స్త్రీ ఆరోగ్యం
‘నేను ప్రీ–మెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్, తీవ్రమైన కండరాల నొప్పితో బాధించే ఫైబ్రోమయాల్జియా రుగ్మతలతో బాధ పడుతున్నాను. నా వేదన మీకు చైతన్యం కలిగించాలి’ అంది నేహా భాసిన్. బాలీవుడ్‌లో ఎన్నో ఎన్నో హిట్ ట్రాక్స్ పాడిన గాయని నేహా ఇటీవల ఇన్‌స్టాలో రాసుకున్న పోస్ట్ స్త్రీల ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలియచేస్తోంది. ఆమె ఏం రాసింది?
‘‘నేను చెప్పాల్సింది చాలా ఉంది. అయితే ఎక్కణ్ణుంచి మొదలుపెట్టి, ఎక్కడ ముగించాలో తెలియడం లేదు. నేను అనుభవిస్తున్న నరకాన్ని ఎలా ఏకరువు పెట్టాలో అర్థం కావడం లేదు. నా హెల్త్ రిపోర్టుల మీద రెండేళ్ల నుంచి అని రాసి ఉన్నప్పటికీ ఈ వేదనాపర్వం నా 20వ ఏటి నుంచి కొనసాగుతోంది. ఒంటరిగా ఉండకుండా నలుగురితో... అందునా నాకిష్టమైన, నేను ప్రేమించే వ్యక్తులను కలుస్తూ, పత్రికలకు వ్యాసాలు రాస్తూ నా ఇబ్బందులను ఎంతోకొంత అధిగమించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పటికీ నెలనెలా వేధించే నా ప్రీ మెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ నన్ను కొత్త చీకట్లలోకి విసిరేస్తోంది. ‘ఇది నీ వైఫల్యమేనా?’ అంటూ నా అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ నన్ను వెక్కిరిస్తూ ప్రశ్నిస్తోంది. ఫైబ్రోమయాల్జియా అంటూ డాక్టర్లు చెబుతున్న ఆ సమస్య నాలో వేదనాగ్ని జ్వాలల్ని రగిలిస్తోంది. ఏళ్ల తరబడి నేను వాటిని లెక్కచేయకుండా నిన్నమొన్నటివరకూ ప్రదర్శనలిస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు నా డాక్టర్ ‘ఇంక మీరేమీ చేయకుండి. హాయిగా విశ్రాంతి తీసుకోండి’ అంటున్నాడు.
నేనిలా విశ్రాంతి తీసుకోవడం నాకే నచ్చడం లేదు. దశాబ్దాల తరబడి లెక్కచేయకుండా నెట్టుకొస్తున్న నా వేదనలు నన్ను బాధిస్తున్నప్పటికీ... నా కలలను శ్వాసిస్తూ, నా కలలకు రూపం కల్పించే సంకల్పంతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను. ఇవ్వాళ నేనో వృద్ధుణ్ణి చూశాను. ఒక చేత్తో ఓ పెద్ద బరువైన పెట్టెను మోస్తూ, మరో చేతిలో గొడుగుతో కుస్తీపడుతూ ధారాపాతంగా కురుస్తున్న వర్షాన్ని లెక్కచేయకుండా అతికష్టమ్మీద నా వ్యాయామశాల సోపానాల చివరి మెట్టును అధిగమించాక నన్ను చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. అతడి ఆ నవ్వు ఎలా ఉందంటే... ‘ఈ వయసుకు తీవ్రమైన నొప్పులతో నేనూ బాధపడుతున్నా. వేదనా తరంగాల దొంతరల్లో ఈదులాడుతున్నా. నేనే ఇలా ఉన్నానంటే... నీకింకా ఏమీ ముగిసిపోలేదు. జీవితానికి కృతజ్ఞురాలివై ధైర్యంగా ఉండు. నీకంటే ఎక్కువ బాధపడుతున్నవారు ఇంకా ఎందరో ఉన్నారు’ అంటూ ఉద్బోధిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.
అందుకే... నా బాధలూ, నా వెతలూ, నా ఆవేదనలన్నీ నా జీవితాన్ని సవాల్ చేస్తున్నప్పుడు మీ ప్రేమతో పాటు నేను రాసుకుంటున్న ఈ కొన్ని మాటల్ని సాంత్వననిచ్చే ఓ మలాముగా పులుముకుంటున్నా’’ అంటూ ముగించింది నేహా.
ప్రీ మెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్..
కొందరు యువతుల్లో నెలసరి ముందుగా తీవ్రమైన నొప్పి రావడాన్ని ‘ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్‌ఎస్) అంటారు. అందులోని అత్యంత బాధకరమైన ఒక రకం ‘ప్రీ–మెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్’. కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలతో డాక్టర్లు దీనికి చికిత్స అందిస్తుంటారు.
అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్..
పూర్తి పర్‌ఫెక్షన్ రాలేదంటూ చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ, ఎంతకీ సంతృప్తి లేక దాన్నే కొనసాగిస్తూ విసుగు కలిగించే మానసిక వ్యాధి ఇది. దీని బారిన పడితే ఆలోచనలూ, పనులూ అలా అనియంత్రితంగా సాగుతూ ఎంతకీ పని పూర్తి చేయనివ్వక బాధిస్తుంటాయి. దీనికి మానసిక చికిత్స అవసరం.
ఫైబ్రోమయాల్జియా..
కండరాల, ఎముకల నొప్పితో తీవ్రమైన ఒళ్లు నొప్పులతో, స్పర్శ సున్నితంగా మారి ఒంటిని ముట్టుకోనివ్వనంతగా తీవ్రమైన వేదన కలిగిస్తుందిది. మానసిక ఆందోళనలు, యాంగై్జటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ వంటి సమస్యల కారణంగా మరింత పెచ్చరిల్లే ఈ నొప్పులకు సరైన చికిత్స అవసరం.
Comments
Please login to add a commentAdd a comment