మహానుభావుడు సినిమాలో హీరో ఓసీడీతో బాధపడుతూ ప్రేక్షకులను కేరింతలు పెట్టిస్తాడు. కానీ నిజజీవితంలో ఇట్స్ నాట్ ఏ లాఫింగ్ మ్యాటర్. ఇంటికి తాళం వేసి మీరూ, నేనూ జేబులో తాళం వేసుకొని బయటకు వెళ్తాం, కానీ ఈ మహానుభావులు మాత్రం వీధి చివరికి వెళ్లి, మళ్లీ వచ్చి తాళం చెక్ చేస్తారు. ఆ తర్వాత సినిమాకు వెళ్లి మళ్లీ డౌట్ వస్తే ఇంట్రవెల్‌కు ముందే ఇంటికొచ్చి మళ్లీ చెక్ చేస్తారు.
ఇదండీ... వీళ్ల సినిమా! కడిగిన చేతులే కడుగుతుంటారు... వేసిన తాళాలు చెక్ చేస్తుంటారు... కట్టేసిన గ్యాస్ సిలెండర్‌ను మాటిమాటికీ చూస్తుంటారు. ఈ సినిమాకు శుభం కార్డు వేయాలంటే ముందు ఈ జబ్బును కడిగేయాల్సిందే!
ఈమధ్య లక్ష్మి ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటోంది. చేతులు పుస్తకానికి తగిలినా, ఎదుటివారి బట్టలకు తాకినా, ఎవరిదైనా ఫోన్ తగిలినా అవి మురికి అయిపోయాయనే భావన ఆమెలోకి వస్తోంది. వెంటనే సబ్బుతో చేతులు కడగటం మొదలుపెడుతోంది. మురికి అయిపోతానేమో ఆమెకు ఎంత ఉందంటే మూడేళ్ల కూతురిని కూడా ఆమె తాకడం లేదు. ఆ పాప తనను ముట్టుకున్నా మురికి అయినట్లుగా తలచి, చేతులూ, ఒళ్లూ కడుక్కుంటోంది. దాంతో ఇంట్లోవాళ్లందరూ లక్ష్మి ప్రవర్తన వల్ల బాధపడుతున్నారు. వాళ్ల ఇల్లు నరకమైపోయింది. ఈ నరకానికి కారణం ఒక జబ్బు. ఆ జబ్బుపేరే ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’. సంక్షిప్తంగా చెప్పాలంటే ఓసీడీ.ప్రతి వందమందిలో ఇద్దరుఓసీడీ అంతగా చదువుకోని వారిలోనూ ఎక్కువని అనే అపోహ ఉంది. కానీ బాగా తెలివైనవారిలోనూ, అన్నీ తెలిసినవారిలోనూ దీని బాధితులు ఉన్నారు. నిజానికి సాధారణ ఐక్యూ కంటే కాస్త ఎక్కువ ఐక్యూ ఉన్నవారిలోనే ఇది ఎక్కువ. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 2 నుంచి 3 శాతం ప్రజలు ఓసీడీతో బాధపడుతుంటారని అంచనా. సాధారణంగా ఈ వ్యాధి 18 ఏళ్ల వయసులో కనిపిస్తుంటుంది. అయితే వ్యాధికి గురైన 5 నుంచి 10 ఏళ్ల తర్వాతగానీ రోగులు, వారి కుటుంబ సభ్యులు డాక్టర్‌ను సంప్రదించడం లేదు. దాంతో జబ్బు ముదిరి చికిత్స కాస్త ఒకింత కష్టమవుతుంది. జబ్బు వచ్చాక ఎంత త్వరగా డాక్టర్‌ను సంప్రదిస్తే చికిత్స ప్రభావం అంత మెరుగ్గా ఉంటుంది.
ఓసీడీ అంటే...
ఓసీడీ అను సంక్షిప్త రూపంలో ‘ఓ’ అంటే అబ్సెషన్ అనే మాటకు సూచన. అబ్సెషన్ అంటే ఒక ఆలోచన మదిలో వచ్చాక అదే పనిగా అదే అదే రావడం. ఆ ఆలోచనను వదిలించుకోవాలని ఎంత ప్రయత్నపూర్వకంగా అనుకున్నా ఆగకుండా అదే రావడం. ఇలా మనం కోరుకోనిది పదే పదే మనసులో మెదులుతుండటంతో తీవ్ర అసౌకర్యం, ఒత్తిడి కలుగుతుంది. సీ అంటే కంపల్షన్. అంటే పదే పదే వచ్చే ఆలోచనలు ఒక పనిని పదే పదే చేసే పరిస్థితిని (కంపల్షన్‌ను) కల్పిస్తాయి. అది చాలా సమయాన్ని వృథా చేస్తుంది.
ఎలా వస్తాయి ఆ ఆలోచనలు...
ఈ రోగుల మనసులో ఏదో ఒక ఆలోచన మొలుస్తుంది. అది మనసును తొలిచేయడం మొదలవుతుంది. అది మనసుపై ఒకరకమైన ఒత్తిడిని, ఉద్విగ్న స్థితిని కలిగిస్తుంది. ఒక పనిచేస్తే ఆ ఉద్విగ్న స్థితి తొలగిపోయి, మనం మామూలవుతామని మన మనసుకు అనిపిస్తుంది. అంతే. ఆ ఉద్విగ్నతనూ, ఆ ఒత్తిడినీ తొలగించేందుకు ఆ పని చేస్తుంటారు. కానీ ఆ ఉద్విగ్నత తొలగిపోదు. పోతుందనే భావనతో మళ్లీ చేస్తారు. ఇలా ఒక పరంపర అదేపనిగా కొనసాగుతుండటంతో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అది ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. తాము చేస్తున్న పని ఎన్నో రకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతోందని గ్రహించాక కూడా తాము దాన్ని ఆపలేకపోవడంతో ఆ పనిచేస్తున్న వాళ్లలో తీవ్రమైన కోపం, నిరాశ, నిస్పృహ పెరుగుతుంటాయి. దాంతో ఆ జబ్బు రోగుల్లో తీవ్రమైన భయాన్నీ, ఆందోళనను కలిగిస్తుంది.
లక్షణాలు...
ఓసీడీ కడిగిన దాన్నే కడగటం అనే లక్షణంతో వ్యక్తమవుతుంటుంది. ఏమాత్రం మురికి లేదా చెత్త తగిలినా వీళ్లు కడుక్కుంటూనే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతులు, కాళ్లు కడుగుతూ బాత్‌రూమ్‌లోనే గడుపుతుంటారు. అలాగే తలుపులు, గోడలు, గదులు, కొన్ని వస్తువులనూ కడుగుతుంటారు. ఇటీవల ఈ జబ్బు వ్యక్తమయ్యే లక్షణాల జాబితా బాగా పెరుగుతోంది. వాటిలో కొన్ని...
∙ఎప్పటికీ చేయబోమనే పని పట్ల చేస్తామేమో అనే ఆందోళన : ఒక పని మనం ఎప్పటికీ చేయకపోయినా అది చేస్తామేమో అన్న ఆందోళన మనసును కుదిపేస్తుంటుంది. ఉదాహరణకు మనం దొంగతనం ఎప్పటికీ చేయం లేదా ఎవరనీ అవమానపరచబోం. కానీ ఆ పని చేస్తామేమో అని మనలో ఆందోళన కలుగుతుంది. ఏదైనా నేరం చేస్తామేమోననే బెంగ కొందరిలో వేధిస్తుంటుంది. న్యూస్‌పేపర్లలోని క్రైమ్ కాలమ్స్‌లో వచ్చే క్రైమ్ వార్తల్లో అవి తమ వల్ల కాదుగదా అని కూడా నిర్ధారణ చేసుకునేంత ఆందోళనతో ఉంటారు.
∙అంటుకుంటుందనే భయమే కంటామినేషన్ అబ్సెషన్ : అంటే దేనివల్లనైనా మనకు జబ్బు వస్తుందేమో అనే ఆలోచన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉదాహరణకు మనం చేసే మూత్రవిసర్జన, మలవిసర్జన, ఇంట్లోని అపరిశుభ్రత, ఎక్కడైనా కాస్త జిగురుగా ఉండే పదార్థాల వల్ల మనకు ఏదైనా హాని జరుగుతుందేమో, దాని వల్ల మనకు జబ్బులు వస్తాయేమో అన్న ఆలోచన అదేపనిగా వస్తూ ఆందోళనకు గురిచేస్తుంది.
∙సెక్స్‌పరమైన అబ్సెషన్ : మనం రాకూడదని కోరుకునే తరహా సెక్స్ ఆలోచనలు వచ్చి, మన ప్రమేయం లేకుండానే, ఎంతగా నియంత్రించుకుందామనుకున్నా ఆగకుండా అదేపనిగా వస్తుంటాయి. పనికిరాని వస్తువులను సేకరించి పెట్టుకోవడం : కొందరు ఏమాత్రం ఉపయోగం లేని వస్తువులను సేకరించి వాటిని దాచుకుంటూ ఉంటారు. అవి దేనికీ పనికిరావని తెలిసినా వాటిని వదిలేయలేరు. పర్‌ఫెక్షన్ కోసం తాపత్రయం: కొందరు తాము ఆఫీస్‌లో లేదా ఇతరత్రా చేసే పనుల్లో పూర్తి స్థాయి పర్‌ఫెక్షన్ ఇంకా రాలేదనే అభిప్రాయంతో, దానిలో మరింత పర్‌ఫెక్షన్ కోసం సమయం వృథా చేస్తుంటారు.
∙జబ్బు ఉందేమోనన్న అపోహ : కొందరిలో తమకు ఏదైనా జబ్బు ఉందేమో, తమ శరీర అవయవాల్లో ఏదైనా లోపం ఉందేమో అనే అనుమానం ఉంటుంది. ఉదాహరణకు తమకు క్యాన్సర్ లేదా ఎయిడ్స్ వంటి జబ్బులు సోకాయేమోనని అనుమానపడుతుంటారు. ఇక దాంతో వాళ్లు అదేపనిగా డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. జబ్బు లేదనే రిపోర్టు వచ్చినా పదే పదే ఆ వైద్య పరీక్షలే మళ్లీ మళ్లీ చేయిస్తుంటారు. ఇలా డబ్బూ, సమయం వృథా చేసుకుంటారు. దీన్ని సొమాటిక్ అబ్సెషన్ అంటారు.
పిల్లలలో: పిల్లలు కొంతమందిని చాలా ఎక్కువగా అభిమానిస్తుంటారు. అలా తాము అమితంగా గౌరవించే పెద్దలకూ, తమ తల్లిదండ్రులకూ తామెప్పుడైనా హాని చేస్తామేమో, వాళ్ల గౌరవానికి తలవంపులు తెస్తామేమో అన్న ఆందోళన వాళ్లలో ఉంటుంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌కు లోనైనవారు తమ ఆలోచనలను నియంత్రించుకోడానికి లేదా తగ్గించుకోడానికి చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. మనసులో అంకెలు లెక్కపెట్టుకోవడం, ఇతరుల చేత ఒక విషయాన్ని పదే పదే చెప్పించుకోవడం, ప్రార్థనలు చేయడం వంటివి అందులో ముఖ్యమైనవి. అలా చేయడం వల్ల తమకు జరగబోయే చెడు జరగదని వాళ్ల నమ్మకం. అలాగే తమ వస్తువులను పలుమార్లు తాకడం, లెక్కపెట్టుకోవడం వంటి పనులు తాము చేస్తుండటంతో పాటు ఇతరులను కూడా అలాగే చేయమని ఒత్తిడి చేస్తుంటారు. ఓసీడీ వల్ల చాలామందిలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. తమపై తమకు నమ్మకం తగ్గిపోతుంది. రోజువారీ దినచర్యల్లో సమయం వృథాకావడం పెరిగి, జీవనం అస్తవ్యస్తమవుతుంది. అది పనిలోని నాణ్యతనూ, డబ్బునూ, మానవ సంబంధాలనూ దెబ్బతీస్తుంది.
నిర్ధారణ : ఓసీడీ జబ్బును లక్షణాల ద్వారానూ, రోగి పరిస్థితిని బంధువులు, స్నేహితుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక వైద్యపరంగా డీఎస్‌ఎమ్–5 /ఐసీడీ 10 క్రైటీరియా ద్వారా దీన్ని నిర్ధారణ చేయవచ్చు. వై–బాక్స్ స్కేల్ మీద దీని తీవ్రతను తెలుసుకుంటారు.
చికిత్స : ఓసీడీ లక్షణాలు కనిపించినప్పుడు అవి ముదిరే వరకు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే, ఫలితాలు అంత బాగా ఉంటాయి. మందులు ప్రారంభించిన వెంటనే మార్పు కనిపించదు. అవి మొదలుపెట్టిన 6 నుంచి 12 వారాల తర్వాత మార్పు కనిపిస్తుంటుంది. ఒకసారి మందులు వాడక మళ్లీ మానేయకూడదు. అలా చేస్తే వ్యాధి తిరగబెట్టడంతో పాటు దాని తీవ్రత మరింత పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఓసీడీకి సంబంధించిన ఆలోచనలు వస్తుంటే వాళ్లను నిర్భయంగా చెప్పమని అడగాలి. అలాగే బాధితులను కించపరచకూడదు, వారు నొచ్చుకునేలా, బాధపడేలా మాట్లాడకూడదు. ఇదో పెద్ద వ్యాధి కాదన్నట్లుగా రోగులకు భరోసా ఇస్తూ ఉండాలి. సరైన చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా తగ్గుతుందనీ, ఇతరుల్లా హాయిగా జీవించగలుగుతారని ధైర్యం చెప్పాలి.
ఇటీవల ఈ జబ్బు తగ్గడంలో గణనీయమైన పురోగతి ఉంది. గతంలో పోలిస్తే మంచి మందులు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. బిహేవియర్ థెరపీ లేదా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో పాటు రెస్పాన్స్ ప్రివెన్షన్ ప్రక్రియలతో రోగుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. తాము భయపడే అంశాలకు రోగిని నెమ్మదిగా గురిచేస్తూ దాని వల్ల ఎలాంటి హానీ ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పుతూ పోవడమే రెస్పాన్స్ ప్రివెన్షన్ చికిత్సలోని ప్రత్యేకత. ట్రైస్లైక్లిక్స్, ఎస్‌ఎస్‌ఆర్‌ఐస్, బెంజోడయజపైన్స్ వంటి మందుల్ని కేవలం సైకియాట్రిస్ట్‌ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది.
ఓసీడీ థీమ్‌తోనే ‘మహానుభావుడు’ సినిమా!
‘మహానుభావుడు’ సినిమాలో హీరో శర్వానంద్ ఓసీడీ పేషేంట్. ఆ జబ్బు ప్రభావంతో అతడు అతిశుభ్రత పాటిస్తుంటాడు. ఆ జబ్బు ఉన్నవారు చేసే పనులు చూసేవారందరికీ వింతగా ఉంటాయి. కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తుంటుంది. చిన్న విషయమే కదా అనిపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలున్న వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అనేది కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. ఈ íసినిమాలో హీరోకి హీరోయిన్ ముద్దు పెట్టడానికి దగ్గరికొస్తే హీరో ఆమెను ఆపి ‘ఈ రోజు బ్రష్ చేశావా’ అని అడుగుతాడు. అలాగే హీరో అమ్మకు జ్వరమొస్తే, ఆమె దగ్గరికి వెళ్లటానికి కూడా అతను సంకోచిస్తుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి తండ్రికి గుండెపోటు వస్తే కనీసం ఆమె కోసం అతన్ని హాస్పటల్‌కు తీసుకెళ్లటానికి సహకరించడు. ఇలా ఇతనికి ఉన్న జబ్బు కారణంగా దగ్గర వాళ్లు కూడా అయిష్టం పెంచుకోవడం.. వంటివన్నీ ‘ఓసీడీ’ వల్ల కుటుంబ జీవితంపైనా, సామాజికంగా ఎంత ప్రతికూల ప్రభావం ఉంటుందో ప్రతిభావంతంగా చూపించారు డైరెక్టర్ మారుతి.
రుగ్మతకు కారణం
వివిధ కారణాల వల్ల మెదడులోని రసాయనాల్లో కలిగే మార్పులతో ఓసీడీ వస్తుంటుంది. ప్రధానంగా మన మెదడులో స్రవించే న్యూరోట్రాన్స్‌మిటర్ అయిన సెరిటోనిన్‌లో మార్పుల వల్ల ఇది వస్తుంది. దీనికి ఇదమిత్థంగా కారణం తెలియకపోయినా బహుశా జన్యుపరమైన మార్పులతో ఇది జరిగి, కుటుంబంలో చాలామందిలో కనిపిస్తుందని వైద్యపరిశోధకులు భావిస్తున్నారు. పిల్లల్లో స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఈ వ్యాధి కనిపించవచ్చు. ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలయ్యాక, కొందరిలోనైతే మెనింజైటిస్ వంటి వ్యాధుల తర్వాత ఈ రుగ్మత కనిపించవచ్చు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు 35 శాతం ఎక్కువగా ఉంటాయి. అయితే కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన ఇతరులకు ఈ వ్యాధి తప్పక రావాలనేమీ లేదు.
కంపల్షన్ డిజార్డర్‌లో చేసే పనులు
కంపల్షన్‌లో సాధారణంగా రోగులు చేసే పనుల్లో ఎక్కువగా ఉండేవివి...
∙తాళం వేశాక అది సరిగ్గా పడిందా లేదా అని మళ్లీ మళ్లీ చూడటం ∙గ్యాస్ స్టవ్ ఆర్పేశారా లేదా అన్ని మళ్లీ మళ్లీ పరీక్షించడం ఏదైనా పని ఎవరికీ హాని చేయకూడదంటూ, దాన్ని కన్‌ఫర్మ్ చేసుకోడానికి చేసిన పనే మళ్లీ మళ్లీ చేయడం (ఉదాహరణకు పారేసిన పాత బ్లేడులు, కత్తెరలు ఎవరికైనా హాని చేస్తుందని అనిపించి, దాన్ని ఎవరికీ తగలని చోట పారేశామా లేదా అని పదే పదే చూస్తూ, దాన్ని ఎవరికీ అందనిచోటకు నెడుతూ ఉండటం) రాసినదాంట్లో ఏదైనా తప్పు వచ్చిందేమో అని మళ్లీ మళ్లీ రాస్తూ ఉండటం ∙లెక్కపెట్టిన డబ్బులను మళ్లీ మళ్లీ లెక్కపెట్టడం లాంటివి.
ఇన్‌పుట్స్: డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై
ప్రొఫెసర్ అండ్ హెచ్‌ఓడి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకియాట్రీ కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment