నా వయస్సు 33 సం‘‘లు. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక ఏడాది నుంచి పూర్తిగా మానేశాను. మాంసాహారం అంటే జంతువధ అని, వాటిని చంపడం, రక్తపాతం లాంటి దృశ్యాలు నా మనసులోకి పదే పదే రావడం వాటిని తప్పించడానికి నేను తరచు చేతులు కడగడం ఇల్లంతా శుభ్రం చేయడం, భర్తను పిల్లలను అనవసరంగా కోపగించుకోవడం వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు. దయచేసి మీరేదైనా మార్గం చెప్పండి! – ఎ. పార్వతి,హైదరాబాద్
జంతువధ గురించి ఆలోచించి, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదే. అయితే మీ ఇంట్లో మాంసాహారం వండినప్పుడు, జంతువధ, రక్తపాతం లాంటి దృశ్యాలు మీ మదిలో మెదిలి, వీటి నుండి బయట పడేందుకు, చేతులు అతిగా కడగడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇదంతా పాపంగా భావిస్తూ, ప్రార్థనలు చేస్తూ, మనోవేదనకు గురి కావడం... ఇవన్నీ ‘ఓసీడీ’ అనే ఒక మానసిక వ్యాధి లక్షణాలు. మెదడులోని కొన్ని రసాయనిక పదార్థాల సమతుల్యం లో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి మానసిక రుగ్మత వస్తుంది. ఇదేదో మీ బలహీనత గానీ, తప్పు గానీ కానే కాదు. అలా అని మీరు బాధపడవద్దు.
శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయని గుర్తించండి. ఈ ఒ.సి.డి జబ్బును పూర్తిగా నయం చేసేందుకు మంచి ఔషధాలున్నాయి. వాటితోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్, ‘ఆర్.టి.ఎమ్.ఎస్’అనే ప్రత్యేక అధునాతన పరికరాలతో చికిత్స చేసి, మీ బాధ నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తులను చేయవచ్చు. మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను వెంటనే కలవండి. ఆల్ ది బెస్ట్.
– డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment