obsessive compulsive disorder
-
అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్!
నా వయస్సు 33 సం‘‘లు. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక ఏడాది నుంచి పూర్తిగా మానేశాను. మాంసాహారం అంటే జంతువధ అని, వాటిని చంపడం, రక్తపాతం లాంటి దృశ్యాలు నా మనసులోకి పదే పదే రావడం వాటిని తప్పించడానికి నేను తరచు చేతులు కడగడం ఇల్లంతా శుభ్రం చేయడం, భర్తను పిల్లలను అనవసరంగా కోపగించుకోవడం వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు. దయచేసి మీరేదైనా మార్గం చెప్పండి! – ఎ. పార్వతి,హైదరాబాద్జంతువధ గురించి ఆలోచించి, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదే. అయితే మీ ఇంట్లో మాంసాహారం వండినప్పుడు, జంతువధ, రక్తపాతం లాంటి దృశ్యాలు మీ మదిలో మెదిలి, వీటి నుండి బయట పడేందుకు, చేతులు అతిగా కడగడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇదంతా పాపంగా భావిస్తూ, ప్రార్థనలు చేస్తూ, మనోవేదనకు గురి కావడం... ఇవన్నీ ‘ఓసీడీ’ అనే ఒక మానసిక వ్యాధి లక్షణాలు. మెదడులోని కొన్ని రసాయనిక పదార్థాల సమతుల్యం లో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి మానసిక రుగ్మత వస్తుంది. ఇదేదో మీ బలహీనత గానీ, తప్పు గానీ కానే కాదు. అలా అని మీరు బాధపడవద్దు.శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయని గుర్తించండి. ఈ ఒ.సి.డి జబ్బును పూర్తిగా నయం చేసేందుకు మంచి ఔషధాలున్నాయి. వాటితోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్, ‘ఆర్.టి.ఎమ్.ఎస్’అనే ప్రత్యేక అధునాతన పరికరాలతో చికిత్స చేసి, మీ బాధ నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తులను చేయవచ్చు. మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను వెంటనే కలవండి. ఆల్ ది బెస్ట్.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Neha Bhasin: ఇదీ నా వేదన..!
‘నేను ప్రీ–మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్, తీవ్రమైన కండరాల నొప్పితో బాధించే ఫైబ్రోమయాల్జియా రుగ్మతలతో బాధ పడుతున్నాను. నా వేదన మీకు చైతన్యం కలిగించాలి’ అంది నేహా భాసిన్. బాలీవుడ్లో ఎన్నో ఎన్నో హిట్ ట్రాక్స్ పాడిన గాయని నేహా ఇటీవల ఇన్‌స్టాలో రాసుకున్న పోస్ట్ స్త్రీల ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలియచేస్తోంది. ఆమె ఏం రాసింది?‘‘నేను చెప్పాల్సింది చాలా ఉంది. అయితే ఎక్కణ్ణుంచి మొదలుపెట్టి, ఎక్కడ ముగించాలో తెలియడం లేదు. నేను అనుభవిస్తున్న నరకాన్ని ఎలా ఏకరువు పెట్టాలో అర్థం కావడం లేదు. నా హెల్త్ రిపోర్టుల మీద రెండేళ్ల నుంచి అని రాసి ఉన్నప్పటికీ ఈ వేదనాపర్వం నా 20వ ఏటి నుంచి కొనసాగుతోంది. ఒంటరిగా ఉండకుండా నలుగురితో... అందునా నాకిష్టమైన, నేను ప్రేమించే వ్యక్తులను కలుస్తూ, పత్రికలకు వ్యాసాలు రాస్తూ నా ఇబ్బందులను ఎంతోకొంత అధిగమించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పటికీ నెలనెలా వేధించే నా ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ నన్ను కొత్త చీకట్లలోకి విసిరేస్తోంది. ‘ఇది నీ వైఫల్యమేనా?’ అంటూ నా అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ నన్ను వెక్కిరిస్తూ ప్రశ్నిస్తోంది. ఫైబ్రోమయాల్జియా అంటూ డాక్టర్లు చెబుతున్న ఆ సమస్య నాలో వేదనాగ్ని జ్వాలల్ని రగిలిస్తోంది. ఏళ్ల తరబడి నేను వాటిని లెక్కచేయకుండా నిన్నమొన్నటివరకూ ప్రదర్శనలిస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు నా డాక్టర్ ‘ఇంక మీరేమీ చేయకుండి. హాయిగా విశ్రాంతి తీసుకోండి’ అంటున్నాడు.నేనిలా విశ్రాంతి తీసుకోవడం నాకే నచ్చడం లేదు. దశాబ్దాల తరబడి లెక్కచేయకుండా నెట్టుకొస్తున్న నా వేదనలు నన్ను బాధిస్తున్నప్పటికీ... నా కలలను శ్వాసిస్తూ, నా కలలకు రూపం కల్పించే సంకల్పంతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను. ఇవ్వాళ నేనో వృద్ధుణ్ణి చూశాను. ఒక చేత్తో ఓ పెద్ద బరువైన పెట్టెను మోస్తూ, మరో చేతిలో గొడుగుతో కుస్తీపడుతూ ధారాపాతంగా కురుస్తున్న వర్షాన్ని లెక్కచేయకుండా అతికష్టమ్మీద నా వ్యాయామశాల సోపానాల చివరి మెట్టును అధిగమించాక నన్ను చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. అతడి ఆ నవ్వు ఎలా ఉందంటే... ‘ఈ వయసుకు తీవ్రమైన నొప్పులతో నేనూ బాధపడుతున్నా. వేదనా తరంగాల దొంతరల్లో ఈదులాడుతున్నా. నేనే ఇలా ఉన్నానంటే... నీకింకా ఏమీ ముగిసిపోలేదు. జీవితానికి కృతజ్ఞురాలివై ధైర్యంగా ఉండు. నీకంటే ఎక్కువ బాధపడుతున్నవారు ఇంకా ఎందరో ఉన్నారు’ అంటూ ఉద్బోధిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.అందుకే... నా బాధలూ, నా వెతలూ, నా ఆవేదనలన్నీ నా జీవితాన్ని సవాల్ చేస్తున్నప్పుడు మీ ప్రేమతో పాటు నేను రాసుకుంటున్న ఈ కొన్ని మాటల్ని సాంత్వననిచ్చే ఓ మలాముగా పులుముకుంటున్నా’’ అంటూ ముగించింది నేహా.ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్..కొందరు యువతుల్లో నెలసరి ముందుగా తీవ్రమైన నొప్పి రావడాన్ని ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) అంటారు. అందులోని అత్యంత బాధకరమైన ఒక రకం ‘ప్రీ–మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్’. కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలతో డాక్టర్లు దీనికి చికిత్స అందిస్తుంటారు.అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్..పూర్తి పర్ఫెక్షన్ రాలేదంటూ చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ, ఎంతకీ సంతృప్తి లేక దాన్నే కొనసాగిస్తూ విసుగు కలిగించే మానసిక వ్యాధి ఇది. దీని బారిన పడితే ఆలోచనలూ, పనులూ అలా అనియంత్రితంగా సాగుతూ ఎంతకీ పని పూర్తి చేయనివ్వక బాధిస్తుంటాయి. దీనికి మానసిక చికిత్స అవసరం.ఫైబ్రోమయాల్జియా..కండరాల, ఎముకల నొప్పితో తీవ్రమైన ఒళ్లు నొప్పులతో, స్పర్శ సున్నితంగా మారి ఒంటిని ముట్టుకోనివ్వనంతగా తీవ్రమైన వేదన కలిగిస్తుందిది. మానసిక ఆందోళనలు, యాంగై్జటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ వంటి సమస్యల కారణంగా మరింత పెచ్చరిల్లే ఈ నొప్పులకు సరైన చికిత్స అవసరం. -
OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి..
Obsessive-Compulsive Disorder: సునీత తెలుగు టీచర్. సంప్రదాయ కుటుంబం. ప్రతి పనీ పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచీ అలవాటు. అయితే కరోనా తర్వాత ఆమె ప్రవర్తన విపరీతంగా మారింది. కరోనా లేదని తెలిసినా శానిటైజర్ వాడకం ఆపలేదు. కూరగాయలు, పండ్లు, సరుకులు.. ఏవి తీసుకువచ్చినా శానిటైజ్ చేయాల్సిందే. స్నానానికి వెళ్లిందంటే గంట పాటు బయటకు రాదు. ఏమాత్రం అశుభ్రంగా ఉన్నా ఏదైనా వైరస్ వస్తుందేమోనని విపరీతమైన భయం. గిన్నెలు పదేపదే కడుగుతూనే ఉంటుంది. హాల్లో వస్తువులు ఏ మాత్రం ఆర్డర్ తప్పినా తట్టుకోలేదు. పిల్లలపై అరిచేస్తుంది. ‘ఏంటమ్మా నీ చాదస్తం?’ అని పిల్లలంటున్నా పట్టించుకోదు. ఆయనది ఇంకో తీరు సునీత భర్త సుకుమార్‌ది మరో సమస్య. అతనికీ మధ్య ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఆఖరుకు గుడికి వెళ్లి విగ్రహాల్ని చూసినా లైంగికపరమైన ఆలోచనలు వస్తున్నాయి. తల్లి, చెల్లి గురించి కూడా అలాంటి ఆలోచనలు వస్తుండటంతో ఎవరికీ చెప్పలేక, చెప్పుకోలేక తనలో తానే మథన పడిపోతున్నాడు. తాను తప్పుడువాడిని కనుకే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయని అపరాధభావంతో కుంగిపోతున్నాడు. ఒక్కోసారి బలవన్మరణ ఆలోచనలు అతని మనసును కమ్మేస్తున్నాయి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ సునీత, సుకుమార్ ఇద్దరిదీ ఒకటే మానసిక సమస్య.. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ). అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం (అబ్సెషన్స్), ఒకే పని పదేపదే చేయడాన్ని నియంత్రించుకోలేకపోవడం (కంపల్సివ్) ఆ వ్యాధి లక్షణాలు. కొందరిలో అబ్సెషన్ లేదా కంపల్సివ్ లక్షణాలుంటే, మరికొందరిలో రెండూ ఉంటాయి. కానీ అది ఒక మానసిక సమస్య అనే విషయం చాలామందికి తెలియక తమలో తామే మథనపడుతూ ఉంటారు. ఈ రుగ్మత వల్ల సమయం విపరీతంగా వృథా అవుతుంది, జీవితం దుర్భరంగా మారుతుంది. ఓసీడీ లక్షణాలు ►అనుచిత, అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం. వీటితో డిస్టర్బింగ్‌గా ఉండడం. ►తమ గురించి తాము అతిగా ఆందోళన చెందడం, లేదా ఇతరుల గురించి వారికేదైనా ఆపద వస్తుందేమోనని భయపడడం. ►అన్నీ పరిశుభ్రంగా ఉండాలనుకోవడం. వస్తువులు మురికిగా ఉన్నాయనో, కల్తీ అయ్యాయనో ఆందోళనచెందడం లేదా వాటిని పదేపదే శుభ్రపరచుకోవడం ►తాళం వేశామా లేదా? అలారం పెట్టామా? గ్యాస్ ఆఫ్ చేశామా లేదా? అని పదేపదే చెక్ చేయడం. ►అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం, అందుకోసం పదేపదే సర్దడం. ►కొన్ని పనులను ప్రతిసారి నిర్దిష్టమైన పాటర్న్‌లో చేయడం లేదా పదేపదే చేయడం ►అవతలి వ్యక్తి తాను చెప్పింది వింటున్నారో లేదో అన్న అనుమానంతో చెప్పిన విషయాన్ని పదేపదే చెప్పడం ►ముట్టుకుంటే క్రిములు వస్తాయనే భయంతో ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఈ లక్షణాలు కనపడగానే మీకు మాత్రమే ఈ సమస్య వచ్చిందని బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అంతర్జాతీయ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెకమ్, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకోణ్, ప్రియాంక చోప్రా కూడా ఈ రుగ్మత నుంచి బయటపడిన వారే. జనాభాలో రెండు శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. మహిళల్లో, పురుషుల్లో దాదాపు సమానంగా ఉంటుంది. అయితే 10–25 శాతం మందికి తమకు సమస్య ఉందనే విషయమే తెలియదు. 