగా సేమ్యా మాదిరిగా చేయాలి రెండు మూడు రోజులు ఎండబెట్టాలి డబ్బాలో నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. వీటిని తయారు చేసే మిషన్లు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి సేమ్యా లాంటివి. చేమకూర బడీలు కావలసినవి: చేమకూర ఆకులు - 10 (వెడల్పుగా ఉండే ఆకులు); సెనగపిండి - కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; మిరప్పొడి - టీ స్పూను; పసుపు - చిటికెడు; గరం మసాలా - చిటికెడు; సన్నగా తరిగిన కొత్తిమీర - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత. తయారీ: చేమకూర ఆకులను కడిగి, తుడిచి పెట్టుకోవాలి సెనగపిండిలో మిగతా వస్తువులు, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి ముద్దలా చేసుకోవాలి చేమకూర ఆకుపై ఈ ముద్దను పలుచగా రాసి చాప చుట్టలా మడిచి ఉంచాలి అదే విధంగా అన్ని ఆకులతో చేసుకోవాలి ఈ మడతలను ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించాలి చల్లారిన తర్వాత అంగుళం వెడల్పులో ముక్కలుగా కట్ చేయాలి నూనెలో వేసి ఎర్రగా కరకరలాడేలా వేయించాలి వీటిని ఉల్లి చక్రాలతో నంచుకు తింటే రుచిగా ఉంటాయి. పూర్ణం కట్టు చారు కావలసినవి: సెనగపప్పు ఉడకబెట్టిన నీళ్లు - 2 కప్పులు; చింతపండు - నిమ్మకాయంత; ఉల్లిపాయ - 1; పచ్చి మిర్చి - 2; ఎండు మిర్చి - 3; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; టొమాటో - 1; పసుపు - పావు టీ స్పూను; ఆవాలు + జీలకర్ర - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు; ఉడికించిన సెనగపప్పు ముద్ద (పూర్ణం) - పావు కప్పు తయారీ: చింతపండులో నీళ్లు పోసి, నానబెట్టి, పులుసు తీసుకుని పప్పు నీళ్లలో కలపాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేగాక కలిపి పెట్టుకున్న కట్టు చారు వేయాలి కొద్దిసేపు మరిగిన తర్వాత పూర్ణం వేసి కలపాలి మరో రెండు నిమిషాలు మరిగించి దించేయాలి చారు తియ్యతియ్యగా పుల్లపుల్లగా ఉంటుంది. ఆనప గింజల కుడుములు కావలసినవి: బియ్యప్పిండి - కప్పు; ఆనప గింజలు - ఒకటిన్నర కప్పులు; ఉల్లికాడల తరుగు - కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; పచ్చి మిర్చి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: ఆనప గింజలు మరీ లేతగా కాకుండా కొద్దిగా ముదురుగా ఉండేలా చూసుకోవాలి. (చిక్కుడు గింజలతో కూడా చేయవచ్చు) బియ్యప్పిండిలో ఆనప గింజలు, పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి గోరువెచ్చని నీళ్లతో తడిపి మూత పెట్టి గంటసేపు ఉంచాలి నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకోవాలి ఇడ్లీ రేకులలో ఒక్కో ఉండను ఉంచి ఆవిరి మీద ఉడికించాలి ఆవకాయతో కాని, ఉల్లిపాయ పచ్చడితో కాని తింటే రుచిగా ఉంటాయి. వాక్కాయఆవకాయ కావలసినవి: వాక్కాయలు - కేజీ; ఉప్పు - 250 గ్రా.; నువ్వుల నూనె - 250 గ్రా.; మిరప్పొడి - 125 గ్రా.; అల్లం ముద్ద - 125 గ్రా.; వెల్లుల్లి ముద్ద - 125 గ్రా.; జీలకర్ర పొడి - 25 గ్రా.; మెంతి పొడి - టీ స్పూను; పసుపు - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; జీలకర్ర + మెంతులు - టీ స్పూను తయారీ: వాక్కాయలను రెండు లేదా నాలుగు ముక్కలుగా తరిగి లోపలి జీడి వేరు చేయాలి ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద వేసి కలిపి పూర్తిగా చల్లారాక కలిపి పెట్టుకున్న పొడులు, వాక్కాయ ముక్కలు వేసి బాగా కలపాలి జాడీలోకి తీసుకుని మూడు రోజుల తర్వాత ఆవకాయ మొత్తం ఇంకోసారి కలిపి వాడుకోవాలి. చేమగడ్డ పప్పు కావలసినవి: కందిపప్పు - 200 గ్రా.; చేమగడ్డలు - 200 గ్రా.; ఉల్లిపాయ - 1; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; గరంమసాలా పొడి - పావు టీ స్పూను; పసుపు - అర టీ స్పూను; మిరప్పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఆవాలు + జీలకర్ర - అర టీ స్పూను; టొమాటో - 1 (ముక్కలుగా తరగాలి); చింతపండు పులుసు - పావు కప్పు; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు తయారీ: కందిపప్పు కడిగి నీళ్లు పోసి సగం పసుపు, కొంచెం నూనె వేసి ఉడికించాలి చేమగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకు ఉంచాలి పసుపు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నిమిషం సేపు వేయించి చేమగడ్డలు, వాటికి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి చేమగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, పచ్చి మిర్చి తరుగు వేసి అందులో చింతపండు పులుసు, అర కప్పు నీళ్లు పోసి, బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి చేమగడ్డలు మెత్తబడ్డ తర్వాత ఉడికించిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మరి కొద్దిసేపు ఉడికించాలి గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. సేకరణ డా. వైజయంతి కర్టెసీ: జ్యోతి వలబోజు -
రుచులు ఆరేయండి..!
రుతువు మారగానే రుచులూ మారతాయి. నాల్కలు సంప్రదాయ షడ్రుచులను కోరతాయి. అందుకే... ఆరారా తినడానికి ఆరు రుచుల వంటలివే... నాలుకతో నెయ్యానికి తియ్యగా చెరుకు పానకం. పులుపుతో పచ్చిపులుసుదే జిహ్వపై గెలుపు. మిగులు చలికి విరుగుడీ మిర్చిమసాలా చలి ‘మంట’! వగరు రుచి కోసమే మామిడి మెంతిబద్దల విగరు. ‘వేప్పువ్వు పొడి’చే పోటు - అనారోగ్యాన్ని ఆవలికి నెట్టడానికే. చిటికెడంత తాను లేకపోతే అసలు రుచే లేదంటూ... ఇక అన్నింటా తానై ఉన్నానని చిటికేసి చెప్పే ‘ఉప్పు’! జయనామ సంవత్సరంలో విజయాలు సాధించే ముందర నాలుకపై రుచులను ‘ఆరే’యండి... షడ్రుచులపై మనసు పారేయండి! షడ్రుచుల ఉగాది పచ్చడి కావలసినవి: అరటిపండు ముక్కలు - కప్పు; చెరకు ముక్కలు - కప్పు; చింతపండు - కొద్దిగా; నీళ్లు - 6 కప్పులు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; వేప పువ్వు - 3 టేబుల్ స్పూన్లు; బెల్లం తురుము - 3 కప్పులు; ఉప్పు - చిటికెడు; మామిడికాయ ముక్కలు - పావు కప్పు తయారి: చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి ఒక పాత్రలో చింతపండురసం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, మామిడికాయ ముక్కలు, వేపపువ్వు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. పుల్లటి పచ్చిపులుసు కావలసినవి: చింతపండు - 50 గ్రా.; నీళ్లు - 4 కప్పులు; నువ్వులపొడి - 50 గ్రా.; ఉల్లిపాయ ముక్కలు- కప్పు; కారం - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; ఎండుమిర్చి - 4; తాలింపుగింజలు - టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు తయారీ: చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి ఉల్లిపాయముక్కలు, కారం, కొత్తిమీర, నువ్వులపొడి, ఉప్పు అందులో వేసి బాగా కలపాలి బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించాలి చింతపండు రసంలో వేసి అన్నీ కలపాలి (ఇష్టమైనవారు తీపి వేసుకోవచ్చు) చిరుచేదుగా వేపపువ్వు పొడి కావలసినవి: వేపపువ్వు - అర కప్పు; ధనియాలు - 2 టీ స్పూన్లు; నువ్వులు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండుమిర్చి - 10; మెంతులు - కొద్దిగా; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: వేపపువ్వును శుభ్రం చేసి ఎండబెట్టాలి బాణలిలో వేసి దోరగా వేయించి తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి. నువ్వులు వేసి వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తయారుచేసి ఉంచుకున్న అన్ని పొడులకు వేపపువ్వు జత చేసి మరోమారు మిక్సీలో వేసి తీసేయాలి వేడివేడి అన్నంలో, కమ్మటి నెయ్యి జతచేసి ఈ పొడి తింటే రుచిగా ఉండటమే కాకుండా, అనేక రోగాలను రాకుండా నివారిస్తుంది. కారం కారంగాపచ్చిమిర్చి మసాలా కూర కావలసినవి: పచ్చిమిర్చి - పావు కేజీ (బజ్జీ మిర్చి అయితే రుచి బాగుంటుంది); శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; పల్లీలు - గుప్పెడు; నువ్వుపప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; గసగసాలు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 10; ఉప్పు - తగినంత; నూనె - 4 టేబుల్ స్పూన్లు. తయారీ ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఒక వైపు గాట్లు పెట్టి గింజలు తీసేయాలి బాణలిలో నూనె వే సి కాగాక పచ్చిమిర్చి అందులో వేసి వేయించి పక్కన ఉంచాలి అదే బాణలిలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి తీసేయాలి పల్లీలు, నువ్వుపప్పు విడివిడిగా వేసి వేయించి పక్కన ఉంచాలి పై పదార్థాలన్నీ(పచ్చిమిర్చి తప్పించి) చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బాణలిలో మరి కాస్త నూనె వేసి అందులో పచ్చిమిర్చి, పొడులు, గసగసాలు, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గించి దింపేయాలి. వగరు మామిడికాయ మెంతి బద్దలు కావలసినవి: మామిడిపిందెలు - 2; ఉప్పు - తగినంత; మెంతులు - టీ స్పూను; నూనె - 4 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; ఎండుమిర్చి - 15; ఇంగువ - పావు టీ స్పూను తయారీ: ముందుగా మామిడిపిందెలను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు చేయాలి బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఒక గిన్నెలో మామిడికాయ ముక్కలు, వేయించి పొడి చేసుకున్న మెంతిపొడి మిశ్రమం వేసి బాగా కలపాలి ఉప్పు వేసి మరోమారు కలిపి, ఇంగువ, నూనె వేసి బాగా కలిపి, రెండో రోజు వాడుకోవాలి. తియ్యటి చెరకు పానకం కావలసినవి: చెరకురసం - 2 గ్లాసులు; తేనె - 2 టీ స్పూన్లు; మిరియాలపొడి - టేబుల్ స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను; ఐస్ క్యూబ్స్ - తగినన్ని తయారీ: ఒక పాత్రలో చెరకు రసం పోసి అందులో తేనె వేసి కలపాలి మిరియాలపొడి, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి రసాన్ని గ్లాసులలోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. సేకరణ: డా. వైజయంతి ఫొటోలు: మోర్ల అనిల్ కుమార్ -
రండి రండి రండి థాయ్ ఫుడ్డండీ!!
థాయ్‌లాండ్‌లో ఒక సంప్రదాయం ఉంది. ఇంట్లోగానీ, రెస్టారెంట్‌లోగానీ... ఎవరూ ఒక్కరే తింటూ కనిపించరు! ఎవరూ ఒక్క ఐటమ్తోనే సరిపెట్టుకోరు! ఎవరూ అతిథి ఓకే అనకుండా మొదలుపెట్టరు! ఎవరూ హడావుడిగా మింగేయరు! ఎవరూ మాట్లాడకుండా తినరు! ఎవరూ ప్లేట్లో కాస్త కూడా మిగల్చరు! అంటే ఏమిటర్థం? ప్రతి భోజనమూ అక్కడ వనభోజనమే! ఇంత మంచి సంప్రదాయం ఎలా వచ్చింది? ‘‘అది మా ఫుడ్‌లోనే ఉంది’’ అంటారు వాళ్లు! ఫుడ్లోనా!! అయితే... ఓ పట్టు పట్టాల్సిందే. ఫ్రెండ్స్‌ని బుట్టలో వేసుకోవాల్సిందే! థాయీ గ్రీన్ కర్రీ కావలసినవి: పచ్చిమిర్చి - 2, ఉల్లితరుగు - అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, నారింజకాయ - ఒకటి (చిన్నది), పంచదార - 2 టేబుల్ స్పూన్లు, చింతపండు - కొద్దిగా, కరివేపాకు - 2 రెమ్మలు, ఏలకులు - 2, జీలకర్ర - టీ స్పూను, వీటన్నిటినీ పేస్ట్ చేసి, కొబ్బరిపాలు పోసి మరిగించాక, కూరముక్కలు జత చేసి మరోమారు ఉడికించి పక్కన ఉంచాలి. కావలసినవి: గ్రీన్ కర్రీ పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు (సూపర్మార్కెట్లో దొరుకుతుంది), కొబ్బరిపాలు - 2 కప్పులు, నీరు - అర కప్పు, చైనీస్ క్యాబేజీ తరుగు - 2 కప్పులు, రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు, క్యారట్ తురుము - కప్పు, మష్రూమ్స్ - కప్పు, బేబీకార్న్ తరుగు - అర కప్పు, పనీర్ - అర కప్పు తయారి స్టౌ మీద బాణలి ఉంచి అందులో గ్రీన్ కర్రీ పేస్ట్, కొబ్బరిపాలు వేసి, ఆపకుండా కలుపుతూ మరిగించి, మంట తగ్గించి 5 నిముషాలు ఉంచాలి పైన చెప్పిన మిగతా పదార్థాలను వేసి, మంట తగ్గించి నాలుగు నిముషాలు ఉంచి దించేయాలి (కూరముక్కలన్నీ ఉడకాలి కాని ముద్ద అయిపోకూడదు. ఒకవేళ గ్రీన్ కర్రీ బాగా స్పైసీగా ఉందనిపిస్తే, మరికొన్ని కొబ్బరిపాలు జత చేయవచ్చు) రైస్‌తో సర్వ్ చేయాలి. థాయీ ట్రాపియోకా పెరల్ డంప్లింగ్స్ కావలసినవి: సగ్గుబియ్యం - కప్పు (సన్నవి), వేడినీరు - ఒకకప్పు కంటె ఎక్కువ, క్రంబుల్స్ - కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి), బాదంపప్పులు - పావు కప్పు ఉల్లితరుగు - టేబుల్ స్పూను, అల్లంతరుగు - టేబుల్ స్పూను, వెల్లుల్లి రేకలు - 2, పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు, సోయాసాస్ - టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, వెజిటబుల్ ఆయిల్ - టేబుల్‌స్పూను, నువ్వుల నూనె - టీ స్పూను తయారి బాణలిలో నూనె వేసి కాగాక, ఉల్లితరుగు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి అల్లంవెల్లుల్లి పేస్ట్ జత చేసి వేయించాలి క్రంబుల్స్, పల్లీలు, సోయాసాస్ వేసి క్రంబుల్స్ మెత్తగా ఉడికేవరకు కలుపుతుండాలి కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టౌ ఆర్పేయాలి సన్న సగ్గుబియ్యాన్ని ఒక పాత్రలో వేసి, వేడి నీరు పోసి, ముద్దగా అయ్యేలా కలపాలి. (ఎండినట్టుగా ఉండకుండా చూసుకోవాలి) ఒక పాత్రలో నీరుపోసి, నీటిలో చేతివేళ్లను ముంచి, సగ్గుబియ్యం మిశ్రమం కొద్దిగా తీసుకుని, ఒత్తి, అందులో క్రంబుల్ మిక్స్చర్ను కొద్దిగా ఉంచి, చివర్లు మూసి బాల్లా తయారు చేయాలి ఈ బాల్స్‌ను ఇడ్లీ రేకులలో ఉంచి (ఒకదానికి ఒకటి తగలకుండా చూసుకోవాలి) వాటిని కుకర్‌లో ఉంచి, విజిల్ పెట్టకుండా ఇడ్లీల మాదిరి సుమారు 30 నిముషాలు ఉడికించి దించేయాలి పాత్రలో నుంచి వీటిని బయటకు తీస్తున్నప్పుడు ఒక్కో బాల్ మీద కొద్దిగా నువ్వులనూనె చల్లాలి. థాయీ ఫ్రైడ్ రైస్ కావలసినవి: బాస్మతి బియ్యం - 3 కప్పులు, బీన్స్ - 20, థాయీ రెడ్ కర్రీ పేస్ట్ - టేబుల్ స్పూను (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), నీరు - 6 కప్పులు, ఉప్పు - తగినంత, సోయాసాస్ - 2 టేబుల్ స్పూన్లు, వెజిటబుల్ ఆయిల్ - టేబుల్ స్పూను, ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి), రెడ్కర్రీ పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), వెల్లుల్లి రేకలు - 3 (వేయించాలి), వేయించిన పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (కొద్దిగా పలుకులుగా ఉండేలా పొడి చేయాలి), కొత్తిమీర, పుదీనా ఆకులు - అర కప్పు (సన్నగా కట్ చేయాలి) తయారి బీన్స్‌ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో నీరు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి బీన్స్ జత చేసి రెండు నిముషాలు ఉడికి ంచి, ముక్కలను చల్లటి నీరు ఉన్న పాత్రలో వేయాలి. (ఇలా చేయడం వలన బీన్స్ మరీ మెత్తబడిపోకుండా ఉంటాయి) చిన్న పాత్రలో రెడ్ కర్రీ పేస్ట్, సోయా సాస్, 2 టేబుల్ స్పూన్లు నీరు వేసి పేస్ట్‌లా చేసి, పక్కన ఉంచుకోవాలి ఒక బాణలిలో నూనె వేసి వేడి చేయాలి ఉల్లితరుగు జత చేసి బంగారురంగులోకి వచ్చే వరకు వేయించాలి రెడ్ క్యాప్సికమ్ తరుగు జత చేసి ఒక నిముషం పాటు కలపాలి బీన్స్ ముక్కలు, రెడ్ కర్రీ పేస్ట్ జత చేసి మంట పెంచి సుమారు 30 సెకన్లు ఉంచి దించేయాలి ఈ మిశ్రమానికి అన్నం జత చేసి అన్నీ కలిసేలా జాగ్రత్తగా కలపాలి పల్లీలపొడి, వేయించి ఉంచుకున్న వెల్లుల్లి రేకలు, సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులతో గార్నిష్ చేయాలి. వెజిటబుల్ థాయీ ప్యాడ్ కావలసినవి సాస్ కోసం: బ్రౌన్ షుగర్ - 4 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు, సోయాసాస్ - 4 టేబుల్ స్పూన్లు, నీరు - పావు కప్పు నూడుల్స్ కోసం: థాయ్ రైస్ నూడుల్స్ - ఒక ప్యాకెట్, వెజిటబుల్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, రెడ్ క్యాప్సికమ్- 1 (సన్నగా తరగాలి), వెల్లుల్లి రేకలు - 6, బ్రొకోలీ ముక్కలు - 2 కప్పులు, క్యారట్ తురుము - కప్పు, పనీర్ - కప్పు, బీన్స్ గింజలు - గుప్పెడు, ఉల్లికాడల తరుగు - పావు కప్పు, వేయించిన పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు, నిమ్మ ముక్కలు - 6 తయారి: సాస్‌కు ఉపయోగించే పదార్థాలను ఒక నాన్‌స్టిక్ పాన్‌లో వేసి, ఉడికించాలి దించేయాలి నూడుల్స్‌ను నానబెట్టి, నీటిని వడకట్టాలి. (ప్యాకింగ్ మీద ఇచ్చిన సూత్రాలను పాటించాలి. ఎటువంటి సూచనలు ఇవ్వకపోతే, చల్లటి నీటిలో సుమారు పావుగంట సేపు నానబెట్టి, ఆ తరవాత వడకట్టాలి) బాణలిలో నూనె వేసి కాగాక, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి వెల్లుల్లి తరుగు, బ్రకోలీ ముక్కలు, క్యారట్ తురుము జత చేసి, మీడియం మంట మీద వీటిని కలుపుతూ, బ్రకోలీ ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి, వెల్లుల్లి వాసన రావడం ప్రారంభించాక రెండు నిముషాలు ఉంచి దించేయాలి నానబెట్టిన నూడుల్స్, పనీర్, సాస్‌లను జత చేసి, అన్నీ బాగా కలిసి, నూడుల్స్ ఉడికేవరకు మీడియం మంట మీద ఉంచాలి. (ముద్దలా అయిపోకుండా చూసుకోవాలి) మంట ఆపేసి, బీన్స్ గింజలు, ఉల్లికాడల తరుగు వేసి బాగా కలపాలి కొత్తిమీర తరుగు, పల్లీలతో గార్నిష్ చేసి, నిమ్మ ముక్కలు జత చేసి సర్వ్ చేయాలి. సోయా కర్ల్స్ కావలసినవి: సోయా కర్ల్స్ - ఒక ప్యాకెట్ (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి), బియ్యప్పిండి - టేబుల్ స్పూను, బ్రొకోలీ - నాలుగైదు ముక్కలు, ఉప్పు - తగినంత, అల్లం పేస్ట్ - టీ స్పూను, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను. గ్రేవీ కోసం... సోయాసాస్ - 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, పంచదార - 2 టేబుల్ స్పూన్లు, నువ్వులనూనె - టేబుల్ స్పూను, పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను, కొత్తిమీర తరుగు - కొద్దిగా తయారి సోయా కర్ల్స్ను వేడినీటిలో సుమారు 20 నిముషాలు నాననిచ్చి, నీరంతా పిండేయాలి ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలిపి, అందులో సోయా కర్ల్స్ను వేసి కలపాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, సోయా కర్ల్స్ వేసి, బంగారురంగులోకి వచ్చేవరకు (చిన్న మంట మీద) వేయించి, తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రొకోలీ వేసి బాగా వేయించాలి సోయా కర్ల్స్ జత చేయాలి సాస్ కోసం ఉన్న పదార్థాలన్నిటినీ జత చేసి సాస్ పూర్తిగా ఆవిరయ్యేవరకు స్టౌ మీద ఉంచాలి నువ్వులు, కొత్తిమీర తరుగులతో గార్నిష్ చేసి, రైస్ నూడుల్స్‌తో సర్వ్ చేయాలి. సేకరణ: డా.వైజయంతి కర్టెసీ: veggiebelly.com -
పచ్చడి పడితేనేఫుల్ మీల్స్
అష్టభోగాలలో ఉత్కృష్ట భోగం... భోజనం! ధనం, ధాన్యం, వాహనం, వస్త్రం, స్నానం, సదుపాయం, సయోగం... అన్నీ... భోజనం తర్వాతే. మరి భోజనాలలో... ఉత్కృష్ట భోజనం? ఆకేసి, పప్పేసి, నెయ్యి వేసిందే కదా! అబ్బే... చప్పగా ఉంటుంది. అది కాదు. సాంబారు, రసం, అప్పడం, వడియం? అబ్బే... అదంతా సెకండ్ సెషన్. వేపుడు, పులిహోర, పూర్ణాలు? అబ్బే... ఇవన్నీ నంజుళ్లు, పైపై చప్పరింతలు. పాయసం, వడ, గడ్డపెరుగు..? అబ్బే... పడాల్సింది ఇంకా ఎక్కడ పడిందీ?! పడాలా? ఏం పడాలి? ఎక్కడి నుంచి పడాలి? రోట్లోంచి, రోలు లేకపోతే మిక్సీలోంచి... పచ్చి పచ్చడి వచ్చి పడాలి. అలా పడితేనే అది... ఉత్కృష్ట భోజనం మృష్టాన్న భోజనం... సంపూర్ణ భోజనం. కొబ్బరి -మామిడికాయ పచ్చడి కావలసినవి: కొబ్బరి - ఒక చిప్ప, మామిడికాయ - 1 (చిన్నది) పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు, ఇంగువ - కొద్దిగా నూనె - రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి - 5, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను తయారి కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీలో మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి, పోపు, ఇంగువ జతచేసి అన్నంలోకి వడ్డించాలి. కీరా రైతా కావలసినవి కీరా - పావు కిలో పచ్చిమిర్చి - 6, పెరుగు - అరకిలో ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు ధనియాలపొడి - అర టీ స్పూను తయారి కీరాలను శుభ్రంగా కడిగి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేయాలి ఒక గిన్నెలో పెరుగు వేసి చిక్కగా చిలకాలి కీరా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు, ధనియాలపొడి వేసి బాగా కలపాలి సుమారు రెండుగంటలు ఊరనివ్వాలి రోటీలలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తుంది. పచ్చిపులుసు కావలసినవి: ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, నూనె - తగినంత, ఎండుమిర్చి - 2, చింతపండు - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, బెల్లం తురుము - టీ స్పూను, కరివేపాకు - ఒక రెమ్మ తయారి ఉల్లిపాయను చిన్నముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చిని పొడవుగా మధ్యకు కట్ చేయాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఎండుమిర్చి వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. చింతపండును పది నిముషాలు నీటిలో నానబెట్టి, మూడు కప్పుల గుజ్జు వచ్చేలా తీయాలి. ఉప్పు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పొడి వేసి కలపాలి. చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి పచ్చిపులుసులో కలపాలి. బెల్లం తురుము, కరివేపాకు జతచేసి, బాగా కలిపి సర్వ్ చేయాలి. దోసకాయ పచ్చడి కావలసినవి దోసకాయ - మీడియం సైజుది ఒకటి పచ్చిమిర్చి - 6 చింతపండు - కొద్దిగా ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు ఇంగువ - చిటికెడు నూనె - రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర - చిన్న కట్ట తయారి దోసకాయ చెక్కు తీసి, గింజలు వేరు చేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీలో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొన్ని దోసకాయముక్కలు వేసి కచ్చాపచ్చాగా చేయాలి. ఒక గిన్నెలో దోసకాయ ముక్కలు, మెత్తగా చేసిన దోసకాయల మిశ్రమం, పసుపు, ఇంగువ, నూనె వేసి బాగా కలిపి, అరగంట సేపు ఊరనివ్వాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయాలి. పెసర పచ్చడి కావలసినవి: పెసరపప్పు - కప్పు, పచ్చిమిర్చి - 4 చింతపండు - కొద్దిగా జీలకర్ర - అర టీ స్పూను ఉప్పు - తగినంత నూనె - టీ స్పూను ఇంగువ - చిటికెడు కొత్తిమీర - కొద్దిగా తయారి: పెసరపప్పును రెండు గంటలు నానబెట్టి నీరు వడగొట్టాలి మిక్సీలో పెసరపప్పు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా చేయాలి చివరగా ఇంగువ, నూనె వేసి కలిపి, వేడివేడి అన్నంలో వడ్డించాలి. కొత్తిమీర పచ్చడి కావలసినవి కొత్తిమీర - రెండుకప్పులు పచ్చిమిర్చి - 6 చింతపండు - నిమ్మకాయంత ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు ఇంగువ - చిటికెడు నూనె - రెండు టేబుల్ స్పూన్లు తయారి: కొత్తిమీరను శుభ్రంగా కడగాలి మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. (అవసరమనుకుంటే నీరు జత చేయాలి) పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నూనె వేసి కలపాలి. సేకరణ: డా. వైజయంతి -
వెయ్యింతల ఊరింతలు
చింతను చూస్తూ ఊరుకోవడం కష్టమే! కనీసం కాయ కొసల్నైనా కొరక బుద్దేస్తుంది. అందాకా ఎందుకు? చింతకాయను ఊహించుకోండి చాలు... జివ్వుమని మనసు ఊటబావి ఐపోతుంది! చింత వచ్చి చెంతన చేరితే... చప్పిడి పళ్లేలకు కూడా చురుకు పుట్టుకొస్తుంది. ఇక మనమెంత, మానవమాత్రులం? కళ్ల ముందు చింత పులుసో, పప్పో, పచ్చడో ప్రత్యక్షమవగానే... వేళ్లు కలబడి కలబడి ముద్దను కలిపేస్తాయి. చింతలో ఉన్న ‘సి’ట్రాక్షన్ వల్లనే... ఇంత ఎట్రాక్షన్. ఇవన్నీ కాదు... వెయ్యి రకాల కూర గాయలకైనా... వెయ్యి కాంబినేషన్ల రుచులను ఇవ్వగల కెపాసిటీ... చింతది, చింత పులుపుది, చింత తలపుది! చింతకాయ నువ్వుల పచ్చడి కావలసినవి: చింతకాయలు - 8, నువ్వుపప్పు - 100 గ్రా., పచ్చిమిర్చి - 10, ఎండుమిర్చి - 6, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారి: చింతకాయలను ఉడికించి రసం చిక్కగా తీసుకుని పక్కన ఉంచాలి బాణలిలో నువ్వులను వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ఇంగువ వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో చింతకాయరసం, నువ్వులపొడి, పోపుల పొడి, పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. దోసకాయ చింతకాయ పచ్చడి కావలసినవి: దోసకాయముక్కలు - రెండు కప్పులు, చింతకాయలు - కప్పు, పచ్చిమిర్చి - 7, కొత్తిమీర - చిన్నక ట్ట, ఉప్పు - తగినంత, మినప్పప్పు - 3 టీ స్పూన్లు, శనగపప్పు - 3 టీ స్పూన్లు, నూనె - 3 టీ స్పూన్లు, మెంతులు - 3 టీ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఆవాలు - 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 6 (ముక్కలు చేసుకోవాలి), కరివేపాకు చిన్న కట్ట, ఇంగువ - చిటికెడు తయారి: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి కరివేపాకు, ఇంగువ వేసి మరో మారు వేయించాలి దోసకాయ ముక్కలను కొద్దిగా ఉడికించాలి. (హాఫ్ బాయిల్ చేయాలి) చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసుకోవాలి వేయించి ఉంచుకున్న పోపు సామాగ్రి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగాపేస్ట్ చేసుకోవాలి ఒక గిన్నెలో ఉడికించి ఉంచుకున్న దోసకాయముక్కలు, చింతకాయరసం, మెత్తగా చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. చింతకాయ పులుసు కావలసినవి: చింతకాయలు - 6, టొమాటో తరుగు - పావు కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -2, బెల్లం తురుము - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ధనియాలపొడి - పావు టీ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారి: చింతకాయలను ఉడికించి రసం తీసి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి ఉడికించాలి ఉడికించిన చింతపండు రసం, బెల్లం తురుము, పసుపు వేసి పులుసును బాగా మరిగించాలి ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక పులుసులో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ - శనగపిండి కూర కావలసినవి: చింతకాయలు - 10, శనగపిండి - మూడు టేబుల్ స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, టొమాటో తరుగు - పావు కప్పు, పుదీనా ఆకులు - పావు కప్పు, ఎండుమిర్చి - 5, పచ్చిమిర్చి - 3, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్నకట్ట, నూనె - మూడు టేబుల్ స్పూన్లు. తయారి: చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి టొమాటో ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు వేసి వేయించాలి ఇంగువ, పసుపు జత చేసి బాగా కలపాలి చింతకాయ రసంలో శనగపిండి వేసి బాగా కలిపి ఉడుకుతున్న కూరలో వేసి ఆపకుండా కలపాలి దనియాలపొడి, కరివేపాకు వేసి క లిపి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ ఉల్లిపాయ పచ్చడి కావలసినవి: చింతకాయలు - 6, పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత, పసుపు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 5, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (చిన్నముక్కలుగా కట్ చేయాలి), కొత్తిమీర - చిన్న కట్ట తయారి: చింతకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి మిక్సీలో చింతకాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి పసుపు జత చేసి గాలి చొరని గాజు సీసాలో కాని జాడీలో కాని రెండు రోజులు ఉంచాలి మూడవరోజు తిరగకలపాలి బాణలిలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి కరివేపాకు జత చేసి మరోమారు వేయించి చింతకాయపచ్చడిలో వేసి కలపాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించి తీసేసి పచ్చడిలో వేసి కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ పప్పు కావలసినవి: చింతకాయలు - 4, కందిపప్పు - కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చిమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారి: పప్పులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి చింతకాయలను ఉడికించి రసం తీసుకోవాలి ఒక గిన్నెలో ఉడికించిన పప్పు, చింతపండు రసం వేసి స్టౌ మీద ఉంచాలి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి, పోపు సామాను వేసి వేయించాలి ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి ఉడికిన పప్పులో ఈ పోపు వేసి కలపాలి. సేకరణ: డా.వైజయంతి -
ఫ్యూజన్ ఫుడ్: కలిపి తిన్నా కలదు సుఖం
కాంబినేషన్ లేకుండా తింటే... కడుపు కంభం చెరువైపోతుంది! కాస్త చూస్కొని వేస్కోవాలి. పడేవీ వుంటాయి, పడనివీ ఉంటాయి. పడనివాటితో కలిపి కొడితే.. పడేవి కూడా పడకుండా పోతాయి. సలహా బాగానే ఉంది కానీ, వెరైటీలకు అలవాటు పడిన ప్రాణానికి ఈ మాట రుచిస్తుందా? కన్ను అరటిపండంటే... నోరు కోడిగుడ్డంటుంది. నాలుక... ఆపిల్ ని బేక్ చేయమంటుంది! ఏం చేయడం? ‘ఫ్యూజన్ ఫుడ్’ని వండేయడమే! అదొకటుందా? ఉంది. ఈవారం ఫ్యూజనే మన విజన్! ప్రమాదం లేని కాంబినేషన్!! క్రేప్స్ విత్ బనానా ఫ్లేంబ్ కావలసినవి: కోడిగుడ్లు - 7 (రెండు గుడ్లు కేవలం తెల్లసొన మాత్రమే తీసుకోవాలి); చిక్కటిపాలు - రెండున్నర కప్పులు; మైదా - ఒకటింపావు కప్పులు; ఉప్పు - చిటికెడు; బటర్ - 6 టేబుల్ స్పూన్లు; బనానా ఫ్లేంబ్ కోసం... అరటిపళ్లు - 4; బటర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; టాపింగ్ కోసం - తగినంత వెనిలా ఐస్‌క్రీమ్ తయారి: పెద్ద పాత్రలో కోడిగుడ్లు వేసి గిలకొట్టాలి పాలు, మైదా, ఉప్పు జత చేసి మళ్లీ గిలకొట్టాలి ఉండలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి పెనం వేడి చేసి టీ స్పూన్ బటర్ వేడి చేయాలి కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని గరిటెతో తగినంత వేయాలి బాగా కాలాక రెండవవైపు తిప్పితే క్రేప్స్ తయారవుతాయి ఇలా మొత్తం పిండితో వేసుకుని పక్కన ఉంచాలి అరటిపళ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పాత్రను స్టౌ మీద ఉంచి టేబుల్ స్పూను బటర్ వేసి కరిగాక అరటిపండు ముక్కలను వేసి కొద్దిగా వేయించి తీస్తే ఫ్లేక్స్ రెడీ అయినట్లే. (అరటిపండు ముక్కలను వేయించుకోవడం ఇష్టంలేని వారు కట్ చేసిన ముక్కలను వాడుకోవచ్చు) పైన తయారుచేసి ఉంచుకున్న క్రేప్స్ లోపల వీటిని ఉంచి సర్వ్ చేయాలి. వీటిని చాక్లెట్ సాస్‌తో సర్వ్ చేస్తే చాలా వెరైటీగా ఉంటుంది. బేక్ డ్ ఆపిల్ కప్స్ కావలసినవి: గ్రీన్ ఆపిల్స్ - 4 (తొక్క తీసేయాలి); నిమ్మరసం - రెండు టీ స్పూన్లు; పంచదార -5 టేబుల్ స్పూన్లు; మసాలా - టీ స్పూను; జాజికాయ పొడి - పావు టీ స్పూను; లవంగాల పొడి - అర టీ స్పూను; ఉప్పు - పావు టీ స్పూను; వెనిలా ఎసెన్స్ - 2 టీ స్పూన్లు; మైదా - రెండు కప్పులు + రెండు టేబుల్ స్పూన్లు; కోడిగుడ్లు - మూడు; ఐస్ వాటర్ - 4 టేబుల్ స్పూన్లు; బటర్ - 8 టేబుల్ స్పూన్లు; వెనిలా ఐస్‌క్రీమ్ - 4 స్కూపులు తయారి: చిన్న చాకు తీసుకుని దానితో ఆపిల్‌ను కప్‌లా వచ్చేలా, లోపలి గుజ్జును బాల్స్‌లా వచ్చేలా స్కూప్లాంటి దానితో నెమ్మదిగా తీయాలి. (ఆపిల్ అంగుళం మందంగా వచ్చేవరకు ఇలా చేయాలి) నిమ్మరసం తీసుకుని ఆపిల్ కప్స్ మీద, ఆపిల్ బాల్స్ మీద నిమ్మరసం చల్లాలి దాల్చినచెక్కపొడి, పంచదార, మసాలా, జాజికాయపొడి, లవంగాలపొడి, ఉప్పు, వెనిలా ఎసెన్స్‌లను ఆపిల్ కప్స్‌లో వరసగా వేయాలి ఆపిల్బాల్స్ మీద కూడా చల్లి పక్కన ఉంచాలి మిక్సింగ్ బౌల్లో మైదాపిండి, కోడిగుడ్ల సొన వేసి చేతితో బాగా కలపాలి 6 టేబుల్ స్పూన్ల బటర్ జత చేసి కలపాలి. (అవసరమనుకుంటే కొద్దిగా చల్లటి నీరు జతచేసి మరోమారు కలపాలి. పిండి మెత్తగా ఉండేలా చూసుకోవాలి) పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అప్పడాల పీట మీద వేసి కొద్దిగా పొడి పిండి జత చేసి పూరీలా ఒత్తి, ఆపిల్ బాల్స్ మిశ్రమం మధ్యలో ఉంచి అంచులు మూసేయాలి అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి అల్యూమినియం ప్లేట్‌కి చీజ్ రాసి ఆపిల్ కప్స్‌ను ఇందులో ఉంచాలి ఒక కోడిగుడ్డును బాగా గిలక్కొట్టి ఎగ్ వాష్‌తో మృదువుగా ఈ సొనను వీటి మీద రాయాలి ఆపిల్ కప్స్‌ని సుమారు 40 నిముషాలు బేక్ చేయాలి. (గోధుమరంగులోకి మారేవరకు ఉంచాలి) ఇంక ఐదు నిముషాలలో బేకింగ్ పూర్తవుతుందనగా టేబుల్ స్పూన్ బటర్‌ను పెద్ద బాణలిలో కరిగించి, ఆపిల్ బాల్స్‌ను మూడు నిముషాల పాటు వేయించి వీటిని ఆపిల్ కప్స్‌లో ఉంచి వేడివేడిగా సర్వ్ చేయాలి. ఆల్మండ్ పుడింగ్ విత్ లిచీ కావలసినవి: అగర్ అగర్ పొడి - అర టీ స్పూను (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నీరు - ఆరు కప్పులు; చిక్కటిపాలు - 5 కప్పులు (సుమారు ముప్పావు లీటరు); మరిగించిన పాలు - రెండు కప్పులు (చిక్కగా కోవాలా తయారయినవి); పంచదార - కప్పు; ఆల్మండ్ ఎసెన్స్ - ఒకటిన్నర స్పూనులు; లిచీలు - గార్నిషింగ్ కోసం తయారి: పెద్ద పాత్రలో నీరు పోసి మరిగించాలి చిన్న గిన్నెలో అగర్ అగర్ పొడి, ఐదారు చుక్కల వేడినీరు వేసి పేస్ట్‌లా కలిపి, మరుగుతున్న నీటిలో ఈ మిశ్రమాన్ని వేసి కలపాలి పాలు, మరిగించిన కోవాలాంటిపాలు పోసి బాగా కలిపి మంట తగ్గించి పది నిముషాలు ఉంచాలి పంచదార వేసి కరిగేవరకు కలుపుతుండాలి స్టౌ మీద నుంచి కిందకు దించి ఆల్మండ్ ఎసెన్స్ జత చేయాలి పుడ్డింగ్ మౌల్డ్‌లో పోసి డీప్‌ఫ్రీజ్‌లో రాత్రంతా ఉంచాలి సర్వ్ చేసే ముందు ముక్కలుగా కట్ చేసి లిచీలతో గార్నిష్ చేయాలి. ఆల్మండ్ కేక్ విత్ మ్యాంగో బటర్‌క్రీమ్ ఫ్రాస్టింగ్ కావలసినవి: పంచదార - కప్పు; బటర్ - అర కప్పు; కోడిగుడ్లు - 2; మైదా - ఒకటిన్నర కప్పులు; బేకింగ్ సోడా - అర స్పూను; ఉప్పు - అర టీ స్పూను; పాలు అర కప్పు; ఆల్మండ్ ఎసెన్స్ - ముప్పావు టీ స్పూను. మ్యాంగో బటర్ క్రీమ్... సాల్ట్ లేని బటర్ - కప్పు; కన్ఫెక్షనరీస్ పంచదార - అర కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); పాలు - పావుకప్పు; మామిడిపండు గుజ్జు - ఒకటిన్నర కప్పులు లేదా మ్యాంగో ప్యూరీ - ఒకటిన్నరకప్పులు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) తయారి: అవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేయాలి బేకింగ్ పాన్‌కి బటర్ పూయాలి ఒక పెద్ద పాత్రలో బటర్, పంచదార వే సి మెత్తగా అయ్యేవరకు కలపాలి కోడిగుడ్డు సొన జత చేసి కలపాలి ఆల్మండ్ ఎసెన్స్ జత చేసి మళ్లీ బాగా కలపాలి వేరే పాత్రలో మైదా, బేకింగ్ సోడా వేసి బాగా జల్లెడపట్టి పై మిశ్రమానికి జతచేసి నెమ్మదిగా గిలకొట్టాలి చివరగా పాలు జతచేసి గరిటెతో కలపాలి బేకింగ్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి, సుమారు 40 నిముషాలు అవెన్‌లో బేక్ చేసి తీసేయాలి 20 నిముషాల తర్వాత కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి మరొక పాత్రలో చల్లగా ఉన్న బటర్ క్రీమ్ వేసి బాగా చిక్కగా అయ్యేలా గిలకొట్టాలి కన్ఫెక్షనరీ సుగర్ జతచేసి, రెండూ కలిసేలా బాగా కలపాలి పాలు నెమ్మదిగా పోస్తూ కలిపి మరో మారు గిలకొట్టాలి చివరగా మామిడిపండు గుజ్జు వేసి వేగంగా గిలకొట్టాలి బటర్ క్రీమ్, మామిడిపండు గుజ్జు కలిసేవరకు స్పీడ్‌గా బీట్ చేయాలి మ్యాంగ్ బటర్క్రీమ్ను కేక్ స్లైసుల మీద పోసి సర్వ్ చేయాలి. అగర్... అగర్... అగర్ అగర్ అనే పదార్థం చూడటానికి చైనా సాల్ట్లాగ ఉంటుంది. ఇది ఆల్గై నుంచి తయారవుతుంది. 1658లో జపాన్‌లోని మినోరా టాంజెమన్ దీన్ని కనిపెట్టాడు జపాన్‌లో అగర్ అగర్‌ను కాంటెన్ అని పిలిచేవారు. దీనిని కొన్నిరకాల పేస్ట్రీలలో వినియోగిస్తారు అగర్ స్వాభావికంగా అగరోస్, అగరోపెక్టిన్ల మిశ్రమంతో తయారవుతుంది ఇది తెల్లగా, స్ఫటికంలా ఉంటుంది చిన్న చిన్న క్రిస్టల్స్ రూపంలోనూ, పొడి రూపంలోనూ దొరుకుతుంది జె ల్లీ, పుడ్డింగ్స్, కస్టర్డ్స్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు అగర్ అగర్లో 80 శాతం పీచుపదార్థం ఉండటం వలన, ఇది పేగులను సక్రమంగా ఉంచడంలో తోడ్పడుతుంది. బనానా బైట్ ఫిట్టర్స్ కావలసినవి: అరటిపళ్లు - 3 (బైట్ సైజ్‌లో తురమాలి); కోడిగుడ్లు -2; మైదా - కప్పు; కార్న్‌ఫ్లోర్ - అర కప్పు; బేకింగ్ సోడా - అర టీ స్పూను; ఉప్పు - పావు టీ స్పూను; క్లబ్ సోడా - అర కప్పు; నూనె - తగినంత; కండెన్స్డ్ మిల్క్ - చిలకరించడానికి తగినంత తయారి: పెద్ద పాత్రలో కోడిగుడ్డు సొన వేసి బాగా చిలకరించాలి మైదాపిండి, కార్న్‌ఫ్లోర్ , బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి మరోమారు బీట్ చేయాలి. (ఈ మిశ్రమం బాగా చిక్కగా ఉండాలి) చివరగా క్లబ్ సోడా వేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి అరటిపండు ముక్కలను పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి మంట మీడియంలో ఉంచి వేయించితే బాగా వేగుతాయి పేపర్ టవల్ మీదకు తీసి వేడివేడిగా సర్వ్ చేయాలి సేకరణ: డా.వైజయంతి -
పెరుగుమోత
పులుపంటే మనకు ప్రత్యేకమైన లవ్వు. పులుసు పులిహార పుల్లట్లు పులిపొంగడాలు పుల్లకూర (పక్కింటి వాళ్లదైతే మరీను) అన్నీ... మన చాపల్యానికి తెరచాప లేపేవే! ఆఖరికి, తియ్యగా ఉన్న పెరుగులోనైనా... పిసరంత పులుపు దొరక్కపోతుందా అనినాలుక దేవులాడుతుంది! మరైతే అది పులుపులోని గొప్పతనమా? పెరుగులో దాగి ఉన్న మహత్మ్యమా? తెలియాలంటే పెరుగు మూత తియ్యాలి. తిరగమోత పెట్టాలి. టొమాటో కర్డ్ స్ల్యూ కావలసినవి బీన్‌కర్డ్ - కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), టొమాటో తరుగు - పావుకప్పు, లవంగం - 1, వెల్లుల్లి రెబ్బలు: 6, కార్న్‌ఫ్లోర్ - అర టేబుల్ స్పూను, పచ్చిబఠాణీ - పావు కప్పు (ఉడికించాలి), నూనె - 3 టేబుల్ స్పూన్లు తయారి: బీన్ కర్డ్ని అర అంగుళం ముక్కలుగా కట్ చేయాలి టొమాటోలను శుభ్రంగా కడిగి ఉడికించి, తొక్క తీసి ముక్కలుగా కట్ చే యాలి బాణలిలో నూనె వేసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉంచాలి బీన్‌కర్డ్ ముక్కలు, వెల్లుల్లి తరుగు వే సి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి చిన్నగిన్నెలో నీరు, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి టీ స్పూన్ నూనె వేసి, పై మిశ్రమంలో వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి బఠాణీలతో గార్నిష్ చేయాలి. దహీ రింగ్ చాట్ కావలసినవి: బియ్యప్పిండి -50 గ్రా., కారం - టీ స్పూను, చాట్‌మసాలా - అర టీ స్పూను, సేవ్ - పావు కప్పు, క్యారట్ తురుము - 3 టీ స్పూన్లు, ఉల్లితరుగు - అర కప్పు, పెరుగు - అర కప్పు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు -తగినంత తయారి: ఒక పాత్రలో బియ్యప్పిండి, అర టీ స్పూను కారం, ఉప్పు, తగినంత నీరు పోసి చపాతీపిండిలా కలపాలి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని చేగోడీలాగ చేయాలి అలా మొత్తం పిండితో తయారుచేసుకోవాలి వీటిని ఆవిరి మీద ఉడికించి, బయటకు తీసి ఒక వెడల్పాటి పాత్రలో ఉంచాలి ఉల్లితరుగు, క్యారట్ తురుము, కారం, చాట్ మసాలా, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి చివరగా సేవ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి. థైర్ వెజ్ ఇడ్లీ కావలసినవి: గోధుమలు - ఒకటిన్నర కప్పులు, మినప్పప్పు - ముప్పావు కప్పు, బఠాణీ - పావు కప్పు, క్యారట్ తురుము - పావు కప్పు, బీన్స్ తరుగు - పావు కప్పు, పెరుగు - అర కప్పు, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - రెండు రెమ్మలు, ఆవాలు - టీ స్పూను, మినప్పప్పు (బద్దలు) - 2 టీ స్పూన్లు, శనగపప్పు - 2 టీ స్పూన్లు, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత తయారి: గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి మినప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి ఇడ్లీ రేకులలో వేసి కుకర్‌లో ఉంచి విజిల్ లేకుండా ఉడికించాలి. లస్సీ విత్ ఫ్లేక్స్ కావలసినవి: పెరుగు - అరలీటరు, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా, క్రీమ్ - 3 టీ స్పూన్లు, ఉప్పు తయారి: మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి పెరుగు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి వరుసగా కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్‌లను పైన వేసి సర్వ్ చేయాలి. దహీ కడీ పకోడీస్ కావలసినవి: కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు - రెండు కప్పులు (బాగా చిలకాలి), శనగపిండి - 2 టీ స్పూన్లు, కొబ్బరితురుము - టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, పకోడీల కోసం: శనగపిండి -పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూను, కొత్తిమీర - చిన్న కట్ట, తినే సోడా - చిటికెడు, పసుపు - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, పోపు కోసం: నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 1 (కట్ చేయాలి), జీలకర్ర - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు తయారి: ఒక పాత్రలో శనగపిండి, పచ్చిమిర్చి, కత్తిమీర, సోడా, పసుపు, ఉప్పు వేసి తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని పకోడీలలా వేసి వేయించి గోధుమరంగులోకి వచ్చాక తీసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి ఒక చిన్న గిన్నెలో రెండు కప్పుల నీరు, శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి వడగట్టాలి వేయించిన కొబ్బరితురుము, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి మంట తగ్గించి ఐదు నిముషాలు ఉంచితే పులుసు రెడీ అవుతుంది బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి పచ్చిమిర్చి జతచేసి ఒకసారి వేయించాక, మరిగిన పులుసులో వేయాలి తయారుచేసి ఉంచుకున్న పకోడీలను పులుసులో వేసి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి.