అన్నపూర్ణ... ఆవిడ పేరులో సంప్రదాయం... ఆవిడ రుచులలోనూ సంప్రదాయమే...
శాకాహారం మాత్రమే ఇష్టం...
కృత్రిమ రంగులు, కృత్రిమ రుచులకు ఆమడ దూరం...
కాలానుగుణంగా రుచులలో మార్పులు వచ్చినా...
సీనియర్ సినీ - టీవీ నటి అన్నపూర్ణమ్మ వంటలు మాత్రం
ఓల్డ్ ఈజ్ గోల్డ్‌లాగే ఉంటాయి...
ఈ రోజు అన్నపూర్ణ పుట్టినరోజు...
ఈ సందర్భంగా ఆమె ఇష్టపడే కొన్ని రుచులు మీ కోసం...
సినిమా షూటింగ్‌లో తెగ బిజీగా ఉన్న అన్నపూర్ణగారి దగ్గరకు మా ఫొటోగ్రాఫర్ శివ మల్లాల కెమెరాతో వెళ్లగానే...
‘నాతో ఏం వంట చేయించాలని వచ్చారు’ అని ఆప్యాయంగా పలకరించారు అన్నపూర్ణమ్మ.
మీరు ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారెందుకు...
అన్నపూర్ణ: నాకు ఇంటర్వ్యూలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చెప్పినా ఒకటే ఉంటుంది!
మీరు ‘అన్నపూర్ణ వంటలు - పిండివంటలు’ అనే పుస్తకం రాశారు కదా!
అన్నపూర్ణ: మీకా విషయం భలే గుర్తుందే! ఈ పాటికి ఆ పబ్లిషరే మర్చిపోయి ఉంటాడు!
మొదటి నుంచి మీరు వెజిటేరియనేనా...
అన్నపూర్ణ: గతంలో నాన్ వెజ్ తినేదాన్ని. కానీ ఆరోగ్యరీత్యా చాలా కాలం క్రితమే మానేశాను.
నాన్‌వెజ్‌లో మీరు బాగా చేసే వంటకం ఏది?
అన్నపూర్ణ: తినడం మానేశాక వాటి గురించి మర్చిపోయాను.
వెజిటేరియన్‌లో...
అన్నపూర్ణ: పప్పులే! పప్పు కంటె మించింది ఈ ప్రపంచంలో ఇంకేముంది! పప్పులో ఏ కాయగూర వేసినా ఇష్టంగా తింటాను. ఇందులో కావలసినన్ని మాంసకృత్తులు ఉంటాయి. మా ఇంటికి ఎవరొచ్చినా అదే వండి పెడతాను. (నవ్వుతూ...) కోళ్లూ, మేకలూ మా ఇంటి చుట్టూ తిరగవు.
అసలు మీరు బాగా ఇష్టంగా ఏవేం తింటారు?
అన్నపూర్ణ: దోసకాయ పప్పు, దోసకాయ - వంకాయ పచ్చడి, బెండకాయ వేపుడు... ఇలా సాత్వికంగా ఉండేవన్నీ ఇష్టంగా తింటాను. అన్నట్లు, నాకు పులిహోర అంటే చాలా చాలా ఇష్టం.
ఇప్పుడు కూడా మీరే వంట చేసుకుంటున్నారా!
అన్నపూర్ణ: ప్రస్తుతం పనేం లేదు కదా! వంటలు చేసుకోవడమే పని. ఆ మాటకొస్తే... మనం తినేవి మనం చేసుకోవడమే మంచిది.
మీ వంటను ఎవరైనా మెచ్చుకున్నారా!
అన్నపూర్ణ: ఎవరు మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా నా వంటను నేను మెచ్చుకుంటాను. మనం మెచ్చుకుని తినేలా ఉందంటే వంట బాగా వచ్చినట్లే కదా...
మీరు 40 సంవత్సరాలుగా సినీ రంగంలో ఉన్నారు కదా! ఎప్పుడైనా ఎవరికైనా చేసి పెట్టారా...
అన్నపూర్ణ: (నవ్వుతూ...) ఇప్పటివాళ్ళలో శాకాహారం ఎవరు తింటున్నారండీ? ఎక్కువగా నాన్‌వెజే తింటారు. మరి, నేనేమో నాన్‌వెజ్ చేయను.
కొత్తగా చాలా స్వీట్స్ వస్తున్నాయి కదా...
అన్నపూర్ణ: నేనింకా పాతకాలంలోనే ఉన్నాను. లడ్డు, రవ్వ లడ్డు, తొక్కుడు లడ్డు, అరిసెలు, బూరెలు, కొబ్బరి బూరెలు, బొబ్బట్లు, పూర్ణాలు... ఇవన్నీ ఇష్టంగా తింటాను.
పండగలకు ఏం చేస్తారు...
అన్నపూర్ణ: ఒక్కో పండుగకు ఒక్కో వంటకం తప్పనిసరి కదా! దసరాల్లో... అమ్మవారికి తప్పకుండా పూర్ణాలు నైవేద్యం పెట్టాలి. సంక్రాంతికంటారా... తలకిందులుగా తపస్సు చేసినా అరిసెలు చేయక తప్పదు. ఇక, ఇంటికి అల్లుడొచ్చినప్పుడు అందరూ నాన్ వెజ్ చేస్తారు. కానీ నేను మాత్రం గారెలే చేస్తాను. ఇంకా... సున్నుండలు. అవి తింటే బలమే కాదు, ఒంటికి చలవ కూడా!
మీరు చెప్పే నాలుగు మంచి మాటలు...
అన్నపూర్ణ: మనిషి ఎప్పుడూ కాళ్లతోటి నడుస్తాడు. అదీ భూమి మీదే నడుస్తాడు. అంతేకానీ తలతో నడవలేడు కదా! అలాగే, మన వంటలూ, మన బంధుత్వాలూ ఎన్నటికీ మారకూడదు! వంటలైనా, బంధుత్వాలైనా.. సంక్లిష్టత లేకుండా, ఎంత సింపుల్‌గా ఉంటే అంత కమ్మగా ఉంటాయి.
- సంభాషణ: డా. వైజయంతి
మామిడికాయ పప్పు
కావలసినవి:
కందిపప్పు - కప్పు; మామిడికాయ - 1; పచ్చి మిర్చి - 4; ఎండు మిర్చి - 4; ఇంగువ - పావు టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి); ఉల్లి తరుగు - పావు కప్పు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; కారం - టీ స్పూను
తయారి:
ముందుగా మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి మునగకాడను ముక్కలు చేయాలి
కందిపప్పుకి తగినంత నీరు చేర్చి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి
కరివేపాకు వేసి వేగాక, మామిడికాయ ముక్కలు, మునగకాడ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి
ఉడికించిన పప్పు జత చేసి బాగా కలపాలి
పసుపు, కారం వేసి మరో మారు కలిపి కొత్తిమీర చల్లి దించేయాలి.
ముక్కల పులుసు
కావలసినవి:
కూరగాయ ముక్కలు - 3 కప్పులు (బెండకాయలు, టొమాటో, మునగకాడ, సొరకాయ, ఉల్లిపాయలు, క్యారట్, ముల్లంగి, దోస, తోటకూర...); చింతపండు - పెద్ద నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి); ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; రసం పొడి - టీ స్పూను; ఎండు మిర్చి - 5; పచ్చి మిర్చి - 5 (మధ్యకు పొడవుగా కట్ చేయాలి); ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట; కరివేపాకు - 2 రెమ్మలు
తయారి:
ముందుగా అన్ని కూరగాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు, నీళ్లు జత చేసి ఉడికించాలి
చింతపండు రసం వేసి మరిగించాలి
చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి వేయించి, మరుగుతున్న పులుసులో వే యాలి
బెల్లం పొడి వేసి మరోమారు కలపాలి
చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లలో బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న పులుసులో వే సి మరిగించాలి
కొత్తిమీర, కరివేపాకు, రసం పొడి, పసుపు వేసి బాగా కలిపి దించేయాలి.
చేమదుంపల పులుసు కూర
కావలసినవి:
చేమదుంపలు - అర కేజీ; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 10 (మధ్యకు నిలువుగా కట్ చేయాలి); చింతపండు పులుసు - 5 టేబుల్ స్పూన్లు (చింతపండు నానబెట్టి పులుసు చిక్కగా తీయాలి); ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 6; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; మెంతి పొడి - పావు టీ స్పూను
తయారి:
చేమదుంపలను కుకర్‌లో ఉడికించి, తీసి చల్లారాక తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చి మిర్చి ముక్కలు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
చింతపండు పులుసు, ఉప్పు, కారం, బెల్లం పొడి వేసి ఉడికించాలి
చేమదుంప ముక్కలు వేసి బాగా కలిపి సుమారు పది నిమిషాలు ఉంచాలి
మెంతి పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.
చిక్కుడుకాయ తీపికూర
కావలసినవి:
చిక్కుడు కాయలు - పావు కేజీ; ఇంగువ - కొద్దిగా; ఎండు మిర్చి - 6; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; శన గపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; చింతపండు గుజ్జు - అర టీ స్పూను; బెల్లం పొడి - టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; కరివేపాకు - రెండు రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా
తయారి:
ముందుగా చిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించాలి
కరివేపాకు వేసి వేగాక చిక్కుడుకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత ఉంచాలి
చిక్కుడుకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం పొడి, బియ్యప్పిండి వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి దించేయాలి.
దొండకాయ - కొబ్బరి కారం వేపుడు
కావలసినవి:
దొండకాయలు - పావు కేజీ; ఎండుకొబ్బరి పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీస్పూను; ఆవాలు - అర టీ స్పూను; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించాలి); శనగపప్పు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారి:
దొండకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు చేయాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి
కరివేపాకు వేసి కొద్దిగా వేయించిన తర్వాత, దొండకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, రెండు నిమిషాలయ్యాక మూత ఉంచి, ముక్కలు మెత్తబడేవరకు సుమారు పావు గంట సేపు ఉడికించాలి
మూత తీసి, కారం, కొబ్బరి పొడి, పల్లీలు వేసి బాగా కలిపి దించేయాలి.
మన వంటలూ... మన బంధుత్వాలూ ఎంత సింపుల్‌గా ఉంటే అంత కమ్మగా ఉంటాయి!
Published Fri, Aug 22 2014 10:25 PM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement
Advertisement