15శాతం మంది బలవన్మరణానికి ప్రయత్నించవచ్చు. ఎందుకొస్తుంది? ఓసీడీకి జన్యుపరమైన, పర్యావరణ కారకాలు రెండూ ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఓసీడీ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మెదడులోని నాడీకణాల మధ్య సమాచార మార్పిడికి సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్‌మీటర్ అవసరం. దాని పరిమాణం తగ్గితే మతిమరపు, ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. అలాగే బాల్యంలో భౌతిక, లైంగిక దాడికి గురైనప్పుడు, ప్రమాదం బారినపడ్డప్పుడు, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక సమస్యలున్నప్పుడు, బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. కరోనా వల్ల ఈ రుగ్మత బారినపడ్డ వారి సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. ఏం చేయాలి? ఓసీడీ లక్షణాలు కనిపించగానే ఎవరికి వారు తమ ఆలోచనలను ఆపేసేందుకు, అణచివేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ అవి మరింత బలంగా వస్తాయి. అలాగే పదేపదే చేస్తున్న పనులను బలవంతంగా ఆపేసేందుకు ప్రయత్నిస్తారు. దానివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. ఆ ఆందోళన తగ్గేందుకు మైండ్‌ఫుల్‌నెస్, వ్యాయామం లాంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే వెంటనే సైకాలజిస్టును కలవండి. ఆయన డయాగ్నసిస్ ద్వారా మీ రుగ్మతను నిర్ధారిస్తారు. మీ భయాలు, ఆందోళనలు తగ్గించేందుకు సైకోథెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. మీ అవాంఛిత ఆలోచనలు, అసహజ ప్రవర్తనకు మూలమైన విశ్వాసాలను మార్చుకునేందుకు సహాయపడతారు. ఎక్స్పోజర్, రెస్పాన్స్ ప్రివెన్షన్ ద్వారా మీ అలవాట్లను మార్చేందుకు సహాయపడతారు. సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్‌కు రిఫర్ చేస్తారు. మెదడులో తగ్గిన సెరటోనిన్ స్థాయిలను పెంచడానికి ఆయన మందులు సూచిస్తారు. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: Toxic Positivity: ‘పాజిటివిటీ పిచ్చి’ పడితే అంతే సంగతులు! అతి సానుకూలతతో అనర్థాలే! మీలో ఈ లక్షణాలుంటే వెంటనే.. Skin Cancer: ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు ఉన్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. -
అలాంటి ప్రశ్న ఎలా అడుగుతారు...? జర్నలిస్ట్‌పై రెజీనా ఫైర్
జర్నలిస్ట్‌పై హీరోయిన్ రెజీనా ఫైర్ అయింది. అందర్ని ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా? అమ్మాయిల్ని గొప్పగా చూపిస్తూ సినిమా తీస్తే మీరు ఏంటి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని సీరియస్ అయింది. వివరాల్లోకి వెళితే.. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు, సునీత తాటి, హ్యూన్యు థామస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. (చదవండి: ప్రతి వారం ఓ బాహుబలి రాదు) ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ విలేకరి.. ‘మేడమ్ మీరు ఈ చిత్రంలో ఓసీడీ ఉన్నట్లు నటించారు కదా? నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న రెజీనాను ఇబ్బందికి గురిచేసింది. ‘మీరు అందర్ని ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా? సినిమాలో మేము కేవలం నటిస్తామంతే. పాత్ర డిమాండ్ మేరకు మేము అలా చేస్తాం. అంత మాత్రాన నాకు ఓసీడీ ఉంటుందా? అమ్మాయిల్ని గొప్పగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాంటిది మీరు నా పాత్ర, ఓడీసీ గురించి అడుగుతారేంటి? అసలు ఓసీడీ అంటే ఏంటో మీకు తెలుసా? వ్యక్తిగతంగా నేను శుభ్రతను ఇష్టపడతాను . ఓసీడీ లాంటి సైకలాజికల్ డిజార్డర్స్ నాకు లేవు. ఓడీసీ ఉన్న అమ్మాయి పాత్రలో నటించానంతే’ అని రెజీనా బదులిచ్చింది. అయితే సదరు విలేకరు మాత్రం తాను అడిగిన ఉద్దేశం వేరని వివరణ ఇచ్చాడు. ‘కరోనా తర్వాత అందరూ పరిశుభ్రత ఎక్కువగా పాటిస్తున్నారు కదా..మీరు కూడా అలానే ఉండడానికి ఇష్టపడతారా? అనేది నా ప్రశ్న ఉద్దేశం’అని చెప్పడంతో రెజీనా నవ్వుతూ.. ‘నేను పరిశుభ్రంగానే ఉంటాను..అందరూ అలానే ఉండాలి’అని బదులిచ్చారు. -
OCD Wife: నావల్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి!
A software professional in Bengaluru wants divorce from his wife over her obsession with cleanliness: ఈ ఇల్లాలు శుభ్రతకు బ్రాండ్ అంబాసిడరయ్యి ఉంటుంది. భర్త ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌ను చక్కగా వాషింగ్ పౌడర్ వేసిమరీ శుభ్రంగా కడిగింది. పాపం సాఫ్ట్వేర్ భర్త విసిగి వేసారిపోయి ఇక నా వళ్లకాదని విడాకులిప్పించమని పోలీసులను ప్రాధేయపడిన సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. బెంగుళూరులోని ఆర్టీ నగర్ కాలనీకి చెందిన రాహుల్, సుమనా (పేర్లు మార్చాం) 2009లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వివాహానంతరం వృత్తిరిత్యా ఇంగ్లాండ్, యూకేకు వెళ్లాడు. తిరిగొచ్చేనాటికి వాళ్లు కాపురముంటున్న ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది. రాహుల్ చూసి చాలా సంతోషించాడు కూడా! సరదాగా సాగిపోతున్నవీరి కాపురంలో రెండేళ్ల తర్వాత మొదటి సంతానం కలిగింది. ఇక అప్పటి నుంచి కాపురంలో కలతలు మొదలయ్యాయి. అప్పుడే ఆమెలో ఉన్న అబ్సెసీవ్ కంపల్సీవ్ డిజార్డర్ (ఓసీడీ) భయటపడింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన సుమనా అతిశుభ్రత అలవాట్లు భర్తను విపరీతంగా విసిగించాయి. ప్రతిరోజూ ఆఫీస్ నుంచి రాగానే బూట్లు, దుస్తులు, మొబైల్ ఫోన్లను శుభ్రం చేయమని భర్తను బలవంతం చేసేది. ఈ జంట తరచూ ఫామిలీ కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండేవారు. రెండో సంతానం కలిగాక పరిస్థితికాస్త మెరుగుపడినా కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఆమె ఓసీడి సమస్య వారికాపురంలో మరోమారూ కలతలు రేపింది. ఇంట్లో ప్రతివస్తువును శానిటైజ్ చేయడం మొదలు పెట్టింది. లాక్డౌన్లో భర్త వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో అతని ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను డిజర్జెంట్‌తో శుభ్రం చేసింది. అంతేకాదు రోజుకు ఆరు కంటే ఎక్కువ సార్లు స్నానంచేసేదట, స్నానం సబ్బును శుభ్రం చేసేందుకు మరో మరో ప్రత్యేకమైన సబ్బును కూడా వాడేదని రిపోర్టులో భర్త పేర్కొన్నాడు. చదవండి: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా? ఆశ్యర్యమేమంటే.. భర్త తల్లి (అత్తగారు) మరణిస్తే భర్త, పిల్లలను ఏకంగా 30 రోజులపాటు ఇంటిబయటే ఉంచి, ప్రతిరోజూ ఇంటిని శుభ్రంచేస్తూ ఉండేది. ఐతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల్ని కూడా యూనీఫాం, బూట్లు, బ్యాక్ ప్రతిరోజూ శుభ్రం చేయవల్సిందిగా పోరు పెట్టడంతో తాజాగా ఈ విషయం వెలుగుచూసిందని కౌన్సిలర్ బీఎస్ సరస్వతి చెప్పారు. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన టెక్కీ తన పిల్లలతో పాటు తల్లిదండ్రుల ఇంటికి మారాడు. అతని భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని పరిహార్‌కు బదిలీ చేశారు. నవంబర్‌లో మూడు సార్లు కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఫలితంలేకపోయింది. సుమనాకు ఓసీడీ ఉందని, తన ప్రవర్తనను సరిచేసుకోమని కౌన్సెలర్ ఆమెకు తెల్పగా.. ‘ఇది చాలా సాధారణం నాకు అలాంటిదేమీ లేదని' కొట్టిపారేసింది. అంతేకాదు భర్త తనను వదిలించుకొని మరో వివాహం చేసుకోవలనుకుంటున్నట్లు, అతనిపై వేధింపుల ఫిర్యాదును కూడా నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. చదవండి: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా? -
చప్పుళ్లతో...ఒళ్లు మండిపోతోందా? అదీ ఓ జబ్బే!!
కొన్ని శబ్దాలు ఒళ్లుమండిపోయేలా చేస్తాయి. సర్రున చిర్రెత్తిస్తాయి. మనకు తరచూ అనుభవంలోకి వచ్చే ఓ ఉదాహరణ చెప్పుకుందాం... దగ్గర్లో రంపం గరగరలాడుతున్న శబ్దమేదో వినగానే... అదేదో మన పళ్ల మీద గీరుతున్నట్లుగానే అనిపిస్తుంటుంది. కొందరు గుటాగుటా చప్పుళ్లొచ్చేలా తింటుంటే... పక్కనున్నవారికి ఒళ్లుమండిపోతుంటుంది. టూత్‌బ్రష్ నోట్లో వేసుకుని దాన్ని పరపరలాడిస్తున్న శబ్దం వింటే ఇంకొందరికి సర్రున ఒళ్లు మండిపోతుంది. ఇలాంటి శబ్దాల వల్ల ఒళ్లు మండిపోతుంటుంది. అయితే కొందరిలో ఈ జబ్బు స్థాయికి చేరుకుంటుంది. ఆ జబ్బు గురించి, దానికి చికిత్సల గురించి తెలుసుకుందాం. కేవలం అలాంటి శబ్దాలే కాదు... చప్పుడొచ్చేలా పెద్దగా గొంతు సవరించుకోవడం, చప్పరిస్తూ తింటుండటం, పెదవులు నాక్కోవడం, పెద్దగా విజిల్ వేయడం వంటి శబ్దాలు అదేపనిగా చాలాసేపు వినబడుతుంటే చాలామందికి కోపం తారస్థాయికి చేరుకుంటుంది. ఇక మరికొందరికైతే... ఒళ్లువిరుచుకుంటూ నోటితో గట్టిగా శబ్దం చేయడం, భారీగా ఆవలించడం, టైప్రైటర్ల టకటకలూ, నవ్వుల ఇకఇకలతో నిగ్రహం కోల్పోతారు. ఇక స్లిప్పర్స్ తో మెట్లమీదో లేక గచ్చుమీదో టపటపలాడిస్తున్న చప్పుడు వింటే చాలు ఆగ్రహం మిన్నంటుతుంది. ఇలా చప్పుళ్లను తట్టుకోలేని కండిషన్ ను ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’ అంటారు. వైద్యపరిభాషలో ‘మిసోఫోనియా’ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జబ్బు ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ (ఓసీడీ)కి దూరపు బంధువు వరసవుతుందని చెప్పవచ్చు!! మనందరిలో ఇలాంటి శబ్దాలకు కొంత ఇరిటేషన్ వంటి ఫీలింగ్ కలగడం చాలావరకు సహజమే. అయితే తీవ్రమైన కోపానికి గురయ్యేవారిలో... కొందరికి చెమటలు పట్టడం, కండరాలు టెన్షన్‌కు గురికావడం, గుండెదడ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఆ విముఖత సాధారణ స్థాయి నుంచి రుగ్మత స్థాయికి చేరుకుందని అర్థం. దీనికి చికిత్స కూడా ఉంది... ఇలాంటి సమస్యతో బాధపడేవారికి బిహేవియరల్ థెరపీతో చికిత్స అందిస్తారు. వారికి కొద్దిపాటి శబ్దం వచ్చే ఫ్యాన్ సౌండ్‌ను అలవాటు చేయడం దగ్గర్నుంచి క్రమంగా శబ్దాలను అలవరుస్తారు. అలా శబ్దాల తీవ్రతను పెంచుకుంటూ పోతారు. ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’కు ఇలాంటి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందన్నది నిపుణుల మాట చదవండి: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని.. -
కడిగితే పోదు
మహానుభావుడు సినిమాలో హీరో ఓసీడీతో బాధపడుతూ ప్రేక్షకులను కేరింతలు పెట్టిస్తాడు. కానీ నిజజీవితంలో ఇట్స్ నాట్ ఏ లాఫింగ్ మ్యాటర్. ఇంటికి తాళం వేసి మీరూ, నేనూ జేబులో తాళం వేసుకొని బయటకు వెళ్తాం, కానీ ఈ మహానుభావులు మాత్రం వీధి చివరికి వెళ్లి, మళ్లీ వచ్చి తాళం చెక్ చేస్తారు. ఆ తర్వాత సినిమాకు వెళ్లి మళ్లీ డౌట్ వస్తే ఇంట్రవెల్‌కు ముందే ఇంటికొచ్చి మళ్లీ చెక్ చేస్తారు. ఇదండీ... వీళ్ల సినిమా! కడిగిన చేతులే కడుగుతుంటారు... వేసిన తాళాలు చెక్ చేస్తుంటారు... కట్టేసిన గ్యాస్ సిలెండర్‌ను మాటిమాటికీ చూస్తుంటారు. ఈ సినిమాకు శుభం కార్డు వేయాలంటే ముందు ఈ జబ్బును కడిగేయాల్సిందే! ఈమధ్య లక్ష్మి ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటోంది. చేతులు పుస్తకానికి తగిలినా, ఎదుటివారి బట్టలకు తాకినా, ఎవరిదైనా ఫోన్ తగిలినా అవి మురికి అయిపోయాయనే భావన ఆమెలోకి వస్తోంది. వెంటనే సబ్బుతో చేతులు కడగటం మొదలుపెడుతోంది. మురికి అయిపోతానేమో ఆమెకు ఎంత ఉందంటే మూడేళ్ల కూతురిని కూడా ఆమె తాకడం లేదు. ఆ పాప తనను ముట్టుకున్నా మురికి అయినట్లుగా తలచి, చేతులూ, ఒళ్లూ కడుక్కుంటోంది. దాంతో ఇంట్లోవాళ్లందరూ లక్ష్మి ప్రవర్తన వల్ల బాధపడుతున్నారు. వాళ్ల ఇల్లు నరకమైపోయింది. ఈ నరకానికి కారణం ఒక జబ్బు. ఆ జబ్బుపేరే ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’. సంక్షిప్తంగా చెప్పాలంటే ఓసీడీ.ప్రతి వందమందిలో ఇద్దరుఓసీడీ అంతగా చదువుకోని వారిలోనూ ఎక్కువని అనే అపోహ ఉంది. కానీ బాగా తెలివైనవారిలోనూ, అన్నీ తెలిసినవారిలోనూ దీని బాధితులు ఉన్నారు. నిజానికి సాధారణ ఐక్యూ కంటే కాస్త ఎక్కువ ఐక్యూ ఉన్నవారిలోనే ఇది ఎక్కువ. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 2 నుంచి 3 శాతం ప్రజలు ఓసీడీతో బాధపడుతుంటారని అంచనా. సాధారణంగా ఈ వ్యాధి 18 ఏళ్ల వయసులో కనిపిస్తుంటుంది. అయితే వ్యాధికి గురైన 5 నుంచి 10 ఏళ్ల తర్వాతగానీ రోగులు, వారి కుటుంబ సభ్యులు డాక్టర్‌ను సంప్రదించడం లేదు. దాంతో జబ్బు ముదిరి చికిత్స కాస్త ఒకింత కష్టమవుతుంది. జబ్బు వచ్చాక ఎంత త్వరగా డాక్టర్‌ను సంప్రదిస్తే చికిత్స ప్రభావం అంత మెరుగ్గా ఉంటుంది. ఓసీడీ అంటే... ఓసీడీ అను సంక్షిప్త రూపంలో ‘ఓ’ అంటే అబ్సెషన్ అనే మాటకు సూచన. అబ్సెషన్ అంటే ఒక ఆలోచన మదిలో వచ్చాక అదే పనిగా అదే అదే రావడం. ఆ ఆలోచనను వదిలించుకోవాలని ఎంత ప్రయత్నపూర్వకంగా అనుకున్నా ఆగకుండా అదే రావడం. ఇలా మనం కోరుకోనిది పదే పదే మనసులో మెదులుతుండటంతో తీవ్ర అసౌకర్యం, ఒత్తిడి కలుగుతుంది. సీ అంటే కంపల్షన్. అంటే పదే పదే వచ్చే ఆలోచనలు ఒక పనిని పదే పదే చేసే పరిస్థితిని (కంపల్షన్ను) కల్పిస్తాయి. అది చాలా సమయాన్ని వృథా చేస్తుంది. ఎలా వస్తాయి ఆ ఆలోచనలు... ఈ రోగుల మనసులో ఏదో ఒక ఆలోచన మొలుస్తుంది. అది మనసును తొలిచేయడం మొదలవుతుంది. అది మనసుపై ఒకరకమైన ఒత్తిడిని, ఉద్విగ్న స్థితిని కలిగిస్తుంది. ఒక పనిచేస్తే ఆ ఉద్విగ్న స్థితి తొలగిపోయి, మనం మామూలవుతామని మన మనసుకు అనిపిస్తుంది. అంతే. ఆ ఉద్విగ్నతనూ, ఆ ఒత్తిడినీ తొలగించేందుకు ఆ పని చేస్తుంటారు. కానీ ఆ ఉద్విగ్నత తొలగిపోదు. పోతుందనే భావనతో మళ్లీ చేస్తారు. ఇలా ఒక పరంపర అదేపనిగా కొనసాగుతుండటంతో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అది ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. తాము చేస్తున్న పని ఎన్నో రకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతోందని గ్రహించాక కూడా తాము దాన్ని ఆపలేకపోవడంతో ఆ పనిచేస్తున్న వాళ్లలో తీవ్రమైన కోపం, నిరాశ, నిస్పృహ పెరుగుతుంటాయి. దాంతో ఆ జబ్బు రోగుల్లో తీవ్రమైన భయాన్నీ, ఆందోళనను కలిగిస్తుంది. లక్షణాలు... ఓసీడీ కడిగిన దాన్నే కడగటం అనే లక్షణంతో వ్యక్తమవుతుంటుంది. ఏమాత్రం మురికి లేదా చెత్త తగిలినా వీళ్లు కడుక్కుంటూనే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతులు, కాళ్లు కడుగుతూ బాత్రూమ్లోనే గడుపుతుంటారు. అలాగే తలుపులు, గోడలు, గదులు, కొన్ని వస్తువులనూ కడుగుతుంటారు. ఇటీవల ఈ జబ్బు వ్యక్తమయ్యే లక్షణాల జాబితా బాగా పెరుగుతోంది. వాటిలో కొన్ని... ∙ఎప్పటికీ చేయబోమనే పని పట్ల చేస్తామేమో అనే ఆందోళన : ఒక పని మనం ఎప్పటికీ చేయకపోయినా అది చేస్తామేమో అన్న ఆందోళన మనసును కుదిపేస్తుంటుంది. ఉదాహరణకు మనం దొంగతనం ఎప్పటికీ చేయం లేదా ఎవరనీ అవమానపరచబోం. కానీ ఆ పని చేస్తామేమో అని మనలో ఆందోళన కలుగుతుంది. ఏదైనా నేరం చేస్తామేమోననే బెంగ కొందరిలో వేధిస్తుంటుంది. న్యూస్పేపర్లలోని క్రైమ్ కాలమ్స్‌లో వచ్చే క్రైమ్ వార్తల్లో అవి తమ వల్ల కాదుగదా అని కూడా నిర్ధారణ చేసుకునేంత ఆందోళనతో ఉంటారు. ∙అంటుకుంటుందనే భయమే కంటామినేషన్ అబ్సెషన్ : అంటే దేనివల్లనైనా మనకు జబ్బు వస్తుందేమో అనే ఆలోచన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉదాహరణకు మనం చేసే మూత్రవిసర్జన, మలవిసర్జన, ఇంట్లోని అపరిశుభ్రత, ఎక్కడైనా కాస్త జిగురుగా ఉండే పదార్థాల వల్ల మనకు ఏదైనా హాని జరుగుతుందేమో, దాని వల్ల మనకు జబ్బులు వస్తాయేమో అన్న ఆలోచన అదేపనిగా వస్తూ ఆందోళనకు గురిచేస్తుంది. ∙సెక్స్‌పరమైన అబ్సెషన్ : మనం రాకూడదని కోరుకునే తరహా సెక్స్ ఆలోచనలు వచ్చి, మన ప్రమేయం లేకుండానే, ఎంతగా నియంత్రించుకుందామనుకున్నా ఆగకుండా అదేపనిగా వస్తుంటాయి. పనికిరాని వస్తువులను సేకరించి పెట్టుకోవడం : కొందరు ఏమాత్రం ఉపయోగం లేని వస్తువులను సేకరించి వాటిని దాచుకుంటూ ఉంటారు. అవి దేనికీ పనికిరావని తెలిసినా వాటిని వదిలేయలేరు. పర్ఫెక్షన్ కోసం తాపత్రయం: కొందరు తాము ఆఫీస్‌లో లేదా ఇతరత్రా చేసే పనుల్లో పూర్తి స్థాయి పర్ఫెక్షన్ ఇంకా రాలేదనే అభిప్రాయంతో, దానిలో మరింత పర్ఫెక్షన్ కోసం సమయం వృథా చేస్తుంటారు. ∙జబ్బు ఉందేమోనన్న అపోహ : కొందరిలో తమకు ఏదైనా జబ్బు ఉందేమో, తమ శరీర అవయవాల్లో ఏదైనా లోపం ఉందేమో అనే అనుమానం ఉంటుంది. ఉదాహరణకు తమకు క్యాన్సర్ లేదా ఎయిడ్స్ వంటి జబ్బులు సోకాయేమోనని అనుమానపడుతుంటారు. ఇక దాంతో వాళ్లు అదేపనిగా డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. జబ్బు లేదనే రిపోర్టు వచ్చినా పదే పదే ఆ వైద్య పరీక్షలే మళ్లీ మళ్లీ చేయిస్తుంటారు. ఇలా డబ్బూ, సమయం వృథా చేసుకుంటారు. దీన్ని సొమాటిక్ అబ్సెషన్ అంటారు. పిల్లలలో: పిల్లలు కొంతమందిని చాలా ఎక్కువగా అభిమానిస్తుంటారు. అలా తాము అమితంగా గౌరవించే పెద్దలకూ, తమ తల్లిదండ్రులకూ తామెప్పుడైనా హాని చేస్తామేమో, వాళ్ల గౌరవానికి తలవంపులు తెస్తామేమో అన్న ఆందోళన వాళ్లలో ఉంటుంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌కు లోనైనవారు తమ ఆలోచనలను నియంత్రించుకోడానికి లేదా తగ్గించుకోడానికి చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. మనసులో అంకెలు లెక్కపెట్టుకోవడం, ఇతరుల చేత ఒక విషయాన్ని పదే పదే చెప్పించుకోవడం, ప్రార్థనలు చేయడం వంటివి అందులో ముఖ్యమైనవి. అలా చేయడం వల్ల తమకు జరగబోయే చెడు జరగదని వాళ్ల నమ్మకం. అలాగే తమ వస్తువులను పలుమార్లు తాకడం, లెక్కపెట్టుకోవడం వంటి పనులు తాము చేస్తుండటంతో పాటు ఇతరులను కూడా అలాగే చేయమని ఒత్తిడి చేస్తుంటారు. ఓసీడీ వల్ల చాలామందిలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. తమపై తమకు నమ్మకం తగ్గిపోతుంది. రోజువారీ దినచర్యల్లో సమయం వృథాకావడం పెరిగి, జీవనం అస్తవ్యస్తమవుతుంది. అది పనిలోని నాణ్యతనూ, డబ్బునూ, మానవ సంబంధాలనూ దెబ్బతీస్తుంది. నిర్ధారణ : ఓసీడీ జబ్బును లక్షణాల ద్వారానూ, రోగి పరిస్థితిని బంధువులు, స్నేహితుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక వైద్యపరంగా డీఎస్ఎమ్–5 /ఐసీడీ 10 క్రైటీరియా ద్వారా దీన్ని నిర్ధారణ చేయవచ్చు. వై–బాక్స్ స్కేల్ మీద దీని తీవ్రతను తెలుసుకుంటారు. చికిత్స : ఓసీడీ లక్షణాలు కనిపించినప్పుడు అవి ముదిరే వరకు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే, ఫలితాలు అంత బాగా ఉంటాయి. మందులు ప్రారంభించిన వెంటనే మార్పు కనిపించదు. అవి మొదలుపెట్టిన 6 నుంచి 12 వారాల తర్వాత మార్పు కనిపిస్తుంటుంది. ఒకసారి మందులు వాడక మళ్లీ మానేయకూడదు. అలా చేస్తే వ్యాధి తిరగబెట్టడంతో పాటు దాని తీవ్రత మరింత పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఓసీడీకి సంబంధించిన ఆలోచనలు వస్తుంటే వాళ్లను నిర్భయంగా చెప్పమని అడగాలి. అలాగే బాధితులను కించపరచకూడదు, వారు నొచ్చుకునేలా, బాధపడేలా మాట్లాడకూడదు. ఇదో పెద్ద వ్యాధి కాదన్నట్లుగా రోగులకు భరోసా ఇస్తూ ఉండాలి. సరైన చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా తగ్గుతుందనీ, ఇతరుల్లా హాయిగా జీవించగలుగుతారని ధైర్యం చెప్పాలి. ఇటీవల ఈ జబ్బు తగ్గడంలో గణనీయమైన పురోగతి ఉంది. గతంలో పోలిస్తే మంచి మందులు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. బిహేవియర్ థెరపీ లేదా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో పాటు రెస్పాన్స్ ప్రివెన్షన్ ప్రక్రియలతో రోగుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. తాము భయపడే అంశాలకు రోగిని నెమ్మదిగా గురిచేస్తూ దాని వల్ల ఎలాంటి హానీ ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పుతూ పోవడమే రెస్పాన్స్ ప్రివెన్షన్ చికిత్సలోని ప్రత్యేకత. ట్రైస్లైక్లిక్స్, ఎస్ఎస్ఆర్ఐస్, బెంజోడయజపైన్స్ వంటి మందుల్ని కేవలం సైకియాట్రిస్ట్‌ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. ఓసీడీ థీమ్‌తోనే ‘మహానుభావుడు’ సినిమా! ‘మహానుభావుడు’ సినిమాలో హీరో శర్వానంద్ ఓసీడీ పేషేంట్. ఆ జబ్బు ప్రభావంతో అతడు అతిశుభ్రత పాటిస్తుంటాడు. ఆ జబ్బు ఉన్నవారు చేసే పనులు చూసేవారందరికీ వింతగా ఉంటాయి. కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తుంటుంది. చిన్న విషయమే కదా అనిపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలున్న వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అనేది కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. ఈ íసినిమాలో హీరోకి హీరోయిన్ ముద్దు పెట్టడానికి దగ్గరికొస్తే హీరో ఆమెను ఆపి ‘ఈ రోజు బ్రష్ చేశావా’ అని అడుగుతాడు. అలాగే హీరో అమ్మకు జ్వరమొస్తే, ఆమె దగ్గరికి వెళ్లటానికి కూడా అతను సంకోచిస్తుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి తండ్రికి గుండెపోటు వస్తే కనీసం ఆమె కోసం అతన్ని హాస్పటల్‌కు తీసుకెళ్లటానికి సహకరించడు. ఇలా ఇతనికి ఉన్న జబ్బు కారణంగా దగ్గర వాళ్లు కూడా అయిష్టం పెంచుకోవడం.. వంటివన్నీ ‘ఓసీడీ’ వల్ల కుటుంబ జీవితంపైనా, సామాజికంగా ఎంత ప్రతికూల ప్రభావం ఉంటుందో ప్రతిభావంతంగా చూపించారు డైరెక్టర్ మారుతి. రుగ్మతకు కారణం వివిధ కారణాల వల్ల మెదడులోని రసాయనాల్లో కలిగే మార్పులతో ఓసీడీ వస్తుంటుంది. ప్రధానంగా మన మెదడులో స్రవించే న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరిటోనిన్లో మార్పుల వల్ల ఇది వస్తుంది. దీనికి ఇదమిత్థంగా కారణం తెలియకపోయినా బహుశా జన్యుపరమైన మార్పులతో ఇది జరిగి, కుటుంబంలో చాలామందిలో కనిపిస్తుందని వైద్యపరిశోధకులు భావిస్తున్నారు. పిల్లల్లో స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఈ వ్యాధి కనిపించవచ్చు. ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలయ్యాక, కొందరిలోనైతే మెనింజైటిస్ వంటి వ్యాధుల తర్వాత ఈ రుగ్మత కనిపించవచ్చు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు 35 శాతం ఎక్కువగా ఉంటాయి. అయితే కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన ఇతరులకు ఈ వ్యాధి తప్పక రావాలనేమీ లేదు. కంపల్షన్ డిజార్డర్‌లో చేసే పనులు కంపల్షన్లో సాధారణంగా రోగులు చేసే పనుల్లో ఎక్కువగా ఉండేవివి... ∙తాళం వేశాక అది సరిగ్గా పడిందా లేదా అని మళ్లీ మళ్లీ చూడటం ∙గ్యాస్ స్టవ్ ఆర్పేశారా లేదా అన్ని మళ్లీ మళ్లీ పరీక్షించడం ఏదైనా పని ఎవరికీ హాని చేయకూడదంటూ, దాన్ని కన్ఫర్మ్ చేసుకోడానికి చేసిన పనే మళ్లీ మళ్లీ చేయడం (ఉదాహరణకు పారేసిన పాత బ్లేడులు, కత్తెరలు ఎవరికైనా హాని చేస్తుందని అనిపించి, దాన్ని ఎవరికీ తగలని చోట పారేశామా లేదా అని పదే పదే చూస్తూ, దాన్ని ఎవరికీ అందనిచోటకు నెడుతూ ఉండటం) రాసినదాంట్లో ఏదైనా తప్పు వచ్చిందేమో అని మళ్లీ మళ్లీ రాస్తూ ఉండటం ∙లెక్కపెట్టిన డబ్బులను మళ్లీ మళ్లీ లెక్కపెట్టడం లాంటివి. ఇన్పుట్స్: డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ -
రణ్‌వీర్‌సింగ్ అంటే దీపికకు ఎంతిష్టమో...
అతనలా ప్రవర్తిస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది! నిజమైన ప్రేమంటే... ప్రేమించిన వారి లోపాలను కూడా ఇష్టపడటం. ప్రస్తుతం దీపికా పదుకొనే అదే చేస్తున్నారు. రణ్‌వీర్‌సింగ్ అంటే దీపికకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రణ్వీర్ ప్రస్తావన తీసుకొస్తే చాలు... పులకించిపోతారీ పొడుగుకాళ్ల సుందరి. రణ్వీర్ గురించి ఎంత సేపు మాట్లాడటానికైనా ఇష్టపడతారు. ఇటీవలే రణ్వీర్ లోపాల గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా మాట్లాడారు. ‘‘రణ్వీర్ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’తో బాధ పడుతున్నాడు. ఊరకే భయపడటం, సౌకర్యంగా ఉండలేకపోవడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, అనవసరపు ఆత్రుత ప్రదర్శించడం... ఆ వ్యాధి లక్షణాలు. ఇవన్నీ రణ్‌వీర్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. నీట్‌గా ఉన్న దాన్ని మళ్లీ మళ్లీ శుభ్రం చేసుకోవడం, మళ్లీ మళ్లీ చెకింగ్ చేసుకోవడం, తొందరపడిపోవడం, అతిగా ప్రేమించడం, శృంగారం విషయంలో అడ్వాన్స్ అయిపోవడం... ఇవి కూడా ఆ వ్యాధి లక్షణాలే. ఇవన్నీ రణవీర్‌కి ఉన్నాయి. లొకేషన్లో రణ్వీర్ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. షాట్ గ్యాప్‌లో పెర్ఫ్యూమ్ కొట్టుకుంటుంటాడు. నిమిషనిమిషానికీ దువ్వెనతో దువ్వుకుంటుంటాడు. చూయింగ్‌గమ్ విపరీతంగా నమలుతుంటాడు. ఇవన్నీ తాను ఎందుకు చేస్తున్నాడో నాకు తెలుసు. తన సమస్య పక్కవారికి తెలీకూడదని తాను చేసే ప్రయత్నాలు అవన్నీ. తాను అలా చేయడం మిగిలినవారికి చెడ్డగా అనిపిస్తుందేమో కానీ... నాకు మాత్రం ఇష్టంగా ఉంటుంది. అతనలా ప్రవర్తిస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. తన వంక తదేకంగా చూడాలనిపిస్తుంది. రణ్వీర్ నాకు అమాయకుడిలా కనిపిస్తాడు. ఇంకా అతనిలో నాకు నచ్చే సుగుణాలు చాలానే ఉన్నాయి. రణ్వీర్ నా జీవితానికి నిజంగా ప్రత్యేకం’’ అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ చెప్పుకొచ్చారు దీపిక.