How To Overcome OCD Symptoms Best Tips And Strategies By Psychologist In Telugu - Sakshi
Sakshi News home page

Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి?

Published Tue, Dec 13 2022 3:31 PM | Last Updated on Tue, Dec 13 2022 6:27 PM

OCD Symptoms How To Overcome Tips Best Strategies By Psychologist - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Obsessive-Compulsive Disorder: సునీత తెలుగు టీచర్‌. సంప్రదాయ కుటుంబం. ప్రతి పనీ పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచీ అలవాటు. అయితే కరోనా తర్వాత ఆమె ప్రవర్తన విపరీతంగా మారింది. కరోనా లేదని తెలిసినా శానిటైజర్‌ వాడకం ఆపలేదు. కూరగాయలు, పండ్లు, సరుకులు.. ఏవి తీసుకువచ్చినా శానిటైజ్‌ చేయాల్సిందే.

స్నానానికి వెళ్లిందంటే గంట పాటు బయటకు రాదు. ఏమాత్రం అశుభ్రంగా ఉన్నా ఏదైనా వైరస్‌ వస్తుందేమోనని విపరీతమైన భయం. గిన్నెలు పదేపదే కడుగుతూనే ఉంటుంది. హాల్లో వస్తువులు ఏ మాత్రం ఆర్డర్‌ తప్పినా తట్టుకోలేదు. పిల్లలపై అరిచేస్తుంది. ‘ఏంటమ్మా నీ చాదస్తం?’ అని పిల్లలంటున్నా పట్టించుకోదు

ఆయనది ఇంకో తీరు
సునీత భర్త సుకుమార్‌ది మరో సమస్య. అతనికీ మధ్య ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఆఖరుకు గుడికి వెళ్లి విగ్రహాల్ని చూసినా లైంగికపరమైన ఆలోచనలు వస్తున్నాయి.

తల్లి, చెల్లి గురించి కూడా అలాంటి ఆలోచనలు వస్తుండటంతో ఎవరికీ చెప్పలేక, చెప్పుకోలేక తనలో తానే మథన పడిపోతున్నాడు. తాను తప్పుడువాడిని కనుకే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయని అపరాధభావంతో కుంగిపోతున్నాడు. ఒక్కోసారి బలవన్మరణ ఆలోచనలు అతని మనసును కమ్మేస్తున్నాయి.  

అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌
సునీత, సుకుమార్‌ ఇద్దరిదీ ఒకటే మానసిక సమస్య.. అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ). అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం (అబ్సెషన్స్‌), ఒకే పని పదేపదే చేయడాన్ని నియంత్రించుకోలేకపోవడం (కంపల్సివ్‌) ఆ వ్యాధి లక్షణాలు.

కొందరిలో అబ్సెషన్‌ లేదా కంపల్సివ్‌ లక్షణాలుంటే, మరికొందరిలో రెండూ ఉంటాయి. కానీ అది ఒక మానసిక సమస్య అనే విషయం చాలామందికి తెలియక తమలో తామే మథనపడుతూ ఉంటారు. ఈ రుగ్మత వల్ల సమయం విపరీతంగా వృథా అవుతుంది, జీవితం దుర్భరంగా మారుతుంది. 

ఓసీడీ లక్షణాలు
►అనుచిత, అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం. వీటితో  డిస్టర్బింగ్‌గా ఉండడం.
►తమ గురించి తాము అతిగా ఆందోళన చెందడం, లేదా ఇతరుల గురించి వారికేదైనా ఆపద వస్తుందేమోనని భయపడడం.
►అన్నీ పరిశుభ్రంగా ఉండాలనుకోవడం. వస్తువులు మురికిగా ఉన్నాయనో, కల్తీ అయ్యాయనో ఆందోళనచెందడం లేదా వాటిని పదేపదే శుభ్రపరచుకోవడం
►తాళం వేశామా లేదా? అలారం పెట్టామా? గ్యాస్‌ ఆఫ్‌ చేశామా లేదా? అని పదేపదే చెక్‌ చేయడం. 

►అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం, అందుకోసం పదేపదే సర్దడం.
►కొన్ని పనులను ప్రతిసారి నిర్దిష్టమైన పాటర్న్‌లో చేయడం లేదా పదేపదే చేయడం
►అవతలి వ్యక్తి తాను చెప్పింది వింటున్నారో లేదో అన్న అనుమానంతో చెప్పిన విషయాన్ని పదేపదే చెప్పడం 
►ముట్టుకుంటే క్రిములు వస్తాయనే భయంతో ఎవ్వరికీ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోవడం

ఈ లక్షణాలు కనపడగానే మీకు మాత్రమే ఈ సమస్య వచ్చిందని బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, అంతర్జాతీయ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు డేవిడ్‌ బెకమ్, బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పడుకోణ్, ప్రియాంక చోప్రా కూడా ఈ రుగ్మత నుంచి బయటపడిన వారే.

జనాభాలో రెండు శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. మహిళల్లో, పురుషుల్లో దాదాపు సమానంగా ఉంటుంది. అయితే 10–25 శాతం మందికి తమకు సమస్య ఉందనే విషయమే తెలియదు. 15శాతం మంది బలవన్మరణానికి ప్రయత్నించవచ్చు. 

ఎందుకొస్తుంది?
ఓసీడీకి జన్యుపరమైన, పర్యావరణ కారకాలు రెండూ ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఓసీడీ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మెదడులోని నాడీకణాల మధ్య సమాచార మార్పిడికి సెరటోనిన్‌ అనే న్యూరో ట్రాన్స్‌మీటర్‌ అవసరం. దాని పరిమాణం తగ్గితే మతిమరపు, ఒత్తిడి కలుగుతుంది.

దీనివల్ల ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. అలాగే బాల్యంలో భౌతిక, లైంగిక దాడికి గురైనప్పుడు, ప్రమాదం బారినపడ్డప్పుడు, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక సమస్యలున్నప్పుడు, బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. కరోనా వల్ల ఈ రుగ్మత బారినపడ్డ వారి సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. 

ఏం చేయాలి?
ఓసీడీ లక్షణాలు కనిపించగానే ఎవరికి వారు తమ ఆలోచనలను ఆపేసేందుకు, అణచివేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ అవి మరింత బలంగా వస్తాయి. అలాగే పదేపదే చేస్తున్న పనులను బలవంతంగా ఆపేసేందుకు ప్రయత్నిస్తారు. దానివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. ఆ ఆందోళన తగ్గేందుకు మైండ్‌ఫుల్‌నెస్, వ్యాయామం లాంటివి కొంతవరకు ఉపయోగపడతాయి.

అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే వెంటనే సైకాలజిస్టును కలవండి. ఆయన డయాగ్నసిస్‌ ద్వారా మీ రుగ్మతను నిర్ధారిస్తారు. మీ భయాలు, ఆందోళనలు తగ్గించేందుకు సైకోథెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. మీ అవాంఛిత ఆలోచనలు, అసహజ ప్రవర్తనకు మూలమైన విశ్వాసాలను మార్చుకునేందుకు సహాయపడతారు.

ఎక్స్‌పోజర్, రెస్పాన్స్‌ ప్రివెన్షన్‌ ద్వారా మీ అలవాట్లను మార్చేందుకు సహాయపడతారు. సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్‌కు రిఫర్‌ చేస్తారు. మెదడులో తగ్గిన సెరటోనిన్‌ స్థాయిలను పెంచడానికి ఆయన మందులు సూచిస్తారు. 
-సైకాలజిస్ట్‌ విశేష్‌

చదవండి: Toxic Positivity: ‘పాజిటివిటీ పిచ్చి’ పడితే అంతే సంగతులు! అతి సానుకూలతతో అనర్థాలే! మీలో ఈ లక్షణాలుంటే వెంటనే..
Skin Cancer: ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు ఉన్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